అప్పు పరిమితి పెంచకపోతే అమెరికా దివాళా ఖాయం -మూడీస్


moody'sరిపబ్లికన్, డెమొక్రట్ పార్టీలు అమెరికా అప్పు పరిమితి పెంచే విషయంలో త్వరగా ఒక ఒప్పందానికి రాకపోతే అమెరికా దివాళా ఖాయమని మూడీస్ రేటింగ్ సంస్ధ హెచ్చరించింది. అమెరికా సావరిన్ అప్పు బాండ్లకు ప్రస్తుతం టాప్ రేటింగ్ ఉందనీ, ఇరు పార్టీలు త్వరగా ఒక అంగీకారానికి రావాలనీ లేకుంటే ఇపుడున్న టాప్ రేటింగ్ కోల్పోవాల్సి ఉంటుందనీ ఆ సంస్ధ హెచ్చరించింది. ప్రస్తుతం ట్రెజరీ బాండ్ల అమ్మకం ద్వారా అమెరికా ప్రభుత్వం సేకరించగల అప్పుపై 14.3 ట్రిలియన్ డాలర్ల మేరకు పరిమితి ఉంది. గత మే 16 తేదీ నాటికి ఈ పరిమితిని అమెరికా దాటి పోయింది. ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ ఆగస్టు 2 నాటికి ఎలాగైనా ఈ పరిమితి పెంచాలని ఇప్పటికే హెచ్చరించాడు కూడా. అయితే బడ్జెట్ ఖర్చుల విషయంలోనూ, ఆరోగ్య భీమా విషయంలోనూ ఇరు పార్టీలు పట్టుబట్టి ఉండడంతో చర్చలు చాలా నెమ్మదిగా ముందుకెళ్తున్నాయి. నిజానికి ముందుకెళ్తున్నాయని చెప్పడానికి కూడా ఎవరూ సాహసించలేక పోతున్నారు.

ఆగష్టు 2 నాటికి అమెరికా అప్పు చేయగల సామర్ధ్యాన్ని పెంచుకోక పోతే ఆర్ధిక వినాశనం తప్పదని ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ అంచనా వేశాడు. మే 16 నుండి అసాధారణ డబ్బు నిర్వహణా చర్యల (extraordinary cash management measures) ద్వారా తిమోతి ఖర్చుల్ని నెట్టుకొస్తున్నాడు. ఇరు పార్టీల మద్య ప్రతిష్టంభన నిరంతరం కొనసాగే ప్రమాదం పెరిగినట్లు కనిపిస్తోందని మూడీస్ సంస్ధ హెచ్చరించింది. నవంబరు 2012 లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నందున త్వరలో రాజకీయాలు ప్రధాన రంగాన్ని ఆక్రమిస్తాయని, ఈ లోగా బడ్జెట్ లోటు తగ్గింపుపైన ఒక ఒప్పందానికి రావాల్సిందేనని మూడీస్ తెలిపింది. మూడీస్‌కి చెందిన సావరిన్ క్రెడిట్ విశ్లేషకుడు స్టీవెన్ హెస్ రాయిటర్స్ వార్తా సంస్ధతో మాట్లాడుతూ “ఇది మంచి అవకాసమని భావిస్తున్నాం. దీర్ఘకాలిక అప్పు/లోటు తగ్గింపు తగ్గింపు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకొని ఒక అంగీకారానికి రానట్లయితే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోపు ఇక అంగీకారం కుదిరే అవకాశాలు లేవని గుర్తించాలి” అని చెప్పాడు.

అమెరికా సమయానికి అప్పు చెల్లింపులకి సిద్ధపడనట్లయితే ద్రవ్య మార్కెట్లు ప్రపంచ స్ధాయిలో సంక్షోభంలోకి వెళ్ళి పోతాయి. మరో ప్రపంచ ద్రవ్య సంక్షోభాన్ని ప్రపంచ దేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే సంక్షోభాన్ని అధిగమించడానికి అందుబాటులో ఉన్న సమస్త ఫిస్కల్ ఉపకరణాలను దాదాపు దేశాలన్నీ వినియోగించుకొని ఉన్నాయి. మళ్ళీ ద్రవ్య సంక్షోభం అంటే కోలుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుందని భయపడుతున్నారు. సమీపం భవిష్యత్తులో చెల్లించాల్సి ఉన్న అప్పు చెల్లింపుల్ని అమెరికా చేయడంతో పాటు దీర్ఘకాలిక కోశాగార (ఫిస్కల్) ఒప్పందం కూడా కుదుర్చుకోవలసిన అగత్యాన్ని మూడీ హెచ్చరిక గుర్తు చేస్తున్నదని ట్రేజరి అధికారి మేరీ మిల్లర్ తెలిపింది. అయితే వాల్ స్ట్రీట్ కంపెనీలు మాత్రం ఆ పరిస్ధితి రాదన్న విశ్వాసంతో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అమెరికా సమయానికి అప్పు చెల్లింపులు చేయలేని పక్షంలో ఏర్పడే పరిస్ధితుల గురించి ఏ కంపెనీ కూడా ఆందోళన చెందుతున్న దాఖలాలు లేవు. ఏదో ఒక రకంగా ఒప్పందం కుదురుందని వారు విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది.

మూడీస్ హెచ్చరిక తర్వాత ఒప్పందం కుదరాల్సిన అవసరం గురించి వివరించడానికి గీధనర్ మొదటిసారి ఎన్నికయిన ప్రతినిధులతో గీధనర్ సమావేశమయ్యాదు. ఈ సమావేశం సంతృప్తికరంగా జరిగిందని గీధనర్ తెలిపాడు. ప్రభుత్వ ఖర్చుల్ని తీవ్రంగా తగ్గించకుండా అప్పు పరిమితి పెంచడం పట్ల కొద్దిమంది అనుమానాలు వ్యక్తం చేసారని ఆయన తెలిపాడు. ఇరు పార్టీల ప్రతినిధుల సభ్యులతో చర్చలు జరిపి లోటు/అప్పు తగ్గింపు ఒప్పందం చేయడానికి ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్ ను నియమించాడు. బిడెన్ చేస్తున్న చర్చలు చాలా నెమ్మదిగా పెద్దగా ప్రగతి లేకుండా సాగుతున్నాయని మూడీస్ సంస్ధ అసంతృప్తి వ్యక్తం చేసింది. జూన్ 9 తేదీన బిడెన్ చర్చలను తిరిగి ప్రారంభించవలసి ఉంది. రిపబ్లికన్ పార్టీ సభ్యులు కొన్ని ప్రభుత్వ ఖర్చు పైనా, డెమొక్రటిక్ సభ్యులు ఆరోగ్య భీమా ఖర్చులపైనా పట్టుదలగా ఉండడంతో చర్చలు ముందుకు సాగటం కష్టంగా మారింది.

ధనికులపైన, వాల్‌స్ట్రీట్ కంపెనీలపైన పన్నులు పెంచడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని డెమొక్రట్లు ప్రతిపాదిస్తున్నారు. రిపబ్లికన్ సభ్యులు ధనికులపైన, కంపెనీలపైన పన్నులు పెంచడానికి ససేమిరా అంటున్నారు. పైగా కార్మికులపైన, ఉద్యోగులపైన పన్నులు పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఖర్చు తగ్గించే పేరుతో వృద్ధుల ఆరోగ్య భీమా నిమిత్తం ప్రభుత్వం చెల్లించే భాగాన్ని గణనీయంగా తగ్గించాలని కూడా రిపబ్లికన్ లు కోరుతున్నారు. ఆరోగ్య భీమాకి సంబంధించిన రిపబ్లికన్ డిమాండ్ ను డెమొక్రాట్లు అస్సలు అంగీకరించడం లేదు. ఎవరి నిర్ణయంపై వారు స్ధిరంగా ఉంటూ వెనక్కి తగ్గడానికి నిరాకరిస్తుండండతో చర్చలు ముందుకు సాగడం లేదు. ఆరోగ్య భీమా పై వెనక్కి తగ్గితే ఒబామా తిరిగి రెండో సారి ఎన్నిక కావడంపై ప్రభావం చూపుతుంది. కార్మికులు, ఉద్యోగులుపైన పన్నులు పెంచినా అది కూడా ప్రభావం చూపుతుంది. అందువలన డెమొక్రట్లకు ప్రజల మీద అంత ప్రేమ లేకపోయినా ఎన్నికల ప్రయోజనాల కోసం రాజీకి అంగీకరించడం లేదు.

వ్యాఖ్యానించండి