ప్రధాని మంచోడే, రిమోట్ కంట్రోల్ తోనే సమస్య -అన్నా హజారే


Hajaare vs Sonia

రిమోట్ కంట్రోల్‌తోనే సమస్య! `ఓహో!!

భారత రాజకీయ నాయకులు , బ్యూరోక్రట్ల అవినీతిని అంతం చేయడానికే కంకణం కట్టాడని భావిస్తున్న అన్నా హజారే తాజాగా సోనియా గాంధీని తన విమర్శలకు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. బెంగుళూరులో ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్‌కు క్లీన్ సర్టిఫికెట్ ఇస్తూ రిమోట్ కంట్రోలు వల్ల సమస్యలు వస్తున్నాయని సంచలన ప్రకటన చేశాడు. “ప్రధాన మంత్రి మంచి వ్యక్తి. ప్రధాన మంత్రి చెడ్డవాడు కాడు. రిమోట్ కంట్రోలు కారణంగా సమస్యలు వస్తున్నాయి” అని బహిరంగ సభలొ చెప్పాడు.

తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ “ఏ ప్రభుత్వంలో నైనా ప్రజల అధికారమే చాలా బలమైనదని ఇప్పుడు మనమంతా విశ్వసిస్తున్నాం” అని వాక్రుచ్చారు. ఆగస్టు 16 లోగా లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందని పక్షంలో జంతర్ మంతర్ కి తిరిగి వస్తానని హజారే తెలిపాడు. మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటించాడు. పనిలో పనిగా కర్ణాటక ప్రజలను ‘జైల్ భరో’ కార్యక్రమం నిర్వాహించాలని కోరాడు.తన అవినీతి వ్యతిరేక ప్రచారం వలన ఆరుగురు మంత్రులు రాజీనామా చేయవలసి వచ్చిందని అన్నా హజారే సభలో తెలిపాడు. ఆ అరుగురు పేర్లు మాత్రం హజారే తెలియజేయలేదు. ఆ అరుగురే తనపైన ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించారని తెలుపుతూ, తనపైన ఏ మచ్చా లేకపోవడంతో వారికి తమ ప్రతీకారం తీర్చుకోవడం సాధ్యపడలేదని ఆయన తెలిపాడు.

జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ముగిస్తూ హజారే లోక్ పాల్ బిల్లు తయారీ కోసం జరిగే చర్చలు పారదర్శకంగా ఉంటాయని హామీ ఇచ్చాడు. ఇంతవరకూ ఏమేమి చర్చించారో, బిల్లు సంగతి ఎంతవరకు వచ్చిందో హజారే ఇంకా బహిరంగ పరచలేదు. రిమోట్ కంట్రోలంటే ఎవరో, వారు ఏయే సమస్యలను కలిగిస్తున్నారో ప్రజలకు తెలియ జేయడం హజారే భాధ్యత. పేరు చెప్పకుండా రిమోట్ కంట్రోలని పరోక్షంగా ఎత్తి చూపడం, అదే సమయంలో ప్రభుత్వంలోని మరో వ్యక్తిని మెచ్చుకోవడం సరైందో కాదో హజారే గారు ఆలోచించాల్సి ఉంది. అలా చేయడం కంటే సమస్యలు సృష్టిస్తున్నవారు ఎవరు, వారు ఏ సమస్య సృష్టించారు, ప్రధానిని చర్యలు తీసుకోకుండా అడ్డు పడుతున్నారా మొదలైన విషయాలని చెప్పి, ఆ తర్వాత తప్పొప్పులను, మంచి చెడ్డలను ఎంచడం ఉచితంగా ఉంటుంది.

ప్రధాని మన్మోహన్ మంచి వాడని సర్టిఫికెట్ ఇవ్వడానికి హజారే గారి కొలబద్ద ఏమిటో తెలియదు. ఆయనే గుజరాత్ సి.ఎం నరేంద్ర మోడిని పొగడం, ఫలితంగా చాలామంది హజారేని విమర్శించడం తెలిసిందే. ప్రధాని మన్మోహన్ భారత దేశంలో నూతన ఆర్ధిక విధానాలను ప్రవేశ పెట్టడానికి ప్రధాన భాధ్యుల్లో ఒకరు. ఐ.ఎం.ఎఫ్ వద్ద అప్పుతీసుకుని అది విధించిన షరతుల్లో భాగంగా రూపాయి విలువను రెండు రోజుల తేదాతో నలభై శాతం తగ్గించడంతో తన ప్రజాసేవ(!)ను ప్రారంభించిన మన్మోహన్, భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను అమెరికా నాయకత్వంలోని పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు అనుబంధ ఆర్ధిక వ్యవస్ధగా మార్చడానికి తన కృషిని ఇనుమడించిన ఉత్సాహంతో కొనసాగీస్తూనే ఉన్నాడు.

ఆరుబయట నిలవ చేయడం వలన ధాన్యం పాడవుతున్నందున ఆకలితో చనిపోతున్న కడు పేదలకు ఆ ధాన్యాన్ని ఉచితంగా ఇవ్వండని సుప్రీం కోర్టు కోరితే “కోర్టులు ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు” అని హుంకరించిన ప్రధానిలో ఏ మంచితనం కనిపించిందో హజారే తెలియజేయాలి. డెబ్భై లక్షల కోట్లకు పైగా భారత ప్రజాధనం రాజకీయులు, అక్రమార్కులు, బ్యూరోక్రట్లు విదేశీ బ్యాంకుల్లో కూడ బెట్టారనీ, వారిలో కొన్ని పేర్లను సదరు బ్యాంకు భారత ప్రభుత్వానికి పంపించిందనీ అందరికీ తెలిసిన విషయమే. ఆ పేర్లను బైటపెట్టమని సుప్రీం కోర్టు కోరితే “విదేశీ ఒప్పందాలు అందుకు ఒప్పుకోవని” అభ్యంతరం చెబుతున్న మన ప్రధానిలో మంచితనం ఏ కోణంలో నుంచి దర్శించగలిగారో హజారే భారత ప్రజలకి తెలీయ జేయాలి. ఇంతకీ ఆ పేర్లుగల వారు ఎగవేసిన ఆదాయపన్నును వసూలు చేయడానికే తప్ప వారి అవినీతిపై విచారణ చేయడానికి సిద్ధంగా లేని ప్రధానిలో నిజాయితీని చూడగలమా?

భారత ప్రజలకు కొద్దో గొప్పో ఉద్యోగాలు సమకూర్చిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను సగానికి పైగా మన్మోహన్ ఆర్ధిక విధానాలు సర్వ నాశనం చేశాయి. లక్షల మంది ఉద్యోగాలు పోయి రోడ్లపాలయ్యారు. విదేశీ కంపెనీలకు గేట్లు బాగ్లా తెరిచి దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు లక్షల సంఖ్యలో మూసివేతకు గురయ్యాయి. ఇరవై సంవత్సరాల నుండి ఒక్కో అడుగు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు పూర్తిగా పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు ధరలపై నియంత్రణలను ఎత్తివేయించి వేటినీ సామాన్య మానవుడికి అందుబాటులోకి లేకుండా చేశారు. మన్మోహన్ ఆర్ధిక మంత్రీ అయ్యేనాటికి లీటరు 10 రూ.లు ఉన్న పేట్రోలు ఇప్పుడు 70 రూ.లు. 60 రూ.లు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇప్పుడు దాదాపు రు.400/-. కానీ టాటాలు, అంబానీల ఆస్తులు మాత్రం పదుల వేల నుంఛి లక్షల కోట్ల రూ.ల కు చేరుకున్నాయి. మంత్రుల విదేశీ ఎకౌంట్ల బ్యాలెన్సులు పదుల వేల కోట్లకు చేరుకున్నాయి. ఇదేనా ప్రదాని నిజాయితీ?

కమ్యూనికేషన్ల మంత్రి 1,76,000 కోట్ల రూ.ల నష్టాన్ని ప్రభుత్వ ఖజానాకి తెస్తుంటే చూస్తూ కూడా ఒక్క లేఖతో సరిపెట్టి పైగా కూటమి రాజకీయాలపైకి నెపాన్ని నెట్టివేసిన మన్మోహన్‌లో నిజాయితీని చూడగలమా? సీనియర్ అధికారి ధామస్ ఓ అవినీతి కుంభకోణానికి బాధ్యుడని ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ చెబుతున్నా పట్టించుకోకుండా ఆయన్నే సెంట్రల్ విజిలెన్సు కమిషనర్ గా నియమించిన ప్రధాని నిజాయితీ ఎంత లోతుకు దిగజారితే చూడగలం? జపాన్‌లోని ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో ప్రమాదం ఏర్పడి ఇప్పటికీ రేడియేషన్ విడుదలను కట్టడి చేయలేక సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన జపాన్ సైతం చేస్టలుడిగి చూస్తుంటే పశ్చిమ దేశాలే తమ అణు విద్యుత్ విధానాన్ని సమీక్షిస్తున్నామని ప్రకటిస్తే, ఎట్టి పరిస్ధితుల్లోనూ అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి తీరతామని ప్రతిని బూని, అమెరికా జపాన్ ల బహుళజాతి కంపెనీలకు సంతసం కలగ జేసి భారత ప్రజలకు లాఠీ దెబ్బలు, తూటాలు రుచి చూపిస్తున్న ప్రధాని మన్మోహన్, ఆయన మంత్రివర్గం నిజాయితీ, నేతి బీరలో నెయ్యి కాదా?

నియమగిరి కొండ అక్కది గిరిజనుల సంస్కృతితో ముడి పడి ఉన్న ప్రాంతం. ఆ కొండపై గల వృక్ష జాతుల నుండే వారి జీవనాధారం దొరుకుతుంది. ఆ కొండనీ దాని చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతాన్ని పర్యావరణ శాక మంత్రి జైరాం రమేష్ పైన ఒత్తిడి తెచ్చి వేదాంత కంపెనీకి బాక్సైట్ ఖనిజం కోసం అప్పజెప్పాలని చూస్తున్న మన్మోహన్ నీతి మంతుడా? ఆరేడేళ్ళనుండి ఒరిస్సాలో తమ సర్వస్వం ఐన అడవిని కాపాడుకోవడానికి ఉద్యమిస్తున్న గిరిజనుల అభ్యంతరాలను ఏ మాత్రం లెక్క చేయకుండా పోస్కో ఉక్కు పరిశ్రమ స్ధాపనకు తానిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడాన్ని తన వ్యక్తిగత ప్రతిష్టగా ఎంచి రద్దు చేసిన అనుమతిని పునరుద్ధరించిన ప్రధాని మన్మోహన్ నిజాయితీ పరుడా?

ఇంతకీ, అన్నా హజారే గారూ! నీతి అంటే ఏమిటి? నిజాయితీ అంటే ఏమిటి? మంచోడంటే ఎవరు? చెడ్డవాడంటే ఎవరు?

ప్రజల కడుపులపై తన్నుతున్న పాలకుడి మంచి ఎవరి ఉద్ధరణకి?

గిరిజనులు అన్నం తినే విస్తరాకులో మన్ను కుమ్మరించే మంత్రగాడి వరం ఏ పిశాచాలకి?

ఆకలి కేకల జీవితాలను ఛిద్రం చేసే అభివృద్ధి రధ సారధి గమ్యం ఏ శ్మశానానికి?

సెలవివ్వగలరా హజారే???

వ్యాఖ్యానించండి