అమెరికాలో ముంబై దాడులపై ట్రయల్స్ ప్రారంభం, ఐ.ఎస్.ఐ టెర్రరిస్టుల సంబంధాలను ధృవపరిచిన హేడ్లీ


rana

తహవ్వూర్ రాణా

ముంబై టెర్రరిస్టు దాడులపై అమెరికాలోని చికాగో కోర్టులో ట్రయల్స్ కోర్టులో సోమవారం విచారణ ప్రారంభమయ్యింది. రాణాపై ప్రారంభమైన విచారణలో అతను నిర్ధోషీ అనీ కేవలం హేడ్లీతో బాల్య స్నేహితుడిగా ఉండడమే అతని దోషమని రాణా లాయరు వాదించాడు. బాల్య స్నేహితుడిగా నమ్మి తన కంపెనీలో చేర్చుకున్నందుకు హేడ్లీ రాణాను మోసం చేశాడనీ ఆయన వాదించాడు. అయితే మంగళవారం హేడ్లీ కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. ఐ.ఎస్.ఐ తో లష్కర్-ఎ-తొయిబా సంస్ధకు సంబంధాలున్నాయని తన సాక్ష్యంలో ధృవ పరిచాడు. ఐ.ఎస్.ఐ ఆదేశాల మేరకే తాను ముంబైలో దాడులు చేయవలసిన ప్రదేశాలను గుర్తించానని తెలిపాడు. చికాగోలో వ్యాపారి ఐన తహవ్వూర్ రాణాకి వ్యతిరేకంగా హేడ్లీ సాక్షిగా హేడ్లీ అప్రూవర్‌గా ముందుకొచ్చాడు. రాణా కంపెనీకి అనుబంధ కంపెనీని ముంబైలో హేడ్లీ నడుపుతున్నట్లుగా రాణా అనుమతి మంజూరు చేసి కంపెనీ పనిపై అనేక సార్లు ముంబైని హేడ్లీ సందర్శించే ఏర్పాట్లు చేశాడని హేడ్లీ చెప్పాడు. ఆ విధంగా ముంబైని పలుమార్లు సందర్శీంచి అక్కడ దాడి చేయవలసిన ప్రాంతాలని వివిధ కోణాఅల్లో ఫోటోలు తీసి రెక్కీ నిర్వహించడం ద్వారా టెర్రరిస్టు దాడులకు అవసరమైన సమాచారాన్నీ హేడ్లీ సేకరించాడు.

హేడ్లీ సేకరించిన సమాచారం మేరకు నవంబరు 26, 2008 తేదీన పది మిలిటెంట్లు సముద్ర మార్గంలో ముంబై చేరుకుని తాజ్, ఒబెరాయ్ హోటళ్ళు, రైల్వే స్టేషన్, యూదు కేంద్రం ల వద్ద తుపాకులు, గ్రేనేడ్లతో విధ్వంసం సృష్టించారు. 160 మందికి పైగా చనిపోయిన ఈ దాడుల్లోని నేరస్ధులు హేడ్లీ, రాణాలను విచారించడానికి ఇండియా అనుమతి కోరినప్పటికీ అమెరికా అందుకు నిరాకరించింది. ముంబై దాడులను పాకిస్ధాన్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ, తీవ్ర వాద సంస్ధ లష్కర్-ఎ-తొయిబా లు రెండు సమన్వయపరిచాయని హేడ్లీ తన సాక్ష్యంలో పేర్కొన్నాడు. ఐ.ఎస్.ఐ, తీవ్ర వాద గ్రూపుకు మీలట్రీ, నైతికమద్దతులను అందించిందని చెప్పాడు. ఒక పాకిస్ధాన్ ఏజెంటు తనకు ముంబై ఆపరేషన్ నిమిత్తం 25,000 డాలర్లు చెల్లించాడని వెల్లడించాడు. లష్కర్-ఎ-తొయిబా తనకు శిక్షణ ఇచ్చినట్లు హేడ్లీ గతంలో వెల్లడించాడు. తీవ్రవాద గ్రూపుతో ఐ.ఎస్.ఐకీ తమకూ సంబంధాలున్నాయన్న ఆరోపణను పాకిస్ధాన్ ప్రభుత్వం గతంలోనే తిరస్కరించింది. హేడ్లీ సాక్ష్యాన్ని కూడా కొట్టిపారేస్తునడంలో సందేహం లేదు.

హేడ్లీ ఆరోపణలను రాణా పూర్తిగా తిరస్కరిస్తున్నాడు. తన బాల్య స్నేహితుడైనందున నమ్మి ఇమ్మిగ్రేషన్ వ్యాపారానికి భారత్ వ్యాపారిగా అనుమతించానని వాదిస్తున్నాడు. అయితే ప్రాసిక్యూటర్లు హేడ్లీ తన కార్యకలాపాల నిమిత్తం ఇండియాకి పలుమార్లు వెళ్లవలసి ఉన్నందున అతనికి కవర్‌గానే 2006 లో తన వ్యాపారంలో ఉద్యోగిగా రాణా చేర్చుకున్నాడనీ, ఆ ఇమ్మిగ్రేషన్ వ్యాపారి ముసుగులోనే హేడ్లీ పలుమార్లు ఇండియా సందర్శించి రెక్కీ నిర్వహించాడనీ ఆరోపిస్తున్నారు. అమెరికా అసిస్టెంట్ అటార్నీ సారా స్ట్రీకర్, హేడ్లీ ఇతర దేశాలకు చేస్తున్న ప్రయాణాలవలన చాలామంది చనిపోనున్న సంగతి రాణాకు బాగా తెలుసని సోమవారం జ్యూరీ సభ్యులకు వివరించింది. “నిందితుడు రాణా ఒక్క తుపాకినీ ధరించలేదు. ఒక్క గ్రేనేడునూ విసరలేదు. క్లిష్టమైన, అధునాతనమైన పధకంలో పాత్రధారులందరూ ఆయుధాలు ధరించరు. కాని వారి పధకం విజయవంతం కావడానికి రాణాలాంటివారు చాలా కీలకంగా ఉపయోగపడతారు” అని సారా వాదించింది.

మార్చి 2010లో హేడ్లీ తన నేరాన్ని అంగీకరించాడు. దాడులకు ముందు ఆయా ప్రాంతాల ఫోటోలు, వీడియోలు తీసినట్లు అంగీకరించాడు. అతనికి యావజ్జీవ శిక్షతొ పాటు 3 మిలియన్ డాలర్ల పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చని భావిస్తున్నారు. రాణా దోషిగా రుజువైతే యావజ్జీవ శిక్షకు గురికావచ్చని భావిస్తున్నారు. రాణా పాకిస్ధాన్ లో జన్మించిన కెనడా పౌరుడు కాగా, హేడ్లీ అమెరికా దేశీయుడు. ఇద్దరూ పాకిస్ధాన్లో చిన్నప్పుడు కలిసి చదువుకున్నారని చెబుతున్నారు.

వ్యాఖ్యానించండి