ఔట్‌లుక్ ఇంటర్వూ: బి.జె.పిలో సుష్మా, జైట్లీ ల ఆధిపత్య పోరు


Jaitley Sushma

అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్

బి.జె.పి పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఔట్‌లుక్ వార పత్రిక తాజా సంచికకు ఇంటర్వూ ఇస్తూ ఇనప ఖనిజ అక్రమ తవ్వకాల్లో వేల కోట్లు కాజేసిన గాలి బ్రదర్సుకి కర్ణాటక ప్రభుత్వంలో మంత్రి పదవులిచ్చి పైకి తేవడానికి బాధ్యతను బి.జె.పిలోని మరో నాయకుడు, రాజ్యసభలో బి.జె.పి నాయకుడూ ఐన అరుణ జైట్లీ పైకి నెట్టేసింది. బి.జె.పి పార్టీకి భావి నాయకులుగా భావిస్తున్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇలా బహిరంగంగా వేలెత్తి చూపించడం చర్చనీయాంశంగా మారింది. గాలి బ్రదర్సుని ప్రోత్సహించడం వెనక తన పాత్రేమీ లేదనీ, అప్పట్లో కర్ణాటక వ్యవహారాలను చూసిన వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలే దానికి భాద్యత వహించాలనీ సుష్మా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం బి.జె.పి పార్టిలో చిన్న కలకలాన్ని రేకెత్తించింది.

సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ ల మధ్య పార్టీలో అధిపత్యం కోసం, భవిష్యత్తులో రానున్న కేంద్ర ప్రభుత్వ అధికారంలో పెత్తనం కోసం అంతర్గతంగా నడుస్తున్న పోరు ఔట్‌లుక్ ఇంటర్వూతో బైటపడ్డట్లయ్యింది. ముఠా తగాదాల పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీని పదే పదే ఈసడించుకునే వెంకయ్య నాయుడు తాజా కలకలం లో ఓ ముఠాలో పాత్రధారిగా బైటపడడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు. ప్రజల బాగోగుల కంటే పదవులపైనా, అధికారం పైనా వ్యామోహం పెంచుకునే భారత పాలక పార్టీల నాయకులు అనివార్యంగా ముఠాల కుమ్ములాటల్లో భాగస్వాములవుతారు. కాంగ్రెస్ ఎప్పటినుండో అధికారం చెలాయిస్తున్నది గనక అక్కడ ముఠాలకు లెక్క తెలియదు. ఒక్క సారే అధికారం చేపట్టిన బి.జె.పిలో కాంగ్రెస్ తో పోలిస్తే ముఠాలు తక్కువే కావచ్చు గానీ మునుముందు ఆ సంఖ్య పెరుగుతుందనడంలో అనుమానాలు అనవసరం.

సుష్మా స్వరాజ్ మాస్ అప్పీల్ ఉన్న నాయకురాలు కాగా, అరుణ్ జైట్లీ పార్టీలో ఉన్నత స్ధానాల్లో ఉన్న నాయకులతో సందర్భానుసారం దోస్తీలు కట్టి పలుకుబడి సాధించగల దిట్ట అని పేరు. రాజకీయాల్లో వ్యూహాలు పన్నడంలో చతురుడుగా పేరు పొందిన అరుణ్ జైట్లీ ఈ మద్య కాలంలో సుష్మా స్వరాజ్ పైన పై చేయి సాధించినట్లు కనిపిస్తున్నది. ఉదాహరణకి 2జి కుంభకోణం విషయంలో పార్లమెంటులో శీతాకాల సమావేశాలను జరగకుండా చేసి కాంగ్రెస్ పార్టీని జాయింట్ పార్లమెంటు కమిటీకి (జె.పి.సి) ఒప్పించడంలో సుష్మా విజయం సాధించినప్పటికీ సంక్షోభం ముగిసే రోజుల్లో సివిసి గా నియమించబడీన్ ధామస్ ని తొలగించాక ఆమే చేసిన వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యలకు విరుద్ధంగా జైట్లీ చేసిన ప్రతి వ్యాఖ్యలు జైట్లీకి మద్దతునూ, సుష్మాకి ఖండన మండనలనూ సంపాదించి పెట్టాయి.

సివిసిగా ధామస్ నియామకం చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పడంతో అప్పటివరకూ ధామస్ నియామకాన్ని వెనకేసుకు వస్తున్న ప్రధాని మన్మోహన్ అకస్మాత్తుగా స్వరం మార్చి పార్లమెంటు బయట క్షమాపణ ప్రకటించాడు. కాని పార్లమెంటులో మాత్రం క్షమాపణ చెప్పకుండా సమర్ధనా ధోరణితో మాట్లాడడంతో సుష్మా స్వరాజ్ ఎత్తి చూపి పార్లమెంటులో మళ్ళీ క్షమాపణ చెప్పేలా ఒత్తిడి తెచ్చి సాధించింది. ప్రధాని దామస్ విషయంలో భాద్యతను అంగీకరించినందున ఆ

విషయం అక్కడితో ముగిసినట్లు భావించాలని సుష్మా ప్రకటించడాన్ని జైట్లీ పరోక్షంగా ఖండించాడు. బాధ్యత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతోనే సమస్య ముగిసిపోలేదని దోషులకు శిక్ష పడేవరకూ కాంగ్రెస్ తో పోరాడతామని జైట్లీ ప్రకటించాడు. బి.జె.పి అధ్యక్షుడు, ఆర్.ఎస్.ఎస్ నామినీ అయిన నితిన్ గడ్కారీ విలేఖరుల వద్ద సుష్మా వ్యాఖ్యకు వ్యతిరేకంగా జైట్లీకి మద్దతుగా మాట్లాడ్డంతో జైట్లీ పైచేయి రుజువయ్యింది. సుష్మను ఖండించకుండానే ఆ అంశాన్ని సమర్ధించుకోగల అవకాశాలున్నా గడ్కారీ జైట్లీకి మద్దతుగా రావడం గమనార్హం.

సుష్మా స్వరాజ్ పార్టీలో సెంట్రిస్టు భావాలవైపు మొగ్గు చూపే నాయకురాలుగా, జైట్లీ రైటిస్టు భావాలకు మద్దతుదారుగా పత్రికలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రస్తావించడం మాములయ్యింది. సూటిగా చెప్పాలంటే సుష్మా వాజ్‌పేయి వారసత్వాన్నీ, జైట్లీ అద్వానీ వారసత్వాన్ని కొనసాగించే వారుగా ముద్ర వేస్తున్నారు. నిజానికి ఇందులో వాస్తవం లేదనే చెప్పాలి. వాజ్‌పేయి, అద్వానీ ల మద్య సైద్ధాంతిక విభేధాలు ఉన్నాయనడమే సరైంది కాదు. కాకుంటే సందర్భానికి తగ్గట్లుగా వివిధ పాత్రల్లోకి దూరగల చతురత వాజ్‌పేయి సొంతమైతే అద్వాని అటువంటి చతురతను ప్రదర్శించబోయి అనేక సార్లు విఫలమవడాన్నే గుర్తించాల్సి ఉంటుంది. వాజ్‌పేయి తాను పక్కా ఆర్.ఎస్.ఎస్ వాదినని చెప్పుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అద్వాని కంటే కఠినంగా ఉపన్యాసాలిచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టిన సందర్భాలూ అనేక ఉన్నాయి. అదే వాజ్‌పేయి అవసరమైతే పార్టీ అవసరాల కోసం, ఎన్నికల అవసరాల కోసం మోడరేట్ గా మారగలడు. ప్రధానంగా మోడరేట్ గా కనిపిస్తూ, అద్వానీని మించిన అతివాదాన్ని వాజ్‌పేయి చూపిన ఘటనలు కోకొల్లలు.

ఉదాహరణకి గోధ్రా దారుణం అనంతరం గుజరాత్ లో ముస్లింల మారణ హోమం జరిగాక వాజ్‌పేయి గుజరాత్ పర్యటించి ముఖ్యమంత్రి నరేంద్ర మోడికి పూర్తి మద్దతు అందించిన సంగతిని చెప్పుకోవచ్చు. అదే వాజ్‌పేయి గుజరాత్ వెళ్ళడానికి ముందు ఢిల్లీలొ రాజ ధర్మం పై మోడీని తప్పుపట్టినట్లుగా మాట్లాడ్డాన్ని కూడా మననం చేసుకోవాలి. గుజరాత్ లోకి అడుగు పెట్టడానికి ముందు రాజధర్మం గురించి వాజ్‌పేయి చెప్పినపుడు పత్రికలకు సహజంగానే కనిపించింది. గుజరాత్ వెళ్ళి మోడీకి మద్దతు పలికినా పత్రికలు ఒక మినహాయింపుగానే చూసి రాశాయి తప్ప వాజ్‌పేయిని అతివాదుల్లో కలపడానికి మొగ్గు చూపలేక పొయాయి. అదే అద్వానీ విషయానికి వస్తే వాజ్‌పేయి వలే రంగులు మార్చగల చాతుర్యమే లేదని పరిశీలనలో తేలుతుంది. ఆయన పాకిస్ధాన్ పర్యటించి జిన్నాని లౌకికవాదిగా పొగిడి మోడరేట్ గా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నించడం, అది కాస్తా వికటించి ఆర్.ఎస్.ఎస్ తో పాటు, ఇతర పరివార సంస్ధలు సైతం అద్వానిపై విరుచుకుపడడం మననం చేసుకుంటే వాస్తవ పరిస్ధితి అర్ధం కాగలదు.

అద్వానీకి, వాజ్‌పేయికి మద్య నిజానికి సైద్ధాంతిక విభేధాలేమీ లేవు. బాబ్రీ మసీదు – రామ జన్మ భూమి వివాదాన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి ఇద్దరూ వ్యతిరేకులు కాదు. కానీ భాబ్రీ మసీదు విధ్వంసం ముద్ర నుండి వాజ్‌పేయి విజయవంతంగా బైటగలిగితే, అద్వానీ రధయాత్ర ద్వారా జరిగిన మతకల్లోలాల ముద్ర నుండి బైటపడ్డానికి చేసిన ప్రయత్నాలన్నీ దారుణంగా విఫలమైనాయి. సాఫల్య వైఫల్యాల మధ్యనే తేడా తప్ప ఒకర్ని మోడరేట్ గా, మరొకరిని అతివాదిగా చెప్పుకోవడం అసలు విషయాన్ని మరుగుపరచడమే.

వారి వారసత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం సుష్మా, జైట్లీలు వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీ ఉన్నత స్ధానాలకు ఎగబాకాలంటే పేరు తెచ్చుకున్న పాత నాయకుల అడుగుజాడల్లో నడుస్తున్నారన్న పేరు అవసరం. పైకి చేరడానికి రెండు మార్గాలుగా కనిపిస్తున్న మార్గాల్లో చెరొకటి సుష్మా, జైట్లీలు ఎంచుకున్నారు. ఇద్దరి గమ్యం ఒకటే అది పార్టీలో ఉన్నత స్ధానం, తద్వారా అధికారం (వచ్చినట్లయితే) లో ఉన్నత స్ధానాన్ని చేరుకోవడం. అయితే బాబ్రీ మసీదు అంశం దాదాపు మరుగున పడుతున్నందున సుష్మా, జైట్లీల పలుకుబడి వారి నాయకులైన వాజ్‌పేయి, అద్వానీల స్ధాయికి చేరుకోవడం కష్ట సాధ్యంగా చెప్పుకోవచ్చు.

వ్యాఖ్యానించండి