అమెరికా ఆర్ధిక వ్యవస్ధ బలహీన పడుతున్న నేపధ్యంలో ప్రపంచ వ్యాపితంగా షేర్ మార్కెట్లు మరికొన్ని వారాల పాటు నష్టాలను నమోదు చేయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం రెండో అర్ధ భాగం నుండే అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదించడంతో, మార్కెట్లకు ఊపు ఇవ్వడానికి ఉద్దీపనా ప్యాకెజీ ఇవ్వడానికి నిశ్చయించి, ఆగష్టు నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వు 600 బిలియన్ డాలర్ల క్వాంటిటేటివ్ ఈజింగ్ -2 (క్యు.ఇ – 2) ప్రకటించింది.
అమెరికా ట్రెజరీ బాండ్లను ఫెడరల్ రిజర్వు కొనేయడం ద్వారా ఈ మొత్తాన్ని ఫెడ్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ప్యాకేజీ ఏప్రిల్, మే నెలలనాటికి పూర్తిగా ఖర్చయిపోయింది. ఫలితంగా అమెరికా ఆర్ధిక వృద్ధి నెమ్మదిస్తున్న సూచనలు ప్రస్ఫుటమయ్యాయి. నిరుద్యోగం ఏప్రిల్ లో 9.0 శాతం ఉంటే అధి మే నెలలో 9.1 శాతానికి పెరిగింది. మే నెలలో అమెరికా ప్రవేటు రంగం కేవలం 54,000 ఉద్యోగాలను మాత్రమే కల్పించింది.
గత నెలలో తాకిన అత్యధిక స్ధాయినుండి ఎస్&పి షేర్ సూచిక ఇప్పటివరకూ 5 శాతం నష్టపోయింది. 10 శాతం నష్టపోయినట్లయితే దాన్ని మార్కెట్ కరెక్షన్ గా లెక్కిస్తారు. గత నెల ఆగస్టు నెల తర్వాత అత్యధిక తక్కువ స్ధాయిని ఈ వారం ఎస్&పి సూచిక రికార్డు చేసింది. పైగా వరుసగా ఐదో వారం సూచిక నష్ట పోయింది.
క్యు.ఇ-2 ముగియడం, తక్కువ ఉద్యోగాల కల్పన, నిరుద్యోగం పెరుగుదల ఇవన్నీ అమెరికా ఆర్ధిక వ్యవస్ధ వృద్ధి రేటు పడిపోనున్నదని తెలుపుతున్నాయి. దానితో కొంతమంది, అమెరికా ఆర్ధిక వ్యవస్ధ రెండో సారి మాంద్యం (రిసెషన్) -డబుల్ డిప్- ఎదుర్కొంటుందని భయపడుతుండగా మరికోందరు కొద్ది వారాల పాటు నెమ్మదించినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంటుందని భరోసా ఇస్తున్నారు.
సావరిన్ బాండ్ల యీల్డ్ పడిపాయినా, సంపూర్ణ పతనం అనేదేమీ లేదు లెమ్మని కొంతమంది మదుపు దారులు భావిస్తున్నారు. 2011 సంవత్సరం మొదటి నుండి గనక లెక్కించినట్లయితే షేర్ మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయని వీరు గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకి డౌ సూచిక 5 శాతం లాభపడగా ఎస్ & పి, నాస్‌డాక్ లు 3 శాతం లాభాల్లో ఉన్నాయని వారు ఎత్తి చూపుతున్నారు.
యూరపలో సావరిన్ అప్పు సంక్షోభం కొనగాగుతుండడం వలన ప్రపంచ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దానితో పాటు యెమెన్‌లో ఆందోళనలు సౌదీ అరేబియా లోకి వ్యాపించినట్లయితే అది ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడానికి దారి తీయవచ్చనీ, ఫలితంగా ఆయిల్ ధరలు ఇంకా పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని కూడా కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అధిక ఆయిల్ ధరలు వినియోగదారుడి కొనుగోలు శక్తిని తగ్గిస్తాయి.
మార్కెట్లను కదిలించగల వార్తలు వచ్చే వారం కూడా ఏమీ లేనందున షేర్లు మరింత పతనం కాగలవని అంచనా వేస్తున్నారు. యూరప్ అప్పు సంక్షోభం మరో దేశానికి వ్యాపించినా షేర్లు మరో 5 శాతం పడిపోవడానికి అవకాశాలున్నాయని వీరు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలిక మదుపుదారులకు ఇది మంచి అవకాశంగా కూడా భావిస్తున్నారు. తక్కువ స్ధాయిలో ఉన్న షేర్లలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టినట్లయితే వారు దీర్ఘకాలంలో లాభాలు గ్యారంటీ అని భావిస్తున్నారు.
క్యు.ఇ-2 ముగియడం వలన మార్కెట్లో లిక్విడిటీ కరువయ్యే ప్రమాదం తలెత్తింది. క్యు.ఇ-2 కారణంగా ఎస్&పి సూచిక ఎనిమిది నెలల్లో దాదాపు 30 శాతం లాభపడింది. ప్రభుత్వం లిక్విడిటీ అందించడానికి నిర్ణయించినట్లయితే (క్యు.ఇ-3 ?) అది ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న ఎమర్జింగ్ మార్కెట్లకు నష్టకరంగా పరిగణిస్తుంది.
ఏది ఏమైనప్పటికీ రానున్న కొద్ది వారాల పాటు షేర్ల ధరలు పతనం కానున్నాయని మదుపుదారులు గుర్తించాలని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.