యూరప్ అప్పు సంక్షోభం భయాలు విస్తరించడంతో ప్రపంచ వ్యాపితంగా సోమవారం నాడు షేర్ మార్కెట్లు వణికిపోతున్నాయి. భారత షేర్ మార్కెట్లు దాదాపు రెండు శాతం నష్టపోయాయి. గ్రీసు అప్పు రేటింగ్‌ను ఫిచ్ రేటింగ్ సంస్ధ బాగా తగ్గించడం, ఇటలీ అప్పు రేటింగ్‌ను ఎస్ & పి రేటీంగ్ సంస్ధ నెగిటివ్ కి తగ్గించడంతో షేర్ మార్కెట్లలో అమ్మకాల వత్తిడి పెరిగింది. రేటింగ్ సంస్ధల చర్యలతో యూరో విలువ తగ్గింది. ఇప్పటికే గ్రీసు, ఐర్లండు, పోర్చుగల్ దేశాలు అప్పు సంక్షోభంలో ఉన్నాయి. ఆ మూడు దేశాలు తమ ట్రెజరీ బాండ్ల అమ్మకం ద్వారా కొత్త అప్పును సేకరించడానికి మదుపుదారులు అధిక వడ్డీలను డిమాండ్ చేయడంతో ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కఠిన షరతులతో అప్పు ప్యాకేజి ఇచ్చిన సంగతి విదితమే. తాజాగా స్పెయిన్, ఇటలీలు అప్పు సంక్షోభం ఉచ్చులో చిక్కుకున్నాయి. పొదుపు పేరుతో ప్రజలపై భారాల మోపడంతో స్పెయిన్ లో అధికార పార్టీకి స్ధానిక ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
యూరప్ అప్పు సంక్షోభం ఇతర దేశాలకు విస్తరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గ్రీసుకి గత సంవత్సరం ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు కలిసి 110 బిలియన్ యూరోల అప్పును సమకూర్చాయి. మూడు సంవత్సరాల పాటు విస్తరించి ఉన్న ఈ ప్యాకేజిలో ఇప్పటికి ఒక సంవత్సరం వాయిదా మాత్రమే అందింది. కానీ ఆ ప్యాకేజీతో పాటు విధించిన విషమ షరతుల వలన గ్రీసు ఆర్దిక వృద్ధి తీవ్రంగా కుచించుకు పోయింది. నిరుద్యోగం ప్రబలింది. సదుపాయాలు రద్దయ్యాయి. దానితో సరుకులు కొనడానికి ప్రజల దగ్గర డబ్బు లేదు. ఫలితంగా ఆర్ధిక వృద్ధి మందగించింది. ఆర్దీక వ్యవస్ధపై నమ్మకాలు మరింతగా సడలిపోవడంతో గ్రీసు అప్పును రీస్ట్రక్చరింగ్ చేయవలసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దానితో రెండో సంవత్సరం వాయిదా ఇవ్వడానికి ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు వెనకాడుతున్నాయి. సంక్షోభంలోనుండి బైటికి లాగుతామంటూ గ్రీసుకి ప్యాకేజి ప్రకటించీన ఇ.యు, ఐ.ఎం.ఎఫ్ లు ఇప్పుడు నోరెళ్ళబెడుతున్నాయి. అటు మార్కెట్లో అప్పు దొరక్క, ఇటు ఇస్తామనీ హామీ ఇచ్చిన ప్యాకేజీ ఇవ్వక గ్రీసు అప్పు చెల్లింపులు తీవ్ర ప్రమాదంలో పడ్డాయి. దానికి తోడు స్పెయిన్, ఇటలీ అర్ధిక వ్యవస్ధల పట్ల రేటింగ్ సంస్ధల ప్రతికూల రేటింగ్ మార్కెట్లను మరింతగా భయపెట్టింది.
ఇండియా 30 షేర్ల బోంబే సూచి సెన్సెక్స్ 332.76 పాయింట్లు (1.82 శాతం) నష్టపోయి 17993.33 పాయింట్ల వద్ద ముగిసింది. 50 షేర్ల నేషనల ఇండెక్స్ నిఫ్టీ 99.8 పాయింట్లు (1.82 శాతం) నష్టపోయి 5386.55 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఫైనాన్సియల్ షేర్లు బాగా నష్టపోయాయి. 2జి కుంభకోణంలో అరెస్టయిన ఐదు కంపెనీల సి.ఇ.ఓ లకు కోర్టు మళ్ళీ బెయిల్ నిరాకరించడంతో ఆ కంపెనీల షేర్లు బాగా
పతనమయ్యాయి. ఎస్.బి.ఐ, ఐ.సి.ఐ.సి.ఐ, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకుల షేర్లు 2.3 శాతం నుండి 3.48 శాతం వరకూ నష్టపోయాయి. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న యునిటేక్ 5.76 శాతం, డిబి రియాల్టీ 7.3 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్సు 2.38 శాతం నష్టపోయాయి. అధిక ద్రవ్యోల్భణం, పెరిగిన బ్యాంకు వడ్డీ రేట్లు కూడా తమ ప్రతాపం చూపాయి. ద్రవ్యోల్భణ కట్టడికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శనివారం ప్రణబ్ ముఖర్జీ మరోసారి ప్రకటించాడు.
మే నెలలో ఇప్పటికే విదేశీ కంపెనీలు 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. విదేశీ కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకోవడం వలన 2011 సంవత్సరంలో షేర్ మార్కేట్లు ఇప్పటికి 11 శాతం నష్టపోయాయి.
