తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పిస్తానని వాగ్దానం చేసి అధికారానికి వచ్చిన ఒబామా ఆఫ్ఘనిస్ధాన్‌కి మరింతమంది సైనికుల్ని పంపడమే కాకుండా, కొత్తగా లిబియా యుద్ధానికి గూడా తెగబడ్దాడు. ఈ రెండు చర్యలతో ఒబామా అమెరికా ప్రజల్ని ఘోరంగా మోసం చేశాడు. అయితే ఆయన ప్రజల్ని మోసం చేయడమే కాకుండా అమెరికా చట్టాల్ని కూడా ఉల్లంఘించి లిబియాపై యుద్ధం కొనసాగిస్తున్నాడని అమెరికా కాంగ్రెస్ సభ్యులు అనేకులు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్ పార్టీ నాయకుడు మొత్తుకుంటున్నారు. లిబియా యుద్ధంలో పాల్గొనడానికి వ్యతిరేకంగా పెంటగాన్ (అమెరికా మిలట్రీ కేంద్రం) జనరల్ కౌన్సెల్ జే జాన్సన్, జస్టిస్ డిపార్ట్‌మెంటుకి చెందిన లీగల్ కౌన్సెల్ ఏక్టింగ్ అధిపతి కెరోలిన్ క్రాస్ లు సలహా ఇచ్చినప్పటికీ వారి సలహాను కూడా ఒబామా పెడచెవిన పెట్టినట్లుగా తాజాగా న్యూయార్క్ టైమ్స్పత్రిక వెల్లడించింది.
వియత్నాం యుద్ధకాలపు చట్టం
వియత్నాం యుద్ధానంతరం చేసిన ఒక చట్టం ప్రకారం (The War Powers Resolution of 1973) అమెరికా వరుసగా అరవై రోజులకంటే ఎక్కువగా శతృసంబంధాలు (hostilities) ఉన్న మరో దేశంపై యుద్ధం చేయదలిస్తే అందుకు కాంగ్రెస్ (ప్రతినిధుల సభ – House of Representatives) అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అధ్యక్షుడు మరో 30 రోజులపాటు పొడిగింపును కోరవచ్చు. కాని లిబియాపై యుద్దం ప్రకటించి మే 20 తో 60 రోజులు పూర్తయ్యాయి. రేపు జూన్ 19 తో ప్రత్యేక గడువు కూడా పూర్తవుతుంది. అయినా ఒబామా కాంగ్రెస్ అనుమతి తీసుకునెందుకు ప్రయత్నం చేయడం లేదు.
శతృవుపై యుద్దం కాదు
అందుకు ఒబామా, అతని మద్దతుదారులు చెబుతున్న కారణం లిబియా యుద్ధంలో అమెరికా పాత్ర శతృ సంబంధాలున్న దేశంపై యుద్ధం చేస్తున్న పాత్ర కాదనీ, యుద్ధం చేస్తున్న నాటో దేశాల యుద్ధ విమానాలకు ఇంధనం నింపడం, లిబియాలో గూఢచర్య సమాచారం సేకరించి నాటోకి అందజేయడం మాత్రమేనని. ఈ అంశంపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. మే 20 నుండి ఒబామా లిబియా యుద్ధం విషయంలో అమెరికా 1973 చట్టాన్ని (పౌరులను రక్షించే పేరుతో లిబియాపై యుద్ధం చేయడానికి నాటో దేశాలకు భద్రతా సమితి అనుమతినిచ్చిన తీర్మానం కూడా 1973 వ తీర్మానమే కావడం గమనార్హం) ఉల్లంటిస్తున్నాడని కాంగ్రెస్ సభ్యులు పార్టీలకు అతీతంగా విమర్శిస్తున్నారు. ఇరుపార్టీలకు చెందిన కాంగ్రెస్ సభ్యుల బృందం ఒకటి, కాంగ్రెస్ అనుమతి లేకుండా లిబియా యుద్ధం చేయడం గురించి ఒబామాపై ఫెడరల్ కోర్టులో కేసు దాఖలు చేస్తున్నారు. అమెరికా రాజ్యాంగాన్ని ఒబామా ఉల్లంటించాడని వారి ఆరోపణ.
అయితే పెంటగాన్, న్యాయ విభాగాల సలహాదారులతో వైట్ హౌస్ న్యాయ సలహాదారులు విభేదించారు. వైట్‌హౌస్ కౌన్సెల్ రాబర్ట్ బౌయెర్, స్టేట్ డిపార్ట్‌మెంట్ న్యాయ సలహాదారు హరాల్డ్ కో లు లిబియా యుద్ధంలో అమెరికా పాత్ర “శతృ సంబంధాల” కిందికి రాదని వాదిస్తున్నారు. లీగల్ కౌన్సిల్ కార్యాలయం ఇచ్చే న్యాయ సలహాలను అమెరికా అధ్యక్షులు ఉల్లంఘించడానికీ లేదా పెడచెవిన పెట్టడానికీ అధ్యక్షుడికి అధికారం ఉన్నప్పటికీ అలా జరగడం చాలా అరుదని విశ్లేషకుల అంచనాగా బిబిసి చెబుతోంది. రెండ్రోజుల క్రితం ఒబామా కాంగ్రెస్ సభ్యులకు లిబియా యుద్ధం విషయమై కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెబుతూ 32 పేజీల వివరణ పత్రాన్ని పంపిణీ చేశాడు. అందులో లిబియా యుద్దంలో అమెరికాది సహాయ పాత్ర మాత్రమేనని వివరించడానికి ప్రయత్నించాడు.
రహస్య గోల్ఫ్ ఆట
వాస్తవానికి 1973 చట్టం విషయంలో ఇటువంటి తీవ్ర విభేధాలు సహజమేననీ, ఆ చట్టంపై ఇప్పుడు ఎంత తీవ్రమైన వాదోపవాదాలు జరిగిన అది మంచికేననీ వైట్ హౌస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతినిధుల సభలో రిపబ్లికన్ సభ్యుల నాయకుడు బోయెనర్, అమెరికా పాత్రపై ఒబామా చేస్తున్న వాదనను తిప్పికొట్టాడు. “లిబియా యుద్ధంలో శతృ సంబంధాలు లేవని వైట్ హౌస్ చెబుతోంది. అయినప్పటికీ మనం అక్కడ డ్రోన్ విమానాలతో దాడులు చేస్తున్నాం” అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. “మనం లిబియా యుద్ధంలో రోజుకు 10 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాం. గడ్డాఫీ నివాస భవంతులపై బాంబుదాడులు చేస్తున్న యుద్ధంలో మనం పాత్రధారులం. ఇవన్నీ చూసినపుడు మనం ‘శతృ సంబంధాల్లో లేము’ అని చెప్పడం బొత్తిగా అంగీకార యోగ్యం కాదు” అని బోయెనర్ వ్యాఖ్యానించాడు.
ఈ వారాంతంలో అంటే రేపు ఆదివారం నాడు అధ్యక్షుడు ఒబామా, రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ సభ్యుల నాయకుడు బోయెనర్‌లు ఒక రహస్య ప్రదేశంలో గోల్ఫ్ ఆట ఆడనున్నారు. “రహస్య ప్రదేశంలో గోల్ఫ్ ఆట” అంటే అర్ధం ఇరువురూ సుదీర్ఘ సమయం పాటు చర్చలు జరపనున్నారని. ఈ చర్చల్లో లిబియా యుద్ధం కూడా ఒక అంశం కావచ్చు. దాంతో పాటు అమెరికా అప్పు, చట్ట పరిమితి ఐన 14.3 ట్రిలియన్ డాలర్లకు చేరినందున ఆ పరిమితిని పెంచే బిల్లుకు ఆమోదం పొందటం, అలాగే రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న పొదుపు బడ్జెట్ బిల్లులో ఒబామా చెబుతున్నట్లుగా ధనికులపై పన్నులు వేసి, రద్దు చర్యలనుండి ఆరోగ్య భీమా ఖర్చును తొలగించడం… అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.