ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ గా పరిగణింపబడుతున్న భారత దేశం చైనా తర్వాత అత్యధిక వేగంతో ఆర్ధిక వృద్ధి (జిడిపి పెరుగుదల రేటు) సాధిస్తున్న దేశంగా గుర్తింపు పొందింది. భారత దేశంలో సేవల రంగం (ప్రధానంగా సాఫ్టువేర్, ఆ తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్సు లు కూడా సేవల రంగం కిందికే వస్తాయి) అభివృద్ధి చెందింది. ప్రధానంగా సావ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందిన ఫలితంగా కంప్యూటర్ రంగంలో ఔట్ సోర్సింగ్ కి ఇండియా కేంద్రంగా మారింది. నూతన ఆర్ధిక విధానాలు అమలు చేస్తున్న ఫలితంగా దేశంలోని విదేశీ ప్రవేటు కంపెనీలు వచ్చి పడ్డాయి. ఇవి ఉత్పత్తి రంగాలకు సంబంధించి ప్రధానంగా మాన్యుఫాక్చరింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. దానితో పాటు వ్యవసాయ రంగంపై భారత దేశ ప్రజల్లోని 70 శాతం మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారు. ఈ మూడు ప్రధాన రంగాల్లో భారత దేశ ఆర్ధిక వృద్ధికి ఎక్కువగా తోడ్పడుతున్నది ఏది? ఏ రంగంపైన కేంద్రీకరిస్తే ఇండియా మరింత అభివృద్ధిని సాధించి చైనాను అధిగమిస్తుంది?
ఈ ప్రశ్నలకు పశ్చిమ దేశాలకు చెందిన కార్పొరేట్ వార్తా సంస్ధలతో పాటు ఇండియా కార్పొరేట్ వార్త సంస్ధలు కూడా ఇచ్చే సమాధానం ఒక రకంగానూ, భారత ప్రజల ప్రయోజనాలను ప్రధానంగా భావించేవారు ఇచ్చే సమాధానం ఒక రకంగానూ ఉంటుంది. కార్పొరేట్ వార్తా సంస్ధలు వ్యాపార సంస్ధలు, స్వదేశీ విదేశీ ప్రవేటు బహుళజాతి సంస్ధలు తదితరుల ప్రయోజనాలనే ప్రధానంగా పరిగణిస్తాయి. వారి ప్రయోజనాలు భారత ప్రజల ప్రయోజనాలకు సరిగ్గా విరుద్ధంగా ఉన్నందునే ఈ విధంగా భిన్నమైన సమాధానాలు సహజంగానే వస్తాయి.
ఇప్పటి పరిస్ధితిని ఒక సారి పరిశీలిద్దాం. మాన్యుఫాక్చరింగ్ రంగం ఇప్పుడు ప్రభుత్వం నుండి జారిపోయింది. విదేశీ బహుళజాతి కంపెనిలే ఈ రంగంలో ఆధిక్యత వహిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్ధలు ఉన్నప్పటికీ భారత దేశ వనరులను ప్రవేటు కంపెనీలకు అప్పజెప్పడం బాగా ఎక్కువయ్యింది. ప్రజలు ఎన్ని విధాలుగా వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు ఖనిజాలు, నీరు, గనులు తదితర ప్రకృతి వనరులను విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ రంగం భారత దేశ జిడిపిలో 16 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని 25 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మాన్యుఫాక్చరింగ్ రంగం విదేశీ కంపెనీల ఆధిపత్యం ఉన్న నేపధ్యంలో ఆర్ధిక వ్యవస్ధలో మాన్యుఫాక్చరింగ్ రంగం వాటా పెంచడం అంటే మరిన్ని రంగాలను విదేశీ పెట్టుబడులకు అప్పజెప్పడమే. ఇప్పటికే విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తున్న చోట వారి వాటాను మరింతగా పెంచడమే. అంతిమంగా విదేశీ కంపెనీల వాటాను వంద శాతానికి పెంచడమే.
చైనాలో ఎప్పటినుండో విదేశీ కంపెనీలకు ప్రత్యేక ఆర్ధిక జోన్ లను ఏర్పాటు చేయడం వలన విదేశీ కంపెనీలు అక్కడ బాగా పెట్టుబడులు పెట్టాయి. ప్రపంచంలోనే అత్యంత చౌకైన లేబర్ అక్కడ చైనా అందిస్తోంది. కార్మిక చట్టాలు చైనాలో ఉండవని చెబితేనే సరిపోతుంది. సమ్మెలు జరిగినా సమర్ధవంతంగా అణచివేసేందుకు తగిన ఏకపార్టీ ప్రభుత్వం చైనాలో ఉంది. పర్యావరణ చట్టాలు అక్కడ చాలా బలహీనం. విదేశీ ఫ్యాక్టరీల వలన చైనాలో అడవులు చాలా వరకూ నాశనం అయ్యాయి. ప్రజలు అనేక రోగాలకు గురవుతున్నారు. అయితేనేం, ప్రభుత్వ మద్దతు విదేశీ కంపెనీలకే. వీటన్నింటి కారణంగా చైనాకు విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో అక్కడి మాన్యుఫ్యాక్చరింగ్ రంగం వాటా మొత్తం జిడిపిలో 34 శాతంగా ఉంది. చైనాలాగే దాదాపు నియంతృత్వం అనదగ్గ రాజకీయ వ్యవస్ధ ఉన్న ధాయిలాండ్ లో మాన్యుఫ్యాక్చరింగ్ రంగం ద్వారా 40 శాతం జిడిపి వస్తున్నది.
సేవల రంగానికి వస్తే ఇండియాలో సాఫ్ట్ వేర్ రంగం బాగా అభివృద్ధి చెందింది. ప్రపంచ స్ధాయి నైపుణ్యం ఇండియా సొత్తు. వేతనాలు కూడా అమెరికా, యూరప్ లలో చెల్లించవలసిన దానితో పోలిస్తే ఇండియాలో దాదాపు పదోవంతు చెల్లిస్తే సరిపోతుంది. అదే ఎక్కువగా కనిపించి మురిసిపోతోంది మన సాఫ్ట్ వేర్ రంగం. ఫలితంగా ఐరోపా, అమెరికా లలోని బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ తదితర ఫైనాన్సు కంపెనీలు సాఫ్ట్ వేర్ సర్వీసుల కోసం ఇండియా పై ఆధారపడుతున్నాయి. అమెరికాలోని వాల్‌స్ట్రీట్ లో ఉండే అతి పెద్ద ఫైనాన్స్ కంపెనీలన్నీ సాఫ్ట్ వేర్ సర్వీసుల్ని ఇండియాకి ఔట్ సోర్స్ చేయడం ద్వారా బోల్డన్ని లాభాల్ని మిగుల్చుకుంటున్నాయి. అమెరికాలో కూడా భారత సాఫ్ట్ వేర్ నిపుణుల్ని నియమించుకుంటున్నాయి. తద్వారా వేతనాలలోని అధిక భాగాన్ని లాభాలుగా తరలించుకోగలుగుతున్నాయి. ఈ విధంగా అభివృద్ధి చెందిన దేశాలు బారతదేస ఔట్ సోర్సింగ్ పై ఆధారపడడం వలన ఆ రంగం నుండి భారత దేశ జిడిపికి అత్యధికంగా 55 శాతం వాటా జమ అవుతోంది (రాయిటర్స్ జూన్ 12, 2011).
ఇక వ్యవసాయ రంగానికి వస్తే ఆ రంగంపైనే మెజారిటీ భారత ప్రజలు ఆధారపడి ఉన్నారు. వ్యవసాయం పై ఎంతమంది ఆధారపడు ఉన్నారు అన్నదానికి వివిధ సంస్ధలు వివిధ రకాలుగా చెబుతున్నాయి. అవి 55 నుండి 70 శాతం వరకూ మారుతూ ఉంటుంది. రాయిటర్స్ సంస్ధ 58 శాతం మంది వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారని చెబుతోంది. అంతమంది ఆధారపడుతున్న వ్యవసాయ రంగం నుండి కేవలం 15 శాతం మాత్రమే జిడిపికి జమ అవుతోందని ఆ సంస్ధ తెలిపింది. ఈ శాతం విషయంలోనూ వివిధ సంస్ధల మధ్య తేడా ఉన్నప్పటికీ ఆ తేడాలు పరిగణించదగ్గ స్ధాయిలో లేవు. కాస్త అటు ఇటుగా 15 నుండి 18 శాతం వరకూ ఈ అంచనాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల చిన్నచూపువలన ఈ వాటా కూడా అంతకంతకూ తగ్గుతోంది తప్ప పెరగడం లేదు. ప్రధాని ఉపన్యాసాల్లో మాత్రం వ్యవసాయ రంగ ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటాం అంటారే తప్ప అవేవీ ఆచరణలో కనపడవు.
ఈ విధంగా ప్రస్తుతం వివిధ రంగాల జిడిపి వాటాలు ఉన్న నేపధ్యంలో పశ్చిమ దేశాల కంపెనీలు, ఎనలిస్టులు భారత దేశం మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహించాలని అధికంగా సలహా ఇస్తున్నారు. ఆ రంగంలోకి తక్కువ పెట్టుబడులు వస్తున్నాయని అధిక పెట్టుబడులు రావడానికి అనుగుణంగా పరిస్ధుతులను మెరుగు పరిచినట్లయితే మాన్యుఫాక్చరింగ్ రంగం విస్తరించి ఉద్యోగాలు కల్పిస్తుందనీ, తద్వారా జిడిపి వృద్ధి చెందడంతో పాటు ఉపాధి కూడా సాధ్యమని వారు బోధిస్తున్నారు. భారత దేశంలో మౌలిక సొకర్యాలు అరకొరగా ఉన్నాయన్నది వాస్తవం. రోడ్లు, రైల్వేలు, రవాణా వాహనాలు, సరఫరా చైన్లు, రవాణా కంపెనీలు, ఇవన్నీ అభివృద్ధి చెందలేదు. మౌలిక సౌకర్యాలు సరిగా లేనందున ఉత్పత్తి ధరలకు అధిక రవాణా, నిలవ ఖర్చులు కూడా పెరిగి సరుకుల ధరలు ప్రపంచ మార్కెట్లో పోటీ పడలేక పోతున్నాయనీ అందుకని మౌలిక సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యం ఇవ్వాలని విశ్లేషకులు చెబుతున్నదానిలో వాస్తవాలు లేక పోలేదు. మౌలిక సౌకర్యాల మెరుగుదల ఏ వ్యవస్ధకైనా అవసరమే.
వీటితో పాటు కార్పొరేటు ఎనలిస్టులు ఎత్తి చూపుతున్న ఆటంకాలు ఇంకా ఉన్నాయి. వాటిలో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ అధికార వ్యవస్ధలో పేరుకు పోయిన రెడ్ టేపిజం, వివిధ అనుమతులు పొందటానికి సుదీర్ఘకాలం పట్టడం, పర్యావరణ చట్టాలు అనుమతులను నిరాకరించడం, కార్మిక చట్టాలు ఇంకా బలంగా ఉండడం (ఉదాహరణకి వందకి పైగా ఉద్యోగులున్న కంపెనీ ఉద్యోగుల్ని తొలగించాలంటె ప్రభుత్వానికి చెప్పి తొలగించాలి), భూసేకరణ మందకొడిగా జరగడం (భూసేకరణకి అడ్డం వస్తున్న జనాల్ని అడ్దు తోలగించుకోడానికి సమర్ధవంతంగా ప్రభుత్వాలు వ్యవరించడం లేదని ఫిర్యాదు)… ఇవన్ని మెరుగుపడినట్లయితే విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తి ఇండియా మాన్యుఫాక్చరింగ్ రంగం అధ్భుత ప్రగతి సాధించి ఉపాది కూడా పెరుగుతుందని విదేశీ సలహా సంస్ధలు చెబుతున్నాయి. రానున్న పదేళ్ళలో సంవత్సరానికి 15 మిలియన్ల చొప్పున 150 మిలియన్ల మంది (15 కోట్ల మంది) భారత కార్మికులలొ వచ్చి చేరతారనీ వారికి ఉపాధి కల్పించగలిగేది ఒక్క మాన్యుఫాక్చరింగ్ రంగమేననీ రాయిటర్స్ సంస్ధ తన విశ్లేషణలో తెలిపింది.
కానికి వాస్తవంలో విదేశీ కంపెనీలు కల్పించిన ఉపాధి అత్యంత స్వల్పం. మార్కెట్ ఎకానమీ ఉచ్ఛ స్ధాయిలో ఉన్న అమెరికాలోనే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తర్వాత ప్రవేటు బహుళజాతి సంస్ధలన్నీ ప్రభుత్వం నుండి బెయిలౌట్ లు పొంది సంక్షోభం నుండి బైటపడ్డాయి గానీ అవి ఉద్యోగాలు ఇంతవరకూ కల్పించడం లేదు. అమెరికాని పట్టి పీడిస్తున్న సమస్య ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగమే. నిరుద్యోగం వలన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వినియోగ సరుకులు అమ్ముడు పోవడం లేదు. దానితో ఉత్పత్తి తగ్గిపోయి ఆర్ధిక వృద్ధి సైతం పడిపోతున్నదే తప్ప పెరగడం లెదు. యూరప్ లోనూ అదే పరిస్ధితి. అక్కడ సావరిన్ అప్పు సంక్షోభం వలన ప్రవేటు బహుళజాతి గుత్త కంపెనీలు ఆదేశాల అప్పు బాండ్లను కొనడం లేదు. కొన్నా అధిక వడ్డీని డిమాండ్ చేస్తున్నాయి. అనుత్పాదక రంగాలయిన షేర్ మార్కెట్లు, ఫైనాన్సు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి తప్ప ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించాలన్న ధ్యాసే వాటికి లేదు. పైగా అధిక లాభాల కోసం తమ పెట్టుబడుల్ని ఎమర్జింగ్ దేశాల్లో షేర్ మార్కెట్లలో పెట్టడానికే ఆసక్తి చూపుతున్నాయి. ఆ కంపెనీలు ఇండియా వచ్చి ఫ్యాక్టరీలు పెట్టి ఉపాధి కల్పిస్తాయని చెప్పడం పచ్చి బూటకం తప్ప మరొకటి కాదు.
విదేశీ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు ఇండియా వచ్చేది ఇక్కడి సహజ వనరులను కొల్లగొట్టడానికే. రష్యాతో ఇండియాను పోలుస్తూ రష్యాలాగా ముడి సరుకుల ఎగుమతికి ఇండియా సిద్ధపడాలి అని రాయిటర్స్ సంస్ధ చెబుతున్నది. దానర్ధం ఇండియాలో ఖనిజ వనరుల్ని తొవ్వుకుని తరలించుకెళ్ళడానికి విదేశీ కంపెనీలకి ఇంకా ఎక్కువ అనుమతులను ఇవ్వాలని అది సూచిస్తోంది. తవ్వుకున్న ఖనిజాలను శుభ్రపరిచే (ప్రాసెసింగ్) ఫ్యాక్టరీలే ఇక్కడ పెడుతున్నారు తప్ప సరుకులను తయారు చేసే ఆధునిక టెక్నాలజీని ఇండియాకి దిగుమతి చేసి ఇక్కదే సరుకుల ఉత్పత్తిని చేపట్టే కార్యకలాపాలకు విదేశీ కంపెనీలు సిద్ధపడ్డం లేదు. ఉదాహరణకి వేదాంత కంపెనీ బాక్సైటు ఖనిజాన్ని తవ్వి బాక్సైటును శుభ్రపరిచి అల్యూమినియాన్ని తీసే రిఫైనరీ ఫ్యాక్టరీ పెట్టింది. ముందు ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తికి ఫ్యాక్టరీ పెట్టింది. దాన్ని ప్రభుత్వానికి చెప్పకుండా తగిన అనుమతిని తీసుకోకుండానే ఐదు మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి పెంచుకుంది. ఇలా చేయడం వలన వేదాంత ఉద్యోగాలను పెంచక పోగా అక్కడ పర్యావరణాన్ని తీవ్రంగా నష్టం చేసింది. చుట్టుపక్కల ప్రజలు అక్కడ నివసించ లేని పరిస్ధితి నెలకొంది.
తాజాగా పోస్కో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలంటున్నారు. అది కూడా ముడి ఖనిజాన్ని తవ్వుకుని దాన్ని శుభ్రపరిచి ఉక్కు తీసి బైటికి ఎగుమతులు చేస్తుంది. ఉక్కుతో సరుకులు తయారు చేసే పరిశ్రమలు పెట్టడానికి పధకాలేవీ దానికి లేవు. కాని అది కలుగ జేసే పర్యావరణ నష్టం మాత్రం అపారం. ఈ కంపెనీలు ప్రభుత్వాలకు ఇచ్చిన హమీలకు వేటికీ కట్టుబడి ఉండవు. కట్టుబడి ఉండాలని ప్రభుత్వాలు కూడా అడగవు. అంతిమ ఫలితాన్ని అనుభవించేది మాత్రం ప్రజలే. మొదట కొంతమంది ప్రజలు తమ తమ ఇళ్ళు, పొలాలు వదులుకోవాల్సి వస్తుంది. దాంతో జీవనోపాధి కోసం వెతుక్కోవాలి. నష్టపరిహారం ఏ మూలకూ రాదు. కొత్తగా ఉద్యోగాలు తామే ఇస్తామంటారు గాని అలా ఇళ్ళు భూములు కోల్పోయిన ప్రజలు అక్కడే ఉద్యోగాలు పొందిన ఉదాహరణ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇక ఫ్యాక్టరీ పెట్టాక అది వెలువరించే కాలుష్యానికి చుట్టుపక్కల జనాలు కూడా ఖాళీ చేయాల్సిందే. ఖాళీ చేయకపోతే రోగాలతో చావాలి. ఖాళీ చేస్తే ఉపాధి దొరక్క ఆకలితో చావాలి. ధనిక రైతుల నుండి పేద రైతుల దాకా అంతా కూలీలుగానో పట్నాల్లో కార్మికులు గానో బతుకులు వెళ్ళదీయాల్సిందే తప్ప ఫ్యాక్టరీల వలన ఊళ్ళు వదిలి పోయి బాగుపడ్డవారిని ఈ దేశంలో ఫ్లడ్ లైట్లలో వెతికినా దొరకరు.
అత్యంత మోసం, వంచన ఏమిటంటే ఈ ఫ్యాక్టరీల వలన అభివృద్ధి జరుగుతుందని. అభివృద్ధి అంటే వారి దృష్టిలో జిడిపి వృద్ధి రేటు అది పెరిగే మాట వాస్తవమే. కాని ఆ ఉత్పత్తి ఎవరికి? ఉపాధి ఎవరికి? సంపదలు ఎవరికి? భారత ప్రజలకు మాత్రం కాదని స్పష్టంగా చెప్పవచ్చు. ఇండియా ఇప్పుడు 8 నుండి 9 శాతం వరకు వృద్ధి రేటు సాధిస్తున్నదని టీవిల్లో, వేదికలపైనా, ప్రపంచ స్ధాయి కాన్ఫరెన్సుల్లో అదే పనిగా జబ్బలు చరుచుకుంటున్న దృశ్యాల్ని మనం చూస్తూనే ఉన్నాం. దానితో పాటు పేదరికం పెరగడాన్ని చూస్తున్నాం. దరిద్రుల సంఖ్య మరింత పెరిగి దారిద్ర రేఖకి దిగువన ఉన్నవారి సంఖ్య పెరగడాన్ని చూస్తున్నాం కాలేజి నుండి బైటికి వచ్చినవారు నిరుద్యోగులుగానో లేదా టెంపరరీ ప్రవేటు ఉద్యోగులుగా వెట్టిచాకిరీ చేస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం. అదే సమయంలో నల్ల ధనం ఎన్నడూ లేనంత మొత్తాలకి చేరుకోవడం చూస్తున్నాం. భారత దేశంనుండి 1990 లవరకూ వచ్చి చేరిన డబ్బు కంటే ఆ తర్వాత నూతన ఆర్ధిక విధానాల అమలు ఫలితంగా వచ్చి చేరిన డబ్బు అనేక రెట్లు అధికమని స్విస్ బ్యాంకులు స్వయంగా చెబుతున్నాయి. అంటే ప్రవేటీకరణ, ప్రపంచీకరణ వలన లాభపడింది సూపర్ ధనికులు తప్ప ప్రజలు కాదని తెలుస్తూనే ఉంది.
కనుక భారత దేశం నిజమైన అభివృద్ధి సాధించింది అని చెప్పుకోవాలంటే మొదట వ్యవసాయ రంగాన్ని భారత ప్రభుత్వం మెరుగుపరచాలి. కనీసం నూటికి అరవై మంది ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే ప్రజల కొనుగోలు శక్తి అమాంతం పెరుగుతుంది. దేశంలో ఖాళీగా ఉన్న భూములు కుప్పలు తెప్పలని భారత ప్రభుత్వం తో పాటు విదేశీ సర్వేలు కూడా చెబుతున్నాయి. ఈ భూముల్ని భారత పేద ప్రజానీకానికి పంచాలి. తద్వారా ఖాళీగా ఉన్న భూముల్ని వినియోగంలోకి తెస్తే ప్రజల ఆకలి బాధలు తీరుతాయి. ఆదాయం పెరుగుతుంది. భారత దేశంలో చిన్న కమతాల వలన వ్యవసాయ అభివృద్ధి జరగడం కష్టం అని చాలా మంది చెబుతూ వచ్చారు. కానీ ఆక్స్ ఫాం సంస్ధ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఆ అభిప్రాయం శుద్ధ తప్పు అని తేల్చి చెప్పింది. చిన్న కమతాల రైతులకు ప్రభుత్వం నుండి మద్దతు లభిస్తే అద్భుతాలు చేసి చూపుతారని ఆ సంస్ధ సవివరంగా నివేదిక ఇచ్చింది. చిన్న కమతాలను ప్రోత్సహించడం ద్వారా ఆకలిని, దరిద్రాన్ని రూపుమాపడం తో పాటు అధిక ఉత్పత్తిని కూడా తీయవచ్చని ఆక్స్ ఫాం సంస్ధ పేర్కొన్నది. కనుక తక్షణం ఖాళీ భూములన్నింటినీ ప్రజలకు పంచేందుకు భూసంస్కరణలు చేపడితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉపాధి సమస్య తీరుతుంది. జిడిపి పెరుగుతుంది. విదేశీ పెట్టుబడుల అవసరమే రాదు. శుభ్రంగా దేశ ప్రజలంతా కడుపునిండా తిని కంటినిండా నిద్ర పోగలుగుతారు. అందుకు తక్షణ చర్య భూసంస్కరణలే.
మహాత్మాగాంధీ, పండిట్ జవహర్లాల్, నుండి నేటి ప్రధాని సింగువరకూ పైవిషయాలు ఎరుగనివారా. ఇలా ఎందుకు జరుగుతుందో అని కూడా ఆలోచించి చూడండి.
మీరు ఇంకొంచెం వివరంగా మీ కామెంట్ రాసి ఉంటే బాగుండేది. ఎరగడం, ఎరక్కపోవడం సమస్య కాదిక్కడ. వారు ఎవరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారన్నదే వారి ఆర్ధిక విధానాలను నిర్ణయిస్తాయి.
ఇండియాలో పారిశ్రామీకరణ పాలకులు చెపుతున్నంత జరగడం లేదు. 1991 తరువాత మన రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో మాత్రమే పట్టణీకరణ పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో అంతకు ముందు 12% ఉన్న పట్టణీకరణ 11%కి తగ్గింది. ఈ జిల్లాలోని ఆముదాలవలస, పలాస, రాజాం పట్టణాలలో ఉన్న కొన్ని ఫాక్టరీలు మూతపడడం అందుకు కారణం కావచ్చు. రాజాం పట్టణంలో జనుప మిల్లులు ఉన్నాయి. అవి విద్యుత్ ఆధారంగా పని చేస్తాయి కాబట్టి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జిలకి అవి నష్టపోయాయి. ప్రభుత్వం పెంచిన టాక్సులకి పలాస పట్టణంలో ఉన్న జీడి ఫాక్టరీలు ఒరిస్సాలోని గజపతి జిల్లాకి తరలించబడ్డాయి. మన పాలకుల దృష్టిలో పారిశ్రామీకరణ అంటే దేశీయ ఫాక్టరీలు మూసేసి బహుళజాతి కంపెనీలకి ద్వారాలు తెరవడం.