సి.ఐ.ఏ గూఢచారులను 2/3 వంతు మందిని పాకిస్ధాన్ నుండి పంపించడంతో, ఆ విషయం చర్చించడానికి సి.ఐ.ఏ అధిపతి లియోన్ పెనెట్టా చెప్పా పెట్టకుండా పాకిస్ధాన్‌కి విచ్చేశాడు. పాక్ మిలట్రీ అధికారులు అందించిన సమాచారం ప్రకారం పాకిస్ధాన్ లో మొత్తం 135 మంది సి.ఐ.ఏ గూఢచారులు ఉండగా వారిలో 90 మందిని అమెరికాకు తిప్పి పంపారు. పాకిస్ధాన్ భూభాగంలో రక్షణ పొందుతున్న ఆల్-ఖైదా, తాలిబాన్ స్ధావరాలపై డ్రోన్ దాడులు జరపడానికి పాకిస్ధాన్ లో నియమించబడిన సి.ఐ.ఏ గూఢచారులు అందించే సమాచారమే కీలకంగా ఉపయోగపడుతూ వచ్చింది. పైగా ఆఫ్ఘనిస్ధాన్ లో ప్రత్యక్షయుద్ధం చేయడం కంటే డ్రోన్ దాడులపైనే అమెరికా గత రెండు సంవత్సరాలుగా అధికంగా ఆధారపడుతోంది. ఈ నేపధ్యంలో సి.ఐ.ఏ గూఢచారుల సంఖ్య గణనీయంగా తగ్గించివేయడం అమెరికా యుద్ద వ్యూహంలో తీవ్ర మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది.
సి.ఐ.ఏ మనుషుల సంఖ్యను తగ్గించడం పట్ల లియోన్ పెనెట్టా పాకిస్ధాన్ మిలట్రీతో ఆందోళన వ్యక్తం చేసినట్లుగా పాక్ మిలట్రీ అధికారులు తెలిపారని రాయిటర్స్ చెబుతోంది. లాడెన్ హత్య తర్వాత మొదటిసారి పాక్ వచ్చిన సి.ఐ.ఏ డైరెక్టర్ లియోన్ పెనెట్టా, త్వరలో పదవీ విరమణ చేయనున్న అమెరికా డిఫెన్సు సెక్రటరీ రాబర్ట్ గేట్స్ స్ధానంలో నియమితుడు కానున్నాడు. శుక్రవారం ఆయన పాకిస్ధాన్ కి వచ్చి పాక్ మిలట్రీ అధికారులతో చర్చలు జరిపాడు. “సి.ఐ.ఏ ట్రైనర్లను, గూఢచారులను గణనీయంగా తగ్గించడం పట్ల ఆయన (లియోన్) ఆందోళన వ్యక్తం చేశాడు. మా నేలపైన అమెరికన్ల బూట్లు అడుగుపెట్టడానికి వీల్లేదని మేము స్పష్టంగా ఆయనకు చెప్పాము” అని పాక్ మిలట్రీ అధికారిని ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది.
పాక్ ఆర్మీ అధిపతి జనరల్ అష్‌ఫక్ కయాని, ఐ.ఎస్.ఐ ఛీఫ్ జనరల్ అహ్మద్ సుజా పాషా లతో లియోన్ చర్చలు జరిపాడు. “భవిష్యత్తులో గూఢచర్య సమాచార మార్పిడికి అవసరమైన నమూనా రూపకల్పనపై ఇరుపక్షాలు చర్చలు జరిపాయి” అని పాక్ మిలట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే పాక్ లోని అమెరికా రాయబార కార్యాలయం చర్చలగురించి తమకేమీ సమాచారం లేదని తెలిపింది. “మా వైఖరిలో స్పష్టంగా ఉన్నామని ఆయనకు చెప్పాము. వారి మనుషులు ఇక్కడ ఉండాలని మేము కోరుకోవడం లేదు. ఇక గూఢచార సమాచారాన్ని పరస్పరం తెలుపుకోవడం అంటారా, మేం దానికి సిద్ధంగా ఉన్నాం” అని మరో మిలట్రీ అధికారి చెప్పారని రాయిటర్స్ తెలిపింది. గూఢచర్య సమాచార మార్పిడిలో కూడా పాక్ మిలట్రీ కొన్ని పరిమితులు విధించుకున్నట్లుగా తెలుస్తోంది.
లాడెన్ హత్య అనంతరం పాక్ ప్రభుత్వం అన్ని వైపులనుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా పాక్ ప్రజల్లో పాక్ ఆర్మీ, ప్రభుత్వాలు చేతగానివిగా ముద్రను సంపాదించుకున్నాయి. పాక్ అనుమతి లేకుండా అమెరికా కమెండోలు చొరబడి లాడెన్ ను హత్య చేయడం, సి.ఐ.ఏ గూఢచారి రేమండ్ డేవిస్ ఇద్దరు పాక్ పౌరలను చంపినా శిక్ష లేకుండా వెళ్ళిపోవడానికి అనుమతి ఇవ్వడం, డ్రోన్ దాడులను ఖండిస్తున్నట్లు ప్రకటించిన పాక్ మిలట్రీ అధిపతి రహస్యంగా మరిన్ని డ్రోన్ దాడులను జరపని అమెరికాను కోరినట్లుగా వికీలీక్స్ విడుదల చేసిన డాక్యుమెంట్ల ద్వారా వెల్లడి కావడం ఇవన్నీ పాక్ మిలట్రీకి ప్రజల్లొ ఉన్న పలుకుబడిని పలుచన చేసాయి. పాక్ మిలట్రీ రెండువారాల క్రితం ఒక విలేఖరిని కిడ్నాప్ చేసి చంపడం శుక్రవారం ఒక టీనేజి కుర్రాడిని దొంగతనం అనుమానంతో కాల్చి చంపడం ప్రజల్లో ఆగ్రహాన్ని మరింతగా పెంచాయి. దీనితో పాక్ ప్రభుత్వం, మిలట్రీలో పాక్ ప్రజల్లో పోయిన పరువును తిరిగి నిలబెట్టుకోవలసిన అగత్యం ముందుకు వచ్చింది. ఫలితంగా సి.ఐ.ఏ గూఢచారులను రెండొంతులమందిని పంపేశామని గత గురువారం ప్రభుత్వం ప్రకటించింది.
తాజాగా నేరుగా సి.ఐ.ఏ అధిపతికే అమెరికన్ ప్రత్యేకదళాల బూట్లు పాక్ నేలను తాకడానికి వీల్లేదని చెప్పినట్లుగా ఆర్మీ చెబుతోంది. అయితే పాక్ ఆర్మీ ప్రకటనను ఎంతవరకూ నమ్మవచ్చన్నదీ అనుమానమే. పాకిస్ధాన్ ఆర్ధిక వ్యవస్ధ తీవ్ర సంక్షోభంలో కూరుకు పోయి ఉంది. అమెరికా రుద్ధిన యుద్ధం, మిలిటెన్సీ ల వలన ఆర్ధిక కార్యకలాపాలు బాగా మందగించాయి. దానితో అది అనివార్యంగా అమెరికా అందించే సాయం పైన ఆధారపడక తప్పని పరిస్ధితిలో ఉంది. యుద్ధపరిస్ధితులు లేనప్పుడు కూడా అమెరికా సాయంపై ఆధారపడే పరిస్ధితి పాకిస్ధాన్ ది. ఆరు దశాబ్దాల స్నేహంలో అమెరికా, పాకిస్ధాన్ ను తనపైనే ఆధారపడే విధంగా దిగజార్చింది. మిలట్రీ, పౌర ప్రభుత్వాల మధ్య నిరంతరం కొనసాగిన ఘర్షణలు ప్రజాస్వామిక ప్రభుత్వాలు నిలకడగా కొనసాగకుండా చేశాయి. పాక్ మిలట్రీకి అమెరికా నేరుగా సాయం చేస్తుండడంతో మిలట్రీ ప్రధానమైన అధికార కేంద్రంగా తయారైంది. ఈ పరిస్ధితులన్నీ పాక్ ప్రజలకు ప్రతికూలంగానూ, అమెరికాకి అనుకూలంగానూ తయారయ్యాయి.
పాక్ మిలట్రీపై అమెరికాకు ఆధిపత్యం ఉన్న నేపధ్యంలో పాక్ ఆర్మీ చేస్తున్న ప్రకటనలు ప్రగల్భాలుగానే రాజకీయ విశ్లేషకులు పరిగణిస్తున్నారు. పాక్ మిలట్రీలో పాక్ అమెరికాల స్నేహంపై వ్యతిరేకత ఉన్న సెక్షన్లు మిలిటెంట్లకు సహాయంగా ఉంటూ రెండు దేశాల స్నేహాన్ని నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నాయి.
