ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి బాగా తగ్గిపోయింది. దానితో భారత దేశ ఆర్ధిక వృద్ధిపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ద్రవ్యోల్బణం ఎంతకీ తగ్గక పోవడం, ద్రవ్యోల్బణం కట్టడికోసం బ్యాంకు వడ్డీరేట్లు పెంచడంతో వాణిజ్య బ్యాంకుల నుండి అప్పు ఖరీదు పెరగడం వల్లనే పారిశ్రామిక వృద్ధి తగ్గిపోయిందని భావిస్తున్నారు. పారిశ్రామిక వృద్ధిలో తగ్గుదలవలన రిజర్వు బ్యాంకు ఇక ముందు వడ్డీ రేట్లను పెంచడానికి అంతగా సుముఖంగా ఉండక పోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్యాక్టరీలు, గనులు, ఇతర పారిశ్రామిక పారిశ్రామిక పరికరాలు మొదలైన వాటి ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 6.3 శాతం పెరిగినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. మార్చిలో ఇది 8.83 శాతంగా ఉంది. అదీ కాక ఏప్రిల్ నెల ఉత్పత్తి పెరుగుదల 2004-05 ను బేస్ సంవత్సరంగా లెక్కించినది. పాత బెస్ సంవత్సరం ప్రకారం ఏప్రిల్ లోని పారిశ్రామిక వృద్ధి 4.4 శాతం మాత్రమే. పాత బేస్ సంవత్సరం ప్రకారం మార్చిలో 8.83 శాతం పారిశ్రామిక వృద్ధి రేటు నమోదుకాగా, ఏప్రిల్ లో అది 4.4 శాతానికి తగ్గిపోయింది. పాత బేస్ సంవత్సరం ప్రకారం ఏప్రిల్ లో పారిశ్రామిక వృద్ధి 5.5 శాతం ఉండొచ్చని రాయిటర్స్ సంస్ధ నిర్వహించిన సర్వేలో మార్కెట్ విశ్లేషకులు అంచనా వేయగా వాస్తవ సంఖ్య అంతకంటే తక్కువగా నమోదయ్యింది.
జూన్ నెలలో రిజర్వు బ్యాంకు తన ద్రవ్య విధానాన్ని సమీక్షించ నుంది. ఆ సమీక్షలో మరొకసారి బ్యాంకు వడ్డీ రేటును (వాణిజ్య బ్యాంకుల వద్దనుండి రిజర్వు బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు) 25 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని ఇప్పటివరకూ మార్కెట్ విశ్లేషణలు అంచనా వేస్తూ వచ్చారు. పారిశ్రామిక వృద్ధి గణాంకాలు వెలువడిన నేపధ్యంలో వడ్డీ రేటు పెంచడానికి రిజర్వు బ్యాంకు వెనకడుగు వేయవచ్చని కొద్ది మంది భావిస్తున్నారు. అయితే పారిశ్రామిక వృద్ధి ఎలా ఉన్నప్పటికీ రిజర్వు బ్యాంకు వడ్డీ రెట్లు పెంచడం మాత్రం ఖాయం అని నమ్ముతున్నవారూ లేక పోలేదు.
గత సంవత్సరం చివరి క్వార్టర్ లోనే (జనవరి నుండి మార్చి వరకు) ఆర్ధిక వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది. కొత్త బడ్జెట్ లేదా కోశాగార సంవత్సరంలో ప్రారంభంలోనే పారిశ్రామిక వృద్ధి తక్కువగా నమోదు కావడం మార్కెట్‌లో మదుపుదారులకు ఒకింత నిరాశ కలిగించే వార్తే. తాజా వార్తతో ఇండియా సావరిన్ అప్పు బాండ్లపై వడ్డీ రేటు స్వల్పంగా పడిపోయింది.
పారిశ్రామిక రంగంలో 80 శాతం వాటా ఉన్న మాన్యుఫాక్చరింగ్ రంగంలో ఉత్పత్తి ఏప్రిల్‌లో 6.9 శాతం (కొత్త బేస్ సంవత్సరం) మాత్రమే నమోదైంది. ఇది మార్చి నెలలో 10.4 శాతంగా (పాత బేస్ సంవత్సరం) ఉంది. మైనింగ్ ఉత్పత్తి 2.2 శాతం నమోదు కాగా ఇతర ఉత్పత్తులు 6.4 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పారిశ్రామిక ఉత్పత్తులను పెట్టుబడి సరుకులు, వినియోగ సరుకులుగా చూస్తే పెట్టుబడు సరుకుల ఉత్పత్తి 14.5 శాతం, వినియోగ సరుకుల ఉత్పత్తి 2.9 శాతం పెరుగుదల నమోదు చేశాయి. కార్లు లాంటి సరుకుల ఉత్పత్తి కేవలం 3.8 శాతం మాత్రమే పెరిగింది. ఆర్.బి.ఐ వడ్డీ రేట్లను పెంచడం వలన బ్యాంకుల క్రెడిట్ వడ్డీ కూడా పెరగడం దీనికి కారణం.
ఆర్ధిక వ్యవస్ధలో పెరుగుదల ఇంతగా నెమ్మదించినప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుదల మాత్రం శాంతించడం లేదు. ఏప్రిల్ లో ద్రవ్యోల్బణం 8.66 శాతంగా నమోదైంది. ఇది 4 నుండి 5 శాతం వరకు ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. ఇప్పటికి దాదాపు తొమ్మిది సార్లు వడ్డీ రేట్లను ఆర్.బి.ఐ పెంచినప్పటికీ ద్రవ్యోల్బణం కట్టడి కాక పోవడాన్ని బట్టి దాని మూలాలు మరొకచోట ఉన్నాయని స్పష్టం అవుతోంది. నల్ల డబ్బు, అవినీతి, మాఫియా తదితర మార్గాల్లో విడుదలయ్యే డబ్బు పై నియంత్రణ లేక పోవడం, ద్రవ్యోల్బణం తగ్గించడానికి ప్రభుత్వాలు చిత్త శుద్ధితో ప్రయత్నించకపోవడం అందుకు కారణాలుగా కనిపిస్తూన్నాయి.