టీనేజి కుర్రాడిని కాల్చి చంపిన పాకిస్ధాన్ రేంజర్లు జైలుపాలు


Pak rangers in court

మొఖాలు చాటేసిన పాక్ హంతక రేంజర్లు

దొంగతనం చేయబోతున్నాడన్న అనుమానంతో ఓ టీనేజి కుర్రాడిని పబ్లిక్ పార్కులో దగ్గరినుండి కాల్చి చంపిన పారామిలిటరీ రేంజర్లు ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. గత వారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోనుటీ.వి ఛానెళ్ళు ప్రసారం చేయడంతో పాకిస్ధాన్ అంతటా నిరసన పెల్లుబుకింది. దొంగతన చేయడానికి వచ్చాడంటు సివిల్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి టీనేజీ కుర్రాడిని జుట్టుపట్టి లాక్కొచ్చి పారామిలటరీ దళాలైన “పాకిస్ధాన్ రేంజర్లు” అతి సమీపం నుండి రెండు సార్లు తూటాలు పేల్చి చంపేశారు. కాల్పులు జరిపి అలాగే వదిలేయడంతో తీవ్ర రక్త స్రావం జరిగి యువకుడు చనిపోయాడు. ఈ దృశ్యాన్ని టీవీల్లో చూసిన ప్రజానీకం పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.

సంఘటన జరిగిన రోజే నిరసనలు వెల్లువెత్తడంతో ప్రధాని గిలానీ దర్యాప్తు చేయిస్తానని ప్రకటించాడు. అప్పటికే లాడెన్ హత్యతో పాక్ ప్రభుత్వం పైనా, ఐ.ఎస్.ఐ పైనా, మిలట్రీ పైనా ప్రజలు ఆగ్రాహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. మిలిటెంట్లకు మిలట్రీ, ఐ.ఎస్.ఐ అధికారులతో సంబంధాలున్న విషయాన్ని ఏసియా టైమ్స్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన విలేఖరి సలీమ్ షాజద్‌ను కిడ్నాప్ చేసి చంపింది ఐ.ఎస్.ఐ అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. వరుసగా జరిగిన ఘటనలతో పోలీసులు, మిలట్రీ, ఐ.ఎస్.ఐలపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. మిలట్రీపై ఉన్న గౌరవం తగ్గిపోయింది. పోలీసుల అరాచకాలను కట్టడి చేయాలన్న డిమాండ్లు పెరిగాయి. ఫలితంగా టీనేజి కుర్రాడు సర్ఫరాజ్ షా పై కాల్పులు జరిపిన సందర్భంగా అక్కడ ఉన్న 6 గురు రేంజర్లపైన క్రిమినల్ కేసు నమోదు చేశారు. హత్య, టెర్రరిజం నేరాలపై వారిని మిలట్రీ కోర్టులో కాకుండా సివిల్ కోర్టులో విచారించాలని నిర్ణయించారు.

పాకిస్ధాన్ సుప్రీం కోర్టు సుమోటో గా ఈ కేసును నమోదు చేయించింది. లేకుంటే వాగ్దానలతోనే కాలం గడిచేది. పోలీసులు తమ దర్యాప్తు రిపోర్టుని సమర్పించారనీ దానిని కోర్టుకి సమర్పించాక యాంటి టెర్రరిజం కోర్టులో విచారణ జరుగుతుందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపాడు. సంఘటన సింధ్ రాష్ట్ర రాజధాని కరాచిలో జరిగింది. సుప్రీం కోర్టు సింధ్ రాష్ట్ర పోలీసు ఛీఫ్‌ని తొలగించాలని ఆర్డర్ జారీ చేసింది. అలాగే సింధ్ రాష్ట్ర రేంజర్ల డైరెక్టర్ జనరల్‌ను బదిలీ చేయించింది. ఘటనపై కరాచిలోని సీనియర్ పోలీసు అధికారిని విచారణ నిమిత్తం నియమించింది. ఆరుగురు రేంజర్లతో పాటు జుట్టుపట్టి లాక్కెళ్ళిన సివిలియన్‌పై కూడా అవే కేసులు నమోదు చేశారు.

విలేఖరి సలీం షాజద్ హత్యపై కూడా స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని మానవహక్కుల సంస్ధలు కోరుతున్నాయి. విలేఖరి హత్యలో తమ పాత్రలేదని ఐ.ఎస్.ఐ చెబుతున్నప్పటికీ షాజద్ మరణానికి ముందు తనకు ఐ.ఎస్.ఐ నుండి బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడని ఆయన సహచరులు చెబుతున్నారు. కిడ్నాప్ అయిన తర్వాత ఆయన ఐ.ఎస్.ఐ కస్టడీలో ఉన్నాడని హ్యూమన్ రైట్స్ సంస్ధ చెప్పిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.

భారత దేశంలో కూడా మావోయిస్టు అన్న ముద్ర వేసి బూటకపు ఎన్ కౌంటర్ చేయడం పరిపాటి. మావోయిస్టులతో చర్చలను ప్రతిపాదించి చర్చల ఏర్పాట్లలో ఉన్న మావోయిస్టు నాయకుడు ఆజాద్ ను బూటకపు ఎన్‌కౌంటర్ లో ఆంధ్ర పోలీసులు కాల్చి చంపారని ఆరోపణలు ఉన్నాయి. ఇండియా సుప్రీం కోర్టు ఈ కేసులో పోలీసులపై కేసు నమోదు చేయించి సి.బి.ఐ చేత దర్యాప్తు చేయిస్తోంది. సైనిక ప్రభుత్వమైనా, ఎన్నికల ప్రభుత్వమైనా ప్రభుత్వాల అన్యాయాలను ప్రశ్నించినవారికి ఎదురయ్యే అనుభవం ఒక్కటేనని ఈ ఘటనలు సూచిస్తున్నాయి.

వ్యాఖ్యానించండి