పాకిస్ధాన్ ప్రభుత్వ కోవర్టు మద్దతుతో అమెరికా మానవ రహిత విమానం డ్రోన్ దాడిలో సీనియర్ ఆల్-ఖైదా నాయకుడు ఇలియాస్ కాశ్మీరీ మరణించాడు. ఒసామా హత్యానంతరం అమెరికా సాధించిన ప్రధాన టార్గెట్ గా ఇలియాస్ మరణాన్ని చెప్పుకోవచ్చు. పశ్చిమ దేశాలు “ఇలియాస్ కాశ్మీరీ” ని చాలా ప్రమాదకరమైన టెర్రరిస్టుగా అభివర్ణిస్తాయి. తద్వారా అమెరికా తదితర నాటో సైన్యాలకు నష్టాలు కలిగించడంలో కాశ్మీరీ పాత్ర స్పష్టం అవుతోంది. పాకిస్ధాన్ లోని ఓ గూఢచర్య అధికారిని, స్ధానిక టివి రిపోర్టులను ఉటంకిస్తూ రాయిటర్స్ సంస్ధ ఈ వార్త తెలియజేసింది.
“అతడు చనిపోయాడని ఖచ్చితంగా చెప్పగలం. చనిపోయిన వారి శవాలను సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాము. శవాల ఫోటోలను సంపాదించాల్సి ఉంది” అని పాకిస్ధాన్ అధికారి తెలిపాడు. అయితే కాశ్మీరీ చనిపోవడం ఇది మొదటిసారి కాదు. సెప్టెంబరు 2009 లో కూడా ఇలాగే డ్రోన్ దాడిలో ఇలియాస్ కాశ్మీరీ చనిపోయాడని అమెరికా ప్రకటీంచింది. పాకిస్ధాన్ మీడియా ఇసారి అతను నిజంగానే చనిపోయాడని చెబుతోంది. అతను నాయకత్వం వహిస్తున్నాడని చెబుతున్న హర్కత్-ఉల్ జిహాద్ ఇస్లామి (హుజి) సంస్ధ ఈ వార్తను ధృవీకరించినట్లు అవి చెబుతున్నాయి.
“అమెరికన్ డ్రోన్ విమాన దాడిలో మా అమిర్ (నాయకుడు) మహమ్మద్ ఇలియాస్ కాశ్మీరీ, జూన్ 3 2011 తేదీన రాత్రి 11:15 గంటలకు ఇతర మా మిత్రులతో పాటు చనిపోయాడని ధృవీకరిస్తున్నాం” అను హుజి ప్రతినిధిగా చెప్పుకున్న అబు హంజ్‌లా కషీర్ ఒక పాకిస్ధానీ టెలివిజన్ ఛానెల్ కు పంపిన ఫాక్సు ద్వారా తెలిపినట్లుగా రాయిటర్స్ తెలిపింది. హుజి సంస్ధ ఆల్-ఖైదా కు మిత్ర సంస్ధగా పేర్కొంటారు. “అంతా దేవుడి ఇష్టం. తొందర్లోనే అమెరికా మా పూర్తి ప్రతీకారాన్ని ఎదుర్కొంటుంది. అమెరికా మా ఏకైక శత్రువు” అని ఆయన ఫాక్స్ ద్వారా తెలిపాడు.
2006లో కరాచిలోని అమెరికా రాయబారి కార్యాలయం పేల్చివేసింది హుజీ అని అమెరికా చెబుతోంది. శుక్రవారం రాత్రి డ్రోన్ విమానం దక్షిణ వజీరిస్ధాన్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో మిలిటెంట్ సెంటర్ పై మూడు క్షిపణులు ప్రయోగించిందనీ ఆ దాడిలో మొత్త 8 మంది మిలిటెంట్లు చనిపోగా 5 గురు కాశ్మీరీ సహచరులని అంతకు ముందు వార్తల ద్వారా తెలిసింది. అయితే ఈ వార్త తప్పని పాకిస్ధాన్ తాలిబాన్ ఖండించింది.
కరాచిలోని నౌకా స్ధావరంపై ఆల్-ఖైదా మిలిటెంట్లు జరిపిన దాడి వెనక కాశ్మీరీ మాస్టర్ మైండ్ ఉందని పాకిస్ధాన్ మీడియా ఊహాగానాలు చేసింది. పాకిస్ధాన్ మిలట్రీలో ఉన్న సంబంధాలే కాశ్మీరీ ఆచూకీ లభ్యం కావడానికి దోహదం చేసి ఉండవచ్చు.
