భూములు దక్కించుకోడానికి పోలీసులతో అమీ తుమీకి సిద్ధమైన పోస్కో బాధితులు


దక్షిణ కొరియాకి చెందిన పోస్కో కంపెనీకి ఒడిషాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి పర్యావరణ సమస్యలన్నింటినీ పక్కకు నెట్టి కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం అనుమతి మంజూరు చేసింది. వాస్తవానికి పోస్కో ప్రాజెక్టు వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందని స్వయంగా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మంత్రిత్వ శాఖే గతంలో అనుమతిని నిరాకరించింది. ఐదు సంవత్సరాలనుండి ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతిని సంపాదించింది. పర్యావరణ మంత్రి జైరాం రమేష్, ప్రధాని మన్మోహన్ ఒత్తిడి చేయడంతో తలవంచక తప్పలేదని ప్రకటించాడు. భారత దేశ ప్రజల ప్రయోజనాలను బలిచేసయినా తన అంతర్జాతీయ ప్రతిష్టను నిలుపుకోవడానికే ప్రధాని మన్మోహన్ నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఒడిషాలో ధింకా, గోబింద్ పూర్ గ్రామాల ప్రజలు తమ గ్రామాలకూ, పొలాలకూ రాత్రింబవళ్ళూ కాపలా కాస్తూ కంటికి నిద్ర లేకుండా కాలం గడుపుతున్నారు.

రు.52,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పెట్టుబడి భారత పాలకులను ఊరిస్తోంది. పదులవేల సంఖ్యలో గ్రామస్ధులు తాము పుట్టిపెరిగిన తమ ఇళ్ళనూ, పొలాలనూ ప్రాజెక్టు కోసం వదిలి వెళ్ళిపోవాలని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ప్రజల పీకలమీద కూర్చున్నాయి. వెళ్ళకపోతే వెళ్ళగొట్టడానికి వేలమంది పోలీసులను రెండు గ్రామాల పొలిమేరల్లో దించి మారణకాండకు సిద్ధమైంది ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచ పర్యావరణ దినం ఐన జూన్ 3 కి రెండు రోజుల ముందు కుజంగా గ్రామంలో 17 మందిని పోలీసులు అరెస్టు చెసి తీవ్రంగా కొట్టారు. భూమి స్వాధినానికి అడ్డు వచ్చినందుకు వారిని శిక్షించామని పోలీసులు ప్రకటించారు. నిజానికి కుజంగా గ్రామంలో భూముల స్వాధీనానికి గట్టిగా వ్యతిరేకత రాలేదు. ధింకియా, గోబింద్‌పూర్ గ్రామాల్లో 60 శాతం ప్రజలు గ్రామాలు వదిలి వెళ్ళవలసి ఉంది. కాని వారు తమ భూములు, ఇళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఫలితంగా విదేశీ కంపెనీలకోసం మరో మారణ కాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలిపీఠాన్ని సిద్ధం చేశాయి.

అటవి భూమిని అక్కడ నివసిస్తున్న గిరిజనుల ఇస్టానికి వ్యతిరేకంగా స్వాధీనం చేసుకోవడం కేంద్ర ప్రభుత్వం చేసిన అటవీ హక్కుల చట్టానికి పూర్తిగా వ్యతిరేకం. తాను చేసిన చట్టాని తానే ఉల్లంఘిస్తూ కేంద్ర ప్రభుత్వం పోస్కో ఉక్కు వ్యాక్టరీకి అనుమతినిచ్చింది. దింకియా, గోబింద్ పూర్ గ్రామాలకు చెందిన 3400 హెక్టార్ల భూమిని (దాదాపు 8500 ఎకరాలు) ఆ కంపెనీకి ఇవ్వడానికి ఒడిషా ప్రభుత్వం నిశ్చయించింది.

బలవంతంగా భూమిని లాక్కోవడానికి పోలీసులను దించడంతో ధింకియా, గోబింద్ పూర్ గ్రామాల ప్రజలు పోలీసులతో ఘర్షణకే సిద్ధమయ్యారు. ఏ అర్ధ రాత్రో అపరాత్రో గ్రామాల్లోకి పోలీసులు జొరబడతారని గ్రామంలోకి ప్రవేశించే దారుల వద్ద ఆ గ్రామాల ప్రజలు రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. 20 ప్లాటూన్ల పోలీసులు గ్రామాల బయట క్యాంపు వేసి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విదేశీ కంపెనీల భక్తి చివరకు పెద్ద ఎత్తున మారణకాండకు దారి తీస్తుందని ప్రజలు భయపడుతున్నారు. పోస్కో ప్రతిరోధ్ సంఘర్ష్ సమితి (పి.పి.ఎస్.ఎస్) ఆధ్వర్యంలో గ్రామస్ధులు తమ భూముల్ని కాపాడుకోవడానికి సిద్ధపడ్డారు. మానవ గోడ ఏర్పడి పోలీసుల రాకను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. స్త్రీలు, పిల్లలతో సహా ఈ మానవ గోడలో భాగస్వాములై ఉన్నారు. పోలిమేరల్లో సైతం గుంపులుగా కాపలా కాస్తున్నారు.

జూన్ 8 న గ్రామంలోకి ప్రవేశించడానికి పోలీసులు ప్రయత్నించి గ్రామస్ధులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. కాని తమ క్యాంపులను విడిచిమాత్రం వెళ్ళలేదు. గ్రామంలోకి ప్రవేశించే నిర్ణయాన్ని పోలీసులు వాయిదావేసుకున్నారని గ్రామస్ధులు చెబుతున్నారు. “పోలీసుల వ్యూహం ఏమిటో మాకు తెలియదు. మా అందోళనను ఆటంక పరిచి నాయకులను తీసుకెళ్ళాలని వారు భావిస్తూ ఉండవచ్చు. కానీ పోలీసులు ఎట్టి ప్రయత్నం చేసినా శక్తికొద్దీ ఎదుర్కోవడానికి గ్రామస్ధులు నిర్ణయించుకున్నారు. కనుక రక్తపాతం అనివార్యంలా కనపడుతోంది” అని సంఘ ప్రతినిధి ప్రకాష్ పైకారే చెప్పాడు. ధింకియా, గోబింద్ పూర్ గ్రామాల ప్రజలు భారత దేశ అశేష ప్రజానీకానికి ప్రతినిధులు కాగా పోస్కో కంపెనీ విదేశాలనుండి దిగబడి భారత ప్రజల సంపదలను వనరులను కొల్లగొట్టడానికి వచ్చిన, వస్తున్న బహుళజాతి కంపెనీలకు ప్రతినిధి. పోస్కో బాధితుల మాటల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కంపెనీలు విదిలించిన కమీషన్లు మెక్కిన బ్రోకర్లు అని గ్రామస్ధులు తిట్టిపోస్తున్నారు.

వ్యాఖ్యానించండి