మొత్తం మీద పాకిస్ధాన్ ప్రభుత్వం అనుకున్నది సాధించింది. పాక్ సైనికులకు శిక్షణ ఇచ్చే పేరుతో పాకిస్ధాన్ లో తిష్ట వేసిన అమెరికా ప్రత్యేక బలగాలను లేదా సి.ఐ.ఏ గూఢచారులను బాగా తగ్గించాలని పాక్ ప్రభుత్వం గత కొన్ని వారాలనుండి అమెరికాను కోరుతూ వచ్చింది. ఈ విషయమై ఇరు దేశాల మిలట్రీ ప్రతినిధుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు పాకిస్ధాన్ లో ఉన్న సి.ఐ.ఏ గూఢచారుల్లో 90 మందిని అమెరికాకి తిప్పి పంపినట్లుగా పాక్ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం సి.ఐ.ఏ బలగాలు పాక్ లో 135 మంది ఉన్నట్లుగా పాకిస్ధాన్ మిలట్రీ లోని వ్యక్తులద్వారా తెలిసినట్లు ఎ.పి వార్తా సంస్ధ తెలిపింది. అంటే 2/3 వంతు మందిని అమెరికాకి తిప్పి పంపడంలో పాకిస్ధాన్ సఫలమైంది. ఒక విధంగా పాక్ మిలట్రీకి విజయంగానే చెప్పుకోవాలి.
పాకిస్ధాన్ సైన్యంలోకి సి.ఐ.ఏ గూఢచారులు లోతుకు చొచ్చుకొని పోయినట్లుగా గత కొన్ని నెలలుగా వెలువడిన వార్తల ద్వారా స్పష్టమయింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న మిలట్రీ, నౌకా, వాయు బలగాల స్దావరాల్లో సి.ఐ.ఏ అధికారులు ఏదో ఒక పేరుతో స్ధానం సంపాదించారు. భద్రత రీత్యా అత్యంత ప్రాముఖ్యత ఉన్న కరాచీ నౌకా స్దావరంలో సైతం సి.ఐ.ఏ అధికారులు ప్రవేశం సంపాదించగలిగారు. వీరు మిలట్రీ ఉన్నతాధికారుల అనుమతితోనే నౌకా దళాల ప్రధాన కార్యాలయంలో తిష్టవేయ గలిగారు. పాకిస్ధాన్ మిలట్రీ నుండి, ఐ.ఎస్.ఐ నుండి ఆల్-ఖైదా, తాలిబాన్ మిలిటెంట్లకు సహాయం అందుతున్న వార్తల నేపధ్యంలో అటువంటి వారిపై నిఘా పెట్టేందుకు సి.ఐ.ఏ అధికారులకు ఈ చొరబాటు దారా వీలు కలిగిందని చెప్పవచ్చు.
సి.ఐ.ఏ గూఢచారులు పాకిస్ధాన్ లోని వివిధ కీలక ప్రాంతాల్లో పౌరులుగా స్ధిరపడినట్లుగా వాతావరణం కల్పించగలిగారు. కొంతమంది గూఢచారులు పాక్ పౌరులను నమ్మించడానికి పాక్ స్త్రీలను వివాహం కూడా చేసుకున్న పరిస్ధితి ఉంది. జనవరిలో రేమండ్ డేవిస్ అనే సి.ఐ.ఏ కాంట్రాక్టరు తనను దోపిడీ చేయబోతున్నారన్న ఆరోపణతో ఇద్దరు పాక్ పౌరులను కాల్చి చంపడంతో పాక్, అమెరికా మిలట్రీ వర్గాల మధ్య విభేధాలు బహిరంగం కావడం మొదలయ్యింది. అది కూడా పాక్ ప్రజల్లో అమెరికా దారుణాల పట్ల వ్యతిరేకత పెరగడం వల్లనే పాక్ పాలకులు అమెరికా పెత్తనాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా పైకి కనపడవలసిన పరిస్ధితి తలెత్తింది. ఆఫ్ఘనిస్ధాన్ నుండి అమెరికా డ్రోన్ విమానాలు వచ్చి పాక్ భూభాగం లొ ఉన్న మిలిటంట్లను చంపే పేరుతో చేస్తున్న బాంబు దాడుల్లో అనేక మంది పాక్ పౌరులు చనిపోవడంతో పాక్ ప్రజల్లో అమెరికా పట్ల ఆగ్రహావేశాలు రెట్టింపయ్యాయి.
పాకిస్ధాన్ ఆర్మీ అధిపతి జనరల్ కయాని పైకి డ్రోన్ దాడులు తమకు తెలియకుండా జరుగుతున్నాయని చెబుతూ, వాటిని వ్యతిరేకిస్తునట్లుగా ఖండనల ప్రకటనలు అప్పుడప్పుడూ జారీ చేశాడు. నిజానికి డ్రోన్ దాడులకు కయానీ పూర్తి మద్దతు ఉన్నదనీ, ఇంకా విస్త్రుతంగా డ్రోన్ దాడులు జరపాలని కూడా కయానీ అమెరికాని కోరినట్లు వికీలీక్స్ ద్వారా వెల్లడి కావడంతో పాక్ ప్రభుత్వమూ, మిలట్రీ నిర్ణయాత్మక చర్యలకు దిగక తప్పలేదు. ఫలితమే అమెరికా ప్రత్యేక బలగాలను చాలా మందిని వెనక్కి పిలవాలని అమెరికాని గట్టిగా కోరింది. ఈ కోరికని అమెరికా మొదట్లో పెడచెవిన పెట్టినా, నానాటికి ఒత్తిడి పెరగడంతో 90 మందిని వెనక్కి పంపామని పాక్ ప్రభుత్వం తెలిపింది. ఈ వార్తను అమెరికా ధృవీకరించినప్పటికీ ఎంతమంది అనేది చెప్పడానికి నిరాకరించింది.
అమెరికా ప్రత్యేక దళాలు పాక్ కి చెందిన ఫ్రాంటియర్ దళాలకు శిక్షణ ఇస్తున్నారని పాక్ తెలిపింది. వీరిలో అత్యధికులు పాక్, ఆఫ్ఘన్ సరిహద్దుల్లో నివసించే గిరిజన తెగలకు చెందినవారని తెలిపింది. సరిహద్దు రాష్ట్రాల్లొ తీవ్రవాదాన్ని మట్టుబెట్టడానికి వీరికి తగిన శిక్షణ ఇవ్వడంలోనే ఇప్పటివరకూ అమెరికా ప్రత్యేక బలగాలు నిమగ్నమై ఉన్నారని పాక్ ప్రభుత్వం చెబుతోంది. వీరి వద్ద శిక్షణ పొందినవారు మరింతమంది పాక్ బలగాలకు శిక్షణ ఇచ్చే విధంగా తర్ఫీదు పొందారని తెలిపింది. శిక్షకులు కాకుండా ఇతర భాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో కూడా కొంతమందిని పంపేసినట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.