ఆమరణ నిరాహార దీక్ష చేయబోయిన బాబా రాందేవ్ శిబిరంపై అర్ధరాత్రి అరెస్టు చేసి ఆయన మద్దతుదారులపై లాఠీ ఛార్జీ చేసినందుకు నిరసనగా బి.జె.పి సోమవారం మహాత్మా గాంధీ సమాధి “రాజ్ ఘాట్” వద్ద ఒక రోజు నిరసన తెలిపిన సంగతి విదితమే. తెల్లవారు ఝామున బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ తమ కార్యకర్తల ముందు నాట్యం చేసి పత్రికల పతాక శీర్షికలకెక్కారు. జాతిపిత మహాత్మగాంధి సమాధి వద్ద ప్రతిపక్షాల నాయకురాలు నాట్యం చేయడం కాంగ్రెస్ పార్టీవారికి కోపం తెప్పించింది. జాతిపిత సమాధివద్ద నాట్యం చేయడాన్నిబట్టి ఆమెకు గాంధిపై ఎటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయో వెల్లడవుతోందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారి ఆక్షేపించారు. “జాతిపిత సమాధి వద్ద మీరు నాట్యం చేయడానికి సిద్ధపడ్డారంటే రాజ్ ఘాట్ వద్ద ఎటువంటి పరిశుద్ధతను మీరు కాపాడదలిచారు?” అని ఆయన ప్రశ్నించాడు.
కాంగ్రెస్‌తో పాటు జమ్మూ కాశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సుష్మ నాట్యంపై స్పందించాడు. “సుష్మ గారు నాట్యం చేసిన వీడియోలను చూశాక ఆమెకంటె మా నాన్నగారే బాగా నాట్యం చేయగలరనడంలో ఎటువంటి అనుమానమూ లేదు. ఇప్పుడు నాట్యం కూడా ఓ నిరసన పోరాటంగా అంగీకారానికి నోచుకుంది, అందుకు సంతోషం” అంటూ ఒమర్ తన ట్విటర్ ఎకౌంట్ లో మంగళవారం రాసుకున్నాడు. మూడుసార్లు జమ్మూ కాశ్మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన ఒమర్ తండ్రి ఫరూక్ అబ్దుల్లా కాశ్మీరు జానపద గీతానికి నృత్యం చేస్తూ ఉండగా చిత్రీకరించిన వీడియో ఇంటర్ నెట్ లో ప్రసిద్ధి పొందింది. ఫేస్ బుక్ లో ఉంచబడిన ఆయన వీడియో రికార్డు సంఖ్యలో వీక్షకులను ఆకట్టుకుంది.
ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యకు సమాధానంగానా అన్నట్లు సుష్మ సైతం తన నాట్యంపై ట్విట్టర్ లో రాసుకుంది. “అప్పుడు ఉదయం 2 గంటలైంది. మా పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడానికి నేను ఆ విధంగా చేశాను” అని ఆమె రాసుకుంది.
ఒమర్ అబ్దుల్లా ఏ దృష్టితో వ్యాఖ్యానించాడో గానీ పదవుల కోసం తగినట్లుగా నాట్యం చేయగల చతురత ఫరూక్ అబ్దుల్లా సొంతం. ఆయన బిజెపి నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం లోనూ కేంద్ర మంత్రిగా పదవి నిర్వహించాడు. ఇప్పుడు యు.పి.ఏ ప్రభుత్వంలోనూ కేంద్రమంత్రిగా అధికారం చెలాయిస్తున్నాడు. “కాశ్మీరు ప్రజల్లో ‘డిస్కో ఫరూక్” గా పేరు పొందిన ఫరూక్ అబ్దుల్లా రాజకీయ విలువలకు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకుండా పదవి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అనుగుణంగా నాట్యం చేసి పదవులు, అధికారాలు సంపాదించాడు. ఆ విధంగా ఫరూక్ అబ్దుల్లా రాజకీయ నాట్యంలోనూ సుప్రసిద్ధుడనే చెప్పుకోవాలి. ఫరూక్ అబ్దుల్లా చేసిన రాజకీయ నాట్యాలకు అనుగుణంగానే నేడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీరు ముఖ్యమంత్రి కాగలిగాడని ఒమర్ గ్రహించకపోవడం ఆశ్చర్యకరమే.
తండ్రీ కొదుకులిద్దరూ వాస్తవాని తండ్రికి తండ్రీ, కొడుకుకు తాతా అయిన షేక్ అబ్దుల్లా పాటించిన రాజకీయ, సాంస్కృతిక విలువలకు మైళ్ళ దూరంలో నిలవడమే అసలు విషాదం. కాశ్మీరు ప్రజల స్వయం నిర్ణయాధికారం కోసం నిరంతరం పోరాడిన షేక్ అబ్దుల్లా కాశ్మీరు సింహంగా పేరుపొందిన వ్యక్తి. స్వాతంత్రం వచ్చిన అనంతరం మూడు సంవత్సరాలకు పైగా జమ్మూ కాశ్మీరుకు ప్రధానమంత్రిగా పని చేసిన షేక్ అబ్దుల్లా “ప్రజాభిప్రాయ సేకరణ” (ఫ్లెబిసైట్) జరిపిస్తానని చేసిన నెహ్రూ వాగ్దానాన్ని అమలు చేయమని కోరినందుకు 17 సంవత్సరాలకు పైగా జైలు జీవితం గడపవలసి వచ్చింది. కాశ్మీరు సింహం కడుపున “డిస్కో ఫరూక్” జన్మించి కాశ్మీరు ప్రజల జాతీయ ఆకాంక్షలను పెట్టుబడిగా అధికారం నెరపుతున్న స్వార్ధపరులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలు.
పింగ్‌బ్యాక్: సుష్మ స్వరాజ్ కంటే మా నాన్నగారే బాగా డాన్స్ చేస్తారు -కాశ్మీరు ముఖ్యమంత్రి « తెలుగులో జాతీయ అ