అసభ్య ఫోటోలు పంపి, బొంకి, కన్నంలో వేలుతో దొరికి, రాజీనామా చేసిన అమెరికా కాంగ్రెస్‌మేన్


Anthony Weiner

అమెరికా కాంగ్రెస్ సభ్యుడు ఆంతొనీ వీనర్

ఈ మధ్య కాలంలో పశ్చిమ దేశాల రాజకీయవేత్తలు, ఆర్ధికవేత్తలు, ఇంకా ఇతర వేత్తలు లైంగికపరంగా అసభ్య చేస్టలతో దొరికిపోయి రాజీనామాలు చేయవలసి రావడం ఎక్కువైంది. ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ డొమినిగ్ స్ట్రాస్ కాన్ హోటల్ ఉద్యోగినిపై అత్యాచారం జరపబోయి దొరికిపోయాడు. ఇప్పుడాయన కోర్టుకు హాజరవుతూ చేతులకు బేడీలు వేయొద్దని బతిమాలుకుంటున్నాడు. అక్రమ సంబంధం బైటపడడంతో రిపబ్లికన్ పార్టీకి చెందిన నెవాడా సెనేటర్ జాన్ ఎన్‌సైన్, సెనేటర్ గా రాజీనమా చేశాడు. రిపబ్లికన్ పార్టీకే చెందిన న్యూయార్క్ కాంగ్రెస్ మేన్ క్రిస్ లీ తనకు ఆన్‌లైన్‌లో పరిచయమైన స్త్రీకి షార్టులతో మాత్రమే ఉన్న తన ఫోటోలు పంపి ప్రతినిధుల సభకు రాజీనామా చేశాడు. తాజాగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుడు అంతొని వీనర్ (Anthony Weiner), ట్విట్టర్ లొ పరిచయమైన మహిళకు తాను అండరవేర్‌లో ఉన్న అసభ్య ఫోటోలు పంపి దొరికిపోయాడు. తన వెబ్‌సైట్ హ్యాకింగ్ గురైందని, ఆ ఫొటో హ్యాకర్లు పంపిందని మొదట బొంకిన వీనర్, మరిన్ని ఫోటోలు బైటపడ్డంతో ఒబామా, స్పీకర్ ల ఒత్తిడి మేరకు రాజీనామా చేయక తప్పలేదు.

అత్యంత పిన్న వయసులో న్యూయార్క్ సిటీ కౌన్సిల్‌కి ఎన్నికయి భవిష్యత్తులో రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉన్నాడని భావిస్తున్న ఆంతోని వీనర్ అవమానకరంగా నిష్క్రమించాడు. 20 ఏళ్ళ క్రితం 27 వయసులో న్యూయార్క్ సిటీ కౌన్సిల్ కి తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించిన బ్రూక్లిన్ లోని సీనియర్స్ సెంటర్ వద్దనే నిలబడి 47 ఏళ్ళ వీనర్ కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నట్లుగా విలేఖరుల ముందు ప్రకటించాడు. “నా డిస్ట్రిక్ట్ పౌరులకోసం నా పనిని కొనసాగించాలనీ, మధ్యతరగతి ప్రజలకోసం, జీవితాల సాఫీకా గడపడానికి ఇబ్బందిపడుతున్న ఇతరుల కోసం నేననుకున్న పనులను కొనసాగించడం కోసం పదవిలో కొనసాగాలని కోరుకున్నాను. దురదృష్టవశాత్తూ నా చర్యలు అందుకు అవకాశం లేకుండా చేశాయి. కాంగ్రెస్ నుండి రాజీనమా చేస్తున్నాను” అని వీనర్ ప్రకటించాడు.

డెమొక్రట్ లలో రైజింగ్ స్టార్ గా మన్ననలందుకుని, న్యూయార్క్ మేయర్ గా పోటీ చేయగలడని భావిస్తున్న వీనర్ నిష్క్రమణతో నైనా అమెరికా రాజకీయుల అసభ్య కార్యకలాపాలు ఆగుతాయని ఆశించవచ్చునో లేదో తెలియదు. ఆగిపోయేవే అయితే వీనర్ కి జాన్, క్రిస్ లీలు గుణపాఠంగా పనిచేసి ఉండవలసింది. కాని అలా జరగలేదు. తమ తమ పదవులను ఇలాంటి అక్రమ పద్దతులకు వినియోగించుకోవడం, అందునా బలహీనులైన తన క్రింది మహిళా ఉద్యోగులపైనా, తమ మహిళా అభిమానులపైనా తమ వక్ర బుద్ధులను ప్రయోగించడం పశ్చిమ దేశాల్లో విజయవంతమైన వ్యక్తుల చర్యలుగా స్ధిరపడినట్లు కనిపిస్తోంది. బహిరంగం కానంతవరకు అవి వారి విజయగాధలు. బహిరంగం కావనే ధైర్యం, బహిరంగం కాకుండా నిరోధించుకోగలమన్న విశ్వాసం వారినా అక్రమ కలాపాలకు ప్రేరేపిస్తుండగా, ఆధునిక సమాజంగా చేప్పబడుతున్న నేటి సమాజం పితృ స్వామ్య వ్యవస్ధగా కొనసాగుతుండడమే ఈ ధోరణులకు ప్రధాన వనరుగా చెప్పుకోవాలి.

ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలని వీనర్ తన పదవీ ప్రస్ధానంలో సమర్ధవంతంగా వినియోగించుకోగలిగాడు. వాటిద్వారా తన రాజకీయ బ్రాండు విలువను పెంచుకున్నాడు. అటువంటి ట్విట్టర్ లోనే అతను అండర్ పేంట్స్ లో ఉన్న తన ఫోటో ప్రచురించాడు. అనుకోకుండా అతనా చర్యకి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఆ ఫోటోని సియాటెల్ కి చెందిన ఒక మహిళకు వీనరే స్వయంగా పంపాడని బైటపడినందున “అనుకోకుండా” ప్రచురించాడని చెప్పడంలో అర్ధం లేదు. తన ట్విట్టర్ ఎకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని, ఫోటో పంపడం వెనక తాను లేననైఇ మే 28 న వీనర్ పత్రికలవద్ద బొంకాడు. కాని జూన్ 6 నాటికి తాను చెప్పింది అబద్ధమనీ, తానప్పటివరకూ అరుగురు మహిళలతో అటువంటి అసభ్యకర ఇంటర్ నెట్ సంభాషణల్లో పాల్గొన్నట్లుగా అంగీకరించక తప్పలేదు. అప్పటినుండీ వీనర్‌కి సంబంధించిన మరిన్ని అసభ్యకర ఫోటోలు బైటపడ్డం మొదలైంది. వీనర్, టాబ్లాయిడ్ లకు నిత్య ఆహారంగా మారిపోయాడు. లేట్ నైట్ కమేడియన్లకు ఒక సబ్జెక్టుగా మారిపోయాడు.

వీనర్ రాజీనామా చేయాలన్న డిమాండ్లను శాయశక్తులా ప్రతిఘటించాడు. “అతనికి ఇది కష్టమైన విషయం. వీనర్ ఏదో విధంగా ఆటంకాలు దాటుకుంటాడని విశ్వాసం ఉంది” అని ఎబిసి వార్తా సంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా పేర్కొన్నాడు. ఇంటర్వ్యూ శుక్రవారం ప్రసారం కానుంది. అది ప్రసారం అయ్యే లోపే ఒబామా తన మాట మార్చేసుకున్నాడు. మంగళవారం “వీనర్ తన భార్యను, కుటుంబాన్ని తన చర్యలతో ఇబ్బందులకు గురిచేశాడు. అతని స్ధానంలో నేనుంటే రాజీనామా చేసి ఉండేవాడ్ని” అని ఎన్.బి.సి ఛానెల్ తో ఒబామా చెప్పాడు. వీనర్ భార్య హుమా అబేదిన్, హిల్లర్ క్లింటన్ వద్ద సహాయకురాలిగా పనిచేస్తోంది. వచ్చే సంవత్సరం జరిగే అధ్యక్ష ఎన్నికల్లొ వీనర్ ప్రతిభ ఒబామా విజయావకాశాల్ని దెబ్బతీస్తుందని డెమొక్రట్లు భయపడినట్లు రాయిటర్స్ తెలిపింది.

హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ వీనర్ రాజీనామా చేయాలని సూచించింది. “కాంగ్రెస్ మేన్ వీనర్ తన చర్యల్లో సరైనవాటిని ఎన్నుకోలేకపోయాడు. అవి బైటపడినప్పుడు కూడా అతని స్పందన సరిగా లేదు. ఇప్పుడతను రాజీనామా చేయడం ద్వారా సరైన నిర్ణయాన్ని తీసుకున్నాడు” అని వీనర్ రాజీనామా అనంతరం వ్యాఖ్యానించింది. రాజీనామా చేయాలన్న స్పీకర్ సూచన తర్వాత వీనర్ తన నియోజక్ వర్గంలో జరిగిన తాజా పోలింగ్ లో తన అప్రూవల్ రేటింగ్ ని చూపుతూ నాన్సీ సూచనను ఉపసంహరించుకోవాలని కోరాడు. కాని నాన్సీ ఆ అప్రూవల్ రేటింగ్ నే తన నిష్కృమణ మార్గంలో ఉంచపడ్డ గులాబి దళాలుగా భావించి వెళ్ళిపోవాలని కోరింది. దేశాధ్యక్షుడు, హౌస్ స్పీకర్ అంత చెప్పాక వీనర్ కి పదవిలో మిగలడానికి మద్దతు కనపడలేదు.

సమాజానికి ఆధునికత అనేది సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో రాదు. కార్లు, ఏసిలు, స్కై స్క్రాపర్లు, కంప్యూటర్లు, ఐపాడ్ లు, ఐ ఫోన్ లు… ఇవన్నీ జీవితాన్ని సుఖమయం చేయడానికే గాని సామాజిక సంబంధాల్నీ జీవన అనుబంధాల్ని వాటంతట అవే ఆధునికం చేసేవి కావు. ఆధునికత అనేది మానవుల మనసుల్లోంచి, ఆలోచనల్లోంచి, జీవన తాత్వకతలోంచి వస్తేనే అది సమాజాన్ని, వ్యవస్ధను ఆధునికం చేయగలుగుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా స్త్రీని విలాసవస్తువుగా, ఆనందం ఇచ్చే పనిముట్టుగా, మందుకు పక్కస్ధానాన్ని పొందిన మగువ గా భావిస్తున్నపుడు రాజకీయ నాయకులు, పలురకాల వేత్తలు అందుకు భిన్నంగా ఉంటారనుకోవడం అత్యాశేనేమో. కానీ వీరంతా సమాజంలో పైభాగాన ఉన్నవారు. సమాజానికి మార్గదర్శకం వహిస్తున్నవారు. తప్పొప్పులను ఎంచి చెడును ఏరివేసి మంచిని నిలపవలసిన వారు. దేశం మొత్తాన్ని ప్రభావితం చేయగల చట్టాలను, నియమ నిబంధనలు రూపొందించగల అధికారాలు ఉన్నవారు. అటువంటి స్ధానాల్లో ఉన్నవారు అన్ని విధాలుగా సమాజానికి ఆదర్శంగా ఉండవలసిన బాధ్యత ఉంది. ఆ బాధ్యతలను రాజకీయ నాయకులు విస్మరించి ప్రవర్తించడమే నేటి దౌర్భాగ్యం.

వ్యాఖ్యానించండి