మన్మోహన్ సింగ్ పాలనపై సన్నగిల్లిన వ్యాపారుల విశ్వాసం


వరుస కుంభకోణాలతో తీసుకుంటున్న మన్మోహన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై భారత వ్యాపారులకు, పెట్టుబడుదారులకు విశ్వాసం సన్నగిల్లుతోంది. ఎకనమిక్ టైమ్స్ (ఇ.టి) పత్రిక, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ – FICCI) సంస్ధలు జరిపిన సర్వేలో ఈ ఫిషయం తేలిందని రాయిటర్స్ పత్రిక ప్రకటించింది. దేశీయ పెట్టుబడిదారులు, వ్యాపారుల విశ్వాసం సన్నగిల్లినందువలన అది విదేశీ పెట్టుబడుదారులకు భారత పాలకులపై గల విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

సర్వేలు

సోమవారం ప్రచురించబడిన సర్వేలో 80 శాతం మంది ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోగల ప్రక్రియ బాగా నెమ్మదించిందని తేల్చారు. 72 శాతం మంది మదుపుదారులు తమ పెట్టుబడుల పధకాలు దెబ్బతింటాయని భయపడుతున్నట్లుగా తేలింది. భారత దేశ జిడిపి వృద్ధి రేటును చూపిస్తూ మంత్రులు ఈ పరిణామాలను చిన్నవిగా కొట్టిపారేస్తున్నారని వ్యాపారులు విమర్శిస్తున్నారు. అధిక జిడిపి వృద్ధి రేటు వాస్తవానికి ప్రభుత్వ విధానాల వలన నమోదు కావడం లేదని, ప్రభుత్వం నుండి ప్రతికూలతలను కూడా అధిగమించి ఆర్ధిక వృద్ధి జరుగుతున్న సంగతిని గమనించాలని విమర్శకులు వాదిస్తున్నారు. ప్రభుత్వం నుండి మద్దతు సరిగా ఉన్నట్లయితే జిడిపి వృద్ధి మరింత వేగంగా ఉండగలదని వారి వాదన.

2011-12 ఆర్ధిక సంవత్సరంలో జిడిపి వృద్ధి 8.5 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇది అతి అంచనాగా ప్రవేటు సంస్ధలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ఆశావాదంతో వేసిన అంచనా వాస్తవానికి దూరంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 2010-11 సంవత్సరంలో 28.5 శాతం పడిపోయిన విషయాన్ని వారు ఎత్తి చూపుతున్నారు. ఈ తగ్గుదల పెట్టుబడిదారుల్లో విశ్వాసం సన్నగిల్లిందనడానికి రుజువేనని చెబుతున్నారు. గత సం.ము నవంబరు మధ్యనుండి ఇప్పటివరకు బి.ఎస్.ఇ సెన్సెక్స్ సూచిక 10 శాతం నష్టపోయిందని చెబుతూ అవినీతి ఆరోపణలు దీనికి కారణమని చెబుతున్నారు. ఇదే కాలంలో ఎమర్జింగ్ మార్కెట్ల మొత్తం ఈక్విటీల విలువలో వృద్ధి 2.1 శాతంగా ఉన్నదనీ, ఇండియా కాకుండా ఇతర ఎమర్జింగ్ దేశాల్లొ వృద్ధి బలంగా ఉన్న సంగతి ఇది రుజువు చేస్తున్నదని చెబుతున్నారు.

పై సర్వే కాకుండా ఇ.టి, సినోవేట్ (Synovate) సంస్ధతో కలిసి మరొక సర్వే జరిపింది. ఈ సర్వేలో 43 లీడింగ్ కంపెనీల బిజినెస్ ఎక్జిక్యూటివ్ ల అభిప్రాయాలను సేకరించారు. ఇ.టి పత్రికలోనే సోమవారమే ప్రచురితమైన ఈ సర్వే ఫలితాల ప్రకారం 63 శాతం మంది పాలన సంక్షోభం ఇండియా ఆర్ధిక వృద్ధిని దెబ్బతీస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికం కుంభకోణం వలన గత మూడు విడతల పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు  మెజారిటీ రోజులపాటు అడ్డుకున్నాయనీ ఇది పాలన సంక్షోభంలో భాగమేనని వీరు ఎత్తి చూపుతున్నారు. ఆ సమావేశాల్లో అనేక ప్రవేటీకరణ బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండగా అది జరగలేదు. పరిశ్రమలకు భూసేకరణను మరింత తేలిక పరిచే బిల్లు తప్ప పెద్దగా బిల్లులేవీ ఆమోదం పొందలేదని వారు పెదవి విరిచారు. పారిశ్రామికవేత్తలు, రిజర్వు బ్యాంకు గవర్నర్లతో కూడిన 14 మంది బృందం ప్రభుత్వానికి గత జనవరిలో బహిరంగ లేఖ రాశారు. అవినీతి, అస్తవ్యస్త పాలన ఇండియా ఆర్ధిక వృద్ధిని దెబ్బతీస్తున్నాయని హెచ్చరించడం ఈ సందర్భంగా గమనార్హం.

అవినీతి కుంభకోణాలు

ఇ.టి పత్రిక, ఫిక్కీలు 75 మంది బడా వ్యాపారుల సర్వే చేసింది. నాలుగింట మూడొంతుల కంపెనీలు మన్మోహన్ ప్రభుత్వంలో పాలనా సంక్షోభం ఏర్పడినట్లు భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలు, విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేక పోవడం తదితరాల వలన వ్యాపారాలకు ప్రతికూల వాతావరణం ఏర్పడుతోందని వీరు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలొని యు.పి.ఎ ప్రభుత్వంలోని మంత్రులు అనేకులు అవినీతి కుంభకోణాల్లో మునిగిపోవడం, ఒక మంత్రి అరెస్టు, మరో ఎం.పి ఖైదు, మరింతగా బైట పడుతున్న ఆర్ధిక కుంభకోణాలు పాలనను అస్తవ్యస్తం కావించాయని వ్యాపారులు, మదుపుదారులు గట్టిగా భావిస్తున్నారు.

కుంభకోణాలకు రారాజుగా చెప్పుకోదగ్గ లక్షా డెబ్భైవేల కోట్ల రూపాయల టెలికం కుంభకోణం ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. ప్రధానమంత్రి స్వయంగా జరిగిన విషయం తెలిసినప్పటికీ అవినీతి నిర్ణయాలను అడ్డుకోలేక పోవడం దానికి కూటమి రాజకీయాలను సాకుగా చూపడం వారి చేతగానితనాన్నే చూపిస్తోంది. కూటమి రాజకీయాలవలన అంతపెద్ద మొత్తంలో అవినీతిని ప్రధాని చూసీ చూడనట్లు పోవడం, కుంభకోణం లబ్దిదారుల్లో కాంగ్రెస్ పెద్దలు కూడా ఉన్నారన్న ఆరోపణలు బలంగానే వ్యక్తం కావడంతో మన్మోహన్ ప్రభుత్వం ప్రజలనుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోంటోంది. అన్నా హజారే, బాబా రాందేవ్ లాంటి వ్యక్తుల అవినీతి వ్యతిరేక ఉద్యమాలు ప్రభుత్వ పరిస్ధితిని మరింతగా దిగజార్చాయి.

సరళీకరణ, ప్రవేటీకరణలు మరింత ఆలస్యం

ప్రజాగ్రహం ఏ రూపం తీసుకుంటుందోనన్న భయాలతో కేంద్ర ప్రభుత్వం విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకి హామీ ఇచ్చిన నూతన ఆర్ధిక విధానాల అమలుకు వెనకడుగు వేస్తోంది. ప్రభుత్వ సంస్ధల వాటాల అమ్మకం, విదేశీ పెట్టుబడులు కంపెనీలకు ఆమోదముద్ర వేయడం వంటి చర్యలు వెనకబడ్డాయనీ ప్రవేటు పెట్టుబడిదారులు నిరాశా నిస్పృహలకు లోనవుతున్నారు. వేదాంత-కెయిర్న్ ఇండియా ఒప్పందం ఇంకా ఆమోదానికి నోచుకోక పోవడం, పోస్కో ఉక్కు కంపెనీకి భూసేకరణ జరపలేక పోవడం, రిటైల్ సెక్టార్ రంగంలోకి విదేశీ బహుళజాతి సంస్ధలకు ప్రవేశం కల్పించే బిల్లు ఇంకా పార్లమెంటులో ప్రవేశపెట్టక పోవడం, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు రంగాల్లో మరింతగా ప్రవేటీకరణకు ద్వారాలు తెరిచే నిర్ణయం వాయిదా పడుతుండడం… ఇవన్నీ స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం పై నమ్మకం క్షీణించడానికి దారి తీస్తోంది.

విరుద్ధ ప్రయోజనాలు

ప్రవేట్ కంపెనీలు కోరుతున్న చర్యలు, బిల్లులన్నీ భారత దేశానికి చెందిన అశేష ప్రజల ప్రయోజనాలకు పూర్తి విరుద్ధంగా ఉండడం గమనార్హం. వ్యాపారులు, పెట్టుబడిదారులు కోరుకుంటున్న చర్యలు ప్రజల ప్రయోజనాలను నిరాకరించేవిగా ఉండడాన్ని బట్టి పెట్టుబడిదారులు, ప్రజల ప్రయోజనాలు పరస్పర వ్యతిరేకమని స్పష్టమవుతోంది. వంద కోట్లకు పైగా గల సామాన్య ప్రజానీకం ఒక వైపు, గుప్పెడు మంది పెట్టుబడిదారులు, వ్యాపారులు మరొక వైపు ఉన్న పరిస్ధితుల్లో ఇరువర్గాల ప్రయోజనాలు పరస్పరం ఎదురెదురుగా మొహరించి ఉన్న పరిస్ధితుల్లో ప్రభుత్వాలు ఎవరి పక్షం వహిస్తాయి అన్నదాన్ని బట్టే దాని స్వభావాన్ని నిర్ణయిస్తాయనడంలో సందేహం లేదు.

సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ లను వేగంగా అమలు చేయడానికి మన్మోహన్ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించుకుందని స్పష్టంగా కనిపిస్తున్న విషయం. మరీ ముఖ్యంగా మన్మోహన్ నేతృత్వంలో నూతన ఆర్ధిక విధానాలు అమలు చేయడం ప్రారంభించాక ప్రజల్లో నిరుద్యోగం, ఆకలి దరిద్రాలు, పేదరికం, ఖరీదైన విద్య తదితర సమస్యలు పెచ్చరిల్లాయి. కాని అవే విధానాల వలన పెట్టుబడిదారులు, ఫ్యాపారుల సంపదలు అనేక రెట్లు పెరిగి ప్రపంచ ధనికులతో భారత ధనికులు పోటీ పడే స్ధాయికి చేరుకున్నారు. ప్రజలకు సమస్యలను మిగిలుస్తున్న ఆర్ధిక విధానాలు, ధనికులకు సంపదలను మిగులుస్తున్నాయి. నూతన ఆర్ధిక విధానాల మద్దతుదారులు హామి ఇచ్చిన సమగ్ర అభివృద్ధి ఎక్కడా కనపడ్డం లేదు. వ్యాపారులు, పెట్టుబడిదారుల విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా చర్యలు తీసుకొనేటట్లుగా ఒత్తిడి తేవడానికి ప్రజా సమూహాలు ఉద్యమాలు చేపట్టవలసిన అవసరం మరింతగా ముందుకు వచ్చింది.

వ్యాఖ్యానించండి