‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె!’, ఆఫ్రికాలో ఇండియా ఔదార్యం


Manmohan in Tanzania

టాంజానియాలో ప్రధాని మన్మోహన్

“ఓ వైపు ఇండియాలో ఆకలితో ప్రతి సంవత్సరం లక్షల మంది చనిపోతుండగా, మరో వైపు భారత్ శక్తివంతమైన దేశంగా ఎలా చెలామణి అవుతోంది? రెండు ఇండియాలు ఎలా సాధ్యం?” అంటూ భారత ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తలంటు పోసి రెండు నెలలు కూడా కాలేదు. “గోదాములు లేక ఆరుబైట పరదాల క్రింద ఉంచిన ధాన్యం వర్షాలకు తడిసి పాడుపెట్టే బదులు ఆకలితో ఉన్నవారికి ఉచితంగా పంచండి” అని సుప్రీం కోర్టు సలహా ఇస్తే “ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు” అని వ్యవసాయ మంత్రి శరద్ పవార్, “ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్య చేసుకోవడం కోర్టులకు తగని పని” అని ప్రధాని మన్మోహన్ సింగ్ సుప్రీం కోర్టుపైన ఆగ్రహం తెచ్చుకుని అర సంవత్సరం దాటలేదు. ఇప్పుడు భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఆఫ్రికాలో పర్యటిస్తూ టాంజానియా దేశానికి మిలియన్ల డాలర్లను సహాయంగా ప్రకటించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు.

భారత దేశంలో మంచినీరు దొరకని గ్రామాలకు లెక్కలేదు. అందుబాటులో ఉన్న మురికి నీరు తాగి జబ్బులతో చస్తున్నవారు అనేకం. నయం కాగల జబ్బులతో చనిపోతున్న గిరిజనులను పట్టించుకునే నాధుడే లేడు. దేశ వ్యాపితంగా ఉన్న మండల ఆసుపత్రులలో మందులు లేకా, డాక్టర్లు లేకా, పట్నానికి రోగుల్ని తీసుకెళ్ళడానికి రోడ్లు లేకా, అన్నీ ఉండి పట్నం వచ్చినా అక్కడి వైద్యం ఖరీదు భరించలేకా ఎంతమంది తీసుకుని, తీసుకుని చనిపోతున్నారో అనేక స్వచ్ఛంద సంస్ధలు, ప్రభుత్వ సంస్ధలు, అంతర్జాతీయ సంస్ధలు టన్నులకొద్దీ రిపోర్టులు తయారు చేసినా వాటికి మోక్షం లేదు.

ఇవన్నీ ఇలా ఉండగానే ఆఫ్రికా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన సింగ్ టాంజానియాకు నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం నిమిత్తం 180 మిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించాడు. ఇది 828 కోట్ల రూపాయలకు సమానం. అంతటితో ఆగలేదు. మరో 10 మిలియన్ డాలర్లతో (46 కోట్ల రూపాయలు) టాంజానియా విద్యా రంగ అభివృద్ధికి సహాయం ప్రకటించింది ఇండియా. అంతేనా? టాంజానియా పట్నం దార్-ఎస్-సలాం లో 150 మిలియన్ డాలర్లతో (రు. 690 కోట్లు) ఓ పెద్ద ఆసుపత్రిని నిర్మించడానికి ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇది సహాయం అయిందీ లేనిదీ తెలియలేదు. ఈ ఆసుపత్రిని గుండె జబ్బులకు ప్రత్యేక నైపుణ్యం పొందే విధంగా తయారు చేయాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం టాంజానియా, ఆఫ్రికాల నుండి అనేక మంది గుండె జబ్బుల వైద్యం కోసం ఇండియాకు రాకుండా అక్కడే వైద్య సౌకర్యాలు పొందడం ద్వారా మిలియన్ల డాలర్ల ఖర్చుని నివారించవచ్చని ఈ సందర్భంగా ఇరు దేశాలూ సంతోషం వ్యక్తం చేశాయి.

పనిలో పనిగా ఇరు దేశాల మధ్య ఉన్న పన్నుల అవరోధాలను తొలగించుకుని ద్వైపాక్షిక వాణిజ్యం పెంపుదలకు కృషి చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇండియా ఆఫ్రికాలోని సహజ వనరులను ముఖ్యంగా ఇంధన వనరులను వినియోగించుకోవడంలో చైనాతో పోటీ పడుతోంది. దేశంలో ఉన్న ఖనిజ, ఇంధన వనరులని విదేశీ కంపెనీలకు అప్పజెప్పి ఆఫ్రికా వనరుల కోసం వెంపర్లాడడం ఏ కోవలోకి వస్తుంది? గత కొన్ని సంవత్సరాలుగా చైనా ఆఫ్రికాలొ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. ఇనుప ఖనిజం వెలికి తీయడం, దాన్ని ప్రాసెస్ చేయడం, ఆ తర్వాత చైనాకి తరలించుకెళ్ళడం చేస్తున్నది. ఆ మాటకొస్తే ఇండియాలోని ఇనప ఖనిజాన్ని కూడా పెద్ద ఎత్తున చైనా కొంటోంది. ఆంధ్రాలో గాలి కుటుంబం అనంతపురంలో అక్రమంగా తరలించిన ఇనప ఖనిజం చైనాకి అమ్మి సొమ్ము చేసుకుంది.

అటువంటి చైనాతో ఇండియా పోటీ ఆఫ్రికా వరకూ విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. కాని ఇండియాకు ఉన్నది వాణిజ్య లోటు అయితే చైనాకి ఉన్నది వాణిజ్య మిగులు. చైనా మరేదేశంతో నైనా వాణిజ్య లోటు ఉన్న సంగతి అనుమానమే. తన వాణిజ్య మిగులును ఈ విధంగా విదెశాల్లోని ఇంధన, ఖనిజ వనరులలో పెట్టుబడులు పెట్టి వెలికి తీసి తన దేశానికి తరలించుకువెళ్తోంది. కాని ఇండియా పరిస్ధితి అందుకు విరుద్ధం. ఇండియాలో ఉన్న అత్యంత ఖరీదైన, అత్యంత అవసరమైన బాక్సైట్, ఇనుము, ఆయిల్, బెరైటీస్, చైనా క్లే లాంటి వనరుల వెలికి తీతకు విదేశీ బహుళజాతి కంపెనీలను ఆహ్వానిస్తున్నది. వెలికి తీసిన ముడి ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేసేస్తున్నది. దాని వలన భారత ప్రయోజనాలకు ఘోరమైన నష్టం వాటిల్లుతున్నది. భూపొరల్లో దాగిఉన్న ఖనిజాలు అనంతమైనవేమీ కావు. వాటిని పొదుపుగా ఖర్చు చేస్తూ, భావితరాలు నష్టపోకుండా కాపాడుకోవాలి. దానికి భిన్నంగా ముడి ఖనిజాన్ని తవ్వడానికి, శుభ్రపర్చడానికి విదేశీ కంపెనీలను పిలిచి, వాటి చేతే విదేశాలకు తరలుస్తూ, ఆ ఖనిజాలతో విదేశాల్లో జరిగే ఉత్పత్తులను అధిక ఖరీదుతో దిగుమతి చేసుకుంటున్నది.

స్వదేశంలో పరిస్ధితి ఇదయితే ఆఫ్రికా వెళ్ళి ఉదారంగా సహాయం ప్రకటిస్తున్నారు. సహాయం చేయడం తప్పుకాదు. కాని భారతీయుల ఆకలి, జబ్బులను విస్మరించి సహాయం చేస్తుండడమే అభ్యంతరకరం.

4 thoughts on “‘మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె!’, ఆఫ్రికాలో ఇండియా ఔదార్యం

  1. మినర్వా గారు రాసింది కొంతవరకు నిజమే .కాని మనదేశం పూర్తి అభివ్రుద్ధి చెందితేనే ఇతర దెశాలకు సాయం చెయ్యాలనడం సరికాదు.ఒకప్పుడు పేద దేశమైన భారత్కి టెలివిజన్ ఎందుకన్నారు !దేనిమట్టుకదే ,పేదరికం నిర్మూలనా, అభివ్రుద్ధి, సైనిక పాటవం, ఇతరదేశాలకి సహాయం అంతర్జాతీయంగా పలుకుబడి ,అన్నీ ముఖ్యమే.
    =రమణారావు.ముద్దు

  2. రమణా రావు గారూ, ఇంతకీ మినర్వాగారు ఏం రాశారు? ఎక్కడ రాశారు?

    పూర్తిగా అభివృద్ధి చెందితేనే సాయం చెయ్యాలనడం కాదు గానీ, అసలు ఆకలితో చస్తున్నవారిని పట్టించుకోకుండా సాయం చేయాలనుకోవడమే అభ్యంతరకరం. ధాన్యాన్ని పాడు పెట్టకుండా నిరుపేదలకు ఉచితంగా ఇవ్వమని సుప్రీం కోర్టు కోరితే, కుదరదు అన్నవారు ఇతర దేశాలకు సాయం చేయడానికి ఎందుకు సిద్ధమయ్యారన్నది ఇక్కడ ప్రశ్న. అదీ కాక ప్రజల ఆకలి, ప్రాణాలకంటె పలుకుబడి ముఖ్యం కాదేమో! ఓ సారి ఆలోచించండి.

  3. ఇక్కడొక లోకనీతి గమనించాలి. అన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాలూ ఆయా దేశల్లో అతి పెద్ద వ్యపారవర్గాలకి కాపలా కుక్కలు. మన్మోహనుల వారు సహాయాన్ని ప్రకటించిది ఆకటితో అలమటించే ఏ ఇథియోపియాకో లెదా సోమాలియాకో లేదా సహారా నైసర్గాల్లో అలమటిస్తున్న ఆఫ్రికావాసుల కోసమో కాదు. టాంజానియా అటవీసంపదకీ ఖనిజనిలవలకీ పెట్టింది పేరు. అలాటి దేశాల వనరుల మీద అంతకన్నా అభివృద్ధి చెందిన దేశల్లో వ్యాపా సంస్థలు కన్నెయ్యడం వాటిని చవకగా కొనుక్కోవాలని చూడటం సాధారణం. దేశంలో వున్న అతిపెద్ద వ్యాపారసామ్రాజ్యాలైన అంబానీ, తాటా, బిర్లా, శ్రీరాం, గోడ్రెజ్, …ఇంకా ఇటీవల ప్రబలిన మరో డజను సార్ధవాహక సామ్రాజ్యాలకి కావలసిన ముడిసరుకుల్ని సంపాదించి పెట్టడం అందుకు కావలసిన దౌత్య సంబంధాలని నడపడం మన్మోహన్ సింగు ప్రధానమంత్రిగా చెయ్యవలసిన ప్రధమ కార్యం.

  4. హరికృష్ణ గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం. టాంజానియాకి సహాయం ప్రకటించడానికి మీరు చెప్పిందే అసలు కారణం. సహాయం పేరుతో అక్కడి వనరుల్ని భోంచేయడానికి పన్నిన పన్నాగమే ఇది. టాంజానియాలో నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కాంట్రాక్టుల్ని వాళ్ళు ఇండియా పెట్టుబడిదారులకి గానీ, వారి బాసులైన పశ్చిమ దేశాల కంపెనీలకి గానీ ఇవ్వాల్సి ఉంటుంది. సహాయం చేసినట్లు చేసి కాంట్రాక్టుల ద్వారా మళ్ళీ రాబట్టుకుంటారు. ఇండియాకంటే బహుశా అక్కడ ఛీప్ లేబర్ కూడ దొరకొచ్చు. ప్రాజెక్టు పూర్తయ్యాక వాటి నిర్వహణ కోసం యూజర్ ఛార్జీలు కూడా వసూలు చేసుకునే వసతి కూడా దొరకవచ్చు.

    సరిగ్గా ఇవే టెక్నిక్కులు పశ్చిమ దేశాలు ఇండియా మీద ప్రయోగిస్తూ భారత వనరుల్ని దోచుకెళ్తున్నాయి. అది సహాయం అని ప్రజల్ని నమ్మిస్తుంటారు గాని కాంట్రాక్టుల్ని పశ్చిమ దేశాల కంపెనీలకే (లేదా ఇండియా కంపెనీలు జూనియర్ భాగస్వాములుగా ఉన్న పశ్చిమ దేశాల కంపెనీలకు) ఇచ్చే షరతులు వాటితొ కలిసి ఉంటాయి. కప్పని పాము మింగితే పాముని గద్ద తన్నుకు పోయినట్టు, పేద దేశాల్ని ఇండియా కోటీశ్వరుల్లాంటి నడమంత్రపు సిరిమంతులు, ఇండియానేమో పశ్చిమ దేశాల బిలియనీర్ కంపెనీలు భోంచేస్తున్నాయి.

    ఇక్కడ ట్విస్టు ఏంటంటే గద్ద, పామునీ, పాము తినే కప్పల్నీ కూడా కలిపి వేటాడ్డం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s