ఆడపిల్లలను పిండ దశలోనే హత్య చేయడం నిరక్ష్యరాస్య కుటుంబాల కంటే విద్యాధిక కుటుంబాలలోనూ, ధనికుల కుటుంబాలలోనూ అధికంగా జరుగుతున్నాయని భారత దేశంలో జరిగిన ఓ సర్వేలో తేలింది. విద్యాధిక, ధనిక కుటుంబాలు మొదటి బిడ్డ ఆడపిల్ల పుట్టాక రెండవ బిడ్డ ఆడపిల్లే పుట్టబోతున్నదని తెలిస్తే అబార్షన్ చేయించుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా రెండో ఆడపిల్లలను పిండ దశలోనే చంపివేయడం విద్యాధికులు, ధనికుల కుటుంబాలలోనే అధికంగా ఉండడం కలవరపరిచే అంశమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ ఫర్ గ్లోబల్ హెల్స్ రీసెర్చి (సి.జి.హెచ్.ఆర్) సంస్ధ వారు తమ సర్వే ఫలితాలను మంగళవారం వెల్లడించారు. 2011, 2001, 1991 సంవత్సరాలలో ఇండియాలో జరిగిన జనాభా లెక్కల సేకరణల గణాంకాల ద్వారా వ్యక్తమైన ధోరణులను సర్వే అధ్యయనం చేసింది. 1990-2005 సంవత్సరాల మధ్య రెండో సారి జన్మించే ఆడపిల్లలను చంపివేయడం ప్రతి సంవత్సరం 0.52 శాతం పెరుగుతూ పోయిందని ఈ అధ్యయనంలొ తేలింది.
ఫలితంగా బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య బాగా తగ్గిపోయిందని సర్వే పేర్కొంది. ఈ తగ్గుదల విద్యాధిక, ధనిక కుటుంబాలలో కంటే నిరక్ష్యరాస్య, పేద కుటుంబాలలో చాల తక్కువగా నమోదయిందని సర్వే తెలిపింది. మే 24 న వెలువడే లాన్సెట్ పత్రికలో సర్వే వివరాలు ప్రచురించనున్నారని ఐ.ఎ.ఎన్.ఎస్ వార్తా సంస్ధ తెలిపింది. సి.హి.హెచ్.ఆర్ సంస్ధకు చెందిన ప్రభాత్ ఝా, విదేశీ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ఇండియా గణాంక విభాగ మాజీ రిజిస్ట్రార్ జనరల్ జయంత్ కె బంతియా లు ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. బాలికలు, బాలుర నిష్పత్తి 1991 లో 906:1000 ఉంటే అది 2005 సంవత్సరానికి 836:1000 కు తగ్గిపోయిందని వారు తెలిపారు. ఈ తగ్గుదల సంవత్సరానికి 0.52 శాతంగా ఉందని వారు తెలిపారు. పది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలంపాటు చదువుకున్న తల్లుల కుటుంబాల కంటే అసలు ఏమీ చదువుకోని తల్లుల కుటుంబాలలో ఈ తగ్గుదల చాలా తక్కువగా ఉందని అధ్యనకారులు తేల్చారు. 2011 జనాభా లెక్కల్లో 1000 మంది బాలురకు 914 మంది బాలికలు ఉన్నట్లుగా తేలింది. స్వాతంత్ర్యానంతరం ఇదే అత్యంత తక్కువ అని తెలుస్తోంది.
అయితే సర్వే నిర్వహించినవారు ఆడపిల్లల భ్రూణ హత్యలను చదువుకున్న తల్లులతో ముడిపెట్టడం అభ్యంతరకరం. ఆడపిల్లల కంటే మగపిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడమనేది పితృస్వామ్య వ్యవస్ధతో ముడిపడి ఉన్న అంశం. ఆడ పిల్ల “ఆడ” పిల్లే అన్న సామెత, ఆడపిల్లలపై ఉన్న వివక్ష అన్నీ పితృస్వామ్య సమాజ లక్షణాలు. కుటుంబ ఆస్తులు తమ కుటుంబంలో ఉండాలనే కోరిక, ఆడపిల్ల పెళ్ళి అయ్యాక ఆమె భర్త ఇంటికి చెందిన మనిషీగా చూడటం… ఇలాంటి సంప్రదాయాల వలననే ఆడపిల్లల పై వివక్ష నెలకొందన్నది నిర్వివాదాంశం. ఆడపిల్లతో ఉండే ఆస్తి తమ కుటుంబంలోనే ఉండకుండా ఆమె
భర్త సొంతం అవుతుందనే భయంమే ఆడపిల్లలపై వివక్షకు ముఖ్య కారణమని కూడా తెలిసిందే. అంతే కాక పితృ స్వామ్య వ్యవస్ధలో కుటుంబంలో పెత్తనం మగవాడిదేననీ, మగవారి అంతిమ అంగీకారం లేకుండా ఏదీ జరగదనీ అందరూ ఎరిగిన అంశమే. భార్యల చదువు, హోదా కంటే భర్తల చదువు, హోదాలే అధికంగా ఉండడాన్ని అటు పురుషులతో పాటు, ఇటు స్త్రీలు కూడా అధికంగా ఇష్టపడతారన్నది రహస్యమేమీ కాదు. అదీ కాక భ్రూణ హత్యలకు అత్యధికంగా తల్లుల ఆమోదం ఉండదన్నది ఒక సామాజిక వాస్తవం. అటువంటి నేపధ్యంలో ఆడపిల్లల భ్రూణ హత్యలకు ఒక్క చదువుకున్న తల్లులకే ముడిపెట్టి వారి కంటే విద్యాధికులై ఉండేందుకు ఎక్కువ అవకాశాలున్న పురుషులను విస్మరించడం పూర్తిగా అసంబద్ధం. బహుశా స్త్రీలపై అమలవుతున్న వివక్షకు ఇది కూడా ఒక ఉదాహరణ కావచ్చు.
సర్వే విషయానికి వస్తే 1980 లలో ఎన్నుకుని (ఆడపిండం అయినందున) చేసిన అబార్షన్లు 2 మిలియన్లని నమోదు కాగా ఆ సంఖ్య 1990లలో 4 మిలియన్లకు పెరిగింది. 2000 లకు వచ్చే నాటికి ఆ సంఖ్య 3.1 నుండి 6 మిలియన్ల వరకూ ఉన్నట్లుగా సర్వేలో తేలింది. భ్రూణ హత్యల అలవాటు గతంలో కేవలం కొద్ది రాష్ట్రాలకే పరిమితం కాగా ఇప్పుడది అన్ని రాష్ట్రాలకు పాకిందని గణాంకాలు తెలిపాయని అధ్యయనకర్తలు తెలిపారు. హార్వర్శ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్స్ ప్రొఫెసర్ ఎస్.వి సుబ్రణియన్ ఈ అంశంపై మాట్లాడుతూ “చట్ట విరుద్ధంగా పిండ దశలో లింగ నిర్ధారణ చేయడం, ఆడపిండాల ఆబార్షన్ తదితర సేవలను అందించడం ద్వారా వైద్య వృత్తిలో ఉన్నవారు ధనవంతుల్లో కొడుకుల కోసం ఉన్న డిమాండ్లను సంతృప్తి పరుస్తున్నారు” అని వ్యాఖ్యానించాడు. “చట్టవిరుద్ధ లింగ నిర్ధారణ పరీక్షలు, తదనంతర అబార్షన్లకు శిక్షగా విధించబడే పెనాల్టీ మొత్తం కంటే అటువంటి చట్టవిరుద్ధ సేవలకు డాక్టర్లు అందుకునే బహుమానం మొత్తమే చాలా ఎక్కువగా ఉన్నట్లుంది, చూడబోతే” అన్న సుబ్రమణ్యంగారి వ్యాఖ్య ఈ కధనానికి కొసమెరుపు.
సామాజిక జ్ఞానాన్ని నేర్పని ఎన్ని చదువులు చదివినా సామాజిక పరిస్థితులు మారవు. అందుకే చదువుకున్నవాళ్ళలో సంకుచిత నమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి.
ప్రవీణ్, హోస్టింగ్ సంస్ధ మీరు నడుపుతున్నారా?
I am doing with DirectI’s domains partnership program.