అమెరికా సెనేట్ వెబ్ సైట్ లోకి చొరబడ్డ హ్యాకర్లు


Lulz Security logo

"లుల్జ్ సెక్యూరిటీ" లోగో

అమెరికా ప్రభుత్వ వెబ్ సైట్లపై మరే దేశమైనా దాడి చేసినట్లయితే దాన్ని “యుద్ధ చర్య” గా భావించి సాయుధంగానే ప్రతిస్పందిస్తామని అమెరికా ప్రకటించిన వారం రోజుల లోపే అమెరికా ఎగువ సభ లేదా పెద్దల సభ లేదా సెనేట్ కి చెందిన వెబ్ సైట్ పై హ్యాకర్లు దాడి చేసి అమెరికాకి పరోక్షంగా సవాలు విసిరారు. సెనేట్ వెబ్ సైట్ లోకి చొరబడడమే కాకుండా రహస్యం కాని మామూలు ఫైళ్ళను ఇంటర్నెట్ లో ప్రదర్శించింది. తాము సెనేట్ వెబ్ సైట్ లోకి చొరబడ్డామన్నదానికి సాక్ష్యంగా ఆ ఫైళ్ళను ప్రదర్శించింది. హ్యాకర్లు సభ్యులుగా ఉన్న “లల్జ్ సెక్యూరిటీ” అనే అంతగా సంఘటితం కాని సంస్ధ ఈ హ్యాకింగ్ కి బాధ్యురాలిగా ప్రకటించింది.

హ్యాకర్ల దాడి అనంతరం సెక్యూరిటీ సమీక్షకు ఆజ్ఞ జారీ చేసామని అమెరికా అధికారులు ప్రకటించారు. ఈ దాడిని గత వారాంతం గుర్తించామని వారు తెలిపారు. హ్యాకర్ల దాడి తమకు “అసౌకర్యం” కలిగించేదే అయినా సెనేట్ సిబ్బందిలో ఎవరి భద్రతకూ సమస్య రాలేదని వారు తెలిపారు. గత వారాంతంలో దాడిని గుర్తించాకా సెనేట్ వెబ్ సైట్ Senate.gov హూస్ట్ చేసే అన్ని సైట్ల సెక్యూరిటీని రివ్యూ చేస్తున్నామని సెనేట్ “డిప్యుటీ సార్జెంట్-ఎట్-ఆర్మ్” మార్టినా బ్రాడ్‌ఫర్డ్ తెలిపింది.

లుల్జ్ సెక్యూరిటీ సంస్ధ కొన్ని సెనేట్ ఫైళ్ళను ఇంటర్నెట్ లో పోస్ట్ చేసినప్పటికీ ఆ ఫైళ్ళలో ఏవీ రహస్యమైనవి గానీ ముఖ్యమైనవిగా గాని కనిపించడం లేదని బిబిసి తెలిపింది. “అమెరికా ప్రభుత్వాన్ని మేము అంతగా ఇస్టపడము. సెనేట్ వెబ్ సైట్ పై ఈ దాడిని సరదాగా చేశాం. ఆ సైట్ లోని అంతర్గత వివరాలున్న ఫైళ్ళను శాంపిల్ గా ప్రదర్శించాం. ఇది యుద్ధ చర్యేనా, జెంటిల్‌మెన్? సమస్యా?” అని లల్జ్ ప్రశ్నించింది. ప్రభుత్వ వెబ్ సైట్లపై దాడిని యుద్ధ చర్యగా భావిస్తామని అమెరికా చేసిన ప్రకటనను ఈ దాడి ద్వారా హ్యాకర్లు ప్రశ్నించారన్నది స్పష్టమవుతోంది. వికీ లీక్స్ పై “ఫ్రంట్ లైన్” అన్న పేరుతో తీసిన డాక్యుమెంటరీకి ఈ దాడి నిరసన అని వారు ప్రకటించినట్లుగా రాయిటర్స్ తెలిపింది.

హ్యాకర్లు ఉంచిన సందేశం ఇలా ఉంది.

Greetings friends,

We don't like the US government very much. Their boats are
weak, their lulz are low, and their sites aren't very secure.
In an attempt to help them fix their issues, we've decided
to donate additional lulz in the form of owning them some more!

This is a small, just-for-kicks release of some internal data
from Senate.gov - is this an act of war, gentlemen? Problem?

- Lulz Security

సెనేట్ వెబ్ సైట్ లోని పబ్లిక్ విభాగంలోకి మాత్రమే హ్యాకర్లు వెళ్ళారు తప్ప ఫైర్ వాల్ దాటి వెళ్ళలేదని రాయిటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అమెరికా ప్రభుత్వానికి ఇది ఇబ్బందికర చర్య అని రాయిటర్స్ అభివర్ణించింది. “సెనేట్ లోకి దొంగలు చొరబడడంతో సమానంగా ఈ హ్యాకర్ల దాడిని పోల్చవచ్చు. కాని వారు ఓ గిఫ్టు షాపులో ఉన్న సావనీర్ లను మాత్రమే దొంగిలించగలిగారని చెప్పవచ్చు” అని డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ కి గతంలో సైబర్ అధికారిగా పనిచేసిన స్టీవర్ట్ బేకర్ అన్నాడు. సెనేట్ వెబ్ సైట్ ను ప్రతినెలా పదుల వేల సంఖ్యలో హ్యాకింగ్ చేసే ప్రయత్నాలు జరుగుతాయనీ, వాటన్నింటినీ తిప్పికొడుతుంటామనీ సెనేట్ సైబర్ సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. అయినా ప్రస్తుత దాడి కొంత ఇబ్బంది కలిగించేదే నని వారు తెలిపారు.

లల్జ్ అనేది ఇంటర్నెట్ లోవాడుక లో ఉన్న “బిగ్గరగా నవ్వండి” (laugh out loud) అన్నదానికి పర్యాయ పదం. ఇది గతంలో సోనీ, యు.ఎస్. పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం, నిన్టెండో, ఫాక్స్ న్యూస్ తదితర వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. ఇటీవలి కాలంలో ఐ.ఎం.ఎఫ్, అమెరికా రక్షణ పరికరాలు తయారు చేసే మార్టిన్ లాక్ హీడ్, సిటీ గ్రూప్ ఇంక్, గూగుల్, మైఖేల్ స్టోర్స్ మున్నగు సంస్ధలు హ్యాకింగ్ దాడికి గురయ్యాయి. సెనేట్ సైబర్ సిబ్బందికి ఇది ప్రత్యేకంగా ఇబ్బంది కలిగించే వ్యవహారమనీ, ఇప్పటివరకూ వారు ఇతర సంస్ధలని వారి సెక్యూరిటీ సిస్టం లు ఎందుకు విఫలమవుతున్నాయని ప్రశ్నించేవారనీ “యు.ఎస్. సైబర్ కన్సీక్వెన్సెస్ యూనిట్” సంస్ధ తెలిపింది.

“ఇంటర్నెట్ లో వారు ప్రదర్శించిన ఫైళ్ళను చూస్తే హ్యాకర్లు సెనేట్ సర్వర్ లోకి అడ్మినిస్ట్రేటర్ స్ధాయి ప్రవేశం సంపాదించగలిగారని స్పష్టం అవుతోంది. ఈ ప్రవేశం ద్వారా సెనేట్ సర్వర్ నెట్ వర్క్ లో ఉన్న ఇతర కంప్యూటర్లలోకి నష్టం చేయగల అవకాశం ఉంది” అని ఆ సంస్ధ తెలిపింది.

వ్యాఖ్యానించండి