తిరుగుబాటు తెగలు శుక్రవారం అధ్యక్ష భవనంపై చేసిన రాకెట్ దాడిలో అధ్యక్షుడు, ఆలి అబ్దుల్లా సలే గాయపడ్డాడు. ఆయనతో పాటు ప్రభుత్వంలోని ఇతర ముఖ్య అధికారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన తర్వాత అధ్యక్షుడికి ఏమీ కాలేదని, కొద్ది గంటల్లో ప్రజలముందుకు వస్తాడని చెప్పినప్పటికీ అది జరగలేదు. దాడి జరిగిన ఆరు గంటల అనంతరం ప్రభుత్వ టివీలో రికార్డు చేయబడిన ఉపన్యాసం వినిపించారు. సలే కష్టంగా మాట్లాడాడని, మద్య మధ్యలో ఊపిరి భారంగా తీసుకున్నాడని విలేఖరులు తెలుపుతున్నారు. దాడికి కారణమైన తెగలపై యుద్ధం చేయాల్సిందిగా సలే తన ఆర్మీని కోరాడు. దాడిలో ఏడుగురు మరణించినట్లు తెలుస్తోంది. సాయుధ తెగలు, ఓవైపు సాయుధ తెగలు ప్రభుత్వ సైన్యం తీవ్రంగా ఘర్షణపడుతుండగా, మరోవైపు యెమెన్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తుండగానే అధ్యక్ష భవనాల కాంపౌండులో ఉన్న మసీదుపై రెండు రాకెట్లతో దాడి జరపడంతొ అందులో ప్రార్ధనలకు హాజరైన అధ్యక్షుడు సలే, ఇతర అధికారులు గాయపడ్డాఅరు.
ప్రభుత్వ వ్యతిరేక సాయుధ తెగల నాయకుడు షేక్ సాదిక్ అల్-అహ్మర్ సోదరుడి ఇంటిమీదికి ప్రభుత్వ సేనలు ఓక దశలో పెద్ద ఎత్తున దాడి చేశాయి. అయితే షేక్ అహ్మర్ కార్యాలయం అధ్యక్ష భవనంపై జరిగిన దాడితో తమకు సంబంధం లేదని ప్రకటించాడు. యెమెన్‌లో సాయుధ ఘర్షణలు కొనసాగుతుండడంతో యూరోపియన్ యూనియన్ దేశాలు తమ పౌరులని వెనక్కి రప్పించుకుంటున్నాయి. లిబియాపైన యుద్ధ హెలికాప్టర్లతో దాడులు చేస్తున్న అమెరికా, యూరప్ లు యెమెన్ లో కాల్పుల విరమణకు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ సైన్యం చేతిలో ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 350 మంది పౌరులు చనిపోయినప్పటికీ అలీ అబ్దుల్లా సలేను గద్దె దిగమని గానీ, ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను గౌరవించాలని గాని పశ్చిమ దేశాలు ప్రకటించలేదు. “యెమెన్ ఎదుర్కొంటున్న సమస్యలను హింస పరిష్కరింపజాలదు. ఈ రోజు ఘటనలు మరో కొత్త ఘర్షణకు దారి తీయకూడదు” అని వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ తెలిపాడు.
రాకెట్ దాడిలో అధ్యక్షుడు సలే ఎంతవరకు గాయపడిందీ తెలియలేదు. గీసుకుపొయిన గాయాలేనని కొంతమంది చెబుతుండగా, అతని మెడ, తలలో వాడి వస్తువులు దిగబడ్డాయని మరికొందరు చెబుతున్నారు. అయన ఇంకా మిలట్రీ ఆస్పత్రిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి అలి మహమ్మద్ ముజావర్, ప్రతినిధుల సభ స్పీకర్ యాహ్యా ఆల్-రాయ్, షురా కౌన్సిల్ స్పీకర్ అబ్దుల్ అజీజ్ అబ్దుల్ ఘనీ లతో పాటు మరికొంతమంది గాయపడినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. గత వారం నుండి సలే బలగాలకూ, షేక్ అహ్మర్ కు విధేయులైన తెగల వారికీ మధ్య ఉత్తర సనా జిల్లాలోని హస్సాబా లో తీవ్రమైన పోరు జరుగుతోంది. సనా దక్షిణ భాగంలో కూడా మొదటిసారిగా పేలుళ్ళ శబ్దాలు వినపడుతున్నాయి. రాకెట్ దాడి అనంతరం ప్రభుత్వ బలగాలు హస్సాబాలో దాడులు తీవ్రం చేశాయి.
అంతకుముందు ప్రభుత్వ బలగాల కాల్పుల్లో చనిపోయిన 50 మంది పౌరులకు ఖనన కార్యక్రమం నిర్వహించడానికి పెద్ద ఎత్తున హాజరైనారు. శుక్రవారం ప్రార్ధనల తర్వాత సనా వీధుల్లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి. యెమెన్ దక్షిణ భాగంలో ఉన్న తైజ్ పట్టణంలో సైతం పోరాటం జరుగుతోంది. అక్కడ ముగ్గురు సైనికులు ఇద్దరు పౌరులు మరణించారు. గత ఆదివారం తైజ్ లో ప్రభుత్వ దళాలు జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించారు. ఇప్పటివరకూ 350 మంది చనిపోగా వారిలో 135 మంది గత పది రోజుల్లోనే చనిపోయారని బిబిసి తెలిపింది. అయితే అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చని తెలుస్తోంది. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాలు తయారు చేసిన ఒప్పందంపై సంతకం చేయాలని సలేను పశ్చిమ దేశాలు కొరుతున్నాయి. దాని ప్రకారం సలే అధికారం అప్పగించి దిగిపోతే అతనికి క్షమాభిక్ష లభిస్తుంది. ఇప్పటికి మూడు సార్లు ఒప్పందం అంగీకరించినట్లు ప్రకటించి సలే చివరి నిమిషంలో పేచీలు పెడుతూ వచ్చాడు.
లిబియా పౌరులపై కపట ప్రేమ కురిపిస్తూ, గడ్డాఫీ లిబియా పౌరులను చంపుతున్నాడంటూ అబద్ధపు ప్రచారం చేస్తూ ఆ దేశాన్ని బాంబులతో సర్వ నాశనం చేస్తున్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్సులు యెమెన్ అధ్యక్షుడు తన పౌరుల్ని చంపుతున్నప్పటికీ అతనిపై చర్య తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దానికి కారణం అబ్దుల్లా సలే పశ్చిమ దేశాలకు నమ్మినబంటు కావడమే.