ఇ.కొలి: యూరప్‌నుండి కూరగాయల దిగుమతిని నిషేధించిన రష్యా


E. coli outbreak

ఇ.కొలి భయంతో కీర దోసకాయల్ని పారబోస్తున్న అమ్మకందార్లు

కీర దోసకాయల ద్వారా  ఇ.కొలి జబ్బు యూరప్ అంతటా విస్తురిస్తుండడంతో రష్యా యూరప్ నుండి గిగుమతి అయ్యే కూరగాయలన్నింటిని నిషేధించింది. దిగుమతి అయ్యే కూరగాయలు వేటినీ వాడవద్దని తన ప్రజలకు సూచించింది. దిగుమతి ఐన కూరగాయలకు బదులు రష్యాలో పండిన కూరగాయలను మాత్రమే వాడాలని హెచ్చరించింది. కూరగాయల భద్రతకు యూరప్ అనుసరిస్తున్న విధానాలను, ఆరోగ్య చట్టాన్ని రష్యా విమర్శించింది. ఈ పద్ధతినే అనుసరించాలని యూరప్ దేశాలు గత కొద్ది సంవత్సరాలుగా రష్యా పైన ఒత్తిడి తెస్తున్నాయి. యూరప్ విధానాలు విఫలమయ్యాయని రష్యా తెలిపింది. యూరప్ నుండి దిగుమతైన కూరగాయలన్నింటినీ స్టోర్ల నుండి తొలగిస్తామని రష్యా ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పాడు. ఈ వారం ప్రారంభంలో జర్మనీ, స్పెయిన్ ల నుండి కూరగాయలు, పండ్లు దిగుమతిని నిషేధించిన రష్యా, ఇప్పుడు యూరప్ అంతటికీ నిషేధాన్ని విస్తరించింది. వినియోగదారుల రక్షన ఏజెన్సీ అధిపతి ఈ నిషేధం ప్రకటించాడు.

ఇప్పటికి యూరప్ లో 1500 మంది ఇ.కోలి (ఎంటెరో హెమెరాజిక్ ఇ. కొలి – ఇ.హెచ్.ఇ.సి) బారిన పడ్డారని బిబిసి తెలిపింది. ఇ.కొలి హీమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ (హెచ్.యు.ఎస్) జబ్బును కలుగ జేస్తున్నది. దీని వలన కిడ్నీలు పని చేయడం ఆగిపోతాయి. రోగి రక్త విరోచనాలతో బాధపడతాడు. స్పెయిన్ నుండి వచ్చిన కీర దోసకాయలవలన ఇ.కొలి వ్యాపిస్తున్నదని జర్మనీ మొదట ప్రకటించింది. అయితే స్పెయిన్ జరిపిన విచారణలో స్పెయిన్ వైపు వేలెత్తి చూపడానికి ఎటువంటి ఆధారం లభ్యం కాలేదు. దానితో స్పెయిన్, జర్మనీని నస్టపరిహారం డిమాండ్ చేస్తొంది. స్పెయిన్ కూరగాయలపై ఇ.యు జారీచేసిన హెచ్చరికను ఉపసంహరించుకుంది. రష్యా నిషేధం వాస్తవ సమస్యతో పోలిస్తే అతిగా ఉందని యూరోపియన్ కమిషన్ ప్రతినిధి ఫ్రెడరిక్ విన్సెంట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిషేధంపై ఫిర్యాదు చేస్తామని తెలిపాడు. యూరప్ నుండి రష్యా ఎగుమతి అయ్యే కూరగాయలు, పండ్లు మొత్తం విలువ 3 – 4 బిలియన్ డాలర్లు ఉంటుందని తెలిపాడు. స్పెయిన్, ఫ్రాన్సు, జర్మనీ, పోలండులు ప్రధాన ఎగుమతిదారులనీ తెలిపాడు.

ఇ.కోలి జబ్బు విస్తరణను పర్యవేక్షిస్తున్న జర్మని ప్రజారోగ్య సంస్ధ అధికారి. ఈ జబ్బు నివారణకు కొన్ని నెలలు పట్టే అవకాశం ఉందని చెప్పాడు. ఈ బాక్టీరియా ఉన్న కూరగాయలు ఇంకా వేర్ హౌస్ (గిడ్డంగి) లలో ఉన్నాయా లేక బాక్టిరీయా ప్రారంభమైన ప్రాంతంలో బాక్టీరియా ఇంకా చురుకుగా ఉన్నదా అన్న విషయాలపై నివారణ ఆధారపడి ఉందని తెలిపాడు. బాక్టీరియా మొదలైంది స్పెయిన్‌లో కాదని నిర్ధారణ అయ్యాక అది ఎక్కడ ప్రారంభమైందీ తెలుసుకోడాఇకి యూరప్ దేశాలు వెతుకులాటలో పడిపోయాయి. జర్మనీలోని రాబర్టు కోచ్ సంస్ధ అధిపతి “బాక్టిరియా సోర్సు ఎక్కడో మనకు ఎప్పటికీ తెలియక పోవచ్చు” అని తెలిపాడు. ఒక్క బుధవారమే హెచ్.యు.ఎస్ కేసులు 365 తేలాయని ఆయన చెప్పాడు. వీటిలో రెండు అమెరికాలో కనుగొన్నారు. వీరిద్దరూ ఇటీవల జర్మనీలోని హాంబర్గు వెళ్ళి వచ్చారు. హాంబర్గు నగరం, దాని చుట్టూతా ఈ జబ్బు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది.

ప్రస్తుతం యూరప్ లో ఎనిమిది దేశాలలో ఇ.కొలి బాక్టీరియా బాధితులున్నట్లు తేలింది. ఆస్ట్రియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, స్విడ్జర్లాండ్, ఇంగ్లండు దేశాల్లో ఇ.కొలి విస్తరించి మనుషుల ప్రాణాలు తీస్తోంది. ఈ జబ్బు బాధితులందరూ ఏదో విధంగా జర్మనీతొ సంబంధం ఉన్నవారే. వారు జర్మనీ వాసులైనా అయి ఉన్నారు, లేదా జర్మనీకి ప్రయాణం చేసి వచ్చినవారైనా అయి ఉన్నారు. మొదట జబ్బుని స్పెయిన్ మీదకు తోసేసిన జర్మనీ స్పెయిన్ నస్టపరిహారాన్ని డిమాండ్ చేస్తుండడంతో ఇప్పుడు కిక్కురుమనడం లేదు. అధికారులు కూరగాయలు, పండ్లను శుభ్రంగా కడగాలనీ, ప్లేట్లు గ్లాసులనూ బాగా శుభ్రంగా ఉంచుకోవాలనీ, తినేముందు చేతులను కూడా సబ్బుతొ శుభ్రంగా కడుక్కోవాలనీ సలహా ఇస్తున్నారు.

వ్యాఖ్యానించండి