అనుకున్నదే జరగబోతోంది. భారత దేశంలోని లక్షల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయడానికి భారత ప్రభుత్వం రెండో అడుగు వేసింది. ద్రవ్యోల్బణాన్ని అరి కట్టడమే తమ ప్రధమ కర్తవ్యం అంటూ రెండేళ్ళనుండి ఆందోళన వ్యక్తం జేస్తూ కూడా ఆ దిశలో ఏ చర్యా తీసుకోని ప్రభుత్వం ఇప్పుడు తన ఆందోళన వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని బైటపెట్టుకుంది. ప్రధాన మంత్రి ఆర్ధిక సలహాదారుల బృందానికి అధిపతి అయిన కౌశిక్ బసు శుక్రవారం ప్రభుత్వ ఉద్దేశ్యాలను మెల్లగా బైటపెట్టాడు. భారత దేశ ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే బహుళ బ్రాండుల రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించాలని కౌశిక్ బసు శుక్రవారం ప్రకటించాడు.
ఇప్పటివరకు సింగిల్ బ్రాండులో మాత్రమే రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు. అది కూడా 51 శాతం వరకే విదేశీ పెట్టుబడి వాటాను అనుమతిస్తున్నారు. మిగిలిన వాటా దారులు భారత పెట్టుబడిదారులై ఉండాలి. బహుళ బ్రాండుల రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం అంటే వాల్ మార్టు లాంటి అతి పెద్ద రిటైల్ కంపెనీలను భారత దేశపు రిటైల్ రంగంలో షాపులు నెలకొల్పడానికి అనుమతిని ఇవ్వడం. ఈ షాపులు సమస్త బ్రాండులకు సంబంధించిన సమస్త సరుకులను రిటైల్ ధరలకు అందుబాటులో ఉంచుతాయి. అవి అడుగు పెట్టినట్లయితే మన వీధి చివరా, ప్రతి చిన్న కూడలి వద్దా కనిపించే చిల్లర షాపులు ఇక కనిపించవు. రోజువారి అవసరాలయిన బియ్యం, పప్పు దినుసులు, మసాలా దినుసులు, అల్లం, బెల్లం తదితర సరుకులను చిల్లర ధరలకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న లక్షల షాపులు మూతపడిపోతాయి. వారి జీవన భృతి గల్లంతైపోతుంది.
ఇదే బ్లాగరు మరో బ్లాగులో ఫిబ్రవరి 4 తేదీన ఒక టపా ప్రచురించడం జరిగింది. అప్పటి ప్రధాని ఢిల్లీలొ జరిగిన ఓ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ద్రవ్యోల్బణం పై వ్యక్తం చేసిన అభిప్రాయాలను బట్టి ఓ అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఆ సమావేశంలో ప్రధాని ద్రవ్యోల్బణం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అదుపు కాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం జేశాడు. భారత దేశ ఆర్ధిక వృద్ధికి ద్రవ్యోల్బణం ఆటంకంగా మారిందని దిగులు పడ్డాడు. వ్యవసాయ సరఫరా చైన్లను శక్తివంతం చేయవలసిన అవసరం ఉందనీ, సంఘటిత (ఆర్గనైజ్‌డ్) రిటైల్ చైన్లను అనుమంతించడం ద్వారా అది సాధించవచ్చనీ ఆ కాన్ఫరెన్సులో మన్మోహన్ అభిప్రాయ పడ్డాడు. ద్రవ్యోల్బణం పరిష్కారానికి ఆయన సూచించిన పరిష్కారాన్ని ఎత్తి చూపుతూ భారత ప్రభుత్వం బహుళ బ్రాండుల రిటైల్ సెక్టార్ లోకి విదేశీ పెట్టుబడులను అనుమతించడానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని సాకుగా చూపే ప్రమాదం ఉందని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు కౌశిక్ బసు ప్రకటన ఆ అనుమనాన్ని అనుమానం మాత్రమే కాదని రుజువు చేసింది.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కూడా ఇంచుమించు ఇవే అభిప్రాయాలు గత నెలలో వ్యక్తం చేశాడు. ద్రవ్యోల్బణం అరికట్టవలసిన అవసరం బాగా ఉందనీ, ద్రవ్యోల్బణం జిడిపి వృద్ధికి ఆటంకంగా మారిందనీ బాధపడుతూ సరఫరా సంబంధిత ఆటంకాలు (supply side bottlenecks) ద్రవ్యోల్బణం పెరుగుదలకు దోహదపడుతున్నాయని చెప్పాడు. అహ్లూవాలియా ఈ వాదనలను గత సంవత్సరం నుండీ చేస్తున్నాడు. కొన్ని సార్లు వర్షాలు కురవాలంటాడు. వర్షాలు కురిసాక పంటలు రావాలంటాడు. పంటలు పడ్డాక సరఫరా ఆటంకాలని అంటాడు. ఎప్పటికప్పుడు ద్రవ్యోల్బణానికి కారణాలు మార్చుకుంటూ పోవడమే తప్ప ఆ కారణాలను పరిష్కరించిన పాపాల పోలేదు వీళ్లు. ఇంతకీ ఏమిటీ సప్లై చైన్? సప్లై సైడ్ బాటిల్‌నెక్స్ అని వేటిని ఉద్దేశించి అంటున్నారు? ద్రవ్యోల్బణంతో వాటికి సంబంధం ఏమిటి?
సరుకులను ఆయా గమ్యాలకు సరఫరా చేయడంలో ఎదురైయ్యే ఆటంకాలనే సప్లై సైడ్ బాటిల్‌నెక్స్ లేదా సరఫరా సంబంధిత ఆటంకాలు అని పిలుస్తున్నారు. ఒక కుటుంబం బతకడానికి అనేక సరుకులు కావాలి. అవన్నీ ఒక చోటే పండవు. దేశంలోని ఒక్కో ప్రాంతపు నేలల స్వభావానికి అనుగుణంగా వివిధ పంటలు పండుతాయి. ఒక చోట పండిన పంటని సరుకుగా మార్చి (ఉదా: ధాన్యాన్ని బియ్యంగా మార్చడం) వాటిని దేశంలోని అన్ని ప్రాంతాలకి రవాణా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి గోదావరి వరిని బియ్యం తినే ప్రాంతాలకి పంపాలి. ఉత్తరాదిన పండే గోధుమలను చపాతీ, రొట్టెల తయారీకి దక్షిణాదికి పంపాలి. అనకాపల్లి బెల్లాన్ని దేశం మొత్తం పంపాలి. దుగ్గిరాల పసుపు, గుంటూరు మిర్చి ఇలా అన్నీ దేశం మొత్తానికి సరఫరా చేయాలి.
సరఫరా చేయడానికి ఖర్చవుతుంది కదా. దానికి వాహనాలు, రవాణా మార్గాలు కావాలి. రోడ్లు, రైల్వేలు రవాణా మార్గాలని తెలిసిందే. అయితే కేవలం రవాణా చేస్తే సరిపోదు. వేగంగా రవాణా చేయాలి. కూరగాయలలాంటి సరుకులను రాత్రికి రాత్రి గమ్యానికి చేర్చాలి. లేదంటే కుళ్లిపొతాయి. అలాగే సరుకులను చెడిపోకుండా రవాణా చేయగలగాలి. ఊరికే లారీలోనో ట్రక్కులో వేసి తీసుకెళ్తే చెడిపోవచ్చు. కొన్ని సరుకులకు కూలింగ్ వ్యవస్ధ కావాలి. మరికొన్ని సరుకులకు మరికొన్ని ప్రత్యేక సౌకర్యాలు రవాణాలో కల్పించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యాలకన్నింటికీ ఖర్చవుతుంది. ఈ ఖర్చులను కూడా ఆయా సరుకుల ధరలలో కలిపేస్తారు. పండించి, భద్రపరిచి, శుభ్రపరిచి, క్షేమంగా రవాణా చేసి, అవసరమైతే మరో సారి శుభ్రపరిచి, మళ్లీ భద్రపరిచి రిటైల్ షాపులకు పంపి అక్కడునుండి వినియోగదారులకు చేర్చాలి. ఇలా ఒక సరుకును పండించి వినియోగదారుడికి అందేవరకు మధ్య జరిగే చర్యలు ప్రధానంగా రెండు: ఒకటి ప్రాసెసింగ్, రెండు సప్లై లేదా సరఫరా.
రెండో అంశమైన సరఫరాకు అనేక ఆటంకాలు ఎదురవుతుంటాయి. ఆ ఆటంకాల వలన అదనంగా ఖర్చు అవడం వలన ఆ అదనపు ఖర్చుకూడా సరుకుల ధరలో చేరిపోతుంది. రోడ్డు సరిగా లేకుంటె వాహన వేగం తగ్గుతుంది. అపుడు ప్రయాణ కాలం పెరిగి ఇంధన ఖర్చు పెరుగుతుంది. ఇదొక సరఫరా సంబంధిత ఆటంకం. రోడ్డు బాగున్నా వాహన కండిషన్ సరిగా లేకపోవచ్చు. అపుడు కూడా ఇందనం అదనంగా ఖర్చవుతుంది. రోడ్డూ సరిగా లేక, వాహన కండిషన్ బాగోలేకపోతే అదనపు ఖర్చు మరింత పెరుగుతుంది. వాహనాల్లో కూలింగ్ వ్యవస్ధ ఉండవలసిన అవసరం ఉన్నపుడు అది సరిగా పనిచేయకపోతే కుళ్ళిపోవడమో, స్వల్పంగా పాడైపోవడమో జరుగుతుంది. అపుడు వాటి ఖరీదు కూడా అదే సరుకుకి సంబంధించిన ఇతర లాట్ లకు కలిపి రాబట్టుకుంటారు, అది తప్పయినా. రైల్వేల వ్యవష్ద కూడా వేగంగా పనిచేయకపోతే ఖర్చు పెరుతూపోతుంది. వేగం అనగానే రైలు వేగమే కానవసరం లేదు. మనుషులు చేసే పనులు కూడా వేగంగా ఉండాలి. బుకింగ్, ఎత్తుడు, దించుడు, సంబంధిత డాక్యుమెంట్ల రాత, అప్పగింత ఇవన్నీ మనుషుల శక్తి సామర్ధ్యాలమీద ఆధారపడి ఉంటాయి. వ్యాపారస్ధులు మనిషి శక్తి కలవాడైనా అజమాయిషీ లేకుంటే అతడు సోమరిగా మెల్లగా పని చేస్తాడనే నమ్మకం ఉంచుకుంటారు. వాస్తవం ఏదైనా వారలా భావించడానికే మొగ్గు చూపుతారు. ఆ క్రమంలో వారే పనిచేసే వారికి అటంకంగా కూడా మారవచ్చు. అదేపనిగా అజమాయిషీ చేస్తే పనిలోనుండి తప్పుకోవచ్చు. కొత్త మనిషి త్వరగా దొరక్కపోవచ్చు. మనుషులు త్వరగా ఎత్తుడు, దించుడు చేయకపోతే గూడ్సుగానీ, రైలుగానీ సమయం మించి వెళ్ళి పోవచ్చు. ఇవన్నీ సరఫరా సంబంధిత ఆటంకాలే.
ఈ ఆటంకాలు తొలగించడంలో ప్రభుత్వ పాత్ర ప్రధానంగా ఉంటుంది. రోడ్లు సరిగా లేకుంటే వాటిని బాగు చేసే పని ప్రభుత్వానిది. అసలు సరిగా లేకుండా పోవడానికి కారణాలు చూస్తే కంట్రాక్టర్ల వద్ద మంత్రులు, అధికారులు లంచాలు తినడం వలన రోడ్లు నాసిరకంగా తయారవుతాయి. అలాంటి రోడ్లు త్వరగా పాడైపోయి రవాణాకు ఆటంకంగా మారుతాయి. సరుకుల నిల్వకు ప్రభుత్వం గిడ్డంగులు నిర్వహించాలి. గిడ్డంగుల నిర్వహణలో అంతులేని అవినీతి. ప్రభుత్వం సేకరించీన ధాన్యం నిలవ చేయడానికి గిడ్డంగులు లేక ఆరుబైట నిల్వ చేయడం, అవి చెడిపోవడం, ఫలితంగా ధాన్యం మొత్తం తగ్గి ధరపెరగవచ్చు. ధాన్యం సేకరణకు ఆంధ్ర ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా వెనకడుగు వేస్తోంది. దానికొక కారణం గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పాటు గిడ్డంగులు సమయానికి అందుబాటులొ లేకపోవడమే. ధాన్యం నిల్వలకు గిడ్డుంగులులేవని ప్రభుత్వం చెబుతుండగా ఆ గిడ్డంగుల్లో మద్యం బాటిళ్ళు పెద్ద ఎత్తున నిలవ ఉంచిన సంఘటనలు గత వారం రోజుల్లోనే నాలుగైదు బైటపడ్డాయి. ఇవన్నీ ప్రజలతో, ఉత్పత్తిదారులతో సంబంధం లేనివి. అయినా అంతిమంగా సరఫరా ఆటంకాలుగా తేలుతాయి. ఈ ఆటంకాల వలన సరుకుల రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతున్నదని మన స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతవేత్తలైన మన్మోహన్, అహ్లూవాలియా, కౌశిక్ బసులు చెబుతున్నారు.
మరి విదేశీ పెట్టుబడులు సరఫరా ఆటంకాలను ఎలా తొలగిస్తాయి? విదేశీ కంపెనీలు సమర్ధవంతమైనవని ప్రభుత్వ నమ్మకం. వారికి అధునాతన వాహనాలు, శీతల గిడ్డంగులు, ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పించే వెసులుబాటు ఉంటుందని నమ్మకం. ఆ సౌకర్యాల ద్వారా సరఫరా సంబంధిత అవరోధాలను అధిగమించి ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు. ప్రారంభంలో వారి వాదనలు కొన్ని నిజంగా కనిపించవచ్చు. వాల్-మార్ట్ సంస్ధ ప్రపంచ వ్యాపిత బహుళజాతి సంస్ధ కనుక బోల్డంత పెట్టుబడి అందుబాటులో ఉంటుంది. ఒక చోట నష్టాన్ని వేరొక చోట పూడ్చుకునే వెసులుబాటు ఉంటుంది. కనుక ప్రారంభంలో ఎంతైనా ఖర్చు పెట్టి నాణ్యమైన సరుకుల్ని అందిస్తున్న అభిప్రాయాన్ని కలగజేస్తారు. కొన్నాళ్ళు గడిచాక వారి వాహనాలు కూడా సర్వీసింగ్ కి వస్తాయి. అయినా సర్వీసింగ్ చేయకుండా నడుపుతూనే ఉంటారు. దాని వలన పరిస్ధితి మామూలే. ఇంధనం ఖర్చు అదనం, ధరల పెరుగుదల. రవాణాలో గానీ ప్రాసెసింగ్ లో కాని ప్రభుత్వమైనా, ప్రవేటయినా, స్వదేశీ అయినా, విదేశీ అయినా అరుగుదల, కాలపరిమితి ఉంటాయి. యంత్రాలు కొన్నాళ్లకి అరిగిపోయి కొత్త భాగాలు అవసరం ఔతాయి. వాహనాలు కూడా అంతే. అయితే కంపెనీలు కాలపరిమితి ముగిసినా చిన్న చిన్న రిపేర్లతో ఏదో రకంగా పని చేయించి గడుపుతుంటారు. ప్రభుత్వమైనా, ప్రవేటయినా అదే పరిస్ధితి ఉంటుంది. దాన్నెవరూ కాదనలేరు.
కాని ప్రభుత్వం లొ ఉన్నవారికి ప్రజా సంక్షేమం పట్టకపోతే, స్వార్ధ ప్రయోజనాలకే పదవులు చెలాయిస్తుంటే వారికి విదేశీ కంపెనీలు ఇచ్చే కమిషన్లు ఊరిస్తూ ఉంటాయి. ఆ కమిషన్ల కోసం ఎంతకైనా తెగిస్తారని అరవై ఏళ్ళ మన స్వాతంత్ర పాలను రుజువు చేసింది. ఇప్పుడూ అదే చేయబోతున్నారు. ప్రభుత్వం లొని రాజకీయనాయకులూ బ్యూరోక్రట్ల అవినీతి, విదేశీ ప్రభువులకు భారత పాలకుల లొంగుబాటు, రెండంకెల వృద్ధి రేటు కావాలని కలవరించే మార్కెట్ మిత్రులైన మన పాలకులు వీరంతా కలిసి ప్రజల బతుకుల్ని దుర్భరం చేస్తున్నారు. ద్రవ్యోల్బణానికి కారణం వారి చేతగానితనం కారణమైతే దాన్ని సవరించుకోకుండా విదేశీ కంపెనీలే పరిష్కారం అని చెబుతూ భారత దేశంలోని లక్షలాది కుటుంబాల జీవనోపాధిని అంతం చెయ్యడానికి సిద్ధమవుతున్నారు, మన పాలకులు.
సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ (Liberalization, Privatization, Globalization – LPG) లను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వంపై పశ్చిమ దేశాలు గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. వరసగా ఏదో ఒక చోట ఎన్నికలు జరగడం వలన ప్రవేటీకరణ బిల్లులు పెండింగ్ లో పడిపోవడంతో పశ్చిమ దేశాల బహుళజాతి సంస్ధలు బాగా అసంతృప్తితో ఉన్నాయి. బ్యాంకుల రంగంలొ ప్రవేటు పెట్టుబడిని పూర్తిగా అనుమతించడం, ఇన్సూరెన్సు రంగంలో ప్రవేటు కంపెనీల వాటా 24 శాతం నుండి 49 శాతానికి పెంచడం, బహుళ బ్రాండ్ రిటైల్ రంగంలో (multi-brand retail) విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఈ మూడింటిపైనా పశ్చిమ దేశాలు ప్రధానంగా ఒత్తిడి పెంచుతున్నాయి. రాయిటర్స్ వార్తా సంస్ధ ప్రచురించే వార్తలను రెగ్యులర్ గా చదువుతున్నట్లయితే వార్తా సంస్ధల చేత భారత ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తెస్తారో గమనించవచ్చు. ఈ మూడుతొ పాటు ప్రభుత్వరంగ కంపెనీల్ని అయినకాడికి అమ్మడం కూడా మన ప్రభుత్వ లక్ష్యాల్లొ ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం బడ్జెట్ లో పబ్లిక్ సెక్టార్ కంపెనీల అమ్మకం ద్వారా ఇంత సేకరించాలి అని ఆదాయం పద్దులో కేంద్ర ప్రభుత్వం చూపిస్తుంది. అది ప్రవేటీకరణలో భాగం. గత ఎన్.డి.ఏ ప్రభుత్వం ఐతే ప్రభుత్వ రంగ కంపెనీలను అయినకాడికి అమ్మడానికి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేశారు.
భారత దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ పూర్వాశ్రమంలొ ప్రపంచ బ్యాంకు ఉద్యోగి అని అందరికీ తెలిసిందే. ఆయన ఇంతవరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ప్రజలచేత ఎన్నుకోబడని వ్యక్తి, అందునా ఒక బ్యూరోక్రట్ ఇప్పుడు మన ప్రధానిగా ఉన్నాడు. ఆయన నిలబడితే గెలవడం అసాధ్యమని ఆయనకీ, ఆయన పార్టీకి కూడా తెలుసు. అందుకే రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టి ప్రధానిని చేశారు. అటువంటి వ్యక్తి ప్రజల బాగోగుల గురించి ఆలోచించడం అసాధ్యం. తన విధానాల వలన తాను ఎన్నికల్లో ఓడిపోవలసి వస్తుంది అని భయం ఉంటే కొన్ని విధానాల్లొ కొంచెంఅయినా భయపడే అవకాశం ఉంటుంది. అందుకే మన్మోహన్ నోటివెంట జిడిపి వృద్ధి రేటు, బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, సప్లై సైడ్ బాటిల్ నెక్స్, డిమాండ్ సైడ్ కన్‌స్ట్రెయింట్స్ ఇలాంటి మాటలే వస్తాయి తప్ప ప్రజల కష్టాలు, దరిద్రం, తిండి నీడ ఇలాంటి మాటలు రావు. ఈయనకు సరిజోడి మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, చిదంబరం, కపిల్ సిబాల్ తదితరులు. ఆర్ధిక మంత్రిగా అహ్లూవాలియా కాకుండా ప్రణబ్ ఎందుకయ్యాడని హిల్లరీ క్లింటన్ చేసిన గోల అందరికీ తెలిసిందే. కపిల్ సిబాల్ విద్యారంగాన్ని చెడగొట్టడానికీ, చిదంబరం ప్రజల ఆందోళనలను అణచివేయడానికీ, అహ్లూవాలియా ప్రణాళికా సంఘంలో ఉంటూ ప్రణాళికా బద్ధంగా దేశాన్ని విదేశీ ప్రవేటు బహుళ జాతి సంస్ధలకు అప్పజెప్పడానికీ నియమితులై ఉన్నారు. పెట్రోలు, డీసేల్ లను డీకంట్రోలు చేయడానికి మురళీ దేవరాను నియమించుకున్నా సోనియా పట్టుబట్టి జైపాల్ రెడ్డిని నియమించుకుంది. అయినా విధానాలేవీ మారలేదు.
ప్రొవిజన్సు షాపులపై ఆధారపడి జీవనం గడుపుతున్న లక్షల కుటుంబాలు వీధులపాలు కానున్నాయి. తస్మాత్ జాగ్రత్త!
