సి.ఐ.ఏ. కుట్ర, కుతంత్రాల పుట్ట. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో ఎన్నో ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చిన దగుల్బాజీ సంస్ధ. ఎందరో నియంతలను కంటికి రెప్పలా కాపాడిన ధూర్త సంస్ధ. ఎందరో మానవ హక్కుల కార్యకర్తలను, ప్రజాపోరాటాల నాయకులను దుర్మార్గంగా హత్య చేసిన హంతక సంస్ధ. శాంతి విలసిల్లుతున్న దేశాల్లో విభేధాల కుంపట్లు రగిలించి జాతి హత్యాకాండలను ప్రోత్సహించిన జాత్యహంకార సంస్ధ. దాదాపు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ ఏజెంట్లను ఏర్పరుచుకుని అమెరికా అనుకూల-ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు నిలబెట్టడానికీ, ప్రజానుకూల-అమెరికా వ్యతిరేక ప్రభుత్వాలను కూలగొట్టడానికి కుట్రలు పన్నే ప్రజాస్వామ్య వ్యతిరేక సంస్ధ.
ఇప్పుడా సంస్ధ తన వెబ్ సైట్ నే కాపాడుకోలేక పోయింది. ఒక్కరోజైతే మాత్రమేం, సి.ఐ.ఏ ఐతే మాత్రమేం, ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న సత్యాన్ని చేసి చూపింది “లుల్జ్ సెక్యూరిటీ” అనే హ్యాకర్ల గ్రూపు. సైద్ధాంతికంగా అమెరికాని వ్యతిరేకించేవారెవరైనా సరే, వారు ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రియులై ఉండాలి. “అమెరికాని మేం అంతగా ఇష్టపడం” అని లుల్జ్ ప్రకటించుకుంది. ఆ ఒక్క వాక్యమే దాని పాలసీ స్టేట్‌మెంట్ లేదా విధాన ప్రకటన. అటువంటి అమెరికాకి చెందిన అత్యంత క్రూరమైన సంస్ధ సి.ఐ.ఏ వెబ్ సైట్ ను లుల్జ్ గ్రూపు బుధవారం అంతా ఎవరికీ అందుబాటులో లేకుండా పోయింది. ప్రజలు కోరుకున్న విధంగా హ్యాకింగ్ దాడులు చేస్తామని ప్రకటించి అందుకోసం ఒక ఫోన్ లైన్ ని కూడా స్ధాపించిన లుల్జ్ ప్రకటించిన రోజే సి.ఐ.ఏ వెబ్ సైట్ ని హ్యాక్ చేసి ఒక రోజంతా అందుబాటులో లేకుండా చేసింది.
ట్విట్టర్ లొ లుల్జ్ ఇలా ప్రకటించింది. “టాంగో డౌన్ – సిఐఎ.జిఒవి – ఫర్ ద లుల్జ్” (Tango down – cia.gov – for the lulz). బుధవారం సి.ఐ.ఏ వెబ్ సైట్ ని దర్శించడం అప్పుడప్పుడూ వీలు కాలేదని బిబిసి తెలిపింది. అయితే అది లుల్జ్ వలన జరిగిందా లేక నిజంగానే ఎక్కువమంది ఆ సైట్ ను చూడ్డానికి ప్రయత్నించడం వలన జరిగిందా అని తెలియలేదని బిబిసి తెలిపింది. ఇటీవలి కాలంలో సోని, నింటెండో, అనేక అమెరికా వార్తా సంస్ధలు, అమెరికా సెనేట్ వెబ్‌సైట్ ని హ్యాక్ చేయడం ద్వారా “లుల్జ్ సెక్యూరిటీ” ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రజలనుండి విన్నపాలు అందుకోడానికి ఫోన్ లైన్ స్ధాపించాక తనకి అనేక రిక్వెస్టులు అందాయనీ ఆ వెబ్ సైట్లను డినైయల్ ఆఫ్ సర్వీస్ దాడులు చేశామని లుల్జ్ ప్రకటించిందని బిబిసి తెలిపింది. ఆ ప్రకటన చేసిన కొన్ని గంటల తర్వాత సి.ఐ.ఏ సైట్ ని హ్యాక్ చేసామని లుల్జ్ తెలిపిందిన బిబిసి రాసింది.
లుల్జ్ నెలకొల్పిన టెలిఫోన్ లైన్ కి ఫోన్ చేసినప్పుడు రికార్డయిన గొంతు వినపడిందని బిబిసి తెలిపింది. బాగా ఫ్రెంచి యాస ఉన్న ఆ గొంతు తనను తాను పియర్రే డుబోస్ గా పరిచయం చేసుకున్నట్లు తెలిపింది. ఏరియా కోడ 614 ఓహియో రాష్ట్రానికి సంబంధించిందే ఐనా, వాస్తవానికి అక్కడనుండి సమాధానం వచ్చి ఉండకపోవచ్చని తెలిపింది. Distributed Denial of Service (DDoS) దాడుల ద్వారా సి.ఐ.ఎ వెబ్ సైట్ ను హ్యాక్ చేశామని లుల్జ్ తెలిపింది. టార్గెట్ గా పెట్టుకున్న వెబ్ సైట్ కి ఒకే సమయంలో అత్యధిక సంఖ్యలో విజిట్స్ చేయడం ద్వారా అసలు విజిటర్లకు ఆ సైట్ ని అందుబాటులో లేకుండా చేయడమే DDoS దాడులుగా పిలుస్తారు.
లుల్జ్ గ్రూపు గురించిన వివరాలేవీ ఇంకా బైటికి రాలేదు. పౌరులు, వినియోగదారుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించిన కంపెనీల వెబ్ సైట్లపై తాము దాడులు చేస్తామని లుల్జ్ చెబుతుంది. సొనీ పిక్చర్స్ డాట్ కామ్ వెబ్ సైటు వినియోగదారుల వివరాలను కాపాడలేని పరిస్ధితిలో ఉందన్న విషయం తమ దాడుల ద్వారా వెల్లడయిందని లుల్జ్ ప్రకటించింది. ఆన్‌లైన్ సర్వీసులకి “లుల్జ్ సెక్యూరిటీ”, “ఎనోనిమస్” లాంటి గ్రూపులవల్ల భంగం కలుగుతోందని కొందరంటున్నప్పటికీ నిపుణుల అభిప్రాయాలు వేరేగా ఉన్నాయి. First Base అనే సెక్యూరిటీ కన్సల్టెన్సీని స్ధాపించిన పీటర్ వుడ్ ఈ హ్యాకర్లను హ్యాక్టివిస్టులుగా సంబోధిస్తున్నాడు. వారు చేస్తున్న దాడులను వారు న్యాయమైన నిరసనగా భావిస్తున్నారని అతని అభిప్రాయం. అది వాస్తవమూ, ఆహ్వానించదగ్గది కూడా. ప్రజలు అభిప్రాయాలు, నిరసనలు పట్టించుకోనప్పుడు, వారు పట్టించుకునేలా చేసే మార్గాలు కూడా ప్రజలు వెతుక్కుంటారన్న విషయం లుల్జ్ సెక్యూరిటీ, ఎనోనిమస్ కార్యకర్తలు సమర్ధవంతంగా చెప్పగలుగుతున్నారు.