టెర్రరిస్టు తాలిబాన్‌తో అమెరికా చర్చలు!!!


“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” (Global war on terrorism) ప్రకటించింది అమెరికా దేశమే. టెర్రరిజం వలన అమెరికా జాతీయ భద్రతకూ, అమెరికా ప్రజలకు ప్రమాదం ఏర్పడిందని, దరిమిలా టెర్రరిజం ప్రపంచం మొత్తానికీ ప్రమాదకరమనీ అమెరికా ప్రభుత్వం. ప్రపంచ దేశాలన్నీ తనతో కలిసి టెర్రరిజంపై పోరాటం చేయవలసిందేనని పరోక్షంగా శాసించింది. నీవెటువైపు? అని ప్రశ్నిస్తూ, నాతో లేకుంటే టెర్రరిజం వైపు ఉన్నట్లే అని హుంకరించింది అమెరికా అధ్యక్షుడే. అమెరికా హుంకరింపులతో ఇండియా లాంటి దేశాలు కూడా “నేను సైతం” అని ముందుకురికాయి. ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలపై బాంబులు కురిపిస్తున్న అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం మా భూభాగంపై నింపుకోవచ్చంటూ అప్పటి బి.జె.పి ప్రభుత్వం అదేపనిగా అమెరికా వెంటపడింది.

“టెర్రరిజంపై ప్రపంచ యుద్ధం” మొదలై పదేళ్ళు గడిచాయి. ఆరేడు నెలల్లో పనౌతుందని ప్రగల్భాలు పలికిన అమెరికా నాయకత్వంలోని దురాక్రమణ గుంపు పదేళ్ళైనా అది సాధించలేక అలసి సొలసి నీరసిల్లింది. ఆఫ్ఘనిస్ధాన్ లోని సొంత స్ధావరాల్లోనే అమెరికా జనరల్స్ రక్షణకు గ్యారంటీ లేక అల్లల్లాడుతోంది. తాలిబాన్ ఎత్తుగడలకు చిత్తై తలలు బాదుకుంటున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో డ్రోన్ విమానాలను వినియోగించుకుంటూ కూడా ప్రజలను చంపుతున్నాయి తప్ప వారనుకుంటున్న లక్ష్యం కనుచూపుమేరలో కనిపించడం లేదు. మరోవైపు అంతకంతకూ పెరిగిపోతూ, ఎంతకీ తెగని యుద్ధం అమెరికా ఆర్ధిక వ్యవస్ధను కుంగదీస్తోంది. అమెరికా ప్రజలు కట్టిన పన్నుల డబ్బును దురాక్రమణయుద్ధాలకు పోస్తూ, సొంత ప్రజలకు నిరుద్యోగాన్నీ, దరిద్రాన్నీ, పడిపోతున్న జివన ప్రమాణాలనూ పంచి పెడుతున్నారు అమెరికా పాలకులు.

ఈ నేపధ్యంలోనే శాంతి అనేమాటే ఎరగని అమెరికా శాంతి మంత్రం జపిస్తోంది. తాలిబాన్ టెర్రరిస్టు సంస్ధ అని ముద్ర వేసిన తాలిబాన్‌లో మంచి తాలిబాన్లు ఉన్నారంటోంది. తాలిబాన్‌తో శాంతి చర్చలంటూ రెండు సంఅత్సరాల క్రితమే మాట్లాడ్డం ప్రారంభించిన అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తాజాగా తాలిబాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని నిర్ధారిస్తున్నారు. మొట్టమొదటిసారిగా అమెరికా నియమించిన కీలుబొమ్మ, ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు, హమీద్ కర్జాయ్ అమెరికాయే తాలిబాన్‌తో చర్చలు కొనసాగిస్తున్నదని స్వయంగా ప్రకటించాడు. హమీద్ కర్జాయ్ లాంటి ఉన్నత స్ధాయిలోని వ్యక్తులు అమెరికా, తాలిబాన్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయని నిర్ధారించడం ఇదే మొదటిసారి.

“నీవు నావైపు లేనట్లయితే టెర్రరిజం వైపు నిలిచినట్లే అని హుంకరించిన అమెరికా తన హుంకరింపును ఉపసంహరించుకున్నట్లేనా? “జంట టవర్లపై దాడులకు బాధ్యుడు ఒసామా బిల్ లాడెనేనని నిరూపిస్తే అతనిని ఇరుపక్షాలకు అంగీకారమైన మూడవ దేశానికి అప్పగించడానికి సిద్ధమేననీ, బాంబింగ్‌లో ప్రజలు చనిపోతున్నందున వెంటనే అపాలనీ” తాలిబాన్ ప్రభుత్వం కోరినా, బాంబింగ్ ని విరమించే ప్రసక్తే లేదని, బేషరతుగా లాడెన్‌ని అప్పగించాలని శాంతికీ, చర్చల ప్రక్రియకూ మోకాలడ్డిన అమెరికా ఇప్పుడు శాంతి మంత్రం జపించడం సిగ్గు చేటు. లక్షల మంది ప్రజలను బాంబు దాడుల్లో చంపేసి, మరిన్ని లక్షలమందికి కాళ్ళూ చేతులూ లేని వికలాంగులుగా మార్చివేసి, లక్షల కుటుంబాల జీవితాలను చిన్నాభిన్నం చేసి, దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసిన అమెరికా ఇప్పుడు శాంతి చర్చలని పలవరించడం తులసీనీరు కోసం నిస్సహాయంగా నోరు తెరవడమే.

అమెరికా డిఫెన్స్ సెక్రటరీ రాబర్ట్ గేట్స్ త్వరలో రిటైర్ కానున్నాడు. ఆయన ఈ నెలారంభంలోనే ‘తాలీబాన్‌తో అమెరికా ఈ సంవత్సరాంతానికి రాజకీయ చర్చలు ప్రారంభిస్తుంది అని ప్రకటించాడు. ఒబామా హామీ ప్రకారం వచ్చే నెల జులైనుండే అమెరికాకి చెందిన దాదాపు లక్షమంది సైనికులు ఆఫ్ఘనిస్ధాన్ విడిచి వెళ్ళవలసి ఉంది. ఈ లొగానే ఆఫ్ఘన్ ప్రభుత్వ సైనికులకు తాలిబాన్, ఆల్-ఖైదా లను ఎదుర్కునే విధంగా తయారు చేయాలన్న తలంపుతో అమెరికా ఇచ్చిన శిక్షణను అందిపుచ్చుకున్న ఆఫ్ఘన్ సైనికులు తామే మానవబాంబులుగా మారి అమెరికా సైనికుల్ని చంపేస్తుండడంతో దిక్కు తోచని స్ధితిలో అమెరికా ఉంది. జులైనుండి మొదలు పెట్టి 2014 లోపు ఆఫ్గన్ సెక్యూరిటీ బాధ్యతలను అన్నింటినీ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పజెపుతానని అమెరికా చెపుతున్నప్పటికీ వాస్తవానికి గణనీయ మొత్తంలో అమెరికా సైనికుల్ని ఆఫ్ఘన్ నేలపై ఉంచకుండా మానదు. పూర్తిగా ఖాళీ చేయడానికే వెళ్ళడానికి కాదు అమెరికా ఆఫ్ఘన్ కి వచ్చింది. ప్రపంచాధిపత్యం కోసం పన్నిన వ్యూహంలో భాగంగానే ఆఫ్ఘన్ ని దురాక్రమించిన అమెరికా, ఆఫ్ఘన్ ప్రజలు తరిమి కొట్టే వరకూ అక్కడినుండి వెళ్ళే అవకాశాలు లేవు.

అమెరికా, తాలిబాన్ ల చర్చల వీషయమై హమీద్ కర్జాయ్ ప్రకటించిన గంటల్లోనే ఆఫ్ఘన్ రాజధాని కాబుల్ లోని ఓ పోలిస్ స్టేషన్ ను ఇద్దరు మానవబాంబులు పేల్చేశారు. తాలిబాన్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం విదేశీ సైనికులు ఆఫ్ఘన్ నుండి వెళ్తేనే చర్చలు జరుగుతాయి. అది కూడా అమెరికాతో చర్చలు జరిగే అవకాశం లేదు. ఆఫ్ఘన్ ప్రభుత్వంతోనే ఆ చర్చలు సాధ్యం. తెరవెనుక అమెరికా చర్చలు పరువు నిలుపుకోవడానికి తప్ప మరొకటి కాదు. వీళ్ళిలా చర్చల ప్రస్తావన తెస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. మరిన్ని సంవత్సరాలు పారాడ్డానికి ఆఫ్ఘన్ ఫస్తూన్లు ఎప్పుడూ సిద్దమే. దశాబ్దాల పాటు, గత శతాబ్దం ప్రారంభం నుండీ అనేక ఆక్రమణలను ఆఫ్ఘనిస్ధాన్ ప్రజలు ఎదురొడ్డి పోరాడారు. అదే పట్టుదల, దీక్షలతో వారు అమెరికా దాని తాబేదార్లను తరిమి కొట్టడం ఖాయం. ఆఫ్ఘనిస్ధాన్ నుండి వెళ్ళిపోవడానికి అమెరికా ఎంత త్వరగా నిర్ణయించుకుంటే అంత తక్కువ నష్టంతో బయటపడవచ్చు.

వ్యాఖ్యానించండి