ఆయన పేరు రామాధర్ సింగ్. బీహార్‌లో బి.జె.పి పార్టీ తరఫున ఔరంగాబాద్ నియోజక వర్గం నుండి నాలుగుసార్లు ఎన్నికయిన ఎం.ఎల్.ఎ. 2010 లో ఎన్నికయ్యాక నితీష్ కుమార్ ప్రభుత్వంలో సహకార శాఖా మంత్రిగా పని చేస్తున్నాడు. ఈయన గురువారం మంత్రి పదవికి రాజీనామ చేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సలహా మేరకు గవర్నర్ ఆ ఎం.ఎల్.ఏ రాజీనామాని ఆమోదించాడు. మే 19న రాజీనామా చేశాక బీహార్ హై కోర్టు ఆయనను క్రింది కోర్టులో లొంగిపొమ్మని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు రామాధర్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది.
ఇంతకీ రాజీనామాకీ, కోర్టులో లొంగిపోవడానికి కారణం 16 సంవత్సరాల క్రితం 1995 లో ఆయనపై కోర్టు జారి చేసిన నాన్ బెయిలబుల్ వారంట్ ను ఉల్లంఘీస్తూ తప్పించుకుని తిరగుతున్నాడట! 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఓ బహిరంగ సభలో ఓ మతానికి వ్యతిరేకంగా రెచ్చగోట్టే విధంగా ఉపన్యాసం ఇచ్చాడట. ప్రభుత్వం కేసు పెట్టడంతో మొదట వారంటు జారీ చేసింది. వారంటును పదే పదే ఉల్లంఘిస్తూ కోర్టుకి రాకుండా ఎగ్గొట్టడంతో 1995 లో నాన్-బెయిలబుల్ వారంటు జారీ చేసింది. అయినా ఆయన కోర్టుకు వెళ్లలేదు. విచిత్రంగా పోలీసులకూ ఆయన దొరకలేదు.
అప్పటినుండి రామాధర్ సింగ్ నాలుగు సార్లు బి.జె.పి ఎం.ఎల్.ఎ గా ఎన్నికవుతూ ఉన్నాడు. ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేటప్పుడు తమ ఆస్తులతో పాటు, తమపై ఉన్న నేరాలగురించి కూడా అభ్యర్ధులు వెల్లడించాలి. ఈయన పైన ఈ కేసుతో పాటు 11 కేసులు ఉన్నాయట. గత సంవత్సరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక నీతీష్ కుమార్ మంత్రివర్గంలో సహకార శాఖా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు మూడు ఎన్నికల్లో బహిరంగంగా ప్రచారం చేసినప్పుడు కూడా ఈయన పరారీలోనే ఉన్నాడు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా పరారీలోనే ఉన్నాడు. ఇంతకాలం బహిరంగంగా రాజకీయ నాయకుడుగా సంఘంలో దర్జా వెలగబెట్టినా పరారిలోనే ఉన్నాడు.
ఇప్పుడు ప్రతిపక్షాలు అదేపనిగా గొడవ చేయడంతో నిజాయితీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పరువును బజారుకీడ్చడం ఇష్టం లేక రాజీనామా చేస్తున్నట్లు రామాధర్ సింగ్ చెబుతున్నాడు. లేనట్లయితే ఇంకా పరారీలోనే ఉండేవాడు. తనమీద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయిన సంగతి తనకు తెలియదనీ, ఈ రోజు కోర్టు పత్రాలు చూశాక నాపై వారంటు ఉన్నదని సంతృప్తిపడి రాజీనామా చేసినట్లు చెప్పాడు. అదీ ఆయన దర్జా! బతుకు తెరువుకు చిన్న దొంగతన చేసి ఓ సారి దొరికిన వారిపై పోలీసులు, చేయని నేరాలు కూడా వారిపై మోపి జీవితాంతం దొంగగానే బతకమని శాసించే పోలీసులు నిజానికి చట్టాన్ని అమలు చేస్తున్నారో, చట్టానికి తూట్లు పొడుస్తున్నారో ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తోంది. భారత దేశ న్యాయవ్యవస్ధ ఎవరి తరపున పనిచేస్తుందో ఇంతకంటే ఉదాహరణ కావాలా?
