రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో సారి వడ్డీ రేట్లను పెంచింది. జూన్ 16న చేపట్టిన ద్రవ్య పరపతి విధానం సమీక్షలో ఆర్.బి.ఐ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే అప్పులపై వసూలు చేసే వడ్డీ రేటు) 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రివర్స్ రెపో రేటు (వాణిజ్య బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద డిపాజిట్ చేసిన డబ్బుపై ఇచ్చే వడ్డీ రేటు) కూడా 0.25 శాతం పెంచింది. వడ్డీ రేట్ల పెంపుదల వలన ఆర్ధిక వ్యవస్ధలో ద్రవ్య చలామణిని తగ్గిస్తుంది. ద్రవ్య చలామణిని తగ్గించడం ద్వారా అధిక స్ధాయిలో ఉన్న ద్రవ్యోల్బణం తగ్గించాలని ఆర్.బి.ఐ ప్రయత్నం. ద్రవ్యోల్బణం తగ్గించడానికి ఆర్.బి.ఐ తన వడ్డీ రేట్లను తగ్గించడం ఇది వరుసగా పదవ సారి. ఇన్ని మార్లు వడ్డీ రేట్లు తగ్గించినా ద్రవ్యోల్బణం మాత్రం మే నెలాఖరుకి 9 శాతం గా నమోదైంది.
వడ్డీ రేట్ల పెంపుదల భారత దేశ ఆర్ధిక వృద్ధికి నష్టకరమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వృద్దిని కొంత త్యాగం చేశయినా ద్రవ్యోల్బణం తగ్గించవలసి ఉంటుందని ఈ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఆర్.బి.ఐ గవర్వరు సుబ్బారావు కూడా సూచించారు. ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి తక్కువగా నమోదు కావడంతో ఊహించినట్లుగానే ఈ సంవత్సరం జిడిపి వృద్ధి రేటు తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వంలోని వివిధ ఆర్ధికవేత్తలు జిడిపి వృద్ధి రేటు ఈ సంవత్సరం 8.5 శాతం ఉండగలదని అంచనా వేస్తుండగా, విదేశీ విశ్లేషకులు గానీ, రేటింగ్ సంస్ధలు గానీ అది 7 శాతం అంచనా వేస్తున్నారు. భారత ప్రభుత్వ అంచనాలు ఆశావాదంతో కూడుకుని ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్ల పెంపుదల జిడిపి వృద్ధిని మరింతగా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. అయితే అధిక ద్రవ్యోల్బణం నేపధ్యంలో ఆర్.బి.ఐకి మరొక ప్రత్యామ్నాయం లేదు.
తాజా పెంపుదలతో ఆర్.బి.ఐ రెపో రేటు 7.5 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటు 6.5 శాతానికి చేరింది. దీని ఆధారంగా వాణిజ్య బ్యాంకులు సైతం వడ్డీరేట్లను పెంచుతాయి. క్రెడిట్ సౌకర్యం తగ్గిపోతుంది. ప్రపంచాన్ని ఆర్ధిక సంక్షోభం నుండి బైట పడేసాయని భావిస్తున్న ఎమర్జింగ్ దేశాల్లో జిడిపి వృద్ధి నెమ్మదిస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం మాత్రం తగ్గకపోవడం సమస్యగా మారింది. అమెరికా రికవరీ మరింత నెమ్మదించడం, యూరప్ అప్పు సంక్షోభంతో ఉండడం, భూకంపం సునామీల నుండి జపాన్ ఇంకా కోలుకోక పోవడం… ఇవన్నీ ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధకు ప్రతికూలంగా పరిణమించాయి. ఈ నెలలోనే ఇతర ఎమర్జింగ్ దేశాలయిన చైనా, బ్రెజిల్, దక్షిణ కొరియాలు పరపతి విధానాలను బిగిస్తూ వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం.
దేశీయంగా ద్రవ్యోల్బణం ఇంకా ప్రమాదకర స్ధాయిలో ఉంది. కనుక ద్రవ్య విధానం ప్రధానంగా ద్రవ్యోల్బణంపైనే కేంద్రీకరించింది. ఈ నేపధ్యంలో సమీప కాలంలో (షార్ట్ టర్మ్) ఆర్ధిక వృద్ధి కొంత వెనకపట్టుపట్టే అవకాశం ఉంది అని ఆర్.బి.ఐ గవర్నరు సమీక్షలో పేర్కొన్నాడు. వడ్డీ రేట్ల పెంపుదల, ఆర్ధిక వృద్ధి తగ్గుదల, అవినీతి ఆరోపణలు, సంస్కరణలను అమలు చేయలేని రాజకీయ ఒత్తిడిలు మొదలైన అంశాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని చెప్పవచ్చు. 15 నెలల్లో వడ్డీ రేట్లు పది సారి పెంచడం విదేశీ పెట్టుబడులను నిరాశపరుస్తున్నాయి. రేట్ల పెంపుదలకు తోడుగా సంస్కరణల చర్యలు (ప్రవేటీకరణ, విదేశీ పెట్టుబడి వాటా పెంచడం మొ.వి) ఉన్నట్లయితే బహుశా వారికి అంత నిరాశ కలిగి ఉండకపోను. ప్చ్.
2011లో భారత షేర్ మార్కెట్లు 12 శాతం నష్టపోయాయి. మే నెలలో కార్ల అమ్మకం అత్యంత తక్కువ స్ధాయికి పడిపోయాయి. రెండేళ్ళలో మే అమ్మకాలే అతితక్కువని రాయిటర్స్ తెలిపింది. ఈ సంవత్సరంలో మరో 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు పెరగవచ్చని ఆర్.బి.ఐ సూచనల ద్వారా విశ్లేషకులు అంచవా వేస్తున్నారు. ఆర్.బి.ఐ సమీక్ష ప్రకటించాక షేర్లు కొంత పెరిగినా, గ్రీకు సంక్షోభం వలన షేర్లు మళ్ళీ పడిపోయాయి. బి.ఎస్.ఇ మరొకసారి 18000 మార్కుకంటె తగ్గిపొయింది. సమిప భవిష్యత్తులో తగ్గినా ఆ తర్వాత ఆర్ధిక వృద్ధి పుంజుకుంటుందని ఆర్.బి.ఐ వేసిన అంచనాతో విదేశీ నిపుణులు ఏకీభవించడం లేదు. గురువారం వెలువడిన వివరాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 9 శాతానికీ, ఇంధన ద్రవ్యోల్బణం 12.8 శాతానికీ పెరిగింది. ఇవే ప్రధాన ద్రవ్యోల్బణాన్ని పెకి తీసుకెళ్తున్నాయి. ఇంకోవైపు నష్టాలు వస్తున్నాయంటూ పెట్రోలియం సంస్ధలు గోలపెడుతున్నాయి. త్వరలో పెట్రోల్, డీజెల్ రేట్లు పెరుగుతాయని చెబుతున్నారు. అదే జరిగితే ద్రవ్యోల్బణం మరింత విజృంభించడం ఖాయం.
