ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, అమెరికాల మధ్య పెరుగుతున్న దూరం!?


karzai

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా చేతిలో కీలుబొమ్మ 'హమీద్ కర్జాయ్'

గత శనివారం ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, అమెరికా కీలుబొమ్మ హమీద్ కర్జాయ్ అకస్మాత్తుగా అమెరికాపైన విరుచుకు పడ్డాడు. అమెరికాకి చెప్పకుండానే అమెరికా తాలిబాన్‌తో చర్చలు ప్రారంభించిందనీ, చర్చలు కొనసాగుతున్నాయని కూడా పత్రికలకు చెప్పేశాడు. ఆ తర్వాత అనివార్యంగా అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ కూడా తాము తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్నామని అంగీకరించవలసి వచ్చింది. పనిలో పనిగా ఐక్యరాజ్యసమితిలో తాలిబాన్, ఆల్-ఖైదాలపై గల ఆంక్షలు, నిషేధాల జాబితాను విడదీస్తూ తీర్మానం కూడా ఆమోదించారు. ఆ తీర్మానానికి ఇండియా కూడా చెయ్యెత్తి ఆమోదించింది. తాజా తీర్మానం దరిమిలా ఇక తాలిబాన్ సంస్ధలోని కొంతమంది నాయకులపై టెర్రరిస్టు ముద్ర ఎత్తివేయడానికీ, తాలిబాన్‌తో చర్చలు జరపడానికీ అనుకూలమైన వాతావరణం ఏర్పడాలని ఆకాంక్షించారు.

ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, ఇలా అమెరికాపై కత్తి కాకపోయినా చిన్న బ్లేడయినా దూయడానికి కారణం ఉంది. అమెరికా కొన్ని రోజులుగా ఆఫ్ఘనిస్ధాన్, అమెరికాల మధ్య “వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం” ఆమోదింపజేయాలని ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందంపైన అమెరికా, కర్జాయ్‌ల మద్య కొంతమేరకు ఉద్రిక్తతలు తలెత్తాయి. దానిక్కారణం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో భాగంగా ఆఫ్ఘనిస్ధాన్‌లో అమెరికా సైన్యం శాశ్వతంగా తిష్టవేయడానికి ఆ దేశం ప్రయత్నించడమే. అయితే అమెరికా సైన్యం శాశ్వతంగా ఆఫ్ఘనిస్ధాన్‌లో తిష్ట వేయడాన్ని హమీద్ కర్జాయ్ వ్యతిరేకిస్తున్నాడా? కానే కాదు. ఆఫ్ఘనిస్ధాన్‌కి సంబంధించి యుద్ధానంతర కాలంలో హమీద్ కర్జాయ్‌కి ఏమాత్రం పాత్ర లేకుండా అమెరికా జాగ్రత్తలు తీసుకుంటోందని హమీద్ కర్జాయ్ గట్టిగా అనుమానిస్తున్నాడు.

అమెరికా తాలిబాన్‌తో శాంతి చర్చలు జరపడానికి నిర్ణయించుకున్న తర్వాత, అమెరికా సైన్యం ఇక ఆఫ్ఘనిస్ధాన్‌లో శాశ్వతంగా ఉండవలసిన అవసరం లేదు. అమెరికా ఇంకా తమ సైన్యం జులై నుండి ఉపసంహరణ ప్రారంభిస్తుందనే పత్రికల్లో వార్తలు ప్రచురింపజేసుకుంటోంది తప్ప శాశ్వతంగా ఉండబోతున్న సంగతిని బహిర్గతం చేయడం లేదు. హమీద్ కర్జాయ్‌తో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరితే ఆ ఒప్పందంలో భాగంగా అమెరికా సైన్యం ఇప్పుడున్నంత సంఖ్యలో కాకపొయినా గణనీయ సంఖ్యలోనే ఆఫ్ఘన్ లో శాశ్వతంగా ఉంచడానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం కోరికకు అనుగుణంగా నిర్ణయించామని ప్రకటించుకోవలసి ఉంది. ఈ లోగానే అమెరికా, తాలిబాన్‌‌తో చర్చలు జరుపుతున్న విషయం హమీద్ కర్జాయ్ వెల్లడించాడు. తాలిబాన్‌తో చర్చలు జరుపుతున్న నేపధ్యంలో భాగస్వామ్య ఒప్పందం ప్రకారం అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్ధాన్ లో మరింత కాలం ఉంటుందని ప్రకటించడాన్ని సున్నితంగా మార్చడానికి హమీద్ కర్జాయ్ ప్రయత్నించాడని భావించవచ్చు.

వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కి సంబంధించి అమెరికా, కర్జాయ్ లు చెరొక డ్రాఫ్టులు తయారు చేసుకున్నారు. ఈ రెండూ అనేక అంశాల్లో విభేధిస్తున్నాయని తెలుస్తోంది. శనివారం నాటి ప్రకటనలలో కర్జాయ్ ఈ భాగస్వామ్య ఒప్పందం అంగీకరించడానికి కొన్ని షరతులు ప్రకటించాడు. వాటిలో ముఖ్యమైనవి: “విదేశీ బలగాలు ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగడాన్ని చట్టం పరిధిలోకి తేవాలి. ఏక పక్షంగా చేసే మిలట్రీ చర్యలను బంద్ చేయాలి. ఆఫ్ఘనిస్ధాన్ చట్టాల ప్రకారమే విదేశీ బలగాలు నడుచుకోవాలి. విదేశీ సహాయం ఆఫ్ఘనిస్ధాన్ ప్రభుత్వం ద్వారా అందేలా చూడాలి” ఇవన్నీ కాక ఆఫ్ఘనిస్ధాన్‌కి పూర్తి యుద్ధపరికరాలు గల సైన్యాన్ని ఏర్పాటు చేయడం, F-16 యుద్ధ విమానాలను కూడా సమకూర్చడం లాంటి డిమాండ్లు కూడా కర్జాయ్ అమెరికా ముందు ఉంచాడు.

జులై నుండి అమెరికా సైన్యం ఉపసంహరణ ప్రారంభమవుతుందని గత ఏడాది ఒబామా ప్రకటించాడు. దానికి సంబంధించి ఒబామా ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. అయితే అమెరికా ప్రస్తుతం సైన్యం ఉపసంహరణ అనేది నామ మాత్రంగా ఉండాలని కోరుకుంటోంది తప్ప నిజమైన ఉపసంహరణ ప్రారంభించాలని అనుకోవడం లేదు. ఎన్నికల ప్రచారంలో ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో సైనికుల్ని ఉపసంహరిస్తానని వాగ్దానం చేసినందున దానికి అనుగుణంగా ఒక నామమాత్రపు చర్యను మాత్రమే ఒబామా అమెరికా ప్రజలకు చూపాలని భావిస్తున్నాడు. దీనిపట్ల కర్జాయ్ కి వాస్తవానికి వ్యతిరేకత లేనప్పటికీ ఆయనతో సంబంధం లేకుండా అనేక పనులు జరిగిపోతుండడం కర్జాయ్ కి మింగుడు పడ్డం లేదు. తాలిబాన్‌తో చర్చల విషయంలో సైతం హమీద్ కర్జాయ్ తో సంప్రదించకుండానే అమెరికా ప్రయత్నాలను ప్రారంభించింది. దానితో కడుపు మండిన కర్జాయ్ ఆ సంగతిని అమెరికా కంటే ముందు తానే వెల్లడించాడు.

హమీద్ కర్జాయ్ డిమాండ్లలో ముఖ్యమైనది విదేశీ నిధులు ఆఫ్ఘన్ ప్రభుత్వం ద్వారా పంపిణీ కావాలన్నది. అమెరికా నుంది వచ్చే సహాయమ్ ఆఫ్ఘన్ ప్రభుత్వం చేతిలోకి వచ్చాక, ఆఫ్ఘన్ ప్రభుత్వం మాత్రమే ఆ నిధులను పునః పంపిణీ చేయాలని హమీద్ కర్జాయ్ ఆకాంక్షిస్తున్నాడు. హమీద్ పైన అవినీతి ఆరోపణలు తీవ్రంగా రావడంతో సహాయం నేరుగా ఆయనకు అందడం గగనమై పోయింది. ఇదే కర్జాయ్ కి బొత్తిగా నచ్చడం లేదు. అమెరికాతో కర్జాయ్ పడుతున్న ఘర్షణంతా నిధులకి సంబంధించిందే తప్ప మరొకటి కాదు. ఆఫ్ఘనిస్ధాన్ లో అమెరికా, నాటో బలగాల కమాండర్ ఐన డేవిడ్ పెట్రాస్ కే నేరుగా నిధులు అందుతుండడం కర్జాయ్ కి నచ్చడం లేదు. ఆ కారణం వలన విదేశీ సైన్యాలు ఆఫ్ఘన్ ప్రభుత్వ చట్టాల పరిధిలోనే లోబడి ఉండాలని వాదిస్తున్నాడు కర్జాయ్. అమెరికా బలగాల కొనసాగింపు మరింత రక్తపాతానికీ, వినాశనానికీ, ఆఫ్ఘనిస్ధాన్ మరింత ఒంటరి కావడానికి దారి తీస్తున్నదని వాదిస్తున్నాడు.

ఈ నేపధ్యంలోనే అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్ధాన్ లో మరింత కాలంపాటు కొనసాగే అంశాన్ని హమీద్ కర్జాయ్ బహిరంగంగా ఖండించడానికి బదులు విదేశీ సైన్యం అతి చర్యలకు పాల్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఫోజులిస్తున్నాడు. తాలిబాన్‌తో నేరుగా చర్చలు జరపడానికి ప్రయత్నిస్తూనే మరోవైపు అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్ధాన్‌లో కొనసాగించడానికి తగిన ఎలిబీ కోసం అమెరికా ప్రయత్నిస్తున్న విషయాన్ని హమీద్ కర్జాయ్ తన శనివారం ప్రకటనలో బహిర్గతం చేశాడు. ఐక్యరాజ్య సమితిలో అమెరికా ప్రతినిధి సుసాన్ రైస్ ‘రెండు టెర్రరిస్టు సంస్ధల జాబితాలని వేరు చేయడం ద్వారా తాలిబాన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ఇదే సమయమని సందేశం ఇస్తున్నట్లుగా’ ప్రకటించింది.

హమీద్ కర్జాయ్ ఈ తాలిబాన్ సంబంధాల మెరుగుదల లో తన పాత్ర ఏమీ లేదని వెల్లడించాడు. అమెరికా తాలిబాన్ ల మధ్య మొదలైన చర్చలలో తనకసలు పాత్ర లేదని ఆయన తెలిపాడు. ఇదంతా అమెరికా నిర్వహిస్తున్న షో తప్ప తనది కాదని ఆయన చెప్పదలుచుకున్నాడు. “విదేశీ బలగాలు (నాటో), మరీ ముఖ్యంగా అమెరికా బలగాలు తాలిబాన్‌తో తామే చర్చలు జరుపుతున్నాయి. ఆఫ్ఘన్ ప్రభుత్వం వైపునుండి మేము ఆ చర్చలలో పాల్గొనడం లేదు” అని కర్జాయ్ చెప్పాడు. ఈ పరిస్ధితి ఇలా ఉండగా ఫష్తూనేతర మిలిటెంట్ సంస్ధలు (పాత నార్త్రన్ అలయన్స్ సభ్యులు) కర్జాయ్ పూర్తిగా తాలిబాన్‌కి అమ్ముడుబోవడాన్ని ఖండిస్తున్నారు. వీరందరికీ అమెరికాయే పోషకురాలన్న సంగతి హమీద్ కి బాగానే తెలుసు. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా వ్యవహారం కర్జాయ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే సాగుతోంది. ఒక విధంగా హమీద్ కర్జాయ్ విధేయతను అమెరికా పరీక్షిస్తున్నదని చెప్పవచ్చునేమో!

తాలిబాన్‌తో అమెరికా చేస్తున్న చర్చల్లో పాకిస్ధాన్ కి కూడా భాగస్వామ్యం లేకుండా అమెరికా జాగ్రత్త పడుతున్నట్లు కనిపిస్తోంది. కర్జాయ్ తదుపరి ఎన్నికలలోపు రాజకీయాలనుండే తప్పుకుంటాడని అమెరికా ప్రచారం చేస్తున్నది. ఆ విధంగా ఆయనకి ప్రత్యామ్నాయ శక్తులను ప్రోత్సహించి హమీద్ అడ్డు తొలగించుకోవాలని అమెరికా తలపోస్తున్నది. కాని హమీద్ అందుకు సిద్ధంగా లేడు. అవసరమైతే పాకిస్ధాన్ ప్రయోజనాలతో తన ప్రయోజనాలను మిళితం చేసయినా సరే అమెరికా ఎత్తుగడలకు చెక్ చెప్పాలని హమీద్ కర్జాయ్ ప్రయత్నించవచ్చు. అందుకే తాలిబాన్ తో సంబంధాల మెరుగుదలకు జరిగే ప్రయత్నాల్లో పాక్ పాత్రం చాలా ముఖ్యమని హమీద్ కర్జాయ్ ప్రకటిస్తున్నాడు.

హమీద్ కర్జాయ్ పోకడల పట్ల అమెరికా సహజంగానే కోపంగా ఉంది. వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం ఆమోదించడం ఇప్పుడు అమెరికా కి చాలా అవసరం. రానున్న కొన్ని దశాబ్దాల కాలంలో ఆఫ్ఘనిస్ధాన్ కి సంబంధించినంతవరకూ అమెరికా రాజకీయ, మిలట్రీ, ఆర్ధిక సంబంధాలు ఆ ఒప్పందంపైనే ఆధారపడి ఉన్నాయి. అంతే కాకుండా మధ్య ఆసియా ప్రాంతంలో రష్యా, చైనాల ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే ఆఫ్ఘనిస్ధాన్ తో వ్యూహాత్మక ఒప్పందం తప్పనిసరి. ఈ అనివార్యతపైనే హమీద్ కర్జాయ్ ఆటలు సాగుతున్నాయి. అమెరికా ప్రయోజనాలు నెరవేరాలంటే తన ప్రయోజనాలు కూడా అమెరికా చూడాలన్న సందేశాన్ని ఆయన అమెరికాకి అందిస్తున్నాడు. మరిన్ని ఆర్ధిక వనరులు హమీద్ కర్జాయ్ కి అమెరికా చూపితే తప్ప అమెరికా, హమీద్ కర్జాయ్ ల మధ్య సంబంధాలు ఇలాగే అంటీముంటనట్లుగా కొనసాగవచ్చు. అమెరికా అది పెద్ద కష్టం కూడా కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s