‘పిచ్చి ముదిరింది అంటే రోకిలి తలకు చుట్టండీ’ అన్నాట్ట వెనకకటికెవడో. ఇజ్రాయెల్ రబ్బినికల్ కోర్టు తీరు కూడా అలానే ఉంది. కోర్టు వసారాలో తిరుగుతున్న కుక్క చనిపోయిన ఒక లాయర్ ఆత్మని ధరించిందని భావిస్తూ దానిని కొట్టి చంపమని సదరు కోర్టు అజ్ఞాపించింది. ఆ లాయర్ బ్రతికి ఉండగా ఆ కోర్టులోని జడ్జిలను అవమానిస్తూ మాట్లాడట. అలా అవమానిస్తూ మాట్లాడిన వ్యక్తి చనిపోయాక అతని ఆత్మ వీధి కుక్క రూపంలో తిరుగుతున్నట్లు జడ్జిలు భావించి దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలని తీర్పునిచ్చారు.
ఇజ్రాయెలి వెబ్ సైట్ “వై నెట్” ప్రకారం, జెరూసలేంలోని ఫైనాన్షియల్ కోర్టులోకి అనేక వారాల క్రితం వీధి కుక్క ప్రవేశించింది. మరి దానికక్కడ తినడానికి ఏం దోరికిందో గాని అప్పటినుండి కోర్టును వదిలి వేళ్ళలేదు. కోర్టు పరిసరాలను విడిచి వెళ్ళని కుక్కను చూశాక కోర్టు జడ్జిలలో ఒకరికి 20 ఏళ్ళ క్రితం చనిపోయిన లాయరు గుర్తుకొచ్చాడు. లౌకిక భావాలు కలిగిన ఆ లాయరు ఆత్మ కుక్క శరీరంలో ప్రవేశించాలని అప్పట్లో ఈ జడ్జిలు శపించారట. జుడాయిజంలో కుక్కను అపరిశుద్ధ జంతువులుగా భావిస్తారు. అందువలన జడ్జి ఆత్మ తాము ద్వేషించే కుక్క శరీరంలోకి ప్రవేశీంచాలని శపించారు.
జెరూసలేం నగరంలోని సంప్రదాయకర భావాలకు అత్యంత విలువనిచ్చే మియా షియారిమ్ ప్రాంతంలో ఈ కోర్టు ఉంది. జడ్జిలలో ఒకరు తాము విధించిన శిక్షలను అమలు చేయాలని కొంతమంది పిల్లలను పురమాయించాడు. కాని సదరు లాయరు ఆత్మ ఉన్న కుక్క పసిగట్టిందో ఏమో గాని వారు దాడి చేసేలోపుగానే అక్కడినుండి వెళ్ళిపోయింది. జంతు సంక్షేమ సంస్ధ వాళ్ళు ఒక కోర్టు అధికారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఆయన జడ్జిలు కుక్కను చంపాలని తీర్పు చెప్పడం వాస్తవం కాదని అంటున్నాడు.
అయితే కోర్టు మేనేజరు మాత్రం నిజం చెప్పాడు. యెడియోత్ అహరోనోత్ అనే ఇజ్రాయెలీ దిన పత్రికతో మాట్లాడుతూ కుక్కకు శిక్ష విధించిన సంగతిని అంగీకరిస్తూ ఆ చర్య సరైనదేనని చెప్పుకొచ్చాడు. రాళ్లతో కొట్టి చంపితేనే కుక్కలో ప్రవేశించిన లాయరు ఆత్మ తన యధాస్ధానానికి చేరుకోగలదనీ, అందువలన కొట్టి చంపమని తీర్పివ్వడం సరైనదేననీ ఆయన తేల్చేశాడు.