ఫుకుషిమా అణు ప్రమాదాన్ని జపాన్ తక్కువ అంచనా వేసింది -ఐక్యరాజ్య సమితి


Fukushima Daichi

ఫుకుషిమా దైచి అణు ప్లాంటు నమూనా చిత్రం

మార్చి 11 న సంభవించిన భూకంపం, ఆ తర్వాత పెద్ద ఎత్తున విరుచుకుపడిన సునామీ వలన ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రానికి జరిగిన ప్రమాదాన్ని జపాన్ ప్రభుత్వం తక్కువ అంచనా వేసిందని ఐక్యరాజ్య సమితి అణు ఇంధన సంస్ధ ఐ.ఎ.ఐ.ఎ తన ప్రాధమిక నివేదికలో పేర్కొన్నది. సముద్రం ఒడ్డున నిర్మించిన ఫుకుషిమా కేంద్రానికి సునామీ వలన ఏర్పడగల ప్రమాదాన్ని అంచనా వేయడంలోనూ, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలోనూ జపాల్ విఫలమైందని ఆ సంస్ధ తెలిపింది. నివేదికను ఐ.ఎ.ఇ.ఎ (ఇంటర్నేషనల్ ఎటామిక్ ఎనర్జీ ఏజన్సీ) జపాన్ ప్రభుత్వానికి అందించింది. సునామీ ప్రమాదాన్ని తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని జపాన్ గతంలోనే అంగీకరించింది. సముద్ర అలలు ప్లాంటులోకి రాకుండా ఉండటానికి 6 మీటర్ల ఎత్తుల రక్షణ గోడ నిర్మించగా సునామీ అలలు  14 మీటర్ల ఎత్తున ఎగసిపడడంతో ప్లాంటును అలలు బలంగా తాకాయని నివేదిక పేర్కొన్నది. అయితే ప్రమాదం తర్వాత జపాన్ ప్రభుత్వ స్పందన ఆదర్శవంతగా ఉందని నివేదిక కొనియాడింది.

అణు ప్రమాదాలు సంభవించినపుడు తగిన విధంగా స్పందించడానికి అంతర్జాతీయ స్ధాయిలో ఓ కఠినమైన అత్యవసరంగా స్పందించగల సంస్ధ అవసరమని ఐ.ఎ.ఇ.ఎ నివేదిక సిఫారసు చేసింది. ఐ.ఎ.ఇ.ఎ బృందం వారం రొజులపాటు ఫుకుషిమా అణు కర్మాగారంలో జరిగిన నష్టాల వివరాలను సేకరించి ప్రాధమిక నివేదికను తయారు చేసింది. పూర్తి నివేదిక ఇంకా తయారు చేయవలసి ఉంది. ప్రపంచ వ్యాపితంగా అణు భద్రత గురించి చర్చించడానికి వియన్నాలో అంతర్జాతియ స్ధాయిలో జూన్ నెలలోనే వివిధ దేశాల ప్రభుత్వాలు సమావేశం కానున్నాయి. ఐ.ఎ.ఇ.ఎ తన పూర్తి నివేదికను ఈ సమావేశంలో సమర్పిస్తుంది. సమితి బృందంలో బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్సు, అమెరికా దేశాలకు చెందిన నిపుణులు ఉన్నారు. వీరికి బ్రిటన్‌కి చెందిన మైక్ వెయిట్ మేన్ నాయకత్వం వహిస్తున్నాడు.

సునామీ అలలు అణు ప్లాంటులోని బేకప్ జనరేటర్లను (విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగినపుడు ప్లాంటుకు విద్యుత్‌ని అందించే జరరేటర్లు) పని చేయకుండా చేయడంతో విద్యుత్‌పై ఆధారపడి పనిచేసే రియాక్టర్లలోని కూలింగ్ వ్యవస్ధ పని చేయడం ఆగిపోయింది. దీనివలన రియాక్టర్లలో నీరు వేడెక్కి ఆవిరిగా మారడం, ఆవిరి ఇంధన రాడ్లతో చర్యజరిపి హైడ్రోజన్ వాయువుని సృష్టించడం వాయువు పరిమాణం పెరిగి రియాక్టర్ బిల్డింగ్ పేలిపోవడం సంభవించింది. దానితొ పాటు కూలింగ్‌కి ఉపయోగపడే నీరు తగ్గిపోవడంతో ఇంధన రాడ్లు నీటినుండి బైటపడి వేడెక్కడం రేడియేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఇంధన రాడ్లు బాగా వేడెక్కినపుడు కరిగిపోయి. ఆ ద్రవం రియాక్టరు కిందినుండి బైటికి వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది. అటువంటిది వినాశకరంగా పరిణమిస్తుంది. రాడ్లు కరగలేదని మొదట ప్లాంటు ఆపరేటర్ టెప్కో (టోకియో ఎలెక్ట్రిక్ పవర్ కంపెనీ) బుకాయించినప్పటికీ, వారం రోజులక్రితం రాడ్లు పాక్షికంగా కరిగిపోయాయని ఒప్పుకోక తప్పలేదు. రియాక్టర్లనుండి ఇప్పటికీ రేడియేషన్ విడుదల అవుతూనే ఉండడంతో ప్రమాదం ఇంకా ముగియలేదు.

“న్యూక్లియర్ ప్లాంటు డిజైనర్లు, ఆపరేటర్లు ఉనికిలో ఉన్న అన్ని రకాల ప్రకృతి వైపరీత్యాల వలన అణు ప్లాంటులకు సంభవించగల ప్రమాదాలను అంచనావేసి, అందుకు తగిన జాగ్రత్తలను ముందే తీసుకోవాలి” అని నిఫేదిక పేర్కొంది. “సునామితో ఏర్పడగలప్రమాదాన్ని చాలా అణు ప్లాంటలలో అంచనా వేయలేదు” అని నివేదిక ఎత్తి చూపింది. జపాన్‌లో మొత్తం 54 రియాక్టర్లు విద్యుదుత్పత్తికి నిర్మించగా, ఫుకుషిమా ప్రమాదం అనంతరం భద్రతా భయాలతో ఇప్పుడు 17 మాత్రమే పని ఛేస్తున్నాయి. అణు ప్లాంటుల్లో పని చేసే కార్మికులతో పాటు సాధారణ ప్రజానికానికి కూడా నిరంతరం రేడియేషన్ పరీక్షలు జరిపే ఏర్పాట్లను తప్పనిసరిగా చేయాలని నివేదిక నొక్కి చెప్పింది. అది కాక అణు పరిశ్రమల్లో స్వతంత్రంగా పనిచేసే నియంత్రణాధికారులు ఉండాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పింది. జపాన్‌కి చెందిన న్యూక్లియర్ భద్రతా ఏజెన్సీ అణు పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధీనంలోనే ఉంది. ఆ శాఖ అణు విద్యుత్‌ని ప్రోత్సహించే శాఖ. దాని కిందే రెగ్యులేటర్ ఏజన్సీ ఉండడం పట్ల జపాన్‌పై విమర్శలు వచ్చాయి.

ఐ.ఎ.ఇ.ఎ నివేదికను జపాన్ ప్రధాని సహాయకుడు అంగీకరిస్తున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ సహకారంతో ఫుకుషిమాలో సాధారణ పరిస్ధితి నెలకొల్పడానికి కృషి చేస్తామని ప్రభుత్వం, ఐ.ఎ.ఇ.ఎ తెలిపాయి. అయితే ఫుకుషిమా ప్రాంతాన్ని రేడియేషన్ రహితంగా శుభ్ర పరిచి ప్రజల ఆవాసాలను పునరుద్ధరించి సాధారణ పరిస్ధితులు నెలకొల్పడానికి 20 నుండి 30 సంవత్సరాల వరకు పడుతుందని తోషిబా, హిటాచి కంపెనీలు ఇప్పటికే అంచనావేశాయి. శుభ్రతకూ, పునర్నిర్మాణానికి ఈ రెండు కంపెనీలు పోటీ పడుతున్నాయి. ప్రతి ద్రవ్యోల్బణంతో (డిఫ్లేషన్) ఆర్ధిక వ్యవస్ధ మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పరిస్ధితుల్లో సునామీ విధ్వంసం ఒక విధంగా ఆర్ధిక వ్యవస్ధకు సాయం చేసిందని చెప్పవచ్చు. పునర్నిర్మాణానికి వివిధ ఉత్పత్తి సంస్ధలకు చేతినిండా పని దొరుకుతుంది. బోల్డన్ని కాంట్రాక్టులు లభిస్తాయి. ఇది ఆర్ధిక కార్యకలాపాలకు ఊపునిచ్చి జపాన్ ప్రతి ద్రవ్యోల్బణం నుండి బైటికి రావడానికి దోహదపడుతుంది. అయితే ఈ క్రమం ఈ సంవత్సరాంతానికి గానీ ప్రారంభం కాదని జపాన్ అధికారులు చెబుతున్నారు.

2 thoughts on “ఫుకుషిమా అణు ప్రమాదాన్ని జపాన్ తక్కువ అంచనా వేసింది -ఐక్యరాజ్య సమితి

వ్యాఖ్యానించండి