అమెరికాలో జరిగే కొన్ని పెళ్ళిళ్ళు ఊహించలేనంత వింతగా ఉంటాయి. ప్రఖ్యాత బ్రిటిష్-అమెరికన్ నటి ఎలిజబెత్ టేలర్ ఎనిమిది పెళ్ళిళ్ళు, ఏడుగురు భర్తలతో (ఒక భర్తకు విడాకులిచ్చి ఆ తర్వాత మళ్ళీ అతన్ని పెళ్ళి చేసుకోవడంతో పెళ్ళిళ్ళ కంటే భర్తల సంఖ్య ఒకటి తగ్గింది) నిరంతరం వార్తా సంస్ధలను ఆకర్షించింది. ముసలి తనంలో సైతం యువకుల్ని భర్తగా పొందిన ఆమె నటనా వృత్తిలో అత్యున్నత శిఖరాల్ని అధిరోహించింది. అదే విధమైన వార్తతో ప్లేబాయ్ పత్రిక అధిపతి “హగ్ హెఫ్నర్” తాజాగా వార్తల్లో నిలిచాడు.
85 సంవత్సరాల హెఫ్నర్ ఈ వారాంతంలో మూడో పెళ్ళి జరగవలసి ఉంది. పెళ్ళి కూతురు మరివరో కాదు. ఆయన పత్రికలో ప్లే మేట్ గా ఫోజులిచ్చిన యువతుల్లో ఒకరైన “క్రిస్టల్ హ్యారిస్”. క్రిస్టల్ వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. 300 మంది అతిధుల సాక్షిగా జరగవలసిన పెళ్ళి రద్దయినట్లుగా హెఫ్నర్ ట్విట్టర్ లో రాయడంతో ఈ వార్త బైటికి వచ్చింది. లాస్ ఏంజిలిస్ లో ఉన్న విశాలమైన, ఖరీదైన ప్లే బాయ్ బంగళాలో వీరి పెళ్ళి జరగవలసి ఉంది. ఏదో విషయంలో ఇద్దరూ వాదులాడుకున్న అనంతరం క్రిస్టల్ మనసు మార్చుకోవడంతో ముసలోడు లేటు వయసులో తలపెట్టిన “దసరా పండగ కాస్త రద్దయింది.
“పెళ్ళి రద్దయ్యింది. క్రిస్టల్ తన మనసు మార్చుకుంది” అని హెఫ్నర్ ట్విట్టర్ లో రాసుకున్నాడు. హాలీవుడ్ హీరో హీరోయిన్లు, నటులు, ఇతర సెలబ్రటీలు తదితరుల వ్యక్తిగత జీవితాలపై వార్తలు వ్యాపింప జేసే టి.ఎం.జెడ్ పత్రిక మొదట ఈ వార్త ప్రచురించిందని రాయిటర్స్ తెలిపింది. గత వారాంతాన హెఫ్నర్, క్రిస్టల్ ల మధ్య ఫోన్లో అసభ్యకరమైన వాదోపవాదం జరిగిందనీ, ఆ తర్వాత ప్లే బాయ్ బంగళానుండి క్రిస్టల్ వెళ్ళిపోయిందని టి.ఎం.జెడ్ రాసినట్లుగా రాయిటర్స్ తెలిపింది. హెఫ్నర్ పత్రికా ప్రతినిధిని సంప్రదించడానికి ఆయన అందుబాటులోకి రాలేదని ఆ సంస్ధ తెలిపింది.
సెలబ్రిటీల పెళ్ళిళ్ళు ప్రధానంగా వారి వెనక ఉన్న డబ్బుతో ముడిపడి ఉండడం కద్దు. డబ్బు తప్ప మరొక విలువకు చోటు లేని సోకాల్డ్ హై సొసైటీలో ఇటువంటి వార్తలు సాధారణంగానే పరిగణించాల్సి ఉంది.అవి చివరికంటా నిలవకపోవడానికి కారణం మనుషుల మధ్య గుణగణాల విలువలతో కూడిన సంబంధాలు పునాదిగా ఉండడానికి బదులు డబ్బు విలువలతో సంబంధ బాంధవ్యాలు పునాదిగా ఉండడమే. పదే పదే ఈ విషయం రుజువవుతున్నప్పటికీ ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతుండడం, మళ్ళీ మళ్ళీ విఫలమవుతుండడమే ఆశ్చర్యకరం.
ఆర్ధిక వ్యవస్ధలోని విలువలే సామాజిక వ్యవస్ధలోని సంబంధాల విలువలను నిర్ధారిస్తాయనడానికి అమెరికాలోని సాంస్కృతిక విచ్చలవిడితనం రుజువుగా నిలుస్తుంది.
