జపాన్ లో సంభవించిన భూకంపం, సునామీల వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి వాటిల్లిన ప్రమాదం అణు విద్యుత్ వలన ఏర్పడనున్న వైపరీత్యాలపై మరొకసారి దృష్టి సారించవలసిన అగత్యం ఏర్పడింది. అణు ప్రమాదాల వలన ప్రజలపై కలిగే ప్రభావాలకంటే అణు రియాక్టర్ల మార్కెట్ ను కాపాడుకునే విషయానికే ప్రాధాన్యం ఇస్తున్న నేటి ప్రభుత్వాలు అణు ప్రమాదాల వల్ల సంభవించిన అసలు నష్టాల్ని వెల్లడించడంలో నిజాయితీగా వ్యవరించడం లేదని ఆ పరిశ్రమతో సంబంధం ఉన్న అమెరికా నిపుణుడు రాబర్టు అల్వారెజ్ అభిప్రాయపడుతున్నాడు. అమెరికాకి చెందిన డెమొక్రసీ నౌ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫుకుషిమా దైచి అణు ప్రమాదం సంగతులతో పాటు అమెరికాకి ఎదురుకానున్న పెను ప్రమాదం విషయమై ఆయన హెచ్చరించాడు. అమెరికా ప్రభుత్వం దృష్టి సారించకపోతే అమెరికా అంతటా విస్తరించిన అణు రియాక్టర్లు వాడి పారేసిన ఇంధనం అమెరికాకి గుదిబండ కానున్నదని హెచ్చరించాడు.
అమెరికాలోని అణు విద్యుత్ రియాక్టర్లు వాడగా మిగిలిన అణు ఇంధనాన్ని ఆయా రియాక్టర్ల వద్దే నీటితో కూలింగ్ చేస్తూ నిలవచేశారు. జపాన్ ఫుకుషిమా దైచి అణు రియాక్టర్లలో ఉపయోగించిన డిజైన్ నే అమెరికా కూడా అనుసరించిందని రాబర్ట్ తెలిపాడు. వాడిన ఇంధనాన్ని నిలవ ఉంచిన నీటి కొలనులు వాతావరణంతో నేరుగా సంబంధం కలిగి ఉన్న విషయాన్ని ఫుకుషిమా దైచి ప్రమాదం ద్వారా లోకానికి తెలిసింది. జపాన్‌లో నిలవ ఉంచినదాని కంటే అమెరికా అణు విద్యుత్ కేంద్రాల్లో మూడు నుండి నాలుగు రెట్ల వరకూ, ఒకోసారి ఐదు రెట్లు వరకూ వాడిన ఇంధనాన్ని ఆవిధంగా నిలవ చేశారని రాబర్ట్ తెలిపాడు. అమెరికాలో ఆ విధంగా భద్రత లేకుండా, బహిరంగంగా, ప్రమాదానికి దగ్గరగా ఏర్పాటు చేసిన అటువంటి కొలనుల్లో అమెరికా నిల్వ చేసిన వాడిన ఇంధనం (spent fuel) మొత్తం ఈ భూ గ్రహంపైనే అత్యధికం అని ఆయన తెలిపాడు. అనుకోకుండా ఏర్పడే ప్రమాదాలు ఈ నిల్వలను తేలిగ్గా వాతావరణంలోకి విడుదల చేసే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.
2008లో 9/11 ఘటనలు దృష్టిలో పెట్టుకుని రాబర్ట్ ఆయన మిత్రులు కలిసి ఒక నివేదికను సమర్పించామనీ, లోతుగా అధ్యయనం చేసి ఆ నివేదికను తయారు చేశామనీ ఆయన తెలిపాడు. గత 55 సంవత్సరాల నుండి, వాడిన అణు ఇంధనాన్ని పారవేయగల చోటు కోసం అమెరికా ప్రభుత్వాలు వెతుకుతూనే ఉన్నాయి. వాస్తవం ఏమిటంటె వాడేసిన అణు ఇంధనం ప్రతి సంవత్సరం అమెరికా రియాక్టర్ల వద్ద పెరుగుతూ పోతోంది. రియాక్టర్లను నడుపుతున్న ఆపరేటర్ కంపెనీలు ఇలా వాడేసిన ఇంధనాన్ని రియాక్టర్ల వద్దనే బహిరంగ నీటి కొలనుల్లో నిలవ చేస్తూనే ఉన్నాయి. ఈ నిల్వలు ఆయా రియాక్టర్ల రక్షణ స్ధాయిని ఎన్నడో దాటి పోయాయని రాబర్ట్ తమ నివేదికలో పేర్కొన్నామని తెలిపాడు. వాడిన ఇంధనం నిలవ ఉంచిన నిర్మాణాలు కార్ల గ్యారేజి వద్దనో, లేదా బిగ్ బాక్స్ స్టోర్ల వద్దనో అందరూ చూస్తూ ఉండేవేననీ, అది ప్రమాదం సంభవించగల అవకాశాలు అనేక రెట్లు పెంచాయనీ వెల్లడించాడు. “ఉదాహరణకి అమెరికాకి చెందిన న్యూక్లియర్ రెగ్యులేటరీ కమిషన్ వాడిన ఇంధనం నిలవ చేసిన కొలనుల వద్ద డీజిల్ జనరేటర్లను సిద్ధంగా ఉంచడం లో విఫలమైందనుకోండి. రియాక్టర్లలో రెగ్యులర్ విద్యుత్ సరఫరా ఆగిపోతే ఆ కొలనుల వల్ల పెను ప్రమాదం సంభవించడం ఖాయం. వాడేసిన ఇంధనాన్నయినా ఎల్లప్పుడూ చల్లబరుస్తూ ఉండవలసిందే. అది చాలా ముఖ్యం. లేనట్లయితే అవి తీవ్ర ప్రమాదాన్ని తెస్తాయి. నా ఉద్దేశ్యంలొ అమెరికాలోని అణు విద్యుత్ వలన ఎదురౌతున్న తీవ్ర ప్రమాదం ఈ కొలనుల వల్లనే ఎదురవుతుంది” అని రాబర్ట్ టీవీ ఛానెల్ కు తెలిపాడు.
అమెరికాతో పాటు అనేక దేశాల ప్రభుత్వాలు అణు విద్యుత్ ని వినియోగించడానికే నిర్ణయిస్తున్న నేపధ్యంలో అణు ప్రమాదాల నివారణకు ఉన్న ప్రత్యామ్నాయాల గురించి రాబర్ట్ చర్చించాడు. ప్రభుత్వాలు పధకాలు వేయడానికీ వాటిని అమలు చేయడానికీ చాలా అంతరం ఉందనీ ఆయన అభిప్రాయం వెలిబుచ్చాడు. “అమెరికాలో ఇక ముందు అణు విద్యుత్ ని విస్తరించడం అంటూ అసలు జరిగితే గనక అది చాలా చాలా తక్కువగానే ఉంటుంది. అమెరికాలో ఇప్పటికే నడుస్తూ ఉన్న 104 అణు రియాక్టర్లను, అవి మిగులుస్తున్న వాడిన ఇంధనాన్ని గురించీ ముందు అమెరికా ప్రభుత్వం ఆలోచించాలి. జర్మనీ 25 సంవత్సరాల క్రితం ఏం చేసిందో అమెరికా కూడా ఇప్పటికీ అదే చేస్తూ ఉండాలి నిజంగా. వాడిన ఇంధనాన్ని నిలవ ఉంచిన కొలనులను క్రమంగా తగ్గించుకుంటూ పోవడం, వాటిని ఒరిజినల్ గా ఏం చేయవలసి ఉందో అదే చేయాలి. అంటే ముందు వాడిన ఇంధనాన్ని అనేక సంవత్సరాల పాటు చల్లబడనివ్వాలి. ఆ తర్వాత బాగా అత్యంత గట్టి స్టోరేజి మాడ్యూళ్ళలో ఆ పొడి ఇంధనాన్ని శాశ్వతంగా సమాధి చేయాలి. ఇలా చేయగలిగితే వాడేసిన ఇంధనం నుండి వచ్చే ప్రమాదాన్ని చాలావరకు తగ్గించవచ్చు” అని రాబర్ట్ తెలిపాడు.
అమెరికా అధ్యక్షుడు ఒబామా ఎన్నికల ప్రచారంలో అణు పరిశ్రమ నుండి పూర్తి మద్దతును పొందడాని రాబర్ట్ అప్పట్లో రాశాడు. అమెరికాలో చివరి అణు విద్యుత్ కేంద్రాన్ని స్ధాపించి దాదాపు 30 లేదా 40 సంవత్సరాలు పైనే గడిచింది. తనకు వచ్చిన మద్దతు రీత్యా ఒబామా అణు రియాక్టర్లను కొత్తవి నెలకోల్పుతానని చెప్పకపోయినా స్ధాపించబోనని మాత్రం చెప్పలేదు. అసలా అంశంపై ఒబామా గానీ అణు రియాక్టర్లు తయారు చేసే కంపెనీలు గానీ మౌనం పాటిస్తున్నాయి తప్ప ఇదమిద్ధంగా ఏమీ చెప్పలేదు. అందువలన కొత్తవి స్ధాపించే ఉద్దేశ్యం ఉందేమోనని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయంలొ రాబర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. “ఒబామా కొత్తగా అణు విద్యుత్ కేంద్రం నెలకొల్పడమంటే అణు ఇంధనంతో క్యాండీ తయారు చేసి ఒబామా తన రాజకీయ మద్దతుదారులకు బహుమతిగా ఇవ్వడం లాంటిదే. అంటే తన మద్దతుదారుల్నయినా లేక శత్రువుల్నయినా సరే స్వయంగా అణు ప్రమాదంలోకి నేరుగా నెట్టడం లాంటిదే. వాస్తవం ఏంటంటె అణు విద్యుత్ కి ఇక ఈ దేశంలో అవకాశం లేదు. ఒక్కో రియాక్టరుకి 10 బిలియన్ డాలర్లు అవసరమైన నేపధ్యంలో ఆర్ధిక పరిమితులు అందుకు ఒప్పుకోవు” అని రాబర్ట్ తెలిపాడు. “వాడిన ఇంధనాన్ని పాతి పెట్టడానికి యుక్కా పర్వతాలను వినియోగించాలన్న ప్రతిపాదనను ఒబామా రద్దు చేశాడు. కనుక మాటలకూ ఆచరణకూ చాలా తేడా ఉంది” అని ఆయన ఎత్తి చూపాడు.
ఏతా వాతా తేలేదేమిటంటే అమెరికాలో ఉన్న వందకు రియాక్టర్లు విడుదల చేసే అణు వ్యర్ధాన్ని భద్రంగా నిలవ చేసే సౌకర్యాల్ని అమెరికా ఏర్పాటు చేసుకోలేక పోయింది. దాన్ని పాతిపెట్టడానికి యాభై ఐదు సంవత్సరాలనుండి వెతుకుతున్నా సరైన చోటుని అది ఎన్నుకోలేక పోయింది. తాను స్వయంగా అణు రియాక్టర్లను నిర్మించడాన్ని ఎప్పుడో నిలిపి వేసింది. తాను నిలిపి వేసి అణు పరికరాలు తయారు చేసే కంపెనీలకు మార్కెట్ కోసం ఇండియా లాంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి తాను వద్దను కున్న అణు రియాక్టర్లను అమ్ముకుంటోంది. తద్వారా ఆదేశాల ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోంది. తానే ప్రమాదపుటంచున ఉన్న అమెరికా మూడో ప్రపంచ దేశాల్ని కూడా తెలిసి తెలిసీ ప్రమాదం లోకి నెట్టడానికి సిద్ధమయ్యింది. భారత పాలకులు అమెరికా ఒత్తిడికి లొంగిపోయి భారత ప్రజల భవిష్యత్తును అమెరికా బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టడమే ఇక్కడ అసలు విషాదం.

