కేంద్ర ప్రభుత్వ వైఖరితో అన్నా హజారే విసుగు చెందాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను విశ్వసించి ఏప్రిల్ లో ఆమరణ నిరాహార దీక్షను విరమించిన అన్నా హజారే, మరునాటి నుండే పౌర సమాజ కార్యకర్తలపై కేంద్ర మంత్రులు వివిధ ఆరోపణలతో దాడి ప్రారంభించడంతో ఖిన్నుడయ్యాడు. శాంతి భూషణ్, ఆయన కొడుకు ప్రశాంత్ భూషన్ ఇరువురూ కమిటీలో ఉండడం పట్ల మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు తర్వాత శాంతి భూషణ్ పై అవినీతి ఆరోపణను ఎక్కడో పాతాళం నుండి తవ్వి తీశారు. ఆ ఆరోపణలో నిజం లేదని ఇతర పౌరసమాజ నాయకులు తేల్చాక, ప్రధాని, సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ లను బిల్లులో కలపొద్దంటూ లొల్లి మొదలెట్టారు.
ఈలోపు యోగా గురువు ప్రారంభించిన మరో దీక్షపై పోలీసులతో దాడి చేయించడంతో అప్పటివరకు ఎడమొఖం పెడమొఖంగా ఉన్న హజారే, రాందేవ్ శిబిరాలు ఒంటి గోంతుతో నిరసించాయి. అన్నా హజారే, దానికి నిరసనగా ఒక రోజు దీక్షను ప్రకటించి జంతర్ మంతర్ వద్ద అనుమతి ఇవ్వకపోవడంతో మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద దీక్ష జరిపాడు. ఇప్పుడు ప్రభుత్వం తరపున లోక్ పాల్ బిల్లు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉన్న కేంద్ర మంత్రులు తాము ఒక డ్రాఫ్టును రూపొందిస్తామనీ, పౌర సమాజ నాయకులు మరొక డ్రాఫ్టు రూపొందించడనీ చెప్పడంతో పౌర సమాజ నాయకులు విస్తుపోతున్నారు. ఈ లెక్కన ఆగష్టు 15 నాటికి తయారయ్యేది “లోక్ పాల్ బిల్లు” కాదనీ “జోక్ పాల్ బిల్లు” అనీ అరవింద్ కేజ్రీవాల్ నిరసన వ్యక్తం చేశాడు.
ప్రభుత్వ ధోరణి ఇలాగే కొనసాగి ఎటువంటి ఆయుధాలు లేని సాదా సీదా బిల్లును రూపొందిస్తే తాను ఆగష్టు 16 నుండీ ఆమరణ ధీక్ష ప్రారంభిస్తానని ప్రకటించాడు. తమను తీహార్ జైలులో పెట్టదలుచుకుంటే పెట్టుకోవచ్చనీ అన్నా ప్రకటించాడు. పౌర సమాజ కార్యకర్తలు సూచించే అన్ని ప్రతిపాదనలనూ డ్రాఫ్టులో పొందుపరుస్తామని ఇచ్చిన హామీనుండి ప్రభుత్వం వెనక్కి వెళుతోందని ఆయన విమర్శించాడు. రెండు బిల్లులు తయారు చేద్దామని సూచించడం పట్ల ఆయన విలేఖరుల వద్ద ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. “రెండు డ్రాఫ్టులు తయారుచేసే పనైతే, ఇక ఈ ఉమ్మడి కమిటీని ఎందుకు ఏర్పాటు చేసినట్లు? ఆ విషయం ముందే చెబితే సరిపోయేది. మా డ్రాఫ్టు వారికి తెలుసు. ఇంత సమయాన్ని ఎందుకు వృధా చేశారు? శక్తివంతమైన బిల్లు తయారు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఉద్దేశ్యమూ లేదని స్పష్టమవుతోంది” అని హజారే అన్నాడు.
హజారే, ఏప్రిల్ లో తన నిరాహార దీక్షను విరమించడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలనుండి వెనక్కి వెళ్ళిందని ఆరోపిస్తూ, ఆగస్టు 16 న ఆమరణ నిరాహార దీక్షను తిరిగి ప్రారంభిస్తానని ప్రకటించాడు. రాందేవ్ దీక్షను అణచివేసినట్లు తమ దీక్షను కూడా అణవివేసినట్లయితే మేము దానికి సిద్ధంగా ఉన్నాం. లాఠీలూ, తూటాలు ఎదుర్కోవడానికి మేం సిద్దం. దేశం కోసం నా జీవితాన్ని త్యాగం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని ఆయన ప్రకటించాడు. అయితే జూన్ 20, 21 తేదీల్లో జరిగే సమావేశాలకు తాము హాజరవుతామని ఆయన తెలిపాడు. ప్రభుత్వం ఏంచెబుతుందో వింటామన్నాడు. 

ఐదు రాష్ట్రాల ఎన్నికలున్న కారణాన కేంద్రప్రభుత్వం ఓపిక పట్టింది . విజయవంతంగా నానపెట్టింది . ఇందుకు NDA కూడా లోపాయికారి మద్దతు ఇచ్చింది . స్టేట్ తన అధికారాలని అంత తేలిగ్గా వదులుకోదు . ఊరుకోదు కూడా . అన్నా హజారే మద్దతు చూసి కొంచెం వెనకడు వేసింది . ఇప్పుడు ఒక అవగాహనకొచ్చింది . మధ్యతరగతి మేధావులు , కొన్ని మీడియా సెక్షన్లు మాత్రమే అన్నాకి సపోర్ట్ గా ఉన్నాయనే అంచనాకి వచ్చినట్లుంది . ఈసారి యుద్ధానికి కాలు దువ్వొచ్చు . అప్పుడు ఈ మేధావులు ఎంతమేరకు నిలబడతారనే పాయింట్ మీదే అన్నా భవిష్యత్తు దీక్ష విజయం ఆధారపడుతుంది . ఇదంతా నేను స్టేట్ కి మద్దతుగా రాయట్లేదు . అవసరమైనప్పుడు ఎంత కఠినంగా , క్రూరంగా స్టేట్ ప్రవర్తిస్తుందో ( ఎక్కువ దేశాల్లో ) చరిత్రలో చాలా ఆధారలున్నాయి . కాబట్టి .. వాస్తవ ద్రుక్పధంతో నా ఆ అభిప్రాయం రాస్తున్నాను . మీ బ్లాగ్ చాలా సెన్సిబుల్ గా ఉంటుంది . అందుకు అభినందిస్తున్నాను .
ee prabhutvaniki chitta suddhi ledu
రమణ గారూ మీరు చెప్పింది వాస్తవం. అవసరమైతే స్టేట్ ఎంతకైనా తెగిస్తుంది. రాందేవ్ దీక్షే దానికి సాక్ష్యం. మొదట ఆయన్ని స్వాగతించడానికి నలుగురు మంత్రుల్ని పంపిన కేంద్రం, తర్వాత అర్ధరాత్రి పోలీసుల్తో దాడి చేయించింది. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. రిప్రెషన్ మొదలైతే ఈ మేధావులు నిలబడే సమస్యే లేదు. వారి కమిటిమెంట్ కి పరిమితులుంటాయి. అంతా సజావుగా సాగితేనే ఆందోళన. లేకుంటే ఎక్కడో ఒక చోట రాజీపడి విరమణకే మొగ్గు చూపుతారు.
అభినందనలతో మీరిచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.