ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఏవి? రాయిటర్స్ వార్తా సంస్ధ అనుబంధంగా ఉండే ట్రస్ట్‌లా అనే సంస్ధ ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవడానికి సర్వే చేసింది. ఇది అవినీతి వ్యతిరేక అంశాలు (anti-corruption issues), సమర్ధ పాలన (good governance), మహిళల హక్కుల (women rights) అంశాలపై ప్రపంచ స్ధాయిలో ఉచితంగా వార్తలు, సమాచారం, న్యాయ సలహాలు అందించే సంస్ధ. ధామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ దీన్ని నడుపుతోంది.
మహిళలకు సంబంధించిన ఆరు అంశాలపై ఇది ప్రపంచ వ్యాపితంగా గల నిపుణులైన 200కు పైగా గల వివిధ సంస్ధలను అడిగి అభిప్రాయాలు సేకరించింది. ఆ ఆరు అంశాలు: 1. ఆరోగ్యానికి గల ప్రమాదాలు (health threats) 2. వివక్ష (discrimination) 3. సాంస్కృతిక, మతపరమైన నిబంధనలు (cultural and religious norms) 4. లైంగిన హింస (sexual violence) 5. లైంగికేతర హింస (non-sexual violence) 6. రవాణా (trafficking).
ఈ ఆరు అంశాలపై అభిప్రాయాలు అందించిన సంస్ధలు ఆయా రంగాల్లో అధ్యయనాలు చేస్తున్న సంస్ధలు. మహిళలకు సంబంధించిన వివిధ సమస్యలపై అధ్యయనం చేస్తూ సాధికారంగా, ససాక్ష్యంగా నివేదికలు రూపొందించిన సంస్ధలవి. తమ సర్వేలో తేలినదాని ప్రకారం ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన ఐదు దేశాలను ట్రస్ట్ లా గుర్తించింది. అవి వరుసగా: 1. ఆఫ్ఘనిస్ధాన్ 2. కాంగో 3. పాకిస్ధాన్ 4. ఇండియా 5. సోమాలియా. వీటిలో రెండు మాత్రమే ఆఫ్రికా దేశాలు కాగా, మూడు ఆసియా దేశాలు.
వీటిలో పాకిస్ధాన్, ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమూ, ప్రపంచంలో మారుమూల దేశాల్లో కూడా ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పలవరిస్తుంటే పరుగెత్తికెళ్ళి ప్రజాస్వామ్యాన్ని స్ధాపించే అమెరికాకి గత ఆరు దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత మిత్ర దేశం. ఇక ఇండియా
అయితే దేవతలు సంచరించే దేశం. దేవ భాష విలసిల్లిన దేశం. స్త్రీ శక్తి స్వరూపిణి అని పూజించే దేశం. యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంతే దేవతా, స్త్రీలు ఎక్కడ పూజింపబడెదరో అక్కడ దేవతలు సంచరించెదరు అని మనసా, వాచా, కర్మణా నమ్మి ఆచరిస్తోందని చెప్పుకుంటున్న దేశం. అత్యంత భద్రమైన వివాహ వ్యవస్ధ ఉన్నదని చెప్పుకునే దేశం.
పాకిస్ధాన్ మత ఛాందస దేశమని నమ్ముతూ వీలయినప్పుడల్లా ముస్లిం మతం వల్ల అక్కడి మహిళలు పలు కష్టాల పాలవుతున్నారని భారతీయులు పాక్‌ని ఈసడించుకోవడం పరిపాటి. స్త్రీ విద్యను నిరాకరించే మూర్ఖదేశమని ఆఫ్ఘనిస్ధాన్‌ని సందర్భం వచ్చినప్పుడల్లా తాలిబాన్, ఆల్-ఖైదాలను భారతీయులు తిట్టిపోయడం, ఉపన్యాసాలు దంచడం ఒక అలవాటుగా నిత్య సత్యంగా భావిస్తుంటారు. అటువంటి భారత దేశం, పాకిస్ధాన్ తర్వాత స్ధానాన్ని ఆక్రమించుకోవడం సిగ్గుచేటైన విషయం. అత్యంత వెనకబడిన దేశమైన సోమాలియా కంటే మహిళల విషయంలో మాత్రం ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ గల ఇండియా వెనకబడి ఉండడం ఎంత దైన్యం? మహిల ప్రధాని కాగల దేశం, మహిళ సారధిగా గల పాలక పార్టీ, చట్టసభలో మహిళ ప్రతిపక్ష పార్లమెంటరీ పార్టీ నాయకురాలుగా గల దేశం, దేశానిక మొట్టమొదటి పౌరులుగా మహిళ గల దేశం, ఇద్దరు మహిళలు ముఖ్యమంత్రులుగా ఏలుతున్న దేశం అయిన భారత దేశం ఆడపిల్లలను పుట్టకముందే చంపుతూ, వీలైతే పుట్టాక కూడా చంపుతూ, పెరుగుతుండగా పోషకాహారం ఇవ్వకుండా చంపుతూ, వయసులో ఉండగా వ్యభిచార గృహాలకు అమ్మేస్తూ, పెళ్ళయ్యాక కట్నాల కోసం, మగపిల్లల కోసం, అనుమానాలతో చంపెస్తూ… ఐనప్పటికీ స్త్రీని పూజించే దేశంగా చెప్పుకుంటున్న దేశం ఇండియా. ఎక్కడుంది లోపం?





