గూగుల్ పాపాల జాబితాలో మరొక పాపం చేరింది. శిశుపాలుడి పాపాలను శ్రీ కృష్ణుడు వందవరకే అనుమతించాడు. గూగుల్ పాపాలకు మాత్రం అంతూ పొంతూ ఉండడం లేదు. ప్రమాద వశాత్తూ బిలియనీర్ అయిన కంపెనీల్లో ఒకటిగా మొదట పేరు పొందిన గూగుల్ ఆ తర్వాత నియమ నిబంధనల్లోని లొసుగులను ఉపయోగించుకుంటూ, ఇంటర్నెట్ ద్వారా వినియోగదారుల వ్యక్తిగత వివరాలను దొంగిలిస్తూ, ఒక మాదిరి కంపెనీలన్నింటినీ అక్విజిషన్ల ద్వారా మింగివేస్తూ అనతి కాలంలోనే అతి పెద్ద కంప్యూటర్ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఒకటిగా స్ధానం సంపాదించింది. అనేక ఉచిత సర్వీసులతో అతి పెద్ద యూజర్ల డేటా బ్యాంకును నెలకొల్పుకున్న గూగుల్ “స్ట్రీట్ వ్యూ” లాంటి ప్రాజెక్టుల మాటున వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న వినియోగదారుల కంప్యూటర్లనుండి ఈ మెయిళ్లు, వాటి పాస్‌వర్డులతో సహా అనేక వివరాలను దొంగిలిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ దొంగతనం నేరంపై గూగుల్ పైన అమెరికాతో సహా ఇతర పశ్చిమ దేశాల్లోనూ, దక్షిణ కొరియాలాంటి దేశాల్లో కూడా దర్యాప్తు జరుగుతున్న సంగతి కూడా తెలిసిందే.
తాజాగా అలయన్సు చర్చల పేరుతో పేపాల్ ఉన్నత స్ధాయి ఉద్యోగులను తన కంపెనీలోకి ఆహ్వానించి వారి ద్వారా పేపాల్ వ్యాపార రహస్యాలను దొంగిలించి వాటి ఆధారంగా కొత్త సర్వీసును గూగుల్ ప్రారంభించిందని పేపాల్ సంస్ధ ఆరోపిస్తున్నది. వ్యవహారం కోర్టులవరకూ పోయింది. నియమ నిబంధనలను వల్లిస్తూ వాటి మాటున తన అనైతిక కార్యాన్ని సమర్ధించుకోవాలని చూస్తున్నదని పేపాల్ ఆరోపించింది. గూగుల్ ప్రవేశ పెట్టిన నూతన సర్వీసు ద్వారా ఏండ్రాయిడ్‌ను ఆపరేటింగ్ సర్వీసుగా వినియోగించే మొబైల్ వినియోగదారులు తమ మొబైళ్ళను ఎలెక్ట్రానిక్ వాలెట్ గా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తోంది. స్మార్ట్ ఫోన్లను వినియోగించి క్రెడిట్, డెబిట్ కార్డులవలే కొనుగోళ్ళు చేసే అవకాశాన్ని ఈ కొత్త సర్వీసు కల్పిస్తున్నదని తెలుస్తోంది. క్రెడిట్ కార్డులకు బదులు స్మార్ట్ ఫోన్లు వినియోగించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. తన ఉద్యోగులను ఆకర్ధించి తన కంపెనీ ఐడియాలను గూగుల్ దొంగిలించిందని ఇ-బే అనుబంధ సంస్ధ పేపాల్ కాలిఫోర్నియా కోర్టులో కేసు దాఖలు చేసింది.
ఏండ్రాయిడ్ స్మార్టు ఫోన్ల నిమిత్తం చెల్లింపులను సానుకూలం చేయడానికి పేపాల్ మూడు సంవత్సరాలు తీవ్రంగా కస్టపడినట్లుగా ఆ సంస్ధ తెలిపింది. గూగుల్, పేపాల్ సంస్ధలు ఉమ్మడి సర్వీసు చేపట్టడానికి అలయెన్సు కోసం చర్చలు జరుపుతూ వారి ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే తరుణంలో గూగుల్ అకస్మాత్తుగా చర్చలకు ఎగనామం పెట్టింది. గూగుల్ తో చర్చలు జరపడానికి పేపాల్ తరపున పాల్గొన్న ప్రతినిధుల్లో ప్రధానమైన ఉద్యోగి ఒసామా బెడియర్ ను గూగుల్ తన కంపెనీలోకి లాగేసుకుందని కోర్టు డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఇ-బేలో ఉద్యోగిగా ఉంటూ వచ్చిన స్టెఫనీ టిలేనియస్ ని కూడా గూగుల్ అలాగే లాగేసుకుందని పేపాల్ ఆరోపిస్తున్నది.
పేపాల్ ఆరోపణలకు శుక్రవారం గూగుల్ తన సమాధానాలను కోర్టుకు సమర్పించింది. తన మొబైల్ చెల్లింపుల సర్వీసు నిర్వహణ కోసం నిపుణుడైన, తెలివిగల వారిని తాను ఎన్నుకున్నాననీ, వారికి నిరాకరించడానికి మనసొప్పని స్ధాయిలో వేతనాన్ని ఇవ్వజూపాననీ తన సమాధానంలో గూగుల్ పేర్కొంది. “తమ విజ్ఞానం, నైపుణ్యాలను వినియోగిస్తూ మెరుగైన ఉద్యోగావకాశాలను సొంతం చేసుకోగల వ్యక్తుల సామర్ధ్యంపై సిలికాన్ వాలీ నిర్మితమయ్యింది. పబ్లిక్ పాలసీ తో పాటు కాలిఫోర్నియా చట్టాలు కూడా ఈ సూత్రాన్ని గుర్తించాయి” అని గూగుల్ ప్రతినిధి ఏరాన్ జామోస్త్ తెలిపినట్లుగా ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధ తెలిపింది. “వ్యాపార రహస్యాలను మేము గౌరవిస్తాము. మాపై వచ్చిన ఆరోపణలనుండి మమ్ములను కాపాడుకుంటాము” అని ఏరాన్ తెలిపారు.
రెండు కంపెనీలు అలయన్సు ఏర్పాటుకు చర్చలు జరుపుతుండగానే పేపాల్ ఉద్యోగి బెడియర్ ను తొమ్మిది సంవత్సరాలకు కొనుగోలు చేసింది. ప్రారంభంలో కొంత వెనకాడినా నాలుగు నెలల క్రితం బెడియర్ పేపాల్ ని వదిలి గూగుల్ చెల్లింపులకు వైస్ ప్రెసిడెంట్ గా నియమితుడయ్యాడు. పేపాల్ ని వదిలి వెళ్ళే ముందు బెడియర్ పేపాల్ రహస్యాల్లో కొన్నింటిని తన కంప్యూటర్ కు బదలాయించినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఇతర సున్నితమైన సమాచారాన్ని ‘డ్రాప్ బాక్సు’ అనే పేరుగల ఇంటర్నెట్ స్టోరేజి లాకర్ కి అప్‌లోడ్ చేసాడనీ తెలుస్తోంది. బెడియర్ గూగుల్ లో చేరకముందునుండే పేపాల్ చెల్లింపుల విభాగంలో పని చేస్తున్న ఇతర ఉద్యోగులను గూగుల్ లోకి రావలసిందిగా లాబీయింగ్ జరిపినట్లు పేపాల్ ఆరోపించింది.
ఈ ఆరోపణలు గూగుల్ కి కొత్త కాదు. మైక్రోసావ్ట్ కూడా గతంలో ఈ ఆరోపణే గూగుల్ పైన చేసించి. తన చైనా వ్యాపార కార్యకలాపాలను చూడ్డానికి మైక్రో సాఫ్ట్ లో పని చేస్తున్న ఒక అధికారిని ఆరు సంవత్సరాల క్రితం గూగుల్ తన్నుకు పోయింది. మైక్రో సాఫ్ట్ కోర్టులో కేసు కూడా వేసింది. ఆ సందర్భంగా రెండు కంపెనీలూ కోర్టుకు సమర్పించిన డాక్యుమంట్లు గూగుల్, మైక్రో సాఫ్టు ల మధ్య సాగుతున్న వైరం గురించిన అనేక వివరాలను పత్రికలు బైటపెట్టాయి. “డోన్ట్ గో ఈవిల్” అన్నది గూగుల్ మోటో. గూగుల్ సరిగ్గా దానికి వ్యతిరేకంగా వ్యవరించే ఇప్పటి స్ధాయికి చేరుకోవలిగిందని దాని చరిత్ర తెలియ చేస్తుంది. అనైతిక కార్యకలాపాలే పెట్టుబడిగా పోటీ కంపెనీలను కూలదోస్తూ, సాధ్యం కాకపోతే విలీనం చేసుకుంటూ మాత్రమే పెట్టుబడి దారీ వ్యవస్ధలో వ్యాపర కంపెనీలు బహుళజాతి సంస్ధలుగా రూపాంతరం చెంది ప్రపంచ రాజకీయాలను, ఆర్ధిక వ్యవస్ధలను శాసించగలుగుతున్నాయి.
