ప్రపంచం మొత్తం ఇష్టంగా వాడుతున్న సెల్ ఫోన్‌తో కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ (World Health Organisation – WHO) హెచ్చరించింది. ఈ విషయం నిర్ధారించడానికి సంస్ధ ప్రత్యేక పరిశోధనలేవీ చేయనప్పటికీ ఇప్పటికే ప్రపంచంలోని వివిధ సంస్ధలు చేసిన పరిశోధనలను క్రోడీకరించిన డబ్ల్యు.హెచ్.ఓ సెల్ ఫోన్ ని అతిగా వాడ్డం వల్లా, చెవికి దగ్గరగా పెట్టుకుని వాడడం వలనా కేన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రమాదానాన్ని నివారించడానికి సెల్ ఫోన్‌ని చెవి దగ్గరగా కాకుండా హేండ్స్ ఫ్రీ సెట్ వాడాలని లేదా టెక్ట్సు మెసేజ్‌లపై ఆధారపడాలని సంస్ధ సలహా ఇచ్చింది.
సెల్ ఫోన్లలో వాడే పదార్ధాల నుండి రేడియేషన్ వెలువడుతుందనీ, ఇవి మెదడు కణాల డి.ఎన్.ఏ లతో చర్య జరపడం వలన మ్యుటేషన్ జరిగే అవకాశాలున్నట్లుగా గతంలో కొన్ని సంస్ధలు పరిశోధన చేసి ప్రకటించాయి. మ్యుటేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే కణాలే కేన్సర్ కణాలనీ సేల్ ఫోన్ వాడకం పెరిగే కొద్దీ ఈ కణాల విస్తరణ పెరిగి కేన్సర్ వ్యాధి సంక్రమిస్తుందనీ పరిశోధనలు తెలిపాయి. కొన్ని పరిశోధనలు సెల్ ఫోన్ ల వలన ఎట్టి ప్రమాదం లేదనీ శుభ్రంగా వాడుకోవచ్చని కూడా ప్రకటించిన సందర్భాలున్నాయి. పరిశోధన నిర్వహించిన స్వతంత్ర పరిశోధనలన్నీ కేన్సర్ ప్రమాదాన్ని హెచ్చరించడం గమనార్హం.
రేడియో ఫ్రీక్వెన్సీ ఎలెక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డు ను సెల్ ఫోన్లు వెలువరిస్తాయని ఇది కేన్సర్ కారకంగా పని చేస్తుందని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్ (ఐ.ఎ.ఆర్.సి) సంస్ధ ఫ్రాన్సులో జరిగిన ఎనిమిది రోజుల సమావేశాల అనంతరం ప్రకటించింది. డబ్ల్యు.హెచ్.ఓ కి ఈ సంస్ధ అనుబంధం. జబ్బుల కారణాలు, విస్తరణ, నియంత్రణలకు సంబంధించిన అధ్యయనంలో (epidemiological studies) నిపుణులు ఈ విషయమై ఒక నిర్ధారణకు వచ్చారని ఐ.ఎ.అర్.సి సంస్ధ అధ్యక్షుడు జొనాధన్ సామెట్ తెలిపాడు. బ్రెయిన్ కేన్సర్ లో ఒకటయిన గ్లియోమా ప్రమాదం పెరగడాన్ని పరిశోధనలు సూచిస్తున్న సంగతి నిఫుణులు తేల్చారని ఆయన తెలిపాడు. ముఖ్యంగా గత దశాబ్దంలోనే విస్తృత స్ధాయిలో జరిగిన రెండు పరిశోధనలు సెల్ ఫోన్లు అధికంగా వాడేవారిలో కేన్సర్ ప్రమాదం ఉందని తెలిపాయన్నాడు. పరిశోధనలు జరిపిన వ్యక్తుల్లో కొంతమంది పది సంవత్సరాల్లో రోజుకి అరగంట చొప్పున సెల్ ఫోన్ వాడినట్లు తేలిందని తెలిపారు.
తమ జీవితకాలం పాటు సెల్ ఫోన్లు వాడే వారి పరిస్ధితిని ఇక చెప్పలేమని సామెట్ తెలిపాడు. ప్రపంచ వ్యాపితంగా ప్రస్తుతం 5 బిలియన్ల (500 కోట్లు) సెల్ ఫోన్లు రిజిస్టర్ అయి ఉన్నాయని ఆయన తెలిపాడు. (ప్రపంచ జనాభా 6 బిలియన్లు). కాలం గడుస్తున్న కొద్దీ సెల్ ఫోన్ల సంఖ్య పెరగడంతో పాటు వాటిని వాడే సమయం కూడా పెరుగుతోందని ఆయన తెలిపాడు. అయితే ఈ వైర్‌లెస్ ఉపకరణాలకూ కేన్సర్ కూ ఖచ్చితంగా సంబంధం ఉన్న సంగతి ఇంకా రుజువు కాలేదనీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత శాస్త్రీయ సాక్ధ్యాలు రెండింటికీ సంబంధం ఉండగల అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్పగలవని ఐ.ఎ.ఆర్.సి హెచ్చరిస్తోంది. గ్లియోమాతో పాటు కేన్సర్ కి మరో రూపమైన ఎకౌస్టిక్ న్యూరోమా కూడా పెరుగుతున్న ప్రమాదం కనపడిందని సంస్ధ నిపుణుడు కర్ట్ స్ట్రైఫ్ తెలిపాడు. ఈయన ఐ.ఏ.ఆర్.సి కేన్సర్ పై వెలువరించే నివేదికల ఎడిటింగ్ కి బాధ్యుడు. వాయిస్ కాలింగ్, టెక్ట్సింగ్ ద్వారా ప్రమాదం తగ్గించుకోవచ్చని ఆయన సూచించాడు.
సంవత్సరం క్రితం ఐ.ఎ.ఆర్.సి సంస్ధ కేన్సర్ కీ సెల్ ఫోన్లకీ సంబంధం లేదని ప్రకటించింది. అయితే అప్పట్లో సంస్ధ ఆధారపడిన డేటా చాలా పాతదని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 14 దేశాల నుండి వచ్చిన 31 మంది శాస్త్రవేత్తల పేనెల్ నూతన డేటాను సేకరించాయి. వాటి ఆధారంగా వారంతా బ్రెయిన్ కేన్సర్ కీ సెల్ ఫోన్లకూ సంబంధం ఉండవచ్చని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ అంశానికి సంబంధించిన అన్ని పరిశోధనల వివరాలను క్రోడీకరించిన నివేదిక ఇదని సంస్ధ తెలిపింది. అయితే టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెందుతుండటం, వినియోగదారుల అలవాట్లు కూడా మారుతుండడం, సరిపోయినంత డేటా అందుబాటులో లేకపోవడంతో మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు నొక్కి చెప్పారు. ఐ.ఎ.ఆర్.సి కాన్సర్ కారకాలను నాలుగు గ్రూపులుగా విభజిస్తుంది. అవి కార్సినోజెనిక్ (కేన్సర్ కారకాలు), ప్రాబబ్లీ కార్సినోజెనిక్ (బహుశా కేన్సర్ కారకాలు), పాసిబ్లీ కార్సినోజెనిక్ (కేన్సర్ కారకాలయ్యే అవకాశాలు) ప్రాబబ్లీ నాట్ కార్సినోజెనిక్ (కేన్సర్ కారకాలు కాకపోవచ్చు). సెల్ ఫోన్లు వీటిలో మూడో గ్రూపుకింద వస్తాయని పేర్కొన్నది.

జీవితాన్ని మరింత సులభతరం చేసే సెల్ ఫోన్లు ఒక్కసారిగా విస్తరించాక, దాన్లోనే ఇంటర్నెట్టు, ఫేస్ బుక్ వంటి సోషల్ నెట్ వర్కులూ అందుబాటులో ఉన్నపుడు క్రమ క్రమంగా దీని వినియోగం ఇంకా పెరిగే సూచనలే గానీ తగ్గే అవకాశం లేదు.
GPRS ఫోన్లో మాప్ తో సహా సిద్ధంగా ఉన్నపుడు ఎంతమంది నిపుణులు ఎన్ని రకాలుగా హెచ్చరించినా అంత ప్రయోజనం ఉండదు. రేడియేషన్ సంగతీ, సంతానోత్పత్తి వ్య్వస్థ మీద సెల్ ఫోన్ల ప్రభావం,పిచ్చుకల వంటి పక్షి జాతులు వీటివల్ల అంతరించి పోతున్నాయన్న సంగతీ వీటన్నింటి గురించి పత్రికల్లోనూ ఇతరత్రా వార్తలు బాగానే వస్తున్నాయి. జనానికి కొంతవరకూ అవగాహన ఉంది. కానీ ఈ అవగాహన అవసరం తర్వాతే!
మీరు గమనించారో లేదో ఆరేడు తరగతులు పిల్లలు కూడా సెల్ ఫోన్లను అందుబాటులో ఉంచుకుంటున్నారు.దీనివల్ల సాంస్కృతికంగానూ ఆరోగ్యపరంగానూ పిల్లల మీద దుష్ప్రభావాలు పడే అవకాశం పుష్కలంగా ఉంది.
ఇదో గుర్రపు డెక్క మొక్క లాంటిది. విస్తరించడం ఈజీయే! తగ్గించడమే కష్టం!
అవును. మీరన్నది నిజం. సెల్ వలన మనుషుల మధ్య ఆప్యాయపూరిత సంభాషణలు కరువైనాయి. మానవ సంబంధిత ప్రతిస్పందనలు (కోపం, దు:ఖం, అలక, అభిమానం, ఆప్యాయత ఇత్యాదులు) పరస్పరం వ్యక్తం చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది. ఒక విధంగా టివి ఛానెళ్ళ ప్రభావంతో వీటిని పోల్చవచ్చు. వివిధ చానెళ్లపైన ఇష్టాలు కుటుంబ సభ్యుల మధ్య అప్పటికప్పుడు తగాదాలు సృష్టించే శక్తి టీవీకి ఉంటుంది. భార్యా, భర్తలు ఇంటికి వచ్చి కూడా సెల్ ఫోన్లలో మిత్రులతో గంటల తరబడి మాట్లాడుకోవడం సాధారణంగా మారింది. పిల్లల గురించి, వారి భవిష్యత్ గురించి తీరికగా కలిసి చర్చించుకునే అవకాశాలు ఈ టెక్నాలజీ ఉపకరణాలు చంపేస్తున్నాయి. మనిషి చేతిలో ఉండాల్సిన టెక్నాలజీ మనిషిని తన చేతిలోకి తెచ్చుకుంది.
మా కొలీగ్ ఒకతను గత నెల్లో సెల్ ఫోన్ వలన యాక్సిడెంట్లొ చనిపోయాడు. అతను కూర్చున్నది వెనక సీట్లో. నడుపుతున్నతను సెల్ ఫోన్లో మాట్లాడుతూ లారీ కిందకి వెనక కూర్చున్నతన్ని తోసేశాడు. అతని గుర్తు పట్టలేనంతగా తల చితికి పోయింది వెనక చక్రం కిందపడి.