“కండోమ్‌లు పంచి పెట్టడంతోనే మీ భాధ్యత ముగిసిందనో, మా సమస్యలు తీరిపోతాయనో భావించడం సరికాదు. మా జీవితాల్ని మాకు తిరిగి ఇవ్వండి” అని కోరారు కేరళకు చెందిన రచయిత్రి, ఒకప్పటి సెక్స్ వర్కర్ నళిని జమీలా. సెక్స్ వర్కర్లకి సంబంధించి ప్రభుత్వ విధానాల పట్ల అనేక మంది సెక్స్ వర్కర్ల అభిప్రాయాలను నళిని ఒక్క వాక్యంలో విడమర్చి చెప్పింది నళిని.
నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాంకి సంబంధించిన నాలుగవ పంచవర్ష ప్రణాళిక రూప కల్పన కోసం బెంగుళూరులో చర్చల ప్రక్రియ జరుతుతోంది. ఈ సమావేశాలకు హాజరైన నళిని ఖాళీ సమయంలో విలేఖరులతో మాట్లాడింది. “ప్రభుత్వాలు కేవలం కండోమ్ లు పంచి పెట్టడంతోనో లేక ఎయిడ్స్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలనో సెక్స్ వర్కర్ల విషయంలో తన భాధ్యత ముగిసిందనుకుంటే పొరబాటు. వారికీ అవసరాలు ఉంటాయి. హక్కులూ ఉంటాయి. అవి వారికి దక్కాలి. వారి పిల్లలకు చదువులు కూడా కావాలి. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్ధ ద్వారా రేషన్ సౌకర్యం కావాలి. వారు తమ వృత్తి మాని పనను చేసుకుంటున్న చోట కనీస వేతనాలను అందించాలి” అని నళిని వేశ్యల జీవితాల మెరుగుదల కోసం విలువైన సూచనలు చేశారు.
సెక్స్ వర్కర్ల గురించిన విధానాలను రూపొందించే ముందు ఆ ప్రక్రియలో వారిని భాగస్వాములను చెయ్యాలని కూడా నళిని ప్రతిపాదించారు. “కండోమ్ లు పంచడానికి కాంటాక్టు పాయింటు గానో లేదా ఎయిడ్స్ నిరోధక ప్రచారం కోసమో మాత్రమే వారిని లెక్కలోకి తీసుకునే పరిస్ధితి ఉంది. ఈ పరిస్ధితి మారాలి” అని నళిని కోరారు.
నళిని రాసిన తన ఆత్మకధ పుస్తకంగా వెలువడి అనేక ప్రతులు అమ్ముడుబోయింది. బెస్ట్ సెల్లింగ్ పుస్తకంగా నిలిచింది. ఈ పుస్తకం వెలువడ్డాక సెక్స్ వర్కర్ల జీవన స్ధాయిని పెంచడానికి ప్రభుత్వం చేసే కృషిలో ప్రభుత్వం యొక్క దృక్పధంలోనే పెద్ద ఎత్తున మార్పు వచ్చిందన్న పేరుంది. రెండు రోజుల పాటు జరిగే సమావేశాలు తమ చర్చల వివరాలను ఎన్.ఎ.సి.ఓ (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) సంస్ధకు పంపిస్తారు.
అతి ప్రాచీన వృత్తి అని చెబుతూ వేశ్యా వృత్తి పట్ల సంఘంలో పరోక్షంగా ఆ వృత్తిని సహజంగా భావించే ధోరణులు సమాజంలో ఉన్నాయి. ప్రభుత్వాలు సైతం మొక్కుబడి కార్యక్రమాలకే పరిమితమవుతున్నాయి తప్ప వారి జీవనాన్ని ఆమూలాగ్రం మార్చే పధకాలకు ప్రయత్నించడం లేదు. పేదలకోసం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలు వారికీ అమలు చేయాలన్న నళిని డిమాండ్ లో చాలా న్యాయముంది. ఎవరూ ఇష్ట పూర్వకంగా వేశ్యా వృత్తిలోకి దిగరన్న సత్యాన్ని గుర్తించి వేశ్యా వృత్తికి దారి తీసే పరిస్ధితులు సమాజంలో లేకుండా చేయగలిగినప్పుడే వారి జీవితాల్లొ నిజమైన మార్పులు సాధ్యం.