చైనా కరెన్సీ యువాన్ విలువపై మాట మార్చిన అమెరికా ట్రెజరీ


Yuan manipulation

చైనా కరెన్సీ మానిపులేటర్ కాదు -అమెరికా

చైనా తన కరెన్సీ యువాన్ విలువను కృత్రిమంగా తక్కువ స్ధాయిలో ఉంచుతున్నదంటూ గత రెండు, మూడు సంవత్సరాలనుండీ వాదిస్తూ వచ్చిన అమెరిక ట్రెజరీ డిపార్టుమెంటు ఇప్పుడు “అబ్బే, అదేం లేదు” అంటోంది. యువాన్ విలువ అమెరికా, చైనాల మధ్య ఒక వివాదాంశంగా చాలాకాలం నుండి ఉంది. ముఖ్యంగా గత రెండు, మూడు సంవత్సరాల నుండి, ఇంకా చెప్పాలంటే ప్రపంచ ఆర్ధిక సంక్షోభం తలెత్తినప్పటి నుండి యువాన్ విలువను తగ్గించాలని అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇండియా, జపాన్‌లు కూడా డిమాండ్ చేస్తున్నాయి. యువాన్ విలువ తక్కువగా ఉండటం వలన చైనా ఎగుమతుల విలువ తక్కువై అంతర్జాతీయ వాణిజ్యంలో సాపేక్షిక సానుకూలతను పొందుతున్నాయని దానితో చైనాకీ, తమ తమ దేశాలకూ మధ్య జరిగే వాణిజ్యంలో చైనా వాణిజ్య మిగులును పొందగలుతుతోందని ఈ దేశాలు వాదిస్తూ వచ్చాయి.

అమెరికా ట్రెజరీ డిపార్టుమెంటు ప్రతి అర్ధ సంవత్సరానికి ఒక సారి ఇతర దేశాల కరెన్సీ విలువల నిర్వహణపై అమెరికా కాంగ్రెస్ కి నివేదికలు సమర్పించాలి. ఆ నివేదికల్లో ఏ దేశమైనా తన కరెన్సీ విలువను కృత్రిమంగా మేనిపులేట్ చేస్తున్నట్లుగా ట్రెజరీ ఆరోపించినట్లయితే కాంగ్రెస్ ఆ దేశంపై వాణిజ్యపరంగా చర్యలు తీసుకుంటుంది. ఆ దేశంపై యాంటీ డంపింగ్ డ్యూటిలు పెద్ద ఎత్తున విధించడం, దిగుమతి పన్నులు పెంచడం, కొన్ని దిగుమతుల్ని నిషేధించడం మొదలైన చర్యలను కాంగ్రెస్ తీసుకుంటుంది. చైనా అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో పెద్ద ఎత్తున డాలర్లను కొనుగోలు చేయడం ద్వారా తన కరెన్సీ యువాన్ విలువ పెరగకుండా చూస్తుంది. ఒక్క డాలర్లే కాకుండా యూరో, యెన్, పౌండ్ స్టెర్లింగ్ మొదలైన కరెన్సీలను కూడా కొని నిలవ చేసుకుంటూ వాటితో యువాన్ విలువ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ విధంగా అంతర్జాతీయ వాణిజ్యంలో తమ సరుకుల విలువలను తక్కువ స్ధాయిలో ఉంచడంతో వాటికి డిమాండె పెరిగి చైనా వాణిజ్య మిగులు సాధిస్తోంది.

ఈ కారణం వలన చైనాను “కరెన్సీ మానిపులేటర్”గా ముద్ర వేస్తూ కాంగ్రెస్‌కి నివేదిక సమర్పిస్తానని ట్రెజరీ సెక్రటరీ తిమోతి గీధనర్ గత రెండు సంవత్సరాలనుండి బెదిరిస్తూ వచ్చినా ఆ చర్య తీసుకోవడానికి సాహసించలేదు. అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని చైనా కూడా అమెరికాని బెదిరిస్తూ వచ్చింది. అమెరికా ట్రెజరీలో చైనా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అమెరికా కంపెనీలు చైనాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. అలాంటప్పుడు చైనాకి వ్యతిరేకంగా వాణిజ్య ఆంక్షలకు పూనుకున్నట్లయితే అది తిరిగి అమెరికా కంపెనీలకే హాని కలిగిస్తుంది. ఇదే పరిస్ధితిని యూరప్ దేశాలూ ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలు కూడా అనేక సార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా చైనా కరెన్సీ విలువ తగ్గించాలని కోరాయి. అయితే చైనా తన కరెన్సీ విలువ పెంచడంతోనే అమెరికా, యూరప్ ల సమస్యలు పరిష్కరింపబడతాయని చెప్పడాన్ని తిరస్కరించింది. ఒక దశలో అప్పటి ఐ.ఎం.ఎఫ్ అధ్యక్షుడు కరెన్సీ యుద్ధం తలెత్తే అవకాశాలున్నాయని హెచ్చరించాడు. కరెన్సీ యుద్ధం అనేది వాస్తవ ప్రపంచ యుద్ధానికి ముందరి పరిస్ధితిగా చెప్పుకోవచ్చు.

చైనా మాత్రం తమ అర్ధిక వ్యవస్ధలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకోకుండా తమ సమస్యలకు పరిష్కారాలను చైనాలో వెతకడాన్ని ఎద్దేవా చేసింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేటు అతి తక్కువగా 0.25 శాతం వద్ద ఉంచడాన్ని ఎత్తి చూపింది. యూరోజోన్ సెంట్రల్ బ్యాంకు 1 శాతం వద్దే ఉంచడం, బ్రిటన్ 0.5 శాతం వద్ద కొనసాగించడం ఎత్తి చూపింది. ఇలా వాదోపవాదాలు జరుగుతుండగానే అమెరికా 600 బిలియన్ డాలర్ల బెయిల్ ఔట్ (Quantitative Easing – 2 or QE2) ప్రకటించింది. ఈ డబ్బుతో తన ట్రెజరీ బాండులకు కొనడం ద్వారా ప్రపంచ మార్కెట్లోకి పెద్ద ఎత్తున డాలర్లను కుమ్మరించింది. ఇవి మళ్ళీ ఎమర్జింగ్ దేశాలైన చైనా, ఇండియా, బ్రెజిల్ తదితర దేశాలను ముంచెత్తి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. చైనాలోనైతే అస్సెట్ బబుల్ తలెత్తే ప్రమాదం ఏర్పడించి. క్యు.ఇ-2 విడుదలతో కరెన్సీ వాదనలు పక్కకు పోయాయి. డాలర్ల వరదను కాచుకోవడంతో సరిపోయింది.

అన్ని వైపులనుండి ఒత్తిడి వస్తుండడంతో జూన్ 2010 లో యువాన్ విలువ స్వల్పంగా పెరగడానికి చైనా అనుమతించింది. ఆ పెరుగుదల ఆరునెలల తర్వాత కేవలం 2 శాతం వరకే అనుమతించింది. ఆ మాత్రానికే అమెరికా, యూరోప్ లు ఎగిరి గంతేశాయి. ముందు ముందు ఇంకా బాగా పెరుగుతుందని అవి అంచనా వేశాయి. కాని వారి ఆశలను అడియాశ చేస్తూ ఇప్పటి వరకు యువాన్ విలువ 5.15 శాతం మాత్రమే పెరిగింది. పశ్చిమ దేశాల అంచనా ప్రకారం యువాన్ విలువ ఇప్పటి స్ధాయికంటే కనీసం 40 శాతం పైగా పెరగాలి. ఆ స్ధాయిలొ పెరిగితే “ఎన్ని కంపెనీలు మూసివేతకు గురవుతాయొ, ఎన్ని మిలియన్ల మంది నిరుద్యోగులవుతారో, ఏ స్ధాయిలో పట్నాలకు వచ్చిన గ్రామీణులు తిరిగి స్వస్ధలాలకు ప్రయాణం కడతారో తాను ఊహించలేన”ని చైనా ప్రధాని గత సంవత్సరం అమెరికాలో జరిగిన అమెరికా-చైనా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నాడు.

ఆ తర్వాత ఇప్పుడు గత ఏప్రిల్ నెలలో అమెరికా ట్రెజరీ ఇవ్వవలసిన నివేదికను ఆలస్యంగా ట్రజరీ సెక్రటరీ గీధనర్ కాంగ్రెస్ కి సమర్పించాడు. దానిలో “చైనా కరెన్సీ మానిపులేటర్ కాదు పొమ్మ”న్నాడు. “అన్యాయంగా ప్రపంచ వాణిజ్యంలో సానుకూలతను పొందటానికి ప్రయత్నించడం లేదు” అని సర్టిఫికెట్ ఇచ్చేశాడు. అయితే కొన్ని సన్నాయి నొక్కులు నొక్కాడు. “యువాన్ విలువ తగ్గింపులో ఇప్పటివాకూ జరిగిన ప్రగతి చాలా స్వల్పం. ఇంకా వేగవంతమైన ప్రగతి అవసరం” అని పేర్కొన్నాడు. యువాన్ విలువపై అంతర్జాతీయంగా వాద ప్రతివాదాలు మొదలయ్యాక ఇప్పటికీ ఐదు సార్లు ట్రెజరీ నివేదికలు ఇచ్చాడు. ఆ అయిదింటిల్లోనూ చైనాని కరెన్సీ మానిపులేటర్ గా పేర్కొనడానికి సాహసించలేకపోయారు.

చైనా యువాన్ విలువ పెంచినట్లయితే చైనాతో ఉన్న తన వాణిజ్య లోటును తగ్గించుకోవచ్చని అమెరికా భావిస్తోంది. తేద్వారా తన బడ్జెట్ లోటు కూడా సవరించుకోవచ్చని ఆశపడుతోంది. అర్ధిక వ్యవస్ధల సమతూకాన్ని సాధించాలని ఆసిస్తోంది. అలాగే ఐరోపా దేశాలు కూడా. అయితే అమెరికా గానీ, ఐరోపా దేశాలు గాని వాటి వాణిజ్య లోటు, బడ్జెట్ లోటు, జిడిపి వృద్ధిలో మందగమనం లాంటి సమస్యలకు పరిష్కారం ఆ దేశాల ఆర్ధిక వ్యవస్ధలలోనూ వారు అనుసరిస్తున్న విధానాలలోనూ మాత్రమే ఉన్నదన్నది సత్యం. ఓ వైపు పొదుపు చర్యల పేరుతో కార్మికులకు, ఉద్యోగులకు అందే నెలవారీ వేతనాల్లోనూ, వారి సదుపాయాల్లోనూ తీవ్రంగా కోతపెడుతూ తద్వారా వారి కొనుగోలు శక్తిని నాశనం చేస్తూ, మరోవైపు బహుళజాతి కంపెనీల ఉత్పత్తుల కొనుగోళ్ళు అమాంతం పెరగాలని కోరుకోవడంలో అర్ధం లేదు. కంపెనీలకు లాభాలు పెరగడానికి అత్యవసర షరతు వాటి ఉత్పత్తులను కొనేవారి కొనుగోలు శక్తిని తాకకుండా ఉండడం. ఏ మార్కెట్ పైనైతే కంపెనీలు ఆధారపడతాయో ఆ మార్కెట్ కొనుగోలు శక్తిని చిద్రం చేసే విధానాలు అమలు చేయాలని ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తే వారి లాభాలు పెరగడం అటుంచి అధిక ఉత్పత్తి సంక్షోభమ్ ఇంకా తీవ్రం కాక తప్పదు.

పైగా కార్మికులు, ఉద్యోగుల గోళ్ళూడగొట్టి మరి పెంచుకుంటున్న లాభాలను, పెట్టుబడులను బహుళజాతి కంపెనీలు ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి బదులు షేర్ మార్కెట్లు, సెక్యూరిటీలు, హెడ్జి ఫండ్లు, బ్యాంకులు లాంటి ద్రవ్య (ఫైనాన్సు) మార్కెట్లో పెట్టడం వలన ప్రపంచ మార్కెట్ సున్నితంగా మారిపోయింది. చిన్న సంక్షోభపుగాలి సోకినా చిగురుటాకులా వణికిపోయే స్ధితికి ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ చేరుకుంది. ఈ పాపం నయా ఉదారవాద ఆర్ధిక విధానలదే. ఈ స్ధితి స్వేచ్ఛా మార్కెట్ విధానాల పేరుతో బహుళ జాతి సంస్ధల కోసం అనుసరిస్తున్న ఎల్.పి.జి (లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) విధానాల పర్యవసానమే. ఇవి కొనసాగుతున్నంతకాలం ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ మళ్ళీ మళ్లీ సంక్షోభాల బారిన పడుతూనే ఉంటాయి. ఈ సంక్షోభాలనుండి బైటపడడం గతంలో సులభంగా ఉండేది. కాని పెట్టుబడి ద్రవ్యీకరణ వలన (Financialization of Capital) సంక్షోభాల పరిష్కారం మరింత క్లిష్టంగా మారిపోయింది. 2008 నాటి ప్రపంచ సంక్షోభం నుండి బైటపడ్డామని చెప్పుకోవడానికి అమెరికాగానీ యూరప్ గానీ ఇప్పటికీ ధైర్యంగా చెప్పుకోలేకపోవడమే దానికి రుజువు.

పెట్టుబడిదారీ వ్యవస్ధ తన చావును తానే తెచ్చుకుంటుందన్న కారల్ మార్క్సు ఆర్ధిక, సామాజిక, చారిత్రక నియమం సరైందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు కావాలా?!

వ్యాఖ్యానించండి