ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ బరిలో ఫ్రాన్సు, మెక్సికో అభ్యర్ధులు


Agustin-Carstens-and-Christine-Lagarde

అగస్టిన్ కార్‌స్టెన్ (ఎడమ), క్రిస్టీన్ లాగార్డే

ఐ.ఎం.ఎఫ్ అధిపతి పదవికి అంతిమంగా ఇద్దరిని ఆ సంస్ధ షార్ట్ లిస్ట్ చేసింది. ఫ్రాన్సు ఆర్ధిక మంత్రి క్రిస్టిన్ లాగార్డే తో మెక్సికో సెంట్రల్ బ్యాంకు అధిపతి అగస్టిన్ కార్‌స్టెన్స్ ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి కోసం పోటీ పడుతున్నాడు. ఐ.ఎం.ఎఫ్ ఎం.డి పదవికి పోటీ జరగడం ఇదే మొదటి సారి. ఇప్పటివరకూ బ్రెట్టన్ వుడ్స్ కవలలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ ల ఉన్నత పదవులను అమెరికా యూరప్ లు పంచుకునేవి. ప్రపంచ బ్యాంకు పదవికి అమెరికాకి చెందిన వ్యక్తినీ, ఐ.ఎం.ఎఫ్ పదవికి యూరప్ కి చెందిన వ్యక్తినీ నియమించుకునేవారు. దానికి ఎవరూ అభ్యంతరం కూడా చెప్పేవారు కాదు.

ఎమర్జింగ్ దేశాల నడమంత్రపు సిరి

గత పది సంవత్సరాల నుండి మూడో ప్రపంచ దేశాలు సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ లతో కూడిన నూతన ఆర్ధిక విధానాలు అమలు చేస్తూ విదేశీ బహుళజాతి గుత్త సంస్ధల ప్రవేశానికి గేట్లు బార్లా తెరవడంతో ఆ దేశాల్లోని చౌక శ్రమ (అతి తక్కువ కార్మిక వేతనాలు), బలహీన కార్మిక చట్టాలు, చౌక వనరులు తదితర సౌకర్యాలను వినియోగించుకుంటూ లబ్ది పొందటానికి విదేశీ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. దానితో అప్పటివరకు ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు ఉన్న చైనా, ఇండియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా, మలేషియా తదితర దేశాలు స్వేచ్ఛా మార్కెట్ విధానాలు అనుసరిస్తూ “ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీలు” గా ముందుకు వచ్చాయి.

ఒక దేశ జిడిపిలో ఆ దేశంలో ప్రవేశించిన విదేశీ కంపెనీల పెట్టుబడులను లెక్కించే నిబంధన వలన విదేశీ కంపెనీల ఉత్పత్తులు కూడా అవి పెట్టుబడులు పెట్టిన దేశాల జిడిపిలతో కలిసి ఆయా దేశాల జిడిపిలు పెద్ద మొత్తంలో పెరిగి పోయాయి. విదేశీ కంపెనీల ద్వారా వచ్చి చేరిన ఈ పెరుగుదలను ఎమర్జింగ్ ఎకానమీలు తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రచారం చేసుకోవడం ప్రారంభించాయి. నూతన ఆర్ధిక విధానాల అమలుతో లబ్ది పొందింది తమ కంపెనీలే అయినందున ఇటువంటి ప్రచారానికి అమెరికా, యూరప్ దేశాలకు పెద్దగా అభ్యంతరం లేకుండా పోయింది. ఆ విధంగా వచ్చిన నడమంత్రపు హోదాతో ఎమర్జింగ్ దేశాలు అంతర్జాతీయ సంస్ధలలో తమకూ సరైన వాటా, స్ధానం, హోదాలు కావాలని పట్టుబడుతూ వస్తున్నాయి. వాస్తవానికి ఎమర్జింగ్ ఎకానమీలకు వారు కోరుతున్నంత హోదా ఇవ్వనప్పటికీ స్వల్పంగా వారి ఓటింగ్ హక్కులను పెంచడం వలన పశ్చిమ దేశాలకు పెద్దగా అభ్యంతరం ఉండదు, దాని వలన అంతిమంగా లబ్ది పొందేది ఆ దేశాల్లోని తమ బహుళజాతి కంపెనీలే కనుక.

బ్రిక్స్ అభాసుపాలు

బ్రిక్స్ (BRICS) గ్రూపు దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా లు ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి ఎల్లకాలం అమెరికా, యూరప్ లే నియామకాలు జరపడానికి వీల్లేదనీ, దేశం ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగానే నియామకం జరగాలనీ ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ తమ తరపున ఒక అభ్యర్ధిని ప్రకటించ లేక పోయాయి. వారిలోనే ఏకాభిప్రాయం కుదరక పోవడమే అందుకు కారణం. దానితో ఆ గ్రూపు ఒక రకంగా అభాసుపాలయ్యింది. కనీసం నిలబడ్డ వారిలో ఒకరికి ఏకగ్రీవ మద్దతు అయినా అవి ప్రకటించలేక పోయాయి. రష్యా బ్రిక్స్ గ్రూపుతో జారీ అయిన ప్రకటన పైన సంతకం చేసినా, జి-8 గ్రూపులో భాగంగా లాగార్డే కి మద్దతు ఇస్తూ ప్రకటన చేయడం బ్రిక్స్ గ్రూపు మరింత చులకన కావడానికి దారి తీసింది. చైనా మద్దతు తనకు ఉన్నట్లు లాగార్డే చెప్పుకుంటుంటే ఇండియా అదేమీ లేదని అంటున్నా చైనా మాత్రం తన అభిప్రాయాన్ని బహిరంగంగా చెప్పడం లేదు. ఇప్పటికైనా లాగార్డేతో పోటీపడుతున్న అగస్టిన్ కి బ్రిక్స్ లోని ఇతర నాలుగు దేశాలయినా మద్దతు ఇస్తే కొంతవరకు పరువు కాపాడుకోవచ్చు.

లాగార్డేకే అవకాశాలు

ఇప్పటి పరిస్ధుతుల ప్రకారం, ఫ్రాన్సు అభ్యర్ధి లాగార్డే కి అధిక అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. ఆమె ప్రత్యర్ధి అగస్టిన్ కూడా అదే చెప్పడం గమనార్హం. “నన్ను నేను ఫూల్ ని చేసుకోవడం లేదు ఈ పోటీ సాకర్ ఆటను 5-0 స్కోరుతో మొదలు పెట్టడం లాంటిదే” అని అగస్టిన్ సోమవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ అన్నాడు. ఆయనకి లాటిన్ అమెరికా దేశాలు మద్దతు ఇస్తున్నాయి. లాగార్డేకి యూరప్ దేశాల పూర్తి మద్దతు ఉంది. ఈజిప్టు, మలేషియా, యు.ఎ.ఇ లాంటి దేశాలు కూడా ఆమెకు మద్దతు ప్రకటించాయి. బ్రిక్స్ దేశాలకు అమెరికా, యూరప్ లతో ఉన్న ఆర్ధిక సంబంధాల దృష్ట్యా ఫ్రాన్సు అభ్యర్ధికి మద్దతు ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వెరసి క్రిస్టీన్ లాగార్డే ఐ.ఎం.ఎఫ్ కి భావి మేనేజింగ్ డైరెక్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రయోజనాల ఘర్షణ

అయితే, అగస్టిన్ చేస్తున్న వాదనలో న్యాయం కనిపిస్తోంది. “యూరోపియన్ అభ్యర్ధి ఐ.ఎం.ఎఫ్ ఉన్నత పదవికి నియమితుడైనట్లయితే ‘ప్రయోజనాల ఘర్షణ’ పరిస్ధితి తలెత్తుతుందని ఆయన చేస్తున్న వాదనలో నిజం ఉంది. యూరప్ లోని యూరో జోన్ దేశాలు సావరిన్ అప్పు సంక్షోభంలో ఉన్న దృష్ట్యా యూరప్ అభ్యర్ధి యూరో జోన్ దేశాల ప్రయోజనాల కోసం పని చేసే అవకాశం ఉందనీ ఇది “ప్రయోజనాల ఘర్షణ” (conflict of interest) స్ధితిగా పరిణమిస్తుందనీ అగస్టిన్ వాదిస్తున్నాడు. యూరప్ దేశాలు అవసరంలో ఉన్నందున యూరప్ అభ్యర్ధి యూరప్ ప్రయోజనాలు తీర్చడానికే ముగ్గు చూపుతారు. తద్వారా ఐ.ఎం.ఎఫ్ అవసరం ఉన్న ఇతర దేశాలు తగిన మద్దతు ఐ.ఎం.ఎఫ్ నుండి పొందక పోవచ్చు. పక్షపాత రహితంగా వ్యవహరించవలసిన ఉన్నత పదవిలోని వ్యక్తి అలా వ్యవహరించే పరిస్ధితిలో ఉండడాన్నే “ప్రయోజనాల ఘర్షణ” గా పిలుస్తారు.

యూరప్ అప్పు సంక్షోభాన్ని తాజా దృక్పధంతో పరికించాల్సిన అవసరం ఉందని అగస్టిన్ చెబుతున్నాడు. ఇప్పటివరకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న డొమినిక్ స్ట్రాస్ కాన్ యూరప్ అప్పు సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఐ.ఎం.ఎఫ్ నుండి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయించాడు. ఇప్పటికే గ్రీసు కి 110 బిలియన్ యూరోల ప్యాకేజి ప్రకటించిన ఐ.ఎం.ఎఫ్ ఆ ప్యాకేజి మొత్తాన్ని మరింతగా పెంచడానికి చర్చలు జరుగుతుండగానే స్ట్రాస్ కాన్ ‘రేప్ ప్రయత్నం’ నేరంపై రాజీనామా చేయవలసి వచ్చింది. గ్రీకు తో పాటు ఐర్లండు, పోర్చుగల్ కూడా ఇతోధికంగా ఐ.ఎం.ఎఫ్ నిధుల్ని పొందాయి. ఇంకా స్పెయిన్, ఇటలీ లాంటి పెద్ద ఆర్ధిక వ్యవస్ధలున్న దేశాలు కూడా ఈ సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కనుక ఐ.ఎం.ఎఫ్ నుండి మరిన్ని నిధులు యూరప్ కి ప్రవహించే అవకాశం కనిపిస్తోంది. స్ట్రాస్ కాన్ రాజీనామా అనంతరం “యూరప్ అప్పు సంక్షోభం దృష్ట్యా యూరోపుకి చెందిన వ్యక్తే ఐ.ఎం.ఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి నియమించడం సబబు” అని యూరపియన్ కమిషన్ అధికారులు బహిరంగంగా ప్రకటించారు కూడా. కనుక అగస్టిన్ చెప్పినట్లు “ప్రయోజనాల ఘర్షణ” తప్పని సరిగా ఉద్భవిస్తుంది.

“యూరప్ బైటి నుండి వచ్చే వ్యక్తి ఒక విధంగా యూరప్ అప్పు సంక్షోభం విషయంలో తన మనసులోని అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పే అవకాశం ఉంది. ఈ అంశం నాకు తోడ్పడుతుంది” అని అగస్టిన్ చెబుతున్న అంశాన్ని ప్రపంచ దేశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.

వ్యాఖ్యానించండి