సోమవారం పాకిస్ధాన్ తాలిబాన్‌కి చెందిన 6 గురు మిలిటెంట్లు కరాచిలోని “పి.ఎన్.ఎస్ మెహ్రాన్” అనే పేరుగల నావల్ అండ్ ఎయిర్ బేస్ పై ఆకస్మిక దాడి చేశారు. ఈ బేస్ లోనే పాకిస్ధాన్ తన అణ్వస్త్రాలను భద్రం చేసిందని భావిస్తున్నారు. దాదాపు 16 గంటలపాటు ఆరుగురు మిలిటెంట్ల వందలమంది పాక్ సైనికుల్ని నిలువరించారు. జలాంతర్గాముల్ని నాశనం చేయగల రెండు యుద్ధ విమానాల్ని (అమెరికా తయారీ) వాళ్ళూ ధ్వంసం చేశారు. 12 మంది సైనికుల్ని చంపేశారు. ఆరుగురిలో నలుగురు మాత్రమే చనిపోగా ఇద్దరు తప్పించుకోగలగడం విశేషం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఈ స్ధావరానికి చేశారు. ఐనా మిలిటెంట్లు జొరబడగలిగారంటే బేస్ లో ఎవరి సహాయం లేకుండా సాధ్యం కాదని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి ఆఫ్ఘనిస్ధాన్‌లో కూడా ఇదే పరిస్ధితి. అమెరికా సైనికుల దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న ఆఫ్ఘన్ సైనికులే హఠాత్తుగా తిరగబడి అమెరికా అధికారుల్ని, సైనికుల్ని చంపేస్తున్నారు. కాబూల్‌లొ అత్యంత భద్రత ఉంటుందంటున్న చోట్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం అమెరికాకి చెందిన అత్యున్నత సైనికాధికారులు ఆరుగురిని ఒక విమాన పైలట్ చంపేశాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వ సైన్యంలో, పోలీసుల్లో అన్ని చోట్లా ఆఫ్ఘన్ తాలిబాన్ తన మనుషుల్ని చొప్పించింది. సమయం వచ్చినప్పుడు సాధ్యమైనంత ఎక్కువమంది అమెరికన్లని, వారు కాకుంటే ప్రభుత్వ సైనికుల్ని చంపడం వీరి పని. ఆఫ్ఘనిస్ధాన్ లో ఫలానా చోటు భద్రమైంది అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. కాందహార్ జైలు అధికారుల సహాకారంతో దాదాపు 500 మంది తాలిబాన్లు తప్పించుకుపోవడంతో తాలిబాన్ కి చేతినిండా మిలిటెంట్లు దొరికినట్లయ్యింది. జైలు లోపలి గదినుండి మూడు నెలలు సొరంగం తొవ్వారంటే జైలు అధికారుల సహకారం లేకుండా జరగదు కదా!





