ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం -1


ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, యూరప్ దేశాలు దుష్ప్రచారం చేస్తూ ఆ దేశంపై నాలుగు దఫాలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియా అణు బాంబు నిర్మిస్తున్నదంటూ మరో అబద్ధపు ప్రచారం లంకించుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు అమెరికా, ఐరోపా దేశాల ప్రపంచ ఆధిపత్య రాజకీయాలో కోసమే అటువంటి అబద్ధపు ప్రచారానికి దిగుతాయన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ అణు ఇంధన సంస్ధ ఐన ఐ.ఎ.ఇ.ఏ, తాజాగా ఇరాన్ విషయంపై చర్చించడానికి సమావేశం కానున్న నేపద్యంలో అమెరికా పత్రికా సంస్ధలు మరోమారు తమ కలాలకు ఇరాన్ పై విషం చిమ్మే పనిని కల్పించాయి.

గత వారం రోజులుగా రాండ్ కార్పొరేషన్ పరిశోధించిందంటూ కొన్ని అమెరికా మీడియా సంస్ధలు ఇరాన్ అణు విధానంపై అబద్ధాలు రాస్తున్నాయి. ‘న్యూయార్క్ పోస్టు’ పత్రిక “అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాను చరిత్ర ఇరాన్‌ను అణు బాంబును తయారు చేయడానికి అనుమతించినవాడిగా గుర్తుంచుకుంటుంది. తద్వారా మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని చీకటి యుగం లోకి నెట్టుఇవేసినవాడిగా ఆయన నిలిచిపోతాడు” అని రాసింది. తన రాతలకు సాక్ష్యంగా ఆ పత్రిక రాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు గ్రెగరీ జోన్సు ను అది ఉటంకించింది.

“అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ తాజాగా వెలువరించిన తాజా డేటాను ఉపయోగించి గ్రెగరీ ఇటీవల ‘ఇప్పటి సామర్ధ్యం ప్రకారం ఇరాన్ సెంట్రిఫ్యూజ్ లు శుద్ధి చేసిన యురేనియంను ఉత్పత్తి చేసినట్లయితే అణు బాంబును తయారు చేయడానికి అవసరమైన 20 కి.గ్రా ల శుద్ధి చేయబడిన యురేనియంలో 90 శాతం భాగాన్ని  రెండు నెలల్లో సంపాదించగలుగుతుంది. ఈ వేసవి ముగిసేనాటికి ఖచ్చితంగా సంపాదించుకుంటుంది’ అని నిర్ధారించాడు”

అని న్యూయార్క్ పోస్టు పత్రిక రాసింది. జూన్ 2 రాసిన ఈ వార్తలో తెలిపిన విధంగా జోన్స్ ఈ విధంగా రాసిన మాట వాస్తవమే కావచ్చు గానీ ఆ నివేదికను ప్రచురించింది మాత్రం రాండ్ కార్పొరేషన్ కాదని తెలుస్తోంది. “నాన్-ప్రొలిఫరేషన్ పాలసీ ఎడ్యుకేషన్ సెంటర్” అనే సంస్ధ ఈ నివేదికను ప్రచురించింది. నిజానికి గ్రెగరీ రాండ్ సంస్ధ కోసం చివరిగా రాసింది 2009లో మాత్రమే. (రాండ్ కార్పొరేషన్ సంస్ధ పరిశోధనా సంస్ధగా పనిచేస్తోంది. లాభాల కోసం కాకుండా పరిశోధన నిమిత్తమే ఈ సంస్ధ పనిచేస్తుంది).

ఇటువంటి అబద్ధాలను రాసిన పత్రికా సంస్ధల్లో న్యూయార్క్ పోస్టు ఒంటరి కాదు. ఇజ్రాయెల్ కి చెందిన వైనెట్ న్యూస్, లండన్ కి చెందిన ది డెయిలీ మెయిల్, ది వీక్లీ స్టాండర్డు, అమెరికన్ ధింకర్ పత్రికలు కూడా ఇరాన్ రెండు నెలల్లో అణు బాంబు తయారు చేయబోతున్నదని రాండ్ కార్పొరేషన్ ఖచ్చితంగా నిర్ధారించిందంటూ రాశాయి. అమెరికన్ ధింకర్ పత్రిక “రాండ్ కార్ప్: బాంబు తయారీకి 8 వారాల దూరంలో ఇరాన్” అని హెడ్డింగ్ పెట్టి రాసింది.

అయితే ‘ది రాండ్ కార్పొరేషన్’ జూన్ 7 న ప్రచురించిన తన సొంత నివేదికలో అటువంటి కాల పరిమితిని నిర్ధారించిన దాఖలాలు లేవు ఆ సంస్ధ ప్రచురించిన నివేదిక పేరు “ఇరాన్ అణు భవిష్యత్తు: అమెరికాకి ఉన్న కీలక విధానపరమైన ప్రత్యామ్నాయాలు.” అమెరికా ఎయిర్ ఫోర్సు ఈ నివేదిక తయారీకి నిధులు సమకూర్చింది. ఇరాన్ అణు విధానానికి సంబంధించి అమెరికాకి అందుబాటులో ఉన్న వివిధ ప్రత్యామ్నాయాలను వివరించడమే ఈ నివేదిక లక్ష్యం. ఇరాన్‌తో ప్రధానంగా సాధ్యమైనంత ఎక్కువగా చర్చలు జరపాలని ఈ నివేదిక ప్రతిపాదించింది.

ఈ నివేదిక రచయిత గ్రెగరీ జోన్స్ మాత్రం కాదు. లిన్ ఇ. డేవిస్ దీని ప్రధాన రచయిత. రాండ్ కార్పొరేషన్ లో సీనియర్ రాజకీయ శాస్త్రవేత్త అయిన లిన్ నివేదిక సారాంశాన్ని ఇలా తెలిపారు “ఇరాన్ నాయకత్వం తన జాతీయ భద్రతకు అనుసరించే విధానాలను ఎలా ప్రభావితం చేయగలనన్నదీ అమెరికా ముందు ఉన్న సవాలు. ఎందుకంటే అణ్వాయుధాలు పొందడానికి ఇరాన్ తన జాతియ భద్రతనే కారణంగా చూపిస్తుంది.” ఇరాన్ జాతీయ భద్రతకు అణ్వాయుధాలు కాకుండా ఇతర ప్రత్యామ్నాయాలను అమెరికా చూపగలిగితే ఇరాన్ అణ్వాయుధాల తయారీ ప్రయత్నాలను నిలిపివేస్తుందని లిన్ తన నివేదికలో సూచించారు. వాస్తవం ఇది కాగా రాండ్ రెండు సంవత్సరాల క్రితం తయారు చేసిన రిపోర్టును తాజా నివేదికగా చెప్పడానికి లేదా వేరే సంస్ధ ప్రచురించిన నివేదికను రాండ్ కార్పొరేషన్ కు అపాదిస్తూ మీడియా సంస్ధలు విఫల ప్రయత్నం చేశాయి. అయితే రాండ్ కార్పొరేషన్ సైతం కొన్ని కీలక అంశాలను విస్మరించింది.

అమెరికా గూఢచార సంస్ధలు డిసెంబరు 2009 లో ఒక నివేదికను సమర్పించాయి. దాని ప్రకారం ఇరాన్ 2003 నుండీ అణు బాంబు కోసం చేస్తున్న ప్రయత్నాలను నిలిపివేసింది. ఆ నివేదికను ఇంతవరకూ గూఢచార సంస్ధలు మార్చలేదు లేదా తాజాకరించలేదు. అంటే అప్పటి నిర్ధారణలకే ఇంకా కట్టుబడి ఉన్నట్లుగా అర్ధం చేసుకోవాలి. ఈ అంశాలను రాండ్ కార్పొరేషన్ పూర్తిగా విస్మరించింది. ఇరాన్ అణు విధానంలో మిలట్రీ కోణం ఉండి ఉండవచ్చు అని ఐ.ఏ.ఇ.ఏ కొంత ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ అనేక విధాలుగా తివ్ర స్ధాయిలో పరిశోధన చేసిన తర్వాత “ప్రకటించిన అణు పదార్ధాన్ని ఇతర కార్యకలాపాల నిమిత్తం ఇరాన్ తరలించిందనడానికి ఎటువంటి సాక్ష్యమూ లేదు” అని పదే పదే తెలిపింది. ఈ అంశాన్ని కూడా రాండ్ కార్పొరేషన్ రచయిత లిన్ విస్మరించారు. ఐ.ఏ.ఇ.ఎ నివేదికలో “మిలట్రీ కోణం ఉండవచ్చు” అన్న నిర్ధారణకు సాక్ష్యాలేవీ ఐ.ఎ.ఇ.ఎ చూపలేదు. అయినా అలా నివేదికలొ రాయడానికి అమెరికా ఒత్తిడి పనిచేసిందని సులభంగానే అంచనా వేయవచ్చు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అబద్ధపు నిర్ధారణలు చేయగలిగినవాళ్ళకి అటువంటి అనుమానాలను చొప్పించడానికి ఏ మాత్రం వెనకాడరు.

ఐ.ఎ.ఇ.ఎ ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి అనేక పరిగణించదగిన అనిర్ధిష్టతలు ఉన్నాయని తన నివేదికలో చాలా చోట్ల పేర్కొంది. పేజి 14 లో స్పష్టంగా ఇలా పేర్కొంది. “సమీప కాలం నుండి మాధ్యమిక కాలం వరకూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నిర్దేశించిన అంతర్జాతీయ నియమ నిబంధనల పరిధికి కట్టుబడి ఉంటుందని చెప్పవచ్చు. అయితే యురేనియం శుద్ధి, ఆయుధాలపై తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఈ నిబంధనలకు ఇరాన్ కట్టుబడి ఉండగలదు.” ఈ నిర్ధారణకి ఇరాన్ మరో ఎనిమిది వారాల్లో అణ్వాయుధం తయారు చేయగలదని ఎలా అర్ధం వస్తుందో అమెరికన్ ధింకర్లు సెలవివ్వవలసిందే. ఐ.ఎ.ఇ.ఎ నిర్ధారణలు తప్పని నిర్ణయిస్తే తప్ప ఇరాన్ అణు విధానంపై అటువంటి అబద్ధాలు చెప్పడం కష్టం. ఇరాన్ లోని నటాంజ్ అణు ఫెసిలిటీలో ఐ.ఎ.ఇ.ఎ ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలు నిరంతరం కాపలా కాస్తుంటాయి. అణు ఇంధనం పక్కకు తప్పిస్తే ఆ కెమెరాలు సులభంగా పసికడతాయి.

ది న్యూయార్కర్ పత్రికలో జూన్ 6న పరిశోధనా జర్నలిస్టు సేమౌర్ హెర్ష్ “ఇరాన్ మరియు బాంబు: అణు భయం ఎంతవరకు నిజం” అని వ్యాసం ప్రచురించాడు. ఆయన ఐ.ఎ.ఇ.ఎ మాజీ అధిపతి మహమ్మద్ ఎల్ బరాదీని ఉటంకిస్తూ ఇలా రాశాడు. “మహమ్మద్ ఎల్ బరాదీ తన 12 సంవత్సరాల పదవీ కాలంలో ఇరాన్ అణు బాంబు తయారు చేయడానికి కర్మాగారం నిర్మిస్తున్నదనీ, బాంబు స్ధాయికి శుద్ధి చేసిన ఇంధనాన్ని వినియోగిస్తున్నదనీ చెప్పడానికి పిసరంత సాక్ష్యం (a shred of evidence) కూడా దొరకలేదని చెప్పాడు. ఇంకా రాస్తూ ఆయన, ఇరాన్ స్పష్టమైన, ఉనికిలో ఉన్న ప్రమాదకారి అని నేను నమ్మను. ఇరాన్ కలుగుజేసే ప్రమాదంపైన ఉన్మత్త ప్రచారం తప్ప నాకేమీ కనబడ్డం లేదు” అని బరాదీ తనకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడని హెర్స్ రాశాడు.

(ఇంకా ఉంది)

వ్యాఖ్యానించండి