అమెరికా జారీ చేసే మిలట్రీ కాంట్రాక్టులకు చైనాకి చెందిన కంపెనీలు బిడ్ లు దాఖలు చేయకుండా నిషేధిస్తూ అమెరికా చట్టాని ఆమోదించింది. అంతర్గత భద్రత దృష్యా చైనా కంపెనీలు తమ మిలట్రీ కాంట్రాక్టులకు ప్రయత్నించడం తమకు సమ్మతం కాదని అమెరికా ప్రతినిధుల సభ ఈ చట్టం ద్వారా తేల్చి చెప్పింది. అమెరికా డిఫెన్సు బడ్జెట్ బిల్లును ఆమోదిస్తున్న సందర్భంగా అమెరికా కాంగ్రెస్ చైనా కంపెనీల నిషేధ బిల్లును కూడా బుధవారం ఆమోదించింది. తాజా బిల్లు అమెరికా, చైనాల మధ్య ప్రపంచాధిపత్యం కోసం పెరుగుతున్న పోటిని తెలియజేస్తున్నదని భావించవచ్చు. చైనా డిఫెన్సు కంపెనీల తయారీ తమ అంతర్గత భద్రతకు ప్రమాదకరంగా పరిణమించగలదని అమెరికా కాంగ్రెస్ అభిప్రాయపడింది.
చైనా కంపెనీలను గానీ, వాటికి అనుబంధంగా ఉండే కంపెనీలుగానీ అమెరికా రక్షణ కాంట్రాక్టులకు ప్రయత్నించడానికి వీలు లేదు. అమెరికా సెనేట్ కూడా ఈ బిల్లుని ఆమోదించవలసి ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడు ఒబామా బిల్లును ఆమోదించాక చట్టంగా మారుతుంది. కాంగ్రెస్ సభ్యురాలు రోజ్ డెలారో ఈ సవరణను ప్రతిపాదించి. అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాలను ఈ చట్టం పరిరక్షిస్తుందని రోన్ తెలిపింది.
“డిఫెన్సు, ఏరో స్పేస్ పరిశ్రమల్లో చైనా గణనీయమైన ప్రగతిని సాధిస్తున్నది. తదుపరి ప్రెసిడెన్షియల్ హెలికాప్టరు సరఫరా కాంట్రాక్టును ప్రభుత్వ కంపెనీతో సహా చైనా కంపెనీలకు అప్పగించడంలో అమెరికా జాతీయ భద్రతను పరిరక్షించుకోవాల్సిన కీలక కర్తవ్యం మా పైన ఉంది. ఈ తరహా పరిశ్రమలలో అత్యున్నత నైపుణ్యంతో కూడిన ఉద్యోగాలు, తత్సంబధిత టెక్నాలజీలను విదేశాలకు ఔట్ సోర్సు చేయకూడదు” అని రోజ్ డెలారో ఒక ప్రకటనలో పేర్కొంది. “ఈ సవరణ అమెరికా ప్రయోజనాలకు కాపాడుతుంది. మా జాతీయ భద్రత మాత్రమే కాకుండా నూతన ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పన, దీర్ఘకాలిక ఆర్ధిక వృద్ధిలు కూడా ఇది కాపాడుతుంది” అని ఆమే పేర్కొన్నారు.
వాల్ స్ట్రీట్ జనరల్ లాంటి పత్రికలు చైనా ప్రభుత్వ రంగ మిలట్రీ కాంట్రాక్టు కంపెనీ అయిన ‘చైనా ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్’ ప్రెసిడెన్షియల్ హెలికాప్టర్ల సరఫరాకు బిడ్ దాఖలు చేసే అవకాశం ఉందని వార్త ప్రచురించింది. చైనా తన మిలట్రీ సామర్ధ్యాన్ని పెంచుకుంటూ పోవడం పట్ల అమెరికా ఆందోలనతో ఉంది. అదీ కాక చైనా మిలట్రీ అభివృద్ధి గురించిన అవగాహన బైటి వారికి అందుబాటులో ఉండటం దాదాపు అసాధ్యం. రహస్యయంగా జరిగే మిలట్రీ కార్యకలాపాలు అమెరికాతో పాటు జపాన్, ఇండియాలను కూడా వ్యాకుల పరుస్తున్నది. దానితో దక్షిణ, తూర్పు ఆసియాలలో మిలట్రీ పోటీ ఊపందుకుంది.
అయితే అమెరికా మిలట్రీ సామర్ధ్యంతో పోటీ పడే ఆలోచన తమకు లేదని చైనా ఉన్నత స్ధాయి మిలట్రీ అధికారి ‘చెన్ బింగ్ డే’ గత వారంలో వాషింగ్టన్ సందర్శనలో ఉండగా ప్రకటించాడు. అయినా ఎవరి భయాలు వారివి. ఇండియా ఆందోలన పడటంలో ఎంతో కొంత అర్ధం ఉంది కానీ మిలట్రీ పరంగా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న అమెరికా, చైనా మిలట్రీ పట్ల ఆందోళన చెందటం వింతగానే చెప్పుకోవాలి.
