చైనాలో కారు బాంబు పేలుళ్ళు, ఇద్దరు మృతి


Car bomb blasts in Jianxi

చైనా, జియాంక్సీ రాష్ట్రంలో కారుబాంబు పేలుళ్ళు

చైనాలోని జీయాంక్సి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ముందు కారు బాంబులు పేలాయి. కనీసం మూడు పేలుళ్ళు జరిగాయని, ఈ పేలుళ్ళలొ ఇద్దరు పౌరులు చనిపోయారనీ బిబిసి తెలిపింది. ఫుఝౌ పట్టణంలో జరిగిన ఈ పేలుళ్ళలో మరో ఆరుగురు గాయపడ్డారు. రాష్ట్ర ప్రాసిక్యూటర్ కార్యాలయం, నగర ఆహరము మందుల ఏజెన్సీ కార్యాలయం, జిల్లా పాలనా కార్యాలయ భవనాల ముందు ఉన్న కారు బాంబులుంచారని తెలుస్తోంది. ఇవన్నీ ఒకేసారి పేలినట్లు జిన్‌హువా వార్తా సంస్ధ తెలిపింది. పేలుళ్ళకు కారణాలను పరిశోధిస్తున్నామని పోలీసులు తెలిపారు.

అయితే జిన్‌హువా వార్త్తా సంస్ధ పేలుళ్ళకు కారణం తెలిపింది. ఒక న్యాయ వివాదాన్ని సరిగ్గా పరిష్కరించలేదన్న కోపంతో ఒక రైతు ఈ పేలుళ్ళకు పాల్పడ్డాడని అది తెలిపింది. జిల్లా ప్రభుత్వ కార్యాలయంలో ఒకరు చనిపోగా, మరొకరు ఆసుపత్రిలో చనిపోయాడు. దాదాపు ఒకేసారి జరిగిన ఈ పేలుళ్ళు చైనా కాలమానం ప్రకారం (1:00 GMT) గురువారం ఉదయం జరిగాయి. ప్రభుత్వ కార్యాలయం కిటికీల అద్దాలన్నీ పగిలి చెల్లాచెదురయ్యాయని జిన్‌హువా తెలిపింది. 8 అంతస్ధుల స్ధానిక ప్రాసిక్యూటర్ కార్యాలయ అద్దాలు పగిలిపోయాని తెలిపింది. పది కార్లు ద్వంసం అయ్యాయి.

ఈ నెల ప్రారంభంలో ఘన్సు రాష్ట్రంలో ఇలాగే ఒక బ్యాంకుపైకి పెట్రోలు బాంబు విసరడంతో 40 మంది పౌరులు గాయపడ్డారు. బ్యాంకులోనే పనిచేసే ఉద్యోగి అసంతృప్తికి గురై ఆ చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చైనాలో వారు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం అనేక విఫలయత్నాలు చేసి తీవ్ర అసంతృప్తితో బాంబు పేలుళ్ళకు పాల్పడుతున్నారు. తీవ్రవాద సంస్ధలు తమ రాజకీయ లక్ష్యాల సాధనకోసం జన సమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో బాంబు పేలుళ్ళకు పాల్పడుతూ అనేక మంది చంపడం అందరికీ తెలిసిన విషయం. వ్యక్తిగతంగా ఇలాంటి చర్యలకు దిగడం ఇతర చోట్ల చాలా అరుదుగా కనపడే విషయం. బహుశా ప్రజల అసంతృప్తులను వ్యక్తం చేసేందుకు వేదికలుగా ఉపయోగపడే సంస్ధలను, ప్రజా సంఘాలను అక్కడి ప్రభుత్వం అనుమతించక పోవడం ఇలాంటి ఘటనలకు కారణం కావచ్చు.

చైనాలో ప్రతి సంవత్సరం కొన్ని వేల సంఖ్యలో నిరసన ప్రదర్శనలు జరుగుతుంటాయని ఎ.ఎఫ్.పి వార్తా సంస్ధను ఉటంకిస్తూ ఫ్రాన్సు24 వెబ్ సైట్ తెలుపుతోంది. ప్రభుత్వాధికారుల అవినీతి, ప్రజా సమస్యలు ఎంతకీ పరిష్కారం కాకపోవడం, అభివృద్ధి పేరుచెప్పి ప్రజల వద్దనుండి భూములు లాక్కొవడం ఇవన్నీ చైనా ప్రజలను రోజు రోజుకీ నిరాశా నిస్పృహలవైపుకి నెడుతున్నాయి. పరిశ్రమల కాలుష్యం, కాలుష్యాన్ని అరికట్టే చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వలన అనేక మంది తమ గ్రామాలు, ఇళ్ళను ఖాళీ చేయాల్సిన పరిస్ధుతులు అనేక చోట్ల తలెత్తుతున్నాయి. విదేశీ కంపెనీలకు ఆహ్వానం పలికి వాటి కోసం సౌకర్యాలు ఏర్పాటు చేయడం లో ఉన్న శ్రద్ధ ప్రజల సౌకర్యాలపై చూపకపోవడం అసంతృప్తిని అధికం చేస్తోంది. ఆర్ధిక వృద్ధి రేటు రెండంకెల వద్ద కొనసాగడం, ఫలితంగా ధనిక సెక్షన్లలో డబ్బు చెలామణి అధికమై దృవ్యోల్బణం పెరిగి, దరలు పెరగడానికి కారణమవుతోంది.

జిడిపి వృద్ధి రేటుతో సంతృప్తి పడుతున్న చైనా ప్రభుత్వం ప్రజలను, వారి సౌకర్యాలను ఇలాగే విస్మరిస్తే అక్కడి సమాజం మరిన్ని రాజకీయ చర్యలకు దిగడం ఖాయం.

వ్యాఖ్యానించండి