మారిషస్, ఐ.టి రేటింగ్ లతో నాలుగు నెలల కనిష్ట స్ధాయికి చేరిన ఇండియా షేర్ మార్కెట్లు


సోమవారం ఇండియా షేర్ మార్కెట్లు రెండు శాతం పైగా పతనమైనాయి. మారిషస్‌తొ పన్నుల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం సమీక్షనున్నదన్న భయాలు, ఇండియా ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగం రేటింగ్‌ని తగ్గించడం షేర్ల పతనానికి కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా మారిందని కూడా వీరు భావిస్తున్నారు. సోమవారం పతనంతో భారత్ షేర్ మార్కెట్లు కొన్నాళ్ళపాటు కోలుకోవడం కష్టమనీ, సెంటిమెంట్ బలహీనపడ్డం వలన మరింత పతనం చవిచూడనున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తుండగా, మరికొందరు సోమవారం నాటి భారీ పతనాన్ని సాధారణంగానే పరిగణిస్తున్నారు.

బి.ఎస్.ఇ సెన్సెక్స్ సూచి 363.90 పాయింట్లు (2.04 శాతం) నష్టపోయి 17506.63 వద్ద క్లోజయ్యింది. కాగా ఎన్.ఎస్.ఇ నిఫ్టీ 108.50 పాయింట్లు (2.02 శాతం) నష్టపోయి 5257.50 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫిబ్రవరి 10 తర్వాత ఇంత కనిష్ట స్ధాయికి షేర్లు పడిపోవడం ఇదే మొదటి సారి.

మారిషస్ ఒప్పంద సమీక్ష

మారిషస్‌తో భారత దేశానికి పన్నుల ఒప్పందం సరళతరంగా ఉండడం వలన ఇండియాకి విదేశీ పెట్టుబడులు ఈ మార్గం ద్వారానే ఎక్కువగా వస్తుంటాయి. షేర్ మార్కెట్లలోకి ఎఫ్.ఐ.ఐ పెట్టుబడులన్నీ ఈ రూట్ లోనే వస్తుంటాయి. ఆ దేశంతో ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, మారిషస్ ద్వారా విదేశీ కంపెనీల పెట్టుబడులు సెక్యూరిటీల (షేర్లు) అమ్మకం ద్వారా వచ్చే కేపిటల్ గెయిన్స్ ఆదాయంపై మారిషస్ మాత్రమే పన్నులు వేయవలసి ఉంటుంది. ఇండియా పన్నుల పరిధిలోకి అవి రావు. మారిషస్ లో వీటిపై అసలు పన్నులే లేవు. దానితో మారిషస్ ద్వారా అత్యధికంగా విదేశీ కంపెనీల పెట్టుబడులు ఇండియాకి వస్తున్నాయి. హవాలా మార్గంలో విదేశాలకు తరలించిన సొమ్ముని కూడా అవినీతి పరులు మారిషస్ ద్వారా విదేశీ పెట్టుబడుల అవతార ధరించి ఇండియాకి వస్తున్నాయి. అంటే మారిషస్ ద్వారా వచ్చే విదేశీ పెట్టుబడుల్లో కొంత భాగం నిజానికి విదేశీ పెట్టుబడులు కావన్నమాట. ఇండియా డబ్బే బ్లాక్ మనీగా బైటికి వెళ్ళీ మారిషస్ ద్వారా వైట్ మనీగా మళ్ళీ ఇండియాకే వస్తోంది.

ఈ ఒప్పందాన్ని సమీక్షించనున్నారని ఆర్ధిక శాఖ వర్గాలు చెప్పినట్లుగా వార్త వెలువడడంతో షేర్ మార్కెట్లు వత్తిడికి లోనయ్యాయి. అవినీతి కుంభకోణాలు వరసగా బైటపడుతూ ఉండడం, అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే లాంటి వారు చేస్తున్న ఉద్యమాలకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్న నేపధ్యంలో మారిషస్ పన్నుల ఒప్పందాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఒప్పందంపై సమీక్ష జరిగి కొత్త విధానం అమలులోకి వచ్చేందుకు కనీసం 9 నుండి 12 నెలల వరకూ సమయం పడుతుందనీ కనుక సమీక్ష వార్తపై ఇప్పుడే బెంగ అనవసరమనీ హీలియాస్ కేపిటల్ మేనేజ్‌మెంట్ అనే సింగపూర్ సంస్ధ అభిప్రాయపడినట్లుగా రాయిటర్స్ సంస్ధ తెలిపింది.

ఎఫ్.ఐ.ఐల ఉపసంహరణ

గత వారమంతా విదేశీ ఫండ్ సంస్ధలు ఇండియా షేర్లను అమ్మేసినవారిలో ఎక్కువగా ఉన్నారు. గత వారం మొత్తం మీద కనీసం 330 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఉపసంహరించుకున్నారని సెబి వెల్లడించిన వివరాల ద్వారా తెలుస్తోంది. విదేశీ ఫండ్ కంపెనీలు ఇండియా షేర్ మార్కెట్లో 100 బిలియన్ డాలర్ల (రు.450,000 కోట్లు) విలువగల షేర్లకు సొంతదారులుగా ఉన్నాయని సెబి వివరాలు తెలుపుతున్నాయి. 1992 లో ప్రవేటీకరణ, సరళీకరణ విధానాలు అనుసరిస్తున్నప్పటినుండి భారత షేర్ మార్కెట్లకు వచ్చి చేరిన పెట్టుబడి ఇది. 2011 సంవత్సరంలొ ఎమర్జింగ్ మార్కెట్ దేశాలన్నింటిలో ఇండియా నుండే అత్యధికంగా ఎఫ్.ఐ.ఐ లు అత్యధికంగా పెట్టుబడుల్ని ఉపసంహరించుకున్నాయి. ఈ సంవత్సరంలో షేర్ మార్కెట్లు కూడా అధికంగా నష్టపోయిన ఎమర్జింగ్ దేశం కూడా ఇండియానే.

ఐ.టి రేటింగ్

సాఫ్ట్ వేర్ రంగ రేటింగ్ సంస్ధ సి.ఎల్.ఎస్.ఎ భారత ఐ.టి రంగ రేటింగ్ ను “న్యూట్రల్” నుండి “అండర్‌వెయిట్” కి తగ్గించింది. భారత ఐ.టి కంపెనీల క్వార్టర్లీ ఆద్యాయ వృద్ధి వార్షిక ప్రాతిపదికన ఉచ్ఛ (peak) స్ధితికి చేరుకుందనీ, మునుముందు ఆ వృద్ధి పడిపోతుందని రేటింగ్ తగ్గించడానికి కారణంగా ఆ సంస్ధ తెలిపింది. టి.సి.ఎస్, ఇన్ఫోసిస్ కంపెనీల రేటీంగ్ ను “అండర్ పెర్ఫార్మ్” కు సి.ఎల్.ఎస్.ఎ తగ్గించింది. దానితో వాటి షేర్లు వరుసగా 7.9, 6.2 శాతాలు పడిపోయాయి.

అదేవిధంగా నెట్‌వర్క్ ఇంజనీరింగ్ సేవలు అందించే సంస్ధ జి.టి.ఎల్ షేరు విలువ రోజులో అత్యధిక దిగువస్ధాయికి (63.3 శాతం) రు.124.15పై లకు పడిపోయింది. డిసెంబరు 2006 తర్వాత అత్యంత కనిష్ట స్ధాయి ఇదేనని తెలుస్తోంది. కాగా జిటిఎల్ ఇన్‌ఫ్రా షేరు 48.5 శాతం నష్టపోయి రు.15.25 పై లకు చేరింది. ఆ షేరు జీవితంలోనే ఇది అత్యంత తక్కువ అని రాయిటర్స్ తెలిపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి అవి కొద్దిగా పెరిగి వరుసగా 62.2, 42.7 శాతాల నష్టాలతో ముగిసాయి. తన ఫండమెంటల్స్ బలంగానే ఉన్నాయని జి.టి.ఎల్ అంటోంది.

అనిల్ అంబాని కంపెనీలయిన రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రాష్ట్రక్చర్ లను అగస్టు 8 నుండి బి.ఎస్.ఇ లిస్టింగ్ నుండి తొలగిస్తున్నట్లుగా బి.ఎస్.ఇ ప్రకటించడంతో అవి కూడా బాగా నష్టపోయాయి. ఆర్.కాం 7.9 శాతం, ఆర్.ఇన్‌ఫ్రా 6.2 శాతం నష్టపోయాయి. మొత్తం మీద సోమవారం సాఫ్ట్ వేర్ సంస్ధలు షేర్ మార్కెట్ నష్టపోవడంలొ అగ్రభాగాన ఉన్నాయి.

వ్యాఖ్యానించండి