అమెరికా మరోసారి తన అహంభావాన్ని బైట పెట్టుకుంది. అధ్యక్షుడు ఒబామా నోటి ద్వారా అమెరికా ప్రపంచ పోలీసు బుద్ధి మరోసారి బైట పడింది. అంతర్జాతీయ చట్టాలు తనకు పూచిక పుల్లతో సమానమని చాటి చెప్పుకుంది. టెర్రరిస్టు ఉన్నాడని తెలిస్తే పాకిస్ధాన్ పై మరోసారి అక్కడి ప్రభుత్వానికి చెప్పకుండా దాడి చేస్తామని ఒబామా ప్రకటించాడు. అసలు పాకిస్ధానేం ఖర్మ, తాను చంపదలుచుకున్న వాళ్ళెవరైనా ఉన్నాడని తెలిస్తే ఏ దేశంపైనైనా దాడి చేస్తామని ప్రకటించాడు. తమకు కావలసింది అమెరికా ప్రజల రక్షణ తప్ప చట్టాలూ, నిబంధనలూ కావని అసలు విషయం చెప్పేశాడు. పాకిస్ధాన్ సార్వభౌమత్వం అంటే తమకు గౌరవమే అయినా అంతకంటే ముందు తమకు తమ ప్రజల రక్షణేనని చాటి చెప్పాడు. ప్రజల రక్షణ అనేది ఒక సాకు తప్ప అది నిజం కాదని వేరే చెప్పనవసరం లేదు.
వచ్చే సంవత్సరం అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో, మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఒబామా తానేఎం మాట్లాడుతున్నదీ తెలుసుకునే పరిస్ధితుల్లో లేనట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో నెగ్గడానికి ఎంత ఘోరానికైనా సిద్ధపడినట్లు కనిపిస్తోంది. ఆ అవాంభావంతోనే బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము పాకిస్ధాన్ అనుమతి లేకుండా వారి సరిహద్దులను అతిక్రమిస్తూ దేశం లోపలికి జొరపడి బిన్ లాడేన్^ని చంపడాన్ని సమర్ధింకుకున్నాడు. “అమెరికా ఏదో ఒక చర్య తీసుకోకుండా ఇతరుల పధకాలు ఫలవంతం కావడం అమెరికా సహించబోదని తేల్చి చెప్పాడు. యూరప్ దేశాలలో పర్యటించనున్న ఒబామా బిబిసికి ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఆల్-ఖైదాకి చెందిన మరొక టాప్ నాయకుడు గానీ, లేదా తాలిబాన్ నాయకుడు ముల్లా ఒమర్ గానీ పాకిస్ధాన్ లో ఉన్న చోటు తెలిసినట్లయితే, లేదా మరే దేశంలో నైనా ఉన్నట్లు తెలిస్తే, ఏంచేస్తారని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఒబామా “అవసరమైతే అమెరికా ఏకపక్షంగా దాడి చేస్తుంది” అని చెప్పాడు. “మా పని అమెరికాని రక్షించడం. పాకిస్ధాన్ సార్వభౌమత్వం అంటే మాకు చాలా గౌరవం, కానీ మా ప్రజలను చంపడానికి గానీ లేదా మా మిత్ర దేశ ప్రజలను చంపడానికి గానీ చురుకుగా పధకాలు పన్నుతున్నట్లయితే వారిని అనుమంటించబోము. మేం ఏదో ఒక చర్య తీసుకోకుండా వారి పధకాలు ఫలవంతం కావడానికి ఒప్పుకోము” అని తెలిపాడు.
అయితే ఒమాబా ఇక్కడ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. లిబియా ప్రభుత్వాధిపతి గడ్డాఫీని చంపడానికి అమెరికాతో పాటు బ్రిటన్, ఫ్రాన్సు దేశాలు అతని ఇంటిపై మిస్సైళ్ళతో దాడులు చేస్తున్న సంగతి విదితమే. ప్రతి రోజూ రాత్రి సమయాల్లో లిబియా ప్రభుత్వ సైనికుల బ్యారాక్ లపైనా, దేశమంతంటా ఉన్న ప్రభుత్వ భవనాలపైనా దాడులు చేస్తున్న సంతతి తెలిసిందే. గడ్డాఫీ కొడుకు ముగ్గురు మనవళ్ళనూ పొట్టన బెట్టుకున్న సంగతి తెలిసిందే. మరి గడ్డాఫీ కొడుకూ, ముగ్గురు మనవాళ్ళూ అమెరికా ప్రజలను చమపడానికి చేసిన ప్రయత్నాలేమిటి? గడ్డాఫీ ఎప్పుడైనా అమెరికా ప్రజలను చంపడానికి ప్రయత్నించాడా? అమెరికాలోని జంట టవర్లపై లాడేనే దాడి చేయించాడని అబద్ధ ప్రచారం చేసి అతన్ని చంపేశారు. జంట టవర్లపై దాడిలో లాడెన్ పాత్ర ఉందని రుజువు చేయాల్సిన అవసరం తాము ఎంతగానో గౌరవించే ప్రజాస్వామిక సూత్రాల ప్రకారం ఉందన్న భాద్యతను విస్మరించి మరీ చంపేశారు. అటువంటి అబద్ధ ప్రచారాలే చేసి తాము చంపదలుచుకున్నవారిని ఏ దేశంలో ఉన్నా సరే చంపేస్తామని ఇప్పుడు ఒబామా చెప్పదలుచుకున్నాడా?
పాకిస్ధాన్ పార్లమెంటు మేనెల ప్రారంభంలో అమెరికా కమెండోలు తమ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించి తమ గగనతలం లోకి జొరబడడాన్ని ఖండించింది. “అటువంటి చర్యలను మేము ఇక ఎంతమాత్రం సహించేది లేదు. ఏక పక్షంగా అటువంటి చర్యలను పునరావృతం చేసినట్లయితే ఈ ప్రాంతంతో పాటు ప్రపంచంలో కూడా శాంతికీ, భద్రతకూ అనివార్యమైన ప్రమాదాలు ఏర్పడతాయని” హెచ్చరించింది. పాకిస్ధాన్ పార్లమెంటు హెచ్చరికలను ఒబామా బేఖాతరు బేఖాతరు చేస్తున్నట్లు స్పష్టమౌతోంది.