ఇంటర్నెట్ లో డొమెయిన్ నేమ్‌ల పూర్వ పదాలుగా ఇప్పుడు పరిమితంగానే ఉన్నాయి. డాట్ కామ్, డాట్ ఒఆర్‌జి, డాట్ ఇన్ఫో (.com, .org, .info etc…) తదితరాలతో పాటు ఆయా దేశాలను సూచించే పదాలు మాత్రమే డొమెయిన్ నేమ్ లో చివరి పదాలుగా ఉండాలన్న నిబంధన ఉంది. అవి తప్ప ఇతర పదాలను రిజిష్టర్ చేసుకునే సౌకర్యం ఇంతవరకూ లేదు. అయితే 2012 సంవత్సరం నుండీ ఈ పరిమితికి స్వస్తి పలకడానికి అంతర్జాతీయ ఇంటర్జెట్ నియంత్రణా సంస్ధ నిర్ణయించింది. డొమెయిన్ నేమ్ లను నియంత్రించే సంస్ధ ఐ.సి.ఎ.ఎన్.ఎన్ (ICANN – Internet Corporation for Assigned Names and Numbers) సంస్ధ సోమవారం సింగపూర్ లొ జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 15 మందిలో 12 మంది దీనికి అనుకూలమ్గా ఓటు వేయగా కేవలం 1 ఓటు మాత్రమే వ్యతిరేకంగా వచ్చింది. మిగతా ఇద్దరు ఓటింగ్ నుండి తప్పుకున్నారని రాయిటర్స్ తెలిపింది.
భాషల పరిమితి కూడా తొలగించడానికి నిర్ణయించారు. రష్యన్లకు సిరిలిక్, జపనీయులకు కాంజీ, భారతీయులకు (హిందీ) దేవనాగరి లిపిలలో (మొదలైనవి) అక్షరాలు వినియోగించడానికి కూడా అనుమతి ఇవ్వాలనేది నిర్ణయం. ఈ మార్పుతో ఇంటర్నెట్ లో అతిపెద్ద మార్పు వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపార సంస్ధలకు ఇది బాగా ఉపకరిస్తుంది. ఆయా చివరి పేర్లతో డొమెయిన్ నేమ్ లు రిజిష్టర్ చేసుకునే ముందు ఆ పేర్లు రిజిష్టర్ చేసుకోవడానికి సరైన కారణం చూపాలని ఒక నిబంధన పెడతారని తెలుస్తోంది. అటువంటి డొమైన్ నేమ్ లు రిజిష్టరు చేసుకోవడానికి ఖరీదు కూడా ఎక్కువగా ఉంటుందని రాయిటర్స్ తెలిపింది. అంటే వ్యాపార సంస్ధలకు మాత్రమే ఇది అందుబాటులో ఉండగలదని భావించవచ్చు.
“తరువాతి తరాలకు చెందిన సృజనాత్మకతకూ, స్ఫూర్తికీ మేము ఒక వేదిక కల్పించాము” అని ఐ.సి.ఎ.ఎన్.ఎన్ తెలిపింది. డొమెయిన్ నేమ్ లలో చివరి పేర్లను సూచించే పద్ధతిని gTLD (generic top-level domain) గా పిలుస్తారన్నది తెలిసిందే. ఇకనుండి good.food, glossy.lipstick లాంటి పేర్లు రిజిష్టరు చేసుకోవచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అయితే కొత్త విధానం సామాజిక, మతపరమైన సెంటిమెంట్లు గాయపడేలా కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఉదాహరణకి .nazi లాంటి డొమెయిన్లు ప్రారంభం కావచ్చని ఓ నిపుణుడు తెలిపాడు. ఇప్పటి విధానం ద్వారా డాట్ కామ్ డొమెయిన్లను అధిక ధరలకు కొన్నవారు నష్టపోయే అవకాశాం కూడా కనిపిస్తోంది.
రిజిష్టర్ చేసుకోవడంలొ త్వరపడనట్లయితే బ్రాండ్ నేమ్ లను కలిగి ఉన్న వ్యాపార సంస్ధలకు కూడా అసౌకర్యం కలగవచ్చు. ఉదాహరణకి Canon సంస్ధ .canon నేమ్ ను వేరొకరు రిజిష్టర్ చేయక ముందే తాను రిజిష్టర్ చేసుకోవలసు ఉంటుంది. అదే అంశం వ్యాపార అంశలకు పెద్ద అనుకూలాంశంగా ఉపయోగపడుతుంది. ఆయా కంపెనీలు తమ బ్రాండ్ పేర్లను డొమెన్ పేర్లలో చివరి పదాలుగా ఉంచుకోవడం ద్వారా వారి బ్రాండ్ విలువను మరింత పెంచుకుని ఇంటర్నెట్ లో వ్యాపారావకాశాలను మరింతగా పెంచుకోవచ్చు.
ప్రస్తుతం .com .org .info లాంటి 22 gTLD లు, 250 వరకూ దేశాల పేర్లతో gTLD లు మాత్రమే అనుమతి ఉంది. కొత్త నిబంధనతో అనెక వందల వేల పేర్లు ఉనికి వచ్చే అవకాశం ఉంది. కొన్ని వ్యాపారాలకు ఆయా నగరాలు, పట్టణాల పేర్లు కూడా లాభసాటిగా మారే అవకాశం కనిపిస్తోంది. indian.food, bicycles.newdelhi, sambar.chennai, biryani.hyderabad ఇలా. “ఇది ఇంటర్నెట్ కి సంబంధించి తదుపరి విస్తరణ. ఇంటర్నెట్ కి ఇది భవిష్యత్తు” అని .Nxt.Inc సంస్ధ సి.ఇ.ఓ అన్నట్లుగా రాయిటర్స్ సంస్ధ తెలిపింది. ఈ సంస్ధ ఇంటర్నెట్ విధానాలు, గవర్నెన్స్ అంశాలను పర్యవేక్షించే సాన్‌ఫ్రాన్‌సిస్కో కి చెందిన సంస్ధ.
కొత్త విధానం మరొక కొత్త ఐటి బుడగ ను సృష్టించే అవకాశాలు కూడా లేకపోలేదు.