భారత దేశ రాజకీయ నాయకులు, బ్యూరోక్రట్ అధికారుల అంతులేని అవినీతి పైన యుద్ధం ప్రకటించిన బాబా రామ్ దేవ్ ని అరెస్టు చేశారు. విదేశాల్లో దాచుకున్న అవినీతి డబ్బుని దేశానికి రప్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. 2014 లో ఓ రాజకీయ పార్టీ పెడతానని చెబుతున్న ఈయన కేంద్ర ప్రభుత్వం ముందు కొన్ని అసాధ్యమైన డిమాండ్లు కూడా ఉంచాడు.
తాము అనుమతిని 5,000 మందికి యోగా శిక్షణ ఇస్తానంటే ఇచ్చామనీ, 50,000 మందిని తెచ్చి గొడవ చేయడానికి ఇవ్వలేదనీ చెప్పిన పోలీసులు ముందు టియర్ గ్యాస్ ప్రయోగించి, ఆ తర్వాత బాబా రాం దేవ్ ని పట్టుకు పోయారు. అయితే ఆయన తన దీక్షని కొనసాగిస్తానని ప్రకటించాడు. లాఠీ చార్జీ చేయడంతో పోలీసుల పైన రాందేవ్ మద్దతుదారులు రాళ్ళు విసిరారు. పోలీసులు ఆ రాళ్ళని మళ్ళీ విసిరినవారిపైనే విసిరారు. ఈ పరస్పర విసురుడులో ముప్ఫై మంది రాందేవ్ మద్దతు దారులు, ఓ పదిమంది పోలీసులు గాయపడ్డారని పోలీసు అధికారులు తర్వాత చెప్పారు.
బాబా రాం దేవ్ ని రాంలీలా మైదానం నుండి పట్టుకుపోయిన పోలీసులు ఆయన సొంత ఆశ్రమం ఉన్న హరిద్వార్ లో వదిలిపెట్టారు. రాందేవ్ ని అరెస్టు చేయలేదనీ, ఢిల్లీలో యోగా పేరు చెప్పి గొడవ చేస్తుంటే తీసుకెళ్ళి హరిద్వార్ లో వదిలామనీ హోం సెక్రటరీ జి.కె.పిళ్ళై చెప్పాడు. అక్కడే తన దీక్ష కొనసాగిస్తానని ప్రకటించినట్లుగా వార్తా సంస్ధలు చెబుతున్నాయి. అవినితీ వ్యతిరేక పోరాటం అంటూ ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని ఓ సీనియర్ పోలీసు అధికారి పత్రికల వారితో మాట్లాడుతూ అన్నాడు.
బాబా రాందేవ్ సత్యగ్రహాన్ని భగ్నం చేయడాన్ని ఆర్.ఎస్.ఎస్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. బి.జె.పి కూడా అంతే తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. రాందేవ్ అరెస్టుని ఆయన అరెస్టుని “స్టేట్ టెర్రరిజం” అని నిందించాడు. “ఇది స్టేట్ టెర్రరిజం. అవినీతిపరుల స్టేట్ టెర్రరిజం ఇది” అని వేద్‌ప్రకాష్ అవేశపడ్డాడు. “ఒక మర్యాదస్తుడు నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం పాల్పడిన హింసాత్మక చర్య ఇది” అని కూడా అన్నాడు. నిజం చెప్పాలంటే స్టేట్ టెర్రరిజం అంటే వైదిక్ గారికి ఏమీ తెలియదని చెప్పాలి. కాశ్మీరులో అర్ధరాత్రి పారా మిలట్రీ పోలీసులు, సైనికులు పట్టుకు పోయిన యువకులు మళ్ళీ జీవితంలో కనపడకపోవడం, మన మధ్య తిరుగుతున్న అమ్మాయి భద్రతా దళాల సామూహిక అత్యాచారానికి గురయ్యే మణిపూర్ ప్రజల కష్టాల గురించి వైదిక్ ముందు తెలుసు కుంటే లాఠీ చార్జీ, టియర్ గ్యాస్ ని “స్టేట్ టెర్రరిజం” అని అభివర్ణించే పొరబాటుకి పూనుకోక పోవచ్చు.
బాబా రాందేవ్ కి 40 మిలియన్ డాలర్ల (రు.180 కోట్లు) విలువగల ప్రపంచ యోగా సామ్రాజ్యం నిర్మించుకునాడని రాయిటర్స్ వార్తా సంస్ధ రాసింది. రాందేవ్ ఆమరణ నిరాహార దీక్ష “ఫైవ్ స్టార్ దీక్ష” అని కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ విమర్శించాడు. అతనే ఓ పెద్ద “ఫ్రాడ్” అని కూడా తిట్టిపోశాడు.
అన్నా హజారే దీక్షకూ, రాం దేవ్ దీక్షకీ స్పష్టమైన తేడా కనిపిస్తోంది. అన్నా హజారే దీక్షకి రాందేవ్ దీక్షకి జరిగినన్ని విస్తృత ఏర్పాట్లు జరగలేదు. ఆయన సత్యాగ్రహం గాంధీ సత్యాగ్రహం లాగా ఖద్దరు బట్టలు, నిరాడంబరత తదితర లక్షణాలు పుష్కలంగా కనిపించాయి. కానీ రాందేవ్ దీక్షలో అంతా కాషాయమయం లాగా కనిపించింది. నిరాహార దీక్షకే అని చెప్పి అనుమతి తీసుకుంటె అది నిజాయితీగా ఉండేది. యోగా శిబిరానికి అని అనుమతి తీసుకుని నిరాహార దీక్షకు కూర్చోవడం పోలీసులకి మొదటి రోజు అవడంతోనే అరెస్టు చేయడానికి అవకాశం దొరికింది. ఐనా అబద్ధం చెప్పి దీక్షకు కూర్చోవలసిన అవసరం ఏముంది? చేయబోతున్న పనినే చెప్పి అనుమతి తీసుకుంటే ఆ మేరకు ఆయన దీక్షకు విలువ ఉండేది.
