ఆదివారం కిడ్నాప్‌కి గురై మంగళవారం శవమై తేలిన విలేఖరి సలీం షాజద్ మరణంపై ఇపుడు అంతర్జాతీయ స్ధాయిలో దృష్టి కేంద్రీకృతమై ఉంది. షాజద్ కొన్ని రోజులుగా పాకిస్ధాన్ నౌకాదళ అధికారులతో కలిసి విస్తృతంగా సమాచారం సేకరించాడు. మే 22 న కరాచిలోని గట్టి భద్రతా ఏర్పాట్లు ఉండే నౌకాదళ స్ధావరంపై జరిగిన ఆల్-ఖైదా దాడిగురించి వివరాలు సేకరించాడు. మిలిటెంట్ల సమాచారాన్నీ సేకరించాడు. ఆయన జరిపిన పరిశోధనలో ఆల్-ఖైదా పాకిస్ధాన్ నౌకాదళంలో జొరబడిన సంగతి తెలిసింది. ఆల్-ఖైదా చొరబాటు పట్ల నౌకాదళ అధికారులు ఆందోళనగా ఉన్న సంగతి తెలిసింది. అభిమానం వరకు ఉంటే తప్పు లేదు అనుకున్న అధికారులకి అది అభిమానం స్ధాయిని దాటి రహస్య సెల్ ఏర్పాటు వరకూ వెళ్ళిందని తెలిసి దిద్దుబాటు చర్యలు చేపట్టిన క్రమంలోనే కరాచి దాడి జరిగిందని షాజద్ తెలుసుకున్నాడు. అయితే షాజద్ నౌకాదళ అధికారులను కలుస్తున్న విషయాన్ని పసిగట్టిన ఆల్-ఖైదా అభిమానులు తమ విషయాలు ఆ విలేఖరి ద్వారా బైటికి రానున్నాయని గ్రహించారు. ఆ విషయం ఐ.ఎస్.ఐకి చేరవేశారు.
లాడెన్ హత్య తర్వాత అప్పటికే అమెరికా, పాక్ ల మద్య పొరపొచ్చాలు తలెత్తిన పరిస్ధితిలో ఈ వివరాలు బైటకి వస్తే ఐ.ఎస్.ఐ లోని ఆల్-ఖైదా అనుకూలురపైనా, అలాగే మిలట్రీలో ఉన్న అనుకూలుర పైనా పైఅధికారులు ఒత్తిడి తెస్తే దానివలన వారి ఉనికికే ప్రమాదం రావచ్చు. పాక్ మిలట్రీ, ఐ.ఎస్.ఐ ద్వారా తమకు అందుతున్న సమాచారం, నిధులు అందకుండా పోతాయి. కనుక షాజద్ ఆ వివరాలను బైట పెట్టకుండా ఉండటానికే ఐ.ఎస్.ఐ అరెస్టు చేసి చంపెసిందని అర్ధమవుతోంది. కానీ సలీం షాజద్ అప్పటికే తన కధనంలొ ఒక భాగాన్ని ప్రచురించాడు. దాని ప్రకారం, పాక్ నేవీలో ఉన్న ఆల్-ఖైదా సానుభూతి పరులను అధికారులు అరెస్టు చేసి విచారించడానికి సిద్ధంగా ఉన్నారు. విచారించకుండా వదిలేయాలని ఆల్-ఖైదా కోరింది. ఇద్దరి మధ్య చర్చలు సఫలం కాకపోవడంతో స్ధావరంపై దాడి జరిగింది. ఘటనల క్రమాన్ని పరిశీలిస్తే:
మే 2 న అమెరికా కమెండోలు బిన్ లాడెన్‌ని చంపినట్లు ప్రకటించారు. అందుకు ప్రతీకారంగా కరాచిలో ఓ చర్య చేపట్టాలని ఆల్-ఖైదా గ్రూపులు ఏకాభిప్రాయానికి వచ్చాయి. లాడెన్ హత్యకి ప్రతీకారంతో పాటు భారత నౌకాదళాలపై నిఘా పెట్టడానికి పాకిస్ధాన్‌కి గల శక్తి సామర్ధ్యాలకు నష్టం చేయాలని కూడా ఆల్-ఖైదా గ్రూపులు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ రెండు లక్ష్యాల కంటే అసలైన లక్ష్యం వేరే ఉంది. పాక్ నేవీ లో ఉన్న ఆల్-ఖైదా అనుచరులపై నేవీ అధికారులు పెద్ద ఎత్తున విరుచుకు పడడానికి నిర్ణయించుకున్న సంగతి వారికి తెలిసింది. దాన్ని నివారించి తమ అనుచరగణాన్ని కాపాడుకోవడానికే ప్రధానంగా ఈ దాడి జరిగిందని సలీం షాజద్ కనుగొన్నాడు.
అంతకు ముందు కొన్ని వారాల క్రితం కరాచి లో ఉన్న అనేక నేవీ బేస్ లలో ఒక ఆల్-ఖైదా ఉన్న సంగతిని నేవీ గూఢచార సంస్ధ పసిగట్టింది. కరాచి పాకిస్ధాన్‌కి అతి పెద్ద నౌకా స్ధావరం. ముఖ్యమైన వ్యాపార కేంద్రం. అటువంటి చోట్ల నేవీ శక్తివంతంగా ఉండాలని ఏ దేశమైనా కోరుకుంటుంది. కనుక ఆల్-ఖైదాని ఏరివేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ఓ సీనియర్ నేవీ అధికారి షాజద్‌తో ఇలా చెప్పాడు, “ఇస్లామిక్ సెంటిమెంట్లు సైన్యంలో ఉండడం సర్వసాధారణం. వాటి వలన ప్రమాదం ఉంటుందని మేమెప్పుడూ భావించలేదు. అమెరికా అయినా, బ్రిటన్, ఇండియాలైనా సైనికులు తమ మతాలనుండి స్ఫూర్తి పొందుతారు. శత్రువుకి వ్యతిరేకంగా ఉత్సాహ పర్చడానికి మత సెంటిమెంట్లను ప్రోత్సహిస్తారు. అసలు పాకిస్ధాన్ ఉనికిలోకి వచ్చిందే ద్విజాతి సిద్ధాంతం ఆధారంగా హిందువులు, ముస్లింలకు చెరొక దేశం కావాలన్న సిద్ధాంతం ఆధారంగానే పాకిస్ధాన్ ఏర్పడింది. కనుక ఇస్లాంని గానీ, ఇస్లామిక్ సెంటిమెంట్లను గానీ పాక్ సైన్యం నుండి ఎవరూ వేరు చేయలేరు.” అని అధికారి తెలిపాడు.
“అయినప్పటికీ కరాచిలోని వివిధ బేస్‌లలో ఒక అననుకూలమైన గ్రూపింగ్ ఏర్పడడం మేము గమనించాము. మత సంబంధిత సంప్రదాయాలను నిర్వర్తించడానికి గానీ ఇస్లాంని అధ్యయనం చేయడానికి గానీ నౌకా దళాల బలగాలను ఎవరూ అడ్డుకోరు. కానీ మేము గమనించిన గ్రూపింగు సైనిక బలగాల క్రమశిక్షణకు వ్యతిరేకంగా ఉన్న సంగతి గ్రహించాము. నౌకా బలగాల్లో గూఢచర్యం జరపడానికి అదే ప్రారంభం నేవీలో జరిగే అవాంచనీయ కార్యకలాపాలను అడ్డుకోవాలని భావించాం. ఈ గ్రూపులు నేవీ బలగాల నాయకత్వానికి వ్యతిరేకంగా తయారయింది. ఇస్లామిక్ మిలెటెన్సీకి వ్యతిరేకంగా అమెరికాతో జత కట్టడం ఈ గ్రూపులకు ఇష్టం లేదు. పాక్ సందర్శిస్తున్న అమెరికా అధికారులపై దాడులు చేయాలని ఈ గ్రూపులు తలపెట్టిన సంగతి వారి సందేశాలపై నిఘా ద్వారా అర్ధమయింది. అందువలన వారిపై చర్య తీసుకోక తప్పదని నేవీ ఇంటలిజెన్సు భావించింది. జాగ్రత్తగా పరిశీలించాక వరుసగా జరిపిన ఆపరేషన్లలో కనీసం పదిమందిని (ఎక్కువమంది క్రింది కేడర్ వాళ్ళే) అరెస్టు చేశాము. దానితోనే పెద్ద సమస్య ప్రారంభమైంది” అని నేవీ అధికారి షాజద్ కి తెలిపాడు.
“అరెస్టు చేసిన వారిని నేవల్ ఇంటలిజెన్సు ఆఫీసులో ఉంచారు. అది ముఖ్యమంత్రి ఇంటి వెనకే ఉంటుంది. సరైన విచారణ ప్రారంభిస్తుండగానే విచారణాధికారికి మిలిటెంట్లు నేరుగా ఫోన్ చేసి బెదిరించారు. ఆ పదిమందిని ఎక్కడ ఉంచిందీ తమకు తెలుసని చెప్పారు. దాంతో వారిని మరొక భద్రమైన ప్రాంతానికి తరలించాము. కాని బెదిరింపులు ఆగలేదు. విచారణ వలన నేవీలో ఉన్న తమ ఇతర సానుభూతిపరుల సమాచారం కూడా తెలుస్తుందని మిలిటెంట్లు భయపడినట్లుగా విచారణాధికారులు భావించారు. ఆ పదిమందిని విడుదల చేయకపోతే నేవీ స్ధావరాలపైన దాడి చేస్తామని వారు బెదిరించారు. అరెస్టు చేసిన వారిని ఎక్కడ దాచినా వారెక్కడ ఉన్నదీ మిలిటెంట్లు చెప్పేస్తుండడంతో నేవీలో ఇంకా అధికంగా ఆల్-ఖైదా సానుభూతిపరులు ఉన్న సంగతి అర్ధమయ్యింది. వెంటనే ఓ సీనియర్ స్ధాయి నేవల్ కాన్ఫరెన్సుని ఏర్పాటు చేశాము. ఒక అధికారి పరిస్ధితిని జాగ్రత్తగా డీల్ చేయాలనీ, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని గట్టిగా సూచించాడు. దానికి అందరూ అంగీకరించారు. ఆల్-ఖైదాతో చర్చలు జరపడానికి నిర్ణయించాం.”
“అబ్దుల్ సమన్ మన్సూరి… ఇతను గతంలో విద్యార్ధి సంఘంలో నాయకుడు. ఇప్పుడు 313 బ్రిగేడ్‌కి నాయకుడు. కరాచి వాసి కానీ ఉత్తర వజీరిస్ధాన్ లొ ఉంటున్నాడు. అతనితో చర్చలు ప్రారంభీంచాం. అరెస్టు చేసిన నేవి అధికారుల్ని విచారణ చేయకుండా వెంటనే విడుదల చేయాలని అతను డిమాండ్ చేస్తే మేము నిరాకరించాం. వారిని వారి కుటుంబాలతో మాట్లాడనిచ్చాం. బాగా చూసుకున్నాం. కాని ఇంటలిజెన్సు వాళ్ళు వారిని విచారణ చేసి ఆల్-ఖైదా నేవీలో ఎంతవరకూ విస్తరించిందీ పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న నిశ్చయంతో ఉన్నారు. విచారణ పూర్తయ్యాక వారిని విధుల్లోంచి తొలగించి వదిలేస్తామని ఆల్-ఖైదాకి చెప్పాము. దానికి ఆల్-ఖైదా అంగీకరించకుండా ఏప్రిల్ లో మూడు నేవీ బస్సులపై దాడి చేసి తొమ్మిదిమందిని చంపేశారు. ఈ ఘటనలతో నేవీలో ఒక సెల్ కంటె ఎక్కువే ఉన్నట్లు ధృవపడింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే ఆఫ్ఘనిస్ధాన్ లోని అమెరికా (నాటో) సైనికులకి అందే సరఫరాలకు కొత్త ప్రమాదం తలెత్తుతుంది. నాటో దళాలకి జరిగే సరఫరాలు ఒక సారి కరాచిలో మొదలయ్యాక ఆఫ్ఘనిస్ధాన్ చేరే వరకూ నిరంతరం దాడులకు గురౌతూనే ఉంటాయి. ఇప్పుడవి కరాచి పోర్టులోనే దాడులకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. కరాచిలోని నేవీ స్ధావరాలకు అమెరికన్లు తరచు వస్తుంటారు. వారి ప్రాణాలకీ ప్రమాదమే.”
అందువలన అనివార్యంగా మరోసారి నౌకాదళ బలగాలపై నిఘా పెట్టి మరింత మందిని అరెస్టు చేశారు. ఈసారి అరెస్టయిన వారు అనేక తెగలకు చెందినవాళ్ళు. ఒక నేవల్ కమాండో ఉత్తర వజీరిస్ధాన్‌లోని మెహ్‌సూద్ తెగకి చెందినతను. హకీముల్లా మెహ్‌సూద్ నుండి అతనికి నేరుగా అదేశాలు అందుతాయని అనుమానం ఉంది. హకీముల్లా, తెహ్రీక్-ఎ-తాలిబాన్ (పాకిస్ధాన్ తాలిబాన్) కి నాయకుడు. ఇతరులు పంజాబ్ నుండీ, సింధ్ రాజధాని కరాచి నుండి వచ్చినవాళ్ళు. లాడెన్ హత్య తర్వాత ఒక పెద్ద యాక్షన్ కి టైమొచ్చిందని మిలిటెంట్లు నిర్ణయించుకున్నారు. ఓ వారంలోపు పి.ఎన్.ఎస్ మెహ్రాన్ నౌకా స్ధావరంలో ఉన్నవాళ్లు దానికి సంబంధించిన సవివరమైన మ్యాపులు ఇచ్చారు. లోపాలి ప్రాంతాలన్నింటినీ ఫోటోలు తీసి ఇచ్చారు. కొన్ని పగలూ, కొన్ని రాత్రీ తీసిన ఫోటోలవి. ఏది ఎక్కడుందీ స్పష్టంగా తెలిసిపోతుంది ఆ ఫోటోలు చూస్తే. వారి దాడి తర్వాత బైటి బలగాలు ఏ వైపు నుండి తమపై కాల్పులు జరిగుతాయో కూడా తెలుసుకున్నారు.
ఫలితంగా అత్యంత కఠిన మైన భద్రతా ఏర్పాట్లు ఉండే మెహ్రాన్ స్ధావరంపై దాడి జరిగింది. మూడు గ్రూపులుగా దాడి చేశారు. ఒక గ్రూపు సబ్‌మెరైన్ల మీద నీఘా పెట్టగల రెండు విమానాలపై దాడి చేసింది. రెండో గ్రూపు ఫస్ట్ స్ట్రైక్ దళం పైన దాడి చేసింది. మూడో గ్రూపు చేయాల్సిన నష్టమ్ చేసి ఇతరుల కాల్పులతో కవర్ తీసుకుంటూ తప్పించుకు పోయారు. అక్కడే ఉన్నవారు భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయారు. అధికారిక అంచనా ప్రకారం మొత్తం ఆరుగురు దాడి చేస్తే నలుగురు చనిపోయారు. ఇద్దరు తప్పించుకున్నారు. కాని అనధికారిక లెక్కలు వేరే ఉన్నాయి. దాని ప్రకారం ఆరుగురు తప్పించుకుంటే నలుగురు చనిపోయారు.
(ఇంతవరకూ సలీం షాజద్ రాసిన ఆర్టికల్ కి స్వేచ్ఛానువాదం)
ఇది షాజద్ రాసిన ఆర్టికల్ లొ మొదటి భాగం. మిలిటెంట్ల రిక్రూట్‌మెంటు, ట్రైనింగ్ పైన రెండో ఆర్టికల్ రాస్తున్నట్లుగా షాజద్ మొదటి వ్యాసం క్రింద సూచన ఇచ్చాడు. ఈ లొగానే ఐ.ఎస్.ఐ చేతిలో చనిపోయాడని భావిస్తున్నారు. ఈ ఘటనతో పాకిస్ధాన్ సైన్యాన్ని, కనీసం నౌకాదళ బలగాల్ని ప్రక్షాళన అయిపోయినట్లు కాదని భావించాలు. మిలిటెన్సీ కేవల మిలిటెన్సీ కోసమో, భయోత్పాతాలకు గురిచేయడానికి మాత్రమే జనించదు. “రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి టెర్రరిస్టు చర్యలకు పాల్పడేదే టెర్రరిజం” అని టెర్రరిజానికి నిర్వచనం. పాకిస్ధాన్ సైన్యంలోని మిలిటెంట్లకు గానీ తాలిబాన్, ఆల్-ఖైదా మిలిటెంట్లకు గాని ఉన్న లక్ష్యం ఆఫ్ఘనిస్ధాన్‌ని దురాక్రమించిన అమెరికా సైన్యాన్ని అక్కడినుండి తరిమి కొట్టడం. అది జరిగే దాకా మిలిటెన్సీ సమసి పోదు. సమసి పొతే అది మిలిటెన్సీయే కాదు.

పింగ్‌బ్యాక్: ఆల్-ఖైదా, పాక్ నేవీ ల సంబంధాలు వెల్లడించిన పాక్ విలేఖరి దారుణ హత్య « తెలుగులో జాతీయ అంతర్జాత