గత సంవత్సరం చైనానుండి గూగుల్ తన వ్యాపారాన్ని ఉపసంహరించుకున్నంత పని చేసిన గూగుల్ చైనా ప్రభుత్వంతో తన ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగిస్తోంది. గత సంవత్సరంలో వలే నేరుగా చైనా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపనప్పటికీ గూగుల్‌కి చెందిన జి-మెయిల్ ఎకౌంట్ల ఐ.డి లను పాస్ వర్డ్ లను దొంగిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతూ ఇవి చైనా లోని జినాన్ నుండి జరుగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. ఫిషింగ్ ప్రక్రియ ద్వారా జిమెయిల్ వినియోగదారుల ఐ.డి, పాస్ వర్డులను సంపాదించి వాటి ద్వారా ఆ ఎకౌంట్ల కు వచ్చే మెయిళ్ళన్నింటినీ వేరే మెయిల్ కి రీడైరెక్టు చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని జిమెయిల్ ప్రకటించింది. కొన్ని వందల ఎకౌంట్లపై అటువంటి ప్రయత్నం జరిగిందనీ వారిలో అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారులు, చైనా రాజకీయ కార్యకర్తలు, అనేక ఆసియా దేశాల్లోని (ముఖ్యంగా దక్షిణ కోరియా) అధికారులు, మిలట్రీ అధికారులు, జర్నలిస్టుల ఉన్నారని తెలిపింది.
అమెరికా అధికారుల జిమెయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేస్తున్నారని గూగుల్ ఆరోపించినప్పటికీ అమెరికా వైట్ హౌస్ అధికారులు ఆ వార్తలను ఖండించారు. అమెరికా అధికారుల మెయిల్ ఖాతాలు హ్యాకింగ్ కి గురయినట్లు తాము భావించడం లేదని వారు తెలిపారు. అయితే ఆ రిపోర్టుల పైన దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం చైనా అసమ్మతివాదుల జిమెయిల్ ఎకౌంట్లను చైనా ప్రభుత్వం హ్యాకింగ్ చేస్తున్నదని ఆరోపిస్తూ గూగుల్ చైనా ప్రభుత్వ షరతుల మేరకు గూగుల్ సెర్చి ఫలితాల వడపోతకు నిరాకరించింది. టిబెటన్ల పోరాటం, ఫలూన్ గాంగ్ కార్యకలాపాలు, అసమ్మతి వాదుల వాదనలు, మానవ హక్కుల కార్యకర్తల వాదనలు మొదలైన అంశాలు సెర్చి ఫలితాల్లో రాకుండా వడపోత పోసే సాఫ్ట్ వేర్ వినియోగించాలని చైనా గూగుల్ పై షరతులు విధిస్తుంది. అలా వడపోత చేయనని గూగుల్ ప్రకటించి గూగుల్ చైనా పేజిని హాంకాంగ్ కి రీడైరెక్టు అయ్యేటట్లు ఏర్పాటు చేసింది. చైనా గూగుల్ ఆరోపణలను తిరస్కరించింది. హాంకాంగ్ గూగుల్ నుండి వచ్చే ట్రాఫిక్ ని తానే సెన్సార్ చేసింది. చైనాలో వ్యాపారం చేయాలంటే చైనా నిబంధనలు అనుసరించాల్సిందేనని తేల్చి చెప్పింది. మళ్ళీ బిజినెస్ లైసెన్సు పునరుద్ధరించే సమయానికి గూగులే దిగివచ్చి చైనా షరతులు అమలు చేయడం ప్రారంబించింది.
గూగుల్ చైనా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ చైనా పేజిని రద్దు చేసుకున్నాక అమెరికా ప్రభుత్వం కూడా గూగుల్ కి మద్దతుగావచ్చింది. ఇంటర్నెట్ స్వేచ్ఛను అడ్డుకోవడం పద్ధతి కాదని సుద్దులు చెప్పింది. ఇతర సాఫ్ట్ వేర్ సంస్ధలు కూడా గూగుల్ ని అనుసరించాలని పిలుపునిచ్చింది. కాని ఆవిడ పిలుపుని ఎవరూ పట్టించుకోలేదు. మైక్రో సాఫ్ట్ గూగుల్ వివాదాన్ని సిల్లీగా కొట్టిపారేసింది. యాహూ అసలు ఏమీ మాట్లాడలేదు. దానితో గూగుల్ కిక్కురుమనకుండా
చైనా షరతులను అంగీకరించింది. చైనాలో ఇంటర్నెట్ వాడకం చాలా ఎక్కువ. మరే దేశంలోనూ అంతమంది వినియోగదారులు లేరు. చైనా వ్యాపారం వదులుకోవడమంటే వ్యాపారాభివృద్ధికి గల అవకాశాల్లో గణనీయమైన భాగాన్ని వదులుకోవడమే. దానితో పాటు చైనాకి కూడా గూగుల్ లాంటి సంస్ధల అవసరం ఉంది. పదుల బిలియన్ల విలువ గల గూగుల్ లాంటి సంస్ధల ద్వారా వచ్చే బిజినెస్ వాతావరణం చైనాకి కావాలి. మొత్తం మీద చైనాకి గూగుల్ కావాలి. గూగుల్ కి చైనా కావాలి. దాంతో సమస్య తాత్కాలికంగా పరిష్కారం ఐంది. అసలు యూజర్ల డేటాని దొంగిలించడానికి ప్రతి అడ్డమైన పనికి పాల్పడే గూగుల్ చైనా ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడ్డమే ఓ విచిత్రం.
తాజాగా గూగుల్ చేసిన ప్రకటనతో కోల్డ్ వార్ మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. గూగుల్ ప్రకటన తర్వాత చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గూగుల్ ఆరోపణలని తోసిపుచ్చాడు. చైనాపై ఆరోపణలు ఆమోదనీయం కాదని తెలిపాడు. బిబిసికి చెందిన వాషింగ్టన్ విలేఖరి ఆడం బ్రూక్స్ ప్రకారం ‘ప్రభుత్వం గానీ, వ్యక్తులు గానీ అటువంటి దాడులకు బాధ్యులుగా నిర్ధారించండం చాలా కష్టం. కాని బాధితులు సున్నితమైన, ఒకోసారి రహస్యమైన సమాచారం తెలిసి ఉన్నవారు అయినందున ఈ మెయిళ్ళపై జరిగే దాడులను సైబర్ క్రైమ్ అనే బదులు సైబర్ గూఢచర్యం అని చెప్పాలని ఆయన సూచిస్తున్నాడు. అంటే అమెరికా ప్రభుత్వాధికారుల ఇమెయిళ్ళు హ్యకింగ్ అవుతున్నందూన, వారి దగ్గర ప్రభుత్వ రహస్యాలు ఉన్నందున చైనా ప్రభుత్వం తరపున గూఢచర్యానికి పాల్పడుతుండవచ్చు అని ఆయన ఉద్దేశ్యం. అయితే ఎవరు బాధ్యులైందీ తెలుసుకోలేనపుడు చైనా నుండే హ్యాకింగ్ జరిగిందని ఎలా నిర్ధారించగలరో ఆయన వివరించలేదు. అమెరికా ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ గూఢచర్యానికి దిగుతుంది. మర్యాద, గౌరవం తో ఉండాల్సిన రాయబారులను సైతం గూఢచర్యానికి వినియోగిస్తుంది. గూఢచర్యం తన హక్కు అని ప్రకటించడం ఒక్కటే మిగిలింది అన్నట్లుగా ప్రవర్తిసుంది. అటువంటి అహంభావ దేశానికి ఒక్క చైనా ఏం ఖర్మ ఇంకా బోలెడన్ని దేశాలు శత్రువులుగా ఉంటాయి. ముఖ్యంగా యూరప్ దేశాలు అందులో దిట్టలు.
