షేర్ మార్కెట్లకు ఈ వారం కూడా నష్టాలే!


ఈ వారం షేర్ మార్కెట్లూ నష్టాల్లోనే…

భారత పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 6.3 మాత్రమే (ఏప్రిల్ 2010 లో ఇది 13.1 శాతం) పెరుగుదలను నమోదు చేయడంతో శుక్రవారం షేర్ మార్కెట్లు నష్టాల్ని చవి చూశాయి. వారం మొత్తం చూసినా షేర్లు నస్టాల్లోనే ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 116.36 పాయింట్లు (0.63 శాతం) 18,268.54 వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 35.25 పాయింట్లు (0.64 శాతం) 5,485.8 వద్ద క్లోజ్ అయ్యింది. ఈ వారంలో సెన్సెక్స్ 0.59 శాతం లేదా 107.94 పాయింట్లు నికరంగా నష్టపోయింది.

ద్రవ్యోల్బణం ఇండియాని పీడిస్తూనే ఉంది. దీనివలన ప్రధానంగా నష్టపోతున్నది మధ్య తరగతి, పేదలు, గ్రామాల్లోని కూలీలు మాత్రమే. ఆహార ద్రవ్యోల్బణం మే 28 తో ముగిసిన వారానికి 9.01 శాతానికి చేరుకుంది. గత రెండు నెలల్లో ఇదే ఎక్కువ. రిజర్వు బ్యాంకు ఇప్పటికి 9 సార్లు బ్యాంకు రేట్లను పెంచినా ద్రవ్యోల్బణం అరికట్టడంలో విఫలమైంది.

సెబి వెల్లడించిన డేటా ప్రకారం విదేశీ సంస్ధాగత పెట్టుబడులు (ఎఫ్.ఐ.ఐలు) శుక్రవారం భారత షేర్ మార్కెట్లో 32.66 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి.

ఈవారం జపాన్ షేర్ మార్కెట్ లాభాల్లో ముగియగా, హాంగ్ కాంగ్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనాకి చెందిన షాంఘై సూచి పెద్దగా కదల్లేదు. అమెరికా ఆర్ధిక వ్యవస్ధ నెమ్మదిస్తుండడంతో యూరోపియన్ మార్కెట్లు డబుల్ డిప్ భయాల్తో నష్టాలు ఎదుర్కుంటున్నాయి.

వ్యాఖ్యానించండి